manjhi the mountain man movie
-
ఎన్నికల్లో 'మాంఝీ' హిట్టవుతుందా?
దేశవ్యాప్తంగా శుక్రవారం విడుదలవుతున్న బాలీవుడ్ బయోపిక్ 'మాంఝీ: ది మౌంటేన్ మేన్' బిహార్ అసెంబ్లీ ఎన్నికల అంశమైంది. సోమవారం ఈ చిత్రం ప్రివ్యూను చూసిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చిత్రంపై వినోదపన్నును రద్దుచేశారు. చిత్ర కథకు స్ఫూర్తినిచ్చిన గెహ్లార్ గ్రామానికి చెందిన దశరథ్ మాంఝీ పేరిట పట్నాలో 'దశరథ్ మాంఝీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ది లేబర్ రిసోర్సెస్' అనే సంస్థను కూడా ఏర్పాటుచేశారు. చిత్రానికి దర్శకత్వం వహించిన కేతన్ మెహతాతోపాటు అందులో నటించిన నవాజుద్దీన్ సిద్దిఖీ, రాధికా ఆప్టే, ఇతర నటీనటులను ప్రశంసించారు. వారు నటించలేదని, పాత్రల్లో నిజంగా జీవించారని పొగిడారు. ఇదో గొప్ప చిత్రమని, రాష్ట్ర ప్రజలందరికీ నిజంగా స్ఫూర్తినిస్తుందని వ్యాఖ్యానించారు. గయ జిల్లాలోని గెహ్లార్ గ్రామానికి రోడ్డు సౌకర్యం కోసం 22 ఏళ్లపాటు అకుంఠిత దీక్షతో అడ్డుగా ఉన్న కొండను తవ్వి రోడ్డు వేసిన దశరథ్ మాంఝీ నిజ జీవితం గురించి ప్రస్తావించారు. మాంఝీని గతంలో తాను కలుసుకున్న సందర్భాలను గుర్తుచేశారు. మాంఝీ చిత్రానికి వినోద పన్ను రాయతీని కల్పించాలంటూ నితీష్ కుమార్కు స్వయంగా లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి, హిందుస్థాన్ అవమ్ మోర్చా వ్యవస్థాపక నాయకుడు జితన్ రామ్ మాంఝీ ఇప్పుడు ఇదో రాజకీయ జిమ్మిక్కని వ్యాఖ్యానించారు. నిజ జీవితంలో దశరథ్ మాంఝీ కుటుంబానికిగానీ, ఆయన గ్రామం గెహ్లార్కుగానీ ఎలాంటి సహాయ, సహకారాలు అందించలేదని నితీష్ కుమార్ను విమర్శించారు. దశరథ్ మాంఝీ దళితుడు కాకపోయినట్టయితే ఈ పాటికి ఆయనకు భారతరత్న అవార్డు కూడా వచ్చేదని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో 22 శాతం ఉన్న దళిత ఓటర్లదే కీలక పాత్ర అవుతుందని అన్నారు. మాంఝీ చిత్రం విడుదల సందర్భంగా దర్శకుడు మెహతా, హీరో, హీరోయిన్లు గెహ్లార్ గ్రామానికి వెళ్లి మాంఝీ కుమారుడికి 7.32 లక్షల రూపాయల పారితోషికాన్ని బహూకరించారు. -
ఓ మాంఝీ కోసం.. మరో మాంఝీ పోరాటం
ఎన్నికలు సమీపిస్తున్న బీహార్ రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయాలు ఓ బాలీవుడ్ సినిమా చుట్టూ తిరుగుతున్నాయి. 22 ఏళ్లపాటు అకుంఠిత దీక్షతో అవిశ్రాంతంగా శ్రమించి స్వగ్రామానికి రోడ్డు వేసిన మహానుబావుడు, దళితుడు దశరథ్ మాంఝీ యథార్థ జీవితం ఆదారంగా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కేతన్ మెహతా తీసిన 'మాంఝీ: ది మౌంటేన్ మేన్' ఇక్కడి రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఆగస్టు 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూస్తున్న బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ, ఈ సినిమాకు వినోద పన్నును మినహాయించాలని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను డిమాండ్ చేశారు. మాంఝీతో పలు దళిత సంఘాలు కూడా గొంతు కలుపుతున్నాయి. గతంలో ఆమీర్ ఖాన్ నటించిన 'పీకే' చిత్రంపై నితీష్ కుమార్ వినతి మేరకు నాటి ముఖ్యమంత్రి జితిన్ రామ్ మాంఝీ వినోద పన్ను రద్దు చేశారు. అందుకు ప్రతిఫలంగా ఇప్పుడు 'మౌంటేన్ మేన్' చిత్రంపై వినోద పన్ను రద్దు చేయాలని కోరుతున్నారు. 2007లో చనిపోయిన దశరథ్ మాంఝీకి భారతరత్న, నోబెల్ బహుమతి కూడా ఇవ్వాలని మాంఝీ ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. దశరథ్ మాంఝీ దళితుడు కావడం వల్ల భారత ప్రభుత్వం ఆయన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దశరథ్ మాంఝీ కుమారుడికి, ఇతర కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలిచ్చి ఆదుకున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. అయితే, ఓ సినిమాను కూడా తన రాజకీయ లబ్ధి కోసం వాడుకునేందుకు మాంఝీ ఎత్తు వేస్తున్నారని నితీష్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. గెహలౌర్ వ్యాలీకి చెందిన దశరథ్ మాంఝీ 1960 నుంచి 1982 వరకు దాదాపు 22 ఏళ్లపాటు ఒంటరిగా శ్రమించి ఎత్తైన పర్వతాన్ని తొలిచి 300 మీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పుతో రోడ్డు వేశారు. అందుకు ఆయన ఉపయోగించి ఆయుధాలు రెండే రెండు. ఒకటి సుత్తి, రెండు వులి. ప్రజలంతా పిచ్చివాడని వెక్కిరించినా పట్టించుకోకుండా సమీపంలోని వజీర్గంజ్కు రోడ్డేశారు. దీనివల్ల ఆయన గ్రామం నుంచి వజీర్గంజ్కు చుట్టూ తిరిగి వెళ్లాల్సిన 75 కిలోమీటర్ల దూరం ఒక కిలోమీటరుకు తగ్గింది. ఆమీర్ ఖాన్ స్వయంగా ఆయన ఊరును సందర్శించి దశరథ్ మాంఝీకి నివాళులర్పించినప్పుడు మరోసారి ఆయన పేరు వెలుగులోకి వచ్చింది. 'సత్యమేవ జయతే' టీవీ సీరియల్ ప్రారంభోత్సవానికి ముందు ఆమీర్ ఖాన్ అక్కడికెళ్లారు.