లక్నో: ఫిబ్రవరిలో అయోధ్యను సందర్శించడం మానుకోవాలని కేబినెట్ మంత్రులను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగిన తర్వాత భక్తులు భారీ సంఖ్యలో రామమందిరానికి తరలి రావడంతో మోదీ ఈ మేరకు మంత్రులకు విజ్ఞప్తి చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో కేంద్ర మంత్రులు మార్చి నెలలో అయోధ్యను సందర్శించనున్నట్లు తెలుస్తోంది.
వీఐపీల సందర్శనలో ప్రోటోకాల్‌ల వల్ల భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అయోధ్యకు వెళ్లే ప్రణాళికను మంత్రులు వాయిదా వేసుకోవాలని ప్రధాని మోదీ కోరినట్లు తెలుస్తోంది. అయోధ్య రామమందిర నిర్మాణంపై ప్రజల అభిప్రాయాన్ని కూడా ప్రధాని మోదీ మంత్రులను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.
సోమవారం అయోధ్య ఆలయంలో బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ నాయకత్వం వహించారు. ఈ వేడుకను దేశవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేశారు. అగ్రశ్రేణి రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, క్రీడాకారులు, సెలబ్రిటీలతో సహా అనేక వేల మందిని కార్యక్రమానికి ఆహ్వానించారు. సంప్రోక్షణ కార్యక్రమం ముగిసిన వెంటనే ఆహ్వానితులు దేవుడి దర్శనం చేసుకున్నారు.
సాధారణ ప్రజల కోసం మంగళవారం ఉదయం ఆలయ తలుపులు తెరవబడ్డాయి. మొదటి రోజు దాదాపు ఐదు లక్షల మంది భక్తులు ఆలయాన్ని సందర్శించారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులు బారులు తీరారు. భక్తులు భారీగా తరలిరావడంతో మంగళవారం దర్శనానికి కొద్దిసేపు విరామం ఇవ్వాల్సి వచ్చింది.
ఇదీ చదవండి: Ayodhya Ram Mandir: తొలి రోజు రాములోరి నిద్ర 15 నిముషాలే!
Comments
Please login to add a commentAdd a comment