
అయోధ్య: హోరు వర్షం ధాటికి అయోధ్య రామాలయం గర్భాలయ నిర్మాణంలో లోపాలు వెలుగుచూశాయని రామజన్మభూమి ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ సోమవారం ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం అర్ధరాత్రి అయోధ్యలో కురిసిన భారీ వర్షం కారణంగా గర్భగుడిలో బాలరాముడిని పూజించేందుకు పూజారులు కూర్చునే చోట, దర్శనార్థం వీఐపీ భక్తులు వచ్చే మార్గంలోనూ వర్షపు నీరు లీక్ అవుతోందని దాస్ ఆరోపించారు.
వర్షపు నీరు బయటకు వెళ్లడానికి ఎలాంటి డ్రైనేజీ వ్యవస్థ గుడిలో లేదని తెలిపారు. దీనిని తీవ్రమైన సమస్యగా పరిగణించి తక్షణ చర్యలు చేపట్టాలని ఆలయ యాజమాన్యాన్ని ఆయన కోరారు. ‘‘ దేశవ్యాప్తంగా దిగ్గజ ఇంజనీర్లు అయోధ్య ఆలయ నిర్మాణంలో పాలుపంచుకున్నారు. జనవరి 22న ఆలయానికి ప్రాణప్రతిష్టచేశారు.
ప్రపంచప్రఖ్యాత ఆలయం ప్రారంభమయ్యాక పడిన తొలి భారీ వర్షానికే నీరు లీక్ అవడం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకిలా జరుగుతోంది? అనుభవజు్ఞలైన ఇంజనీర్లు కట్టినా ఇలాంటి ఘటన జరగడం పెద్ద తప్పే’ అని అన్నారు. దీంతో హుటాహుటిన ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా అక్కడికి చేరుకున్నారు. తక్షణం కప్పుకు మరమ్మతులు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ‘‘ ఆలయం మొదటి అంతస్తులో ఇంకా పనులు పూర్తికాలేదు. జూలైకల్లా పూర్తిచేస్తాం. డిసెంబర్‌కల్లా మొత్తం ఆలయనిర్మాణం పూర్తిఅవుతుంది’ అని వివరణ ఇచ్చారు.