ramayan roles
-
Ayodhya Ram Mandir: మరలా ఆ ముగ్గురి దర్శనం
రామానంద సాగర్ ‘రామాయణ్’ సీరియల్ రామాయణ గాధను ఇంటింటికీ తెచ్చింది. 1987లో ప్రసారమైన ఈ సీరియల్ ఆ రోజుల్లో ప్రపంచంలోనే ఎక్కువ మంది చూసిన సీరియల్. రాముడిగా అరుణ్ గోవిల్, సీతగా దీపికా చిక్లియా, లక్ష్మణుడిగా సునీల్ లహరీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని స్థానం పొందారు. వీరు ముగ్గురూ మళ్లీ కనిపిస్తే? అదే ఆలోచన వచ్చింది అభిషేక్ ఠాకూర్ అనే నిర్మాతకు. అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపన సందర్భంగా ‘హమారే రామ్ ఆయేహై’ అనే పాటను సోను నిగమ్ గొంతులో రికార్డు చేయించి, అయోధ్య రామమందిర ప్రాంగణంలో, సరయూ నది ఒడ్డున చిత్రీకరించి విడుదల చేశాడు. ఆ పాటలో అరుణ్ గోవిల్, దీపిక, సునీల్ లహరీ... అయోధ్య ప్రాంగణంలో తిరుగాడటం... సాక్షాత్తు ఆ సీతారామ లక్ష్మణులు తిరిగిన భావనను భక్తులకు కలిగించింది. ‘హమారే రామ్ ఆయేహై’ పాట ఇప్పటికే కోటి వ్యూస్ దాటిపోయింది. ఇంకా ఎన్ని కోట్ల వ్యూస్ వస్తాయో చెప్పలేము. అరుణ్ గోవిల్, దీపికలు ఇప్పటికీ ఎక్కడ కనిపించినా పాద నమస్కారాలు చేసే ప్రేక్షకులు ఉన్నారు. ఇప్పుడు రామమందిర ప్రతిష్ఠాపన తర్వాత వారి కీర్తి మరింతగా విరాజిల్లనుంది. -
ఇంతకీ అక్కడ రాముడెవరు?
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నోటిఫికేషన్ వెలువడక ముందే రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. రాష్ట్ర నేతలు రామాయణంలోని పాత్రలతో పోలుస్తూ పరస్పరం దూషణల పర్వం మొదలుపెట్టారు. హిందుస్థానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం) పేరిట కొత్త పార్టీని పెట్టిన మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీని ద్రోహి అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రామాలయంలోని 'విభీషణుడి'తో పోల్చారు. రాముడికి అండగా నిలిచిన విభూషణుడిగా తనను అభివర్ణిస్తే స్వీకరించడానికి తనకేమీ అభ్యంతరం లేదన్న మాంఝీ, నితీష్‌ను మాత్రం 'రావణాసురుడు' అంటూ ఘాటుగా ఎదురుదాడికి దిగారు. అంతేకాకుండా 'బీహార్‌లో రావణ రాజ్యాన్ని తగులబెడతాం' అంటూ మరో చురకేశారు. కారణమేదైనా అన్నకు ద్రోహం చేసి పరుల పంచన చేరిన విభూషణుడు ద్రోహిగా ముద్రపడ్డారని, అందుకే పిల్లలెవరికీ తల్లిదండ్రులు విభూషణుడి పేరు పెట్టరంటూ మాంఝీ వ్యాఖ్యలను నితీష్ తిప్పికొట్టారు. 'మాంఝీ సంగతి సరే! 17 ఏళ్ల బీజేపీ బంధాన్ని వదిలేసి వెళ్లిన ఎన్డీయేలో విభూషణుడు ఎవరో చెప్పాలి?' అంటూ నితీష్‌ను సీనియర్ బీజేపీ నాయకుడు నంద్ కిషోర్ యాదవ్ నిలదీశారు. జనతా పరివార్ పేరిట ఇటీవల నితీష్‌తో చేతులు కలిపిన లాలు ప్రసాద్‌ను ఇటు బీజేపీ, అటు మాంఝీ పార్టీలు రావణాసురుడికి మరో సోదరుడైన 'కుంభకర్ణుడు'తో పోలుస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. రామాయణంలోని 'రాముడు' పాత్రతో మాత్రం తమకు తాము గానీ, మరొకరిని గానీ ఎవరూ పోల్చడం లేదు. బహుశా 'బీహార్ రాముడు' ఎవరో తేల్చాల్సిన బాధ్యతను అన్ని రాజకీయ పార్టీలు ఓటర్లకు అప్పగించినట్టున్నారు.