యోగి ఆదిత్యనాథ్ ప్రమాణం..
►ఉత్తరప్రదేశ్ 21వ సీఎంగా ప్రమాణస్వీకారం
►47 మంది మంత్రులతో కొలువుదీరిన కేబినెట్
►హాజరైన మోదీ, అమిత్‌షా, ములాయం, అఖిలేశ్
లక్నో: ఉత్తరప్రదేశ్ 21వ ముఖ్యమంత్రిగా హిందుత్వవాది యోగి ఆదిత్యనాథ్(44) ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో ఉత్తరప్రదేశ్ గవర్నర్ రాంనాయక్ ప్రమాణస్వీకారం చేయించారు. యోగి ఆదిత్యనాథ్‌తో పాటు 47 మంది సభ్యుల మంత్రిమండలి కొలువుదీరింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య, పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు దినేశ్ శర్మ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేశారు. ఆశ్చర్యకరంగా క్రికెట్ నుంచి రాజకీయాల వైపు వచ్చిన మెహసిన్ రజాకు కేబినెట్‌లో చోటు దక్కడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్క ముస్లిం అభ్యర్థినీ రంగంలోకి దించలేదు. దీంతో రజాను మంత్రి పదవి వరించింది. ప్రస్తుత కేబినెట్‌లో ఏకైక ముస్లిం మంత్రి ఆయనే. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ముఖ్యమంత్రి, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు, మెహసిన్ రజా నలుగురూ కూడా యూపీ ఉభయ సభల్లో సభ్యులు కాకపోవడం విశేషం.
47 మందితో కేబినెట్.. డిప్యూటీ సీఎంలతో కలిపి 24 మందికి కేబినెట్ హోదా.. తొమ్మిది మందికి స్వతంత్ర హోదా.. మరో 13 మందికి సహాయ మంత్రుల హోదా లభించింది. యోగి కేబినెట్‌లో ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన రీటా బహుగుణ జోషితో పాటు ఐదుగురు మహిళలకు చోటు దక్కింది. లక్నోలోని కాన్షీరాం స్మృతి ఉపవన్‌లో 90 నిమిషాల పాటు అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అడ్వాణీతో పాటు సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం, మాజీ సీఎం అఖిలేశ్‌యాదవ్ తదితరులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం యోగి ఆదిత్యనాథ్ కొత్తగా నిర్మించిన లోక్ భవన్‌లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
15 ఏళ్ల తర్వాత కాషాయ రెపరెపలు..
దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన యూపీలో 15 ఏళ్ల తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. యోగి ఆ పార్టీ తరఫున నాలుగో ముఖ్యమంత్రి. ఆదిత్యనాథ్‌కంటే ముందు బీజేపీ తరఫున కల్యాణ్‌సింగ్, రామ్‌ప్రకాశ్ గుప్తా, రాజ్‌నాథ్‌సింగ్ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ప్రస్తుతం రాజస్థాన్ గవర్నర్‌గా ఉన్న కల్యాణ్‌సింగ్ రెండు సార్లు సీఎంగా పనిచేశారు.
మా ప్రమేయం లేదు: ఆర్‌ఎస్‌ఎస్
ఆదిత్యనాథ్‌ను యూపీ సీఎంగా ఎంపిక చేయడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. అయితే ఐదు సార్లు ఎంపీగా పనిచేసిన యోగి ఆదిత్యనాథ్‌కు పెద్దగా పాలనా పరమైన అనుభవం లేకపోవడం ప్రతికూలాంశం. బీజేపీ అగ్రనాయకత్వానికి సన్నిహితుడైన యోగి ఆదిత్యనాథ్ ఎంపికతో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రమేయం ఉందంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగింది. అయితే ఈ ప్రచారాన్ని ఆర్‌ఎస్‌ఎస్ సంయుక్త ప్రధాన కార్యదర్శి వి.భాగయ్య ఖండించారు. ఇది పూర్తిగా రాజకీయపరమైన నిర్ణయమని, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంల ఎంపికలో ఆర్‌ఎస్‌ఎస్ ఎప్పుడు కలుగజేసుకోలేదన్నారు.
హాజరైన చంద్రబాబు
సాక్షి, అమరావతి: యోగి ప్రమాణానికి ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుతో కలిసి గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన లక్నో వెళ్లారు.∙సాయంత్రం తిరిగి విజయవాడ చేరుకున్నారు.
వివక్ష లేని అభివృద్ధే లక్ష్యం: ఆదిత్యనాథ్
లక్నో: ఎలాంటి వివక్ష లేకుండా అన్ని వర్గాల అభివృద్ధి కోసం కొత్త ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం ఆదిత్యనాథ్ అన్నారు. సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్‌ను అనుసరిస్తూ యూపీ సమతుల్య అభివృద్ధి కోసం పనిచేస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు అవినీతి, బంధుప్రీతికి పాల్పడడంతో పాటు, శాంతి భద్రతల పరిరక్షణలో విఫలమవడంతో.. 15 ఏళ్లుగా అభివృద్ధి పరుగులో యూపీ వెనకబడిందని చెప్పారు. అధికార యంత్రాంగం చురుగ్గా పనిచేసేలా, జవాబుదారీగా ఉండేలా చేస్తామని, శాంతి భద్రతలకు ప్రాధాన్యం ఇస్తామని హామీనిచ్చారు.
యువతకు నైపుణ్య శిక్షణపై దృష్టి పెడతామని, అప్పుడే వారు ఉద్యోగావకాశాలు దక్కించుకుంటారనిపేర్కొన్నారు. ప్రభుత్వ నియామకాల్లో అవినీతి లేకుండా చేస్తామన్నారు. అభివృద్ధి, భద్రత కోసం ప్రజలు బీజేపీకి ఓటేశారని త్వరలో సానుకూల ఫలితాలు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. 15 రోజుల్లోగా మంత్రులందరూ ఆదాయ వివరాల్ని అందచేయాలనిఆదేశించారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంత్రుల పరిచయ కార్యక్రమంలో ఆయన ఈ ఆదేశాలిచ్చారు.
సమతుల యూపీ కేబినెట్
లక్నో: కేబినెట్‌లో అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాల వారికి సీఎం ఆదిత్యనాథ్ సమాన ప్రాతినిధ్యం కల్పించారు. 47 మందితో కూడిన కేబినెట్‌లో ముగ్గురు దళితులు, 26 మంది అగ్రవర్ణాల వారు, ఒకరు ముస్లిం కాగా, మిగిలిన వారు ఓబీసీసీలు. ఇద్దరు డిప్యూటీ సీఎంల ఎంపిక కూడా సమతుల్యంతో ఉంది. సీఎం రాజ్‌పుత్ కాగా, కేశవ్ ప్రసాద్ మౌర్య ఓబీసీ, దినేశ్ శర్మ బ్రాహ్మణ వర్గానికి చెందినవారు. దళిత నేత ఎస్పీ సింగ్ బాఘెల్‌కు కేబినెట్‌లో చోటిచ్చారు. ఎన్నికల్లో ఒక్క ముస్లింకూ టికెట్లివ్వని బీజేపీ.. మాజీ క్రికెటర్ మొహసిన్ రజాకు మైనారిటీ వ్యవహారాలు, హజ్, వక్ఫ్ మంత్రిత్వ శాఖను అప్పగించింది.
కొత్త సీఎం నేపథ్యం..
⇒1972–జూన్ 5న పారీ గడ్వాల్ జిల్లాలో (ఇప్పుడు ఉత్తరాఖండ్‌లో ఉంది) జననం. అసలు పేరు అజయ్ సింగ్ బిస్త్
⇒1992–గడ్వాల్ వర్సిటీ నుంచి బీఎస్సీ (మ్యాథ్స్) పట్టా.
⇒ 1994–గోరఖ్‌నాథ్ మఠాధిపతి మహంత్ అవైద్యనాథ్ శిష్యుడిగా దీక్ష, యోగి ఆదిత్యనాథ్‌గా పేరు మార్పు.
⇒1998లో 26 ఏళ్లకే గోరఖ్‌పూర్ నుంచి ఎంపీగా గెలుపు. అప్పటి నుంచి ఐదు సార్లు ఎంపీగా గోరఖ్‌పూర్‌కు ప్రాతినిధ్యం.
⇒ 2002–శ్రీరామ నవమి రోజున ‘హిందూ యువ వాహిని’ని స్థాపన.
⇒ 2005–యూపీలోని ఎటాలో ఐదు వేల మందికి పైగా వ్యక్తులను హిందూ మతంలోకి మార్పించారు.
⇒ 2007–గోరఖ్‌పూర్ అల్లర్లలో హిందూ బాలుడు మరణించినందుకు సంతాపంగా శ్రద్ధాంజలి సభ, కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహణ సందర్భంగా తొలిసారి జైలుకు.
⇒ 2014–లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి భారీ విజయం లభించిన అనంతరం అసెంబ్లీ ఉపఎన్నికలకు యోగి స్టార్ క్యాంపెయినర్‌గా బీజేపీ ప్రకటన. ఆ ఎన్నికల్లో అత్యధిక సీట్లలో ఓడిన బీజేపీ.
⇒ 2014–తన గురువు మహంత్ అవైద్యనాథ్ మరణించడంతో సెప్టెంబరులో గోరఖ్‌పూర్ మఠాధిపతిగా బాధ్యతల స్వీకారం.
⇒ 2017–ఎన్నికల్లోనూ యోగిని స్టార్ క్యాంపెయినర్‌గా ప్రకటించిన బీజేపీ. ఎక్కువ మంది బీజేపీ అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో ప్రధాని మోదీ లేదా యోగి ఆదిత్యనాథ్‌లే ప్రచారం చేయాలని కోరుకున్నారు.
⇒ 2017– మార్చి 19న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం.
యూపీ సీఎం ఆదిత్యనాథ్, హాలీవుడ్ నటుడు విన్ డీజిల్ ముఖ కవళికలు ఒకేలా ఉండటంతో వీరి ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. యూపీకి సీఎం అయిన డీజిల్‌కు శుభాకాంక్షలంటూ జోకులు పేలుతున్నాయి.