న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు(శనివారం) ఉత్తరప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక నగరం అయోధ్యలో పర్యటించనున్నారు. రామమందిర శంకుస్థాపనకు ముందు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని, ఆధునీకరించిన అయోధ్య రైల్వే స్టేషన్‌ను ప్రధాని ప్రారంభించనున్నారు. నాలుగు గంటలపాటు అయోధ్యలో ఉండనున్నారు. మొత్తం రూ. 15 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో నగరంలో అధికారులు భద్రతను పటిష్టం చేశారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్‌తో అణువణువూ తనిఖీ చేస్తున్నారు. డ్రోన్లతో నిఘా పెంచారు. నగరాన్ని పూలతో అలంకరించారు. ప్రధానమంత్రికి స్వాగతం పలుకుతూ పోస్టర్లు ఏర్పాటు చేశారు
అయోధ్యలో రూ.1,450 కోట్లతో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మించారు.6,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో టెర్మినల్ భవనం సిద్ధమైంది. ఇక్కడి నుంచి ఒకేసారి 600 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించవచ్చు. ఈ విమానాశ్రయానికి ‘మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అయోధ్యధామం’ అనే పేరు ఖరారు చేశారు. గతంలో ‘మర్యాద పురుషోత్తమ్ శ్రీరామ్ అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయం’గా వ్యవహరించేవారు. అయోధ్యలో ఆధునీకరించిన రైల్వే స్టేషన్‌కు ‘అయోధ్య ధామ్ జంక్షన్’గా నామకరణం చేశారు.
శ్రీరాముడి స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ పలు కట్టడాలను సుందరంగా నిర్మించారు. శిఖరం, విల్లు బాణం వంటివి శ్రీరాముడిని గుర్తుకు తెస్తున్నాయి. నాలుగు ఎత్తయిన గోపురాలతో 11,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ స్టేషన్ విస్తరించి ఉంది. ఈ స్టేషన్‌ను రైల్వే శాఖ అనుబంధ సంస్థ అయిన రైల్ ఇండియా టెక్నికల్, ఎకనామిక్ సరీ్వస్ లిమిటెడ్(రైట్స్) అభివృద్ధి చేసింది. మరోవైపు అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభోత్సవ ఏర్పాట్లు ఊపందుకుంటున్నాయి.
రాష్ట్రంలో రూ.15,700 కోట్ల కంటే విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.. వీటిలో అయోధ్య, దాని పరిసర ప్రాంతాల అభివృద్ధికి సుమారు రూ.11,100 కోట్లు ఖర్చు చేస్తుండగా..ఉత్తరప్రదేశ్ అంతటా ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన రూ.4,600 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment