Serial story
-
Ayodhya Ram Mandir: మరలా ఆ ముగ్గురి దర్శనం
రామానంద సాగర్ ‘రామాయణ్’ సీరియల్ రామాయణ గాధను ఇంటింటికీ తెచ్చింది. 1987లో ప్రసారమైన ఈ సీరియల్ ఆ రోజుల్లో ప్రపంచంలోనే ఎక్కువ మంది చూసిన సీరియల్. రాముడిగా అరుణ్ గోవిల్, సీతగా దీపికా చిక్లియా, లక్ష్మణుడిగా సునీల్ లహరీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని స్థానం పొందారు. వీరు ముగ్గురూ మళ్లీ కనిపిస్తే? అదే ఆలోచన వచ్చింది అభిషేక్ ఠాకూర్ అనే నిర్మాతకు. అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపన సందర్భంగా ‘హమారే రామ్ ఆయేహై’ అనే పాటను సోను నిగమ్ గొంతులో రికార్డు చేయించి, అయోధ్య రామమందిర ప్రాంగణంలో, సరయూ నది ఒడ్డున చిత్రీకరించి విడుదల చేశాడు. ఆ పాటలో అరుణ్ గోవిల్, దీపిక, సునీల్ లహరీ... అయోధ్య ప్రాంగణంలో తిరుగాడటం... సాక్షాత్తు ఆ సీతారామ లక్ష్మణులు తిరిగిన భావనను భక్తులకు కలిగించింది. ‘హమారే రామ్ ఆయేహై’ పాట ఇప్పటికే కోటి వ్యూస్ దాటిపోయింది. ఇంకా ఎన్ని కోట్ల వ్యూస్ వస్తాయో చెప్పలేము. అరుణ్ గోవిల్, దీపికలు ఇప్పటికీ ఎక్కడ కనిపించినా పాద నమస్కారాలు చేసే ప్రేక్షకులు ఉన్నారు. ఇప్పుడు రామమందిర ప్రతిష్ఠాపన తర్వాత వారి కీర్తి మరింతగా విరాజిల్లనుంది. -
సుమకి క్షమాపణ దొరికేనా?!
అత్తవారింట దీపం పెట్టడానికి వెళ్లింది. కొద్దిరోజుల్లో ఆ ఇంటికే దీపమయ్యింది. సమస్యలన్నీ తీర్చింది. కానీ అనుకోని పరిస్థితుల్లో తానే సమస్యల్లో చిక్కుకుంది. భర్త గుండెల్లో సింహాసనం వేసుకుని కూర్చునే ఆమె, అతడి ఆగ్రహానికే గురై, చివరికి ఏకంగా అతడికి దూరమయ్యే పరిస్థితి వచ్చింది. మరి దూరమైపోతుందా? లేక క్షమాపణ పొంది మళ్లీ అతడి మనసులో చోటు సంపాదిస్తుందా? ‘మూడు ముళ్లు’ సీరియల్ చూస్తోన్న ప్రేక్షకులందరికీ ఇప్పుడిదే టెన్షన్. అయితే ఆ టెన్షన్ ఇప్పుడే తీరే చాన్స్ లేదు. ఎందుకంటే హీరోయిన్ సుమ మరిన్ని సమస్యల్లో కూరుకుపోనుంది. భర్తకు పూర్తిగా దూరమైపోనుంది. అతడిని మరో అమ్మాయికి వదిలేసి, వేరే దేశమే వెళ్లిపోనుంది. మరి మళ్లీ ఆమె భర్తను కలుస్తుందా? అతడి మనసులో, జీవితంలో తిరిగి ప్రవేశిస్తుందా? అప్పుడే చెప్పేస్తే ఎలా! కాస్త వేచి చూడండి. -
ఇదేం వరుస అత్తమ్మా?!
ఓ అహంభావి ఒక పెద్దింటికి కోడలిగా వెళ్తుంది. ఆ వంశానికి కొడుకును ఇవ్వక పోతే అక్కడ తన స్థానమేమవుతుందో అని భయపడుతుంది. ఆ భయం పురుట్లోనే పిల్లల్ని మార్చేసేలా చేస్తుంది. ఎవరి బిడ్డనో తన కొడుకులా పెంచుతుంది. ఆమె కూతురు ఓ పేదింట పెరుగుతుంది. ఆ పిల్ల పెద్దయ్యి, తన తల్లి పెంచిన పిల్లాడితోనే ప్రేమలో పడుతుంది. ఆమె పేదింటి పిల్ల అని నో చెబుతుంది అబ్బాయి తల్లి. దాంతో అత్తా కోడళ్ల మధ్య ఫైట్. ఇదీ ‘అత్తో అత్తమ్మ కూతురో’ సీరియల్ కథ. కథ బానే ఉంది కానీ ఓ తల్లి తన సొంత బిడ్డతో పాటు మరో బిడ్డను పెంచితే ఆ ఇద్దరూ అన్నాచెల్లెళ్లే అవుతారు కదా! మరి అలాంటి వాళ్లిద్దరి మధ్య ప్రేమేంటి? కూతురు కోడలిగా ఎలా వస్తుంది? కొడుకు అల్లుడెలా అవుతాడు? ఈ కథ పెళ్లి వరకూ వెళ్లడం కరెక్టేనా? అదే కాక అత్తమ్మ నిరోషా తన కొడుక్కి ఏకంగా ఇద్దరమ్మాయిలతో పెళ్లి సెటిల్ చేస్తుంది. కథ కొత్తగా అల్లుకోవడంలో తప్పు లేదు. కానీ ఇలా చట్ట విరుద్ధమైన, సమాజం అంగీకరించని పాయింట్లు పెట్టాల్సిన అవసరం ఉందంటారా!?