రామానంద సాగర్ ‘రామాయణ్’ సీరియల్ రామాయణ గాధను ఇంటింటికీ తెచ్చింది. 1987లో ప్రసారమైన ఈ సీరియల్ ఆ రోజుల్లో ప్రపంచంలోనే ఎక్కువ మంది చూసిన సీరియల్. రాముడిగా అరుణ్ గోవిల్, సీతగా దీపికా చిక్‌లియా, లక్ష్మణుడిగా సునీల్ లహరీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని స్థానం పొందారు. వీరు ముగ్గురూ మళ్లీ కనిపిస్తే? అదే ఆలోచన వచ్చింది అభిషేక్ ఠాకూర్ అనే నిర్మాతకు.
అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపన సందర్భంగా ‘హమారే రామ్ ఆయేహై’ అనే పాటను సోను నిగమ్ గొంతులో రికార్డు చేయించి, అయోధ్య రామమందిర ప్రాంగణంలో, సరయూ నది ఒడ్డున చిత్రీకరించి విడుదల చేశాడు. ఆ పాటలో అరుణ్ గోవిల్, దీపిక, సునీల్ లహరీ... అయోధ్య ప్రాంగణంలో తిరుగాడటం... సాక్షాత్తు ఆ సీతారామ లక్ష్మణులు తిరిగిన భావనను భక్తులకు కలిగించింది. ‘హమారే రామ్ ఆయేహై’ పాట ఇప్పటికే కోటి వ్యూస్ దాటిపోయింది. ఇంకా ఎన్ని కోట్ల వ్యూస్ వస్తాయో చెప్పలేము. అరుణ్ గోవిల్, దీపికలు ఇప్పటికీ ఎక్కడ కనిపించినా పాద నమస్కారాలు చేసే ప్రేక్షకులు ఉన్నారు. ఇప్పుడు రామమందిర ప్రతిష్ఠాపన తర్వాత వారి కీర్తి మరింతగా విరాజిల్లనుంది.
Comments
Please login to add a commentAdd a comment