ఇంతకీ అక్కడ రాముడెవరు?
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నోటిఫికేషన్ వెలువడక ముందే రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. రాష్ట్ర నేతలు రామాయణంలోని పాత్రలతో పోలుస్తూ పరస్పరం దూషణల పర్వం మొదలుపెట్టారు. హిందుస్థానీ అవామ్ మోర్చా (హెచ్‌ఏఎం) పేరిట కొత్త పార్టీని పెట్టిన మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీని ద్రోహి అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రామాలయంలోని 'విభీషణుడి'తో పోల్చారు. రాముడికి అండగా నిలిచిన విభూషణుడిగా తనను అభివర్ణిస్తే స్వీకరించడానికి తనకేమీ అభ్యంతరం లేదన్న మాంఝీ, నితీష్‌ను మాత్రం 'రావణాసురుడు' అంటూ ఘాటుగా ఎదురుదాడికి దిగారు. అంతేకాకుండా 'బీహార్‌లో రావణ రాజ్యాన్ని తగులబెడతాం' అంటూ మరో చురకేశారు.
కారణమేదైనా అన్నకు ద్రోహం చేసి పరుల పంచన చేరిన విభూషణుడు ద్రోహిగా ముద్రపడ్డారని, అందుకే పిల్లలెవరికీ తల్లిదండ్రులు విభూషణుడి పేరు పెట్టరంటూ మాంఝీ వ్యాఖ్యలను నితీష్ తిప్పికొట్టారు. 'మాంఝీ సంగతి సరే! 17 ఏళ్ల బీజేపీ బంధాన్ని వదిలేసి వెళ్లిన ఎన్డీయేలో విభూషణుడు ఎవరో చెప్పాలి?' అంటూ నితీష్‌ను సీనియర్ బీజేపీ నాయకుడు నంద్ కిషోర్ యాదవ్ నిలదీశారు. జనతా పరివార్ పేరిట ఇటీవల నితీష్‌తో చేతులు కలిపిన లాలు ప్రసాద్ను ఇటు బీజేపీ, అటు మాంఝీ పార్టీలు రావణాసురుడికి మరో సోదరుడైన 'కుంభకర్ణుడు'తో పోలుస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. రామాయణంలోని 'రాముడు' పాత్రతో మాత్రం తమకు తాము గానీ, మరొకరిని గానీ ఎవరూ పోల్చడం లేదు. బహుశా 'బీహార్ రాముడు' ఎవరో తేల్చాల్సిన బాధ్యతను అన్ని రాజకీయ పార్టీలు ఓటర్లకు అప్పగించినట్టున్నారు.