ఎన్నికల్లో 'మాంఝీ' హిట్టవుతుందా?
దేశవ్యాప్తంగా శుక్రవారం విడుదలవుతున్న బాలీవుడ్ బయోపిక్ 'మాంఝీ: ది మౌంటేన్ మేన్' బిహార్ అసెంబ్లీ ఎన్నికల అంశమైంది. సోమవారం ఈ చిత్రం ప్రివ్యూను చూసిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చిత్రంపై వినోదపన్నును రద్దుచేశారు. చిత్ర కథకు స్ఫూర్తినిచ్చిన గెహ్లార్ గ్రామానికి చెందిన దశరథ్ మాంఝీ పేరిట పట్నాలో 'దశరథ్ మాంఝీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ది లేబర్ రిసోర్సెస్' అనే సంస్థను కూడా ఏర్పాటుచేశారు.
చిత్రానికి దర్శకత్వం వహించిన కేతన్ మెహతాతోపాటు అందులో నటించిన నవాజుద్దీన్ సిద్దిఖీ, రాధికా ఆప్టే, ఇతర నటీనటులను ప్రశంసించారు. వారు నటించలేదని, పాత్రల్లో నిజంగా జీవించారని పొగిడారు. ఇదో గొప్ప చిత్రమని, రాష్ట్ర ప్రజలందరికీ నిజంగా స్ఫూర్తినిస్తుందని వ్యాఖ్యానించారు. గయ జిల్లాలోని గెహ్లార్ గ్రామానికి రోడ్డు సౌకర్యం కోసం 22 ఏళ్లపాటు అకుంఠిత దీక్షతో అడ్డుగా ఉన్న కొండను తవ్వి రోడ్డు వేసిన దశరథ్ మాంఝీ నిజ జీవితం గురించి ప్రస్తావించారు. మాంఝీని గతంలో తాను కలుసుకున్న సందర్భాలను గుర్తుచేశారు.
మాంఝీ చిత్రానికి వినోద పన్ను రాయతీని కల్పించాలంటూ నితీష్ కుమార్‌కు స్వయంగా లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి, హిందుస్థాన్ అవమ్ మోర్చా వ్యవస్థాపక నాయకుడు జితన్ రామ్ మాంఝీ ఇప్పుడు ఇదో రాజకీయ జిమ్మిక్కని వ్యాఖ్యానించారు. నిజ జీవితంలో దశరథ్ మాంఝీ కుటుంబానికిగానీ, ఆయన గ్రామం గెహ్లార్‌కుగానీ ఎలాంటి సహాయ, సహకారాలు అందించలేదని నితీష్ కుమార్‌ను విమర్శించారు. దశరథ్ మాంఝీ దళితుడు కాకపోయినట్టయితే ఈ పాటికి ఆయనకు భారతరత్న అవార్డు కూడా వచ్చేదని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో 22 శాతం ఉన్న దళిత ఓటర్లదే కీలక పాత్ర అవుతుందని అన్నారు.
మాంఝీ చిత్రం విడుదల సందర్భంగా దర్శకుడు మెహతా, హీరో, హీరోయిన్లు గెహ్లార్ గ్రామానికి వెళ్లి మాంఝీ కుమారుడికి 7.32 లక్షల రూపాయల పారితోషికాన్ని బహూకరించారు.