ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామ మందిరం ప్రారంభోత్సవానికి ముందుగానే అంతర్జాతీయ విమానాశ్రయం తొలిదశ పూర్తి కానుంది. రామ మందిరం ప్రారంభోత్సవానికి నెల రోజుల ముందే, డిసెంబరు 15 నాటికి ఎయిర్‌పోర్ట్ తొలి దశ సిద్ధమవుతుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.
అయోధ్యలో నిర్మాణంలో ఉన్న మర్యాద పురుషోత్తం శ్రీరామ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని యూపీ సీఎం శనివారం సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన విమానాశ్రయం నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయని, డిసెంబర్ 15 నాటికి తొలి దశ పూర్తి చేస్తామని చెప్పారు. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్‌తో కలిసి విమానాశ్రయ స్థలాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి, ప్రధాని మోదీ దార్శనికతకు అనుగుణంగా రూపుదిద్దుకుంటోందన్నారు.
ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం 821 ఎకరాల భూమిని సమకూర్చిందని, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అయోధ్య అభివృద్ధికి హామీ ఇవ్వడంతో పాటు, అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంలో తమ ప్రభుత్వం నిబద్ధతలో ఇది భాగమన్నారు.
విమానాశ్రయంలో అయోధ్య సాంస్కృతిక నైతికతను ప్రతిబింబించేలా కృషి చేశామని సింధియా చెప్పారు. గంటకు 2-3 విమానాలను నిర్వహించగల సామర్థ్యంతో 65వేల చదరపు అడుగుల టెర్మినల్ మొదటి దశలో నిర్మాణంలో ఉంది. బోయింగ్ 737, ఎయిర్‌బస్ 319 మరియు ఎయిర్‌బస్ 320 వంటి విమానాలను ల్యాండింగ్ చేయడానికి 2,200 మీటర్ల రన్‌వే పనులు కూడా జరుగుతున్నాయి. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆలయ నిర్మాణం జరుగుతోంది. జనవరి 22న జరగనుందని భావిస్తున్న ఈ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు.
కాగా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్న సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, అయోధ్యలోని హనుమాన్ గర్హి ఆలయాన్ని ఆదివారం సందర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment