ఓ మాంఝీ కోసం.. మరో మాంఝీ పోరాటం | jitan ram manjhi fights with nitish kumar for a movie | Sakshi
Sakshi News home page

ఓ మాంఝీ కోసం.. మరో మాంఝీ పోరాటం

Published Tue, Jul 21 2015 4:41 PM | Last Updated on Thu, Jul 18 2019 2:11 PM

ఓ మాంఝీ కోసం.. మరో మాంఝీ పోరాటం - Sakshi

ఓ మాంఝీ కోసం.. మరో మాంఝీ పోరాటం

ఎన్నికలు సమీపిస్తున్న బీహార్ రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయాలు ఓ బాలీవుడ్ సినిమా చుట్టూ తిరుగుతున్నాయి. 22 ఏళ్లపాటు అకుంఠిత దీక్షతో అవిశ్రాంతంగా శ్రమించి  స్వగ్రామానికి రోడ్డు వేసిన మహానుబావుడు, దళితుడు దశరథ్ మాంఝీ యథార్థ జీవితం ఆదారంగా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కేతన్ మెహతా తీసిన 'మాంఝీ: ది మౌంటేన్ మేన్' ఇక్కడి రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారుతోంది.

ఆగస్టు 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూస్తున్న బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ, ఈ సినిమాకు వినోద పన్నును మినహాయించాలని ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను డిమాండ్ చేశారు. మాంఝీతో పలు దళిత సంఘాలు కూడా గొంతు కలుపుతున్నాయి.

గతంలో ఆమీర్ ఖాన్ నటించిన 'పీకే' చిత్రంపై నితీష్ కుమార్ వినతి మేరకు నాటి ముఖ్యమంత్రి జితిన్ రామ్ మాంఝీ వినోద పన్ను రద్దు చేశారు. అందుకు ప్రతిఫలంగా ఇప్పుడు 'మౌంటేన్ మేన్' చిత్రంపై వినోద పన్ను రద్దు చేయాలని కోరుతున్నారు. 2007లో చనిపోయిన దశరథ్ మాంఝీకి భారతరత్న, నోబెల్ బహుమతి కూడా ఇవ్వాలని మాంఝీ ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. దశరథ్ మాంఝీ దళితుడు కావడం వల్ల భారత ప్రభుత్వం ఆయన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దశరథ్ మాంఝీ కుమారుడికి, ఇతర కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలిచ్చి ఆదుకున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. అయితే, ఓ సినిమాను కూడా తన రాజకీయ లబ్ధి కోసం వాడుకునేందుకు మాంఝీ ఎత్తు వేస్తున్నారని నితీష్ వర్గీయులు ఆరోపిస్తున్నారు.

గెహలౌర్ వ్యాలీకి చెందిన దశరథ్ మాంఝీ 1960 నుంచి 1982 వరకు దాదాపు 22 ఏళ్లపాటు ఒంటరిగా శ్రమించి ఎత్తైన పర్వతాన్ని తొలిచి 300 మీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పుతో రోడ్డు వేశారు. అందుకు ఆయన ఉపయోగించి ఆయుధాలు రెండే రెండు. ఒకటి సుత్తి, రెండు వులి. ప్రజలంతా పిచ్చివాడని వెక్కిరించినా పట్టించుకోకుండా సమీపంలోని వజీర్‌గంజ్‌కు రోడ్డేశారు. దీనివల్ల ఆయన గ్రామం నుంచి వజీర్‌గంజ్‌కు చుట్టూ తిరిగి వెళ్లాల్సిన 75 కిలోమీటర్ల దూరం ఒక కిలోమీటరుకు తగ్గింది. ఆమీర్ ఖాన్ స్వయంగా ఆయన ఊరును సందర్శించి దశరథ్ మాంఝీకి నివాళులర్పించినప్పుడు మరోసారి ఆయన పేరు వెలుగులోకి వచ్చింది. 'సత్యమేవ జయతే' టీవీ సీరియల్ ప్రారంభోత్సవానికి ముందు ఆమీర్ ఖాన్ అక్కడికెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement