ఇదేం వరుస అత్తమ్మా?!
ఓ అహంభావి ఒక పెద్దింటికి కోడలిగా వెళ్తుంది. ఆ వంశానికి కొడుకును ఇవ్వక పోతే అక్కడ తన స్థానమేమవుతుందో అని భయపడుతుంది. ఆ భయం పురుట్లోనే పిల్లల్ని మార్చేసేలా చేస్తుంది. ఎవరి బిడ్డనో తన కొడుకులా పెంచుతుంది. ఆమె కూతురు ఓ పేదింట పెరుగుతుంది. ఆ పిల్ల పెద్దయ్యి, తన తల్లి పెంచిన పిల్లాడితోనే ప్రేమలో పడుతుంది. ఆమె పేదింటి పిల్ల అని నో చెబుతుంది అబ్బాయి తల్లి. దాంతో అత్తా కోడళ్ల మధ్య ఫైట్.
ఇదీ ‘అత్తో అత్తమ్మ కూతురో’ సీరియల్ కథ. కథ బానే ఉంది కానీ ఓ తల్లి తన సొంత బిడ్డతో పాటు మరో బిడ్డను పెంచితే ఆ ఇద్దరూ అన్నాచెల్లెళ్లే అవుతారు కదా! మరి అలాంటి వాళ్లిద్దరి మధ్య ప్రేమేంటి? కూతురు కోడలిగా ఎలా వస్తుంది? కొడుకు అల్లుడెలా అవుతాడు? ఈ కథ పెళ్లి వరకూ వెళ్లడం కరెక్టేనా? అదే కాక అత్తమ్మ నిరోషా తన కొడుక్కి ఏకంగా ఇద్దరమ్మాయిలతో పెళ్లి సెటిల్ చేస్తుంది. కథ కొత్తగా అల్లుకోవడంలో తప్పు లేదు. కానీ ఇలా చట్ట విరుద్ధమైన, సమాజం అంగీకరించని పాయింట్లు పెట్టాల్సిన అవసరం ఉందంటారా!?