daliths
-
చంద్రబాబు దళిత ద్రోహి
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబు దళిత ద్రోహి అని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న 31 లక్షల ఎకరాలకు పట్టాలిస్తుంటే కోర్టులకు వెళ్లి ఆపుతున్నారని విమర్శించారు. శనివారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దళితులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందేలా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంటే టీడీపీ కోర్టుల ద్వారా ఆపే ప్రయత్నం చేస్తోందని అన్నారు. దళితుడైన డాక్టర్ సుధాకర్ మరణానికి చంద్రబాబు, అయ్యన్నపాత్రుడే కారణమన్నారు. దళిత ద్రోహులైన వర్ల రామయ్య, నక్కా ఆనంద్‌బాబు, జవహర్, వంగలపూడి అనితలతో కలిసి దళితుల్లో విభేదాలు సృష్టించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఎన్టీఆర్ హయాంలో దళితుల సంక్షేమం జరిగిందని చంద్రబాబు ఒప్పుకున్నందుకు ధన్యవాదాలని.., ఆ తర్వాత మహానేత వైఎస్సార్, ఇప్పడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దళితుల సంక్షేమం, అభివృద్ధికి పని చేస్తున్నారని చెప్పారు. ఎవరి హయాంలో దళితుల అభివృద్ధి జరిగిందో బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు దళితులపై చులకన భావంతో వ్యవహరించారన్నారు. దళితుల భూములు లాక్కోవడం, మహిళలపై దాడులు చేశారని, దళిత హక్కు చట్టాలను చుట్టాలుగా వాడుకున్నారని విమర్శించారు. చిత్తురు జిల్లా రామకుప్పంలో అంబేడ్కర్ విగ్రహం పెట్టనివ్వలేదని అసత్య ప్రచారం చేస్తున్నారని, రాష్ట్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నదే తమ ప్రభుత్వమని చెప్పారు. అధికారంలోకి వస్తే సంపూర్ణ గృహ హక్కు పథకం (ఓటీఎస్) ఉచితంగా చేస్తామని హామీలివ్వడం కాదని, ఐదేళ్లు అధికారంలో ఉండి ఏమి చేశారని మండిపడ్డారు. గుంటూరులో ‘జిన్నా టవర్’’ పేరు మార్చాలంటూ బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని అన్నారు. 2018 వరకు టీడీపీతో కలిపి బీజేపీ రెండు పర్యాయాలు కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మార్చలేదని ప్రశ్నించారు. -
దళిత సాధికారత: మేధావులకు సీఎం కేసీఆర్ పిలుపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ దళిత సమాజాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి, వారి జీవితాల్లో గుణాత్మక మార్పును తేవడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, ఈ లక్ష్య సాధనలో దళిత మేధావి వర్గం కలిసి రావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. రూ.1,200 కోట్లతో ప్రారంభించి, భవిష్యత్తులో రూ.40 వేల కోట్లతో అమలు చేయబోతున్న ‘సీఎం దళిత సాధికారత పథకం’కోసం పటిష్టమైన కార్యాచరణ రూపొందిస్తున్నామని, అందుకు తగు సూచనలు, సలహాలు అందించాలని వారిని కోరారు. దళిత సామాజికవర్గ మేధావులు, ప్రొఫెసర్లు సోమవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రిని కలిసి దళిత సాధి కారత పథకం ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. దేశానికి ఆదర్శంగా నిలుద్దాం.. ‘దళిత సాధికారత పథకానికి రూ.40 వేల కోట్ల నిధులకు తోడు భవిష్యత్తులో కార్పస్ ఫండ్‌ను కూడా ఏర్పాటు చేయబోతున్నం. ఇంకా ఏమి చేయాలి ? ఎట్ల చేస్తే అట్టడుగున ఉన్న కడు పేద దళితుల జీవితాల్లో వెలుగులు నింపవచ్చు. అన్న విషయాల్లో మీ సలహాలు, సూచనలను అందించండి. ప్రత్యేకంగా ఓ రోజంతా సదస్సు నిర్వహించుకుందాం. దళిత సాధికారతను సాధించి దేశానికి ఆదర్శంగా నిలుద్దాం’ అని సీఎం వారికి విజ్ఞప్తి చేశారు. ఏ ప్రాంతంలోని సమస్యలకు ఏ విధమైన విధానాన్ని అనుసరించడం ద్వారా శాశ్వత పరిష్కారాలను చూపగలమన్న అంశంపై ఆలోచన చేయాల్సిన అవసరముందన్నారు. విప్లవాత్మక మార్పులకు నాంది ‘సీఎం దళిత సాధికారత పథకం’దళితుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకనుందని దళిత సామాజికవర్గ మేధావులు ధీమా వ్యక్తం చేశారు. మరియమ్మ లాకప్ డెత్ విషయంలో కేసీఆర్ తీసుకున్న చర్యలను సైతం వారు ప్రశంసించారు. దళిత సమాజంలో ఒక భరోసా ఉప్పెనలా పొంగిందని వారు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో ఎస్సీ ఎస్టీ జాతీయ మేధావుల ఫోరం అధ్యక్ష, కార్యదర్శులు ఆరేపల్లి రాజేందర్, ప్రొఫెసర్ మురళీదర్శన్, ఓయూ ప్రొఫెసర్ మల్లేశం, మాదిగ విద్యావంతుల ఫోరం అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్, ఉస్మానియా యూనిర్శిటీ ఎస్సీ, ఎస్టీ బోధనేతర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బి.కుమార్, బంధు సొసైటీ అధ్యక్షుడు పుల్లెల వీరస్వామి, మాదిగ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు జాన్ తదితరులు ఉన్నారు. చదవండి: కాకతీయ వర్సిటీలో పీవీ విద్యాపీఠం ఏర్పాటు చేస్తున్నాం: సీఎం కేసీఆర్ -
ముస్లింలపై బీజేపీ వివక్ష: మాయావతి
లక్నో: యూపీలో బ్రాహ్మణులు, దళితులు, ముస్లిములను టార్గెట్ చేశారని(లక్ష్యంగా చేసుకోవడం) బీఎస్పీ(బహుజన్ సమాజ్ పార్టీ) అధినేత మాయావతి తెలిపారు. శుక్రవారం మాయావతి మీడియాతో మాట్లాడారు. యూపీలో బీజేపీ నేతృత్వంలోని యోగి ఆధిత్యనాథ్ ప్రభుత్వం దళితుల పై తప్పుడు కేసులు బనాయించి వేదిస్తుందని విమర్శించారు. అయితే గతంలో పాలించిన ఎస్పీ(సమాజ్ వాదీ) ప్రభుత్వంలో బ్రాహ్మణులు, దళితులు వివక్షకు గురయ్యారని మండిపడ్డారు కాగా ఎస్పీ పాలనలో దిగ్గజ నాయకుల విగ్రహాలు ధ్వంసమయ్యావని, జిల్లాలు, సంస్థల పేర్లు (దళిత చిహ్నాలు) ఎస్పీ ప్రభుత్వం మార్చిందని మాయావతి ధ్వజమెత్తారు. మరోవైపు వారనాసి, జౌన్పూర్ ప్రాంతాలలో సంఘటనలను ఆమె విమర్శించారు. యూపీలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల మాయావతి ఆవేదన వ్యక్తం చేశారు. -
హక్కుల రక్షణలో అలసత్వం
దళిత వర్గాల హక్కుల పరిరక్షణకు ఎంతో చేస్తున్నామని చెప్పుకునే ప్రభుత్వాల పరువు తీసే నిజాలివి. దేశంలో అత్యధిక ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ(అత్యాచారాల నిరోధక) చట్టం అమలు తీరును పర్యవేక్షించడంలో, తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నాయని మంగళవారం లోక్‌సభలో కేంద్ర సామాజిక న్యాయ మంత్రి తావర్‌చంద్ గెహ్లోత్ చేసిన ప్రకటన వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతోంది. రాజ్యాంగంలోని వివిధ అధికరణలు షెడ్యూల్ కులాలు, తెగల రక్షణకు పూచీపడు తున్నాయి. ముఖ్యంగా 17వ అధికరణ అంటరానితనాన్ని ఏ రూపంలో పాటించినవారైనా శిక్షార్హు లని చెబుతోంది. ఆ అధికరణకు అనుగుణంగా 1955లో అంటరానితనాన్ని నిషేధించే చట్టాన్ని తీసుకొచ్చారు. దానికి మరింత పదునుపెడుతూ 1976లో పౌరహక్కుల రక్షణ చట్టాన్ని చేశారు. అయితే అందులోని లోపాలను పరిహరిస్తూ 1989లో ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం వచ్చింది. ఆ చట్టం కింద అన్ని రాష్ట్రాలూ, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నిఘా, పర్యవేక్షణ కమిటీలు ఏర్పడాలి. రాష్ట్ర స్థాయి కమిటీలు ఏడాదికి కనీసం రెండుసార్లు, జిల్లా స్థాయి కమిటీలు కనీసం మూడు నెలలకోసారి సమావేశం కావాలి. అయితే దేశంలోని 25 రాష్ట్రాలూ, కేంద్ర పాలిత ప్రాంతాలూ ఈ కమిటీల గురించి పట్టించుకోవడం లేదని గెహ్లోత్ చేసిన ప్రకటన ఆశ్చర్యం కలిగిస్తుంది. 2016 మొదలుకొని 2018 వరకూ చూస్తే ఆ కమిటీలు ఒక్కసారైనా సమావేశం కాలేదని ఆయన చెబుతున్నారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో 25 మందితో ఏర్పడే కమిటీలో హోంమంత్రి, ఆర్థికమంత్రి, సాంఘిక సంక్షేమ మంత్రి తదితరులతోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు 16 మంది ఉండాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మొదలుకొని ఉన్నతాధికారులుండాలి. జిల్లా స్థాయి కమిటీల్లో కలెక్టర్, ఎస్పీలతోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఉంటారు. ఎస్సీ, ఎస్టీ(అత్యాచారాల నిరోధక) చట్టం అమలు తీరుపై నిఘా వుండాలని, ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలనడం వెనక ముఖ్య కారణముంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా 1985 జూలై 17న ప్రకాశం జిల్లా కారంచేడులో దళితుల ఊచకోత జరిగింది. దళితులపై అమలవుతున్న అత్యాచారాలను, హత్యాకాండను నిలువరించడంలో పౌర హక్కుల రక్షణ చట్టం దారుణంగా విఫలమవుతున్నదని పలు దళిత, ప్రజా సంఘాలు అప్పట్లో ఆరోపించాయి. మరింత సమగ్రమైన చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశాయి. పార్లమెంటులో సైతం అన్ని పార్టీలూ ముక్తకంఠంతో కోరడంతో పౌర హక్కుల రక్షణ చట్టం స్థానంలో మరో చట్టాన్ని తీసుకు రావాలని నిర్ణయించారు. చివరకు 1989లో ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం వచ్చింది. కానీ విషాద మేమంటే ఆ తర్వాత మరో మూడేళ్లు గడిచాకగానీ ఆ చట్టానికి సంబంధించిన మార్గ దర్శక సూత్రాలు రూపొందలేదు. ఈలోగా 1991 ఆగస్టులో చుండూరు మారణకాండ చోటు చేసుకుంది. 2014లో ఆ చట్టానికి సవరణలు తీసుకొచ్చారు. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నిఘా, పర్యవేక్షణ కమిటీలుండాలని భావించడంలో కీలకమైన ఉద్దేశం వుంది. ఆ చట్టం సరిగా అమలు కావడంలేదని, తమను వేధిస్తున్న వారిపై కేసు పెట్టడంలో పోలీసులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని దళితులు ఆరోపిస్తుంటారు. దళితులను వేధించేవారిలో పెత్తందారీ కులాలకు చెందినవారు, స్థాని కంగా డబ్బు, పలుకుబడి ఉన్నవారే అధికం. అందువల్ల సహజంగానే పోలీసులు చూసీ చూడనట్టు ఉండిపోతారు. అవతలివారి నుంచి డబ్బు తీసుకుని రాజీకి రావాలని ఒత్తిళ్లు తెస్తారు, బెదిరిస్తారు. కమిటీలు చురుగ్గా పని చేస్తుంటే కిందిస్థాయి అధికారులు అప్రమత్తంగా వుంటారు. ఫిర్యాదు అందిన వెంటనే చర్యలకు సిద్ధపడకపోతే సంజాయిషీ చెప్పుకోవాల్సి వస్తుందన్న భయం వారిని వెన్నాడు తుంది. అటు పోలీ సుల వద్దా, ఇటు న్యాయస్థానాల్లోనూ కేసులు పెండింగ్ పడినప్పుడు ఏ దశలో, ఎందుకు నిలిచి పోయాయో కమిటీలు పరిశీలించి... ఆ అవరోధాలను తొలగించే ప్రయత్నం చేస్తాయి. ప్రత్యేక కోర్టుల ఏర్పాటులో జాప్యంవల్ల లేదా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు లేకపోవడంవల్ల కేసుల విచారణ నత్త నడకన సాగుతున్నదని తేలితే అందుకు అవసరమైన చర్యకు సిఫార్సు చేస్తాయి. నిర్ణీత కాల వ్యవధిలో కమిటీలు సమావేశమవుతుంటే ఇలాంటి సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. కానీ మూడేళ్లపాటు 25 రాష్ట్రాలూ, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కమిటీలు ఒక్కసారి కూడా సమావేశం కాలేదంటే ఎస్సీ, ఎస్టీ వర్గాల హక్కుల పరిరక్షణ విషయంలో ప్రభుత్వాలు ఎంతగా అలసత్వం ప్రద ర్శిస్తున్నాయో సులభంగానే తెలుస్తుంది. కేంద్రమంత్రి ఇచ్చిన సమాధానంలో ఆసక్తికరమైన అంశాలున్నాయి. దేశంలో ఒక్క హరియాణా మాత్రమే 2016, 2017 సంవత్సరాల్లో నిబంధనలు తు.చ. తప్పకుండా పాటించింది. 2018లో ఒకసారి మాత్రమే సమావేశం నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో వరసగా మూడేళ్లూ రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కమిటీలు సమావేశమే కాలేదని మంత్రి ఇచ్చిన జవాబు చూస్తే అర్థమవుతుంది. దళితుల విషయంలో చంద్రబాబుకున్న చిన్న చూపేమిటో వివిధ సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. దేశ జనాభాలో ఎస్సీ కులాలు 16.6 శాతమైతే, ఎస్టీ వర్గాలవారు 8.6 శాతం. ఈ వర్గాలవారు సామాజికంగా ఎదగడానికి, అభివృద్ధి సాధించడానికి వివక్ష, వేధింపులు, దాడులు అవరోధంగా ఉంటున్నాయి. ఆ వర్గాల సంక్షేమానికి వివిధ పథకాలు అమలు చేయడం ఎంత అవసరమో... ఆ వర్గాలు నిర్భయంగా, గౌరవప్రదంగా జీవించడానికి అవసరమైన పరిస్థితులు కల్పించడం కూడా అంతే ప్రధానం. అయితే ఏటా సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ రాష్ట్రాల్లోని నిఘా, పర్యవేక్షణ కమిటీల పనితీరుపై ఇస్తున్న సమాచారం నిరాశాజనకంగానే వుంటోంది. ఈ విషయంలో రాష్ట్రాలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహ రించాలి. చట్ట నిబంధనల్ని ప్రభుత్వాలే పాటించకపోతే ఇక సాధారణ పౌరుల నుంచి ఏం ఆశించగలం? -
దలితులను కించపరిచిన టీడీపీ నేత దెవినేని
-
వీడీసీ ఆగడాలు.. దళితుల సాంఘీక బహిష్కరణ!
సాక్షి, నిజామాబాద్ : జిల్లాలోని నందిపేట్ మండలం మారంపల్లి గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆగడాలు మితిమీరాయి. గ్రామంలోని దాదాపు 80మంది దళితులను వీడీసీ సభ్యులు సాంఘీక బహిష్కరణ చేశారు. గ్రామంలోని అంబేద్కర్ భవన నిర్మాణానికి సంబంధించిన విషయంలో తమను సాంఘీక బహిష్కరణ చేశారని దళిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. వీడీసీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సమాచారం అందుకున్న ఆర్మూర్ ఏసీపీ అందే రాములు, ఎమ్మార్వో , ఎంపీడీఓ, ఎస్‌లు మారంపల్లి గ్రామాన్ని పరిశీలించారు. -
‘మిర్చ్‌పూర్’ దోషులకు యావజ్జీవం
న్యూఢిల్లీ: 2010లో సంచలనం సృష్టించిన మిర్చ్‌పూర్ దళితుల సజీవ దహనం కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. జాట్ వర్గానికి చెందిన 12 మందికి యావజ్జీవ శిక్ష, మరో 21 మందికి వేర్వేరు జైలు శిక్షలు విధిస్తూ శుక్రవారం తీర్పునిచ్చింది. దోషులకు విధించిన జరిమానాను బాధితుల పునరావాసానికి ఖర్చు చేయాలని సూచించింది. 2010, ఏప్రిల్‌లో హరియాణాలోని హిసార్ జిల్లా మిర్చ్‌పూర్ గ్రామంలో దళితులు, జాట్లకు మధ్య జరిగిన వివాదం నేపథ్యంలో 60 ఏళ్ల తారాచంద్ అనే వ్యక్తిని, దివ్యాంగురాలైన ఆయన కూతురిని సజీవదహనం చేశారు. జాట్ వర్గీయుల దాడుల్లో పలువురు దళితులు తీవ్రంగా గాయపడ్డారు. భారీఆస్తినష్టం జరిగింది. ఈ కేసులో 98 మందిని నిందితులుగా చేర్చగా, ట్రయల్ కోర్టు 15 మందిని దోషులుగా తేల్చి, వారిలో ముగ్గురికి యావజ్జీవ శిక్ష విధించింది. ట్రయల్ కోర్టు నిర్దోషులుగా తేల్చిన 20 మందిని తాజాగా హైకోర్టు దోషులుగా నిర్ధారిస్తూ శిక్షలు ఖరారు చేసింది. వాల్మీకి వర్గానికి చెందిన వారి ఇళ్లే లక్ష్యంగా, ప్రణాళికతో జాట్లు దాడులకు పాల్పడినట్లు విచారణలో స్పష్టమైందని వ్యాఖ్యానించింది. తీర్పు వెలువరిస్తూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘వాల్మీకీ వర్గీయులకు గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతోనే దాడులు జరిగాయి. ఇది కుల విభేదాలకు సంబంధించిన హింస. స్వాతంత్య్రం వచ్చి 71 ఏళ్లు గడచినా దళితులపై అగ్రవర్ణాల దాడులు ఆగట్లేవు. సమానత్వం, సౌభ్రాతృత్వం అనే రెండు అంశాలు భారతీయ సమాజంలో ఏ మాత్రం కనిపించడం లేదు అంటూ 1949లో రాజ్యాంగ ముసాయిదాను రాజ్యాంగ సభ ముందు ఉంచుతూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ వాస్తవాలుగానే కనిపిస్తున్నాయి’ అని ధర్మాసనం పేర్కొంది. మిర్చ్‌పూర్‌లో లోహర్లు, చమర్లు, వాల్మీకీలు, బ్రాహ్మణులు, జాట్లు ఎక్కువగా ఉంటారు. వీరిలో జాట్లది ప్రాబల్య వర్గం. -
దళిత తేజం ఇదేనా..?
ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు.. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్య దళితులు చదువుకోరు.. శుభ్రంగా ఉండరు.. మంత్రి ఆదినారాయణరెడ్డి ఆగస్టు 15న అన్న మాటలు మాదిగ (నా..కొ..)లు అస్సలు చదవరు.. బాగుపడరు.. పరీక్ష రాసి వస్తున్న ఓ దళిత విద్యార్థిని ఉద్దేశించి మే 10న ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య చేసిన వివాదాస్పద కామెంట్.. సీఎంకి, ఆయన సహచరులకు దళితులపై ఉన్న ప్రేమకు ఈ వ్యాఖ్యలే నిదర్శనాలు.. - పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రులో దళితులపై సాంఘిక బహిష్కరణ విధించారు.. - విశాఖ జిల్లా జర్రిపోతులపాలెంలో దళిత మహిళ ఇల్లు ఖాళీచేయలేదన్న సాకుతో అందరూ చూస్తుండగా వీధుల్లో దుస్తులు ఊడిపోయేలా ఈడ్చి ఈడ్చి కొట్టారు. - కర్నూలు జిల్లాలోని ఒక ఊరిలో శ్మశానంలో గొయ్యి తవ్వలేదని ఎస్సీ కాలనీలో రోడ్లు ధ్వంసం చేసి, కుళాయిలు పీకేశారు..రాష్ట్రంలో దళితుల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి ఇవి మచ్చుతునకలు..కానీ దళితులపై తమకు అపారమైన ప్రేమ ఉందని చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి తహతహలాడుతున్నారు. నెల్లూరు జిల్లాలో ‘దళిత తేజం’ పేరుతో రాష్ట్రప్రభుత్వం శనివారం ఓ కార్యక్రమం నిర్వహిస్తోంది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రతీ దళిత వాడలో దళితుల్లో చైతన్యం రగిలించేందుకు, వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను వివరించేందుకు ఉద్దేశించిన ‘దళిత తేజం’ కార్యక్రమం శనివారం నెల్లూరులో జరగనుంది. సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎస్సీ, ఎస్టీలపై దాడులు ఎక్కువయ్యాయని అంబేడ్కర్‌ను సైతం అవమానపర్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ఎంతోమంది దళిత ఉద్యోగులు వేదనకు గురవుతున్నారని ఆ వర్గాలకు చెందిన నేతలు మండిపడుతున్నారు. ఇందుకు నాలుగేళ్లలో చోటుచేసుకున్న అనేక సంఘటనలను సైతం ఉదహరిస్తున్నారు. - పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రులో దళితులను సాంఘిక బహిష్కరణ చేశారు. - శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో దళిత యువకుడిని ఎస్సై కొట్టి హింసించారు. - విజయనగరం జిల్లా ముదువలసలో జన్మభూమి సభలో సమర్పించేందుకు అర్జీలు రాసుకుంటున్న దళితులను టీడీపీ వారు కొట్టారు. ఇందులో ఎమ్మెల్యే నారాయణస్వామి కుమారుడు నిందితుడు. - అలాగే, విశాఖ జిల్లా జర్రిపోతులపాలెంలో ఒక దళిత మహిళ ఇల్లు ఖాళీచేయలేదని తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులు అందరూ చూస్తుండగా వీధుల్లో దుస్తులు ఊడిపోయాలా ఈడ్చి ఈడ్చి కొట్టారు. - కృష్ణాజిల్లా బందరులో ఈనెల 9, 10, 11 తేదీల్లో ప్రభుత్వం నిర్వహించిన బీచ్ ఫెస్టివల్లో ఆటలు ఆడుతున్న మల్లేశం గ్రామానికి చెందిన కొందరు దళిత యువకులను పోలీసులు నాలుగు రోజులు స్టేషన్లు మార్చి మార్చి మరీ కొట్టారు. - ప్రకాశం జిల్లా పర్చూరు మండలం దేవరపల్లిలో 20 దళిత కుటుంబాలకు చెందిన భూమిని నీరు–చెట్టు కార్యక్రమం కింద స్వాధీనం చేసుకుని రాత్రికి రాత్రి మట్టి తోలారు. టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు బలవంతంగా ఈ పనిచేయించినట్లు దళితులు కేసు పెట్టారు. - చిత్తూరు జిల్లా మునగపాలెం ఎస్సీ కాలనీలో బైక్ హారన్ కొట్టారని ఒక యువకుడిని గ్రామంలోని కొందరు కొట్టగా కేసు పెట్టారు. దీంతో దళితవాడను సాంఘిక బహిష్కరణకు గురిచేశారు. - అనంతపురం జిల్లా పరిగి మండలం వన్నంపల్లి గ్రామంలో అన్ని కులాల వారు చందాలు వేసుకుని గుడి నిర్మించారు. గుడిలో విగ్రహ ప్రతిష్టాపనకు దళితులు వచ్చేందుకు వీల్లేదని అడ్డుకోవడంతో ఎదురుతిరిగిన దళితులను సాంఘిక బíßహిష్కరణకు గురిచేశారు. - కర్నూలు జిల్లా నక్కలదిన్నె శ్మశానంలో గొయ్యి తవ్వేందుకు దళితులు రాలేదని ఎస్సీ కాలనీలో రోడ్లు ధ్వంసం చేసి, తాగునీటి కుళాయిలు పీకేశారు. ఈ సంఘటనలన్నీ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌లో నమోదయ్యాయి. అలాగే, నాలుగేళ్లుగా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరగకపోవడం గమనార్హం. స్మృతివనం పేరుతో అంబేడ్కర్‌కు అవమానం అమరావతిలో 25 ఎకరాల స్థలంలో అంబేడ్కర్ స్మృతివనం నిర్మిస్తున్నామని, అక్కడ 125 అడుగుల ఎత్తులో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటుచేస్తున్నామని సీఎం ఘనంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇందుకు గతేడాది ఏప్రిల్ 14న భూమి పూజ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 14న శంకుస్థాపన చేశారు. కానీ ఇప్పటివరకు ఒక్క ఇటుకా పడలేదు. అలాగే, రెండేళ్లుగా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఆదేశాలు గాలిలో కలిసిపోయాయి. గుంటూరుకు చెందిన వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగి రవి ఎంతోకాలం కోర్టుల చుట్టూ తిరిగి ప్రమోషన్ రాకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. సబ్‌ప్లాన్ నిధులు పక్కదోవ సబ్‌ప్లాన్ నిధులు పక్కదోవ పడుతున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయానికి నిధులు అవసరమైనప్పుడల్లా సబ్‌ప్లాన్ నుంచి వినియోగిస్తున్నారు. వివిధ ప్రాంతాలకు ముఖ్యమంత్రి విమానంలో వెళ్ళిన ఖర్చులు కూడా సబ్‌ప్లాన్ నిధులనే వెచ్చించడం విశేషం. ఇదిలా ఉంటే.. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఏర్పాటుచేసిన సంక్షేమ హాస్టళ్లను ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఎంతోమంది పేద దళిత విద్యార్థులు విద్యకు దూరమయ్యారు. అలాగే, రెండువేల వరకు ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నప్పటికీ నాలుగేళ్లుగా అవి భర్తీకి నోచుకోలేదు. ఈ నేపథ్యంలో దళిత తేజం పేరుతో శనివారం నెల్లూరు జిల్లాలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుండడంపై ఆయా వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పలుచోట్ల దళితులపై జరిగిన దాడుల్లో నిందితులను అరెస్టుచేయని టీడీపీ సర్కార్ శనివారం నెల్లూరులో ‘దళిత తేజం’ నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దళిత తేజం సిగ్గుచేటు దళితులపై ఇటీవల జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, హత్యలు, సాంఘిక బహిష్కరణలు చేస్తున్నా ప్రధాన నిందితులను అరెస్టు చేయని టీడీపీ ప్రభుత్వం దళిత తేజం నిర్వహించడం సిగ్గుచేటు. – ఆండ్ర మాల్యాద్రి,ప్రధాన కార్యదర్శి, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం దళిత నిస్తేజం ఏంచేశారని దళిత తేజం నిర్వహిస్తున్నారు? ఎన్ఆర్ఈజీఎస్, 14వ ఆర్థిక సంఘం నిధులు ఖర్చుచేసి రోడ్లు, డ్రైనేజీ కాలువలు అక్కడక్కడ కట్టిస్తే దళిత తేజం అవుతుందా? ఎస్సీ, ఎస్టీ కాలనీల్లోని సుమారు ఆరువేల స్కూళ్లు మూసివేశారు. విద్య, వైద్యం నిర్వీర్యమైంది. దళితులు ఉండే ప్రాంతాల్లో ఉచిత వైద్యం లేదు. – ఆదిమూలం సురేష్, ఎమ్మెల్యే, సంతనూతపాడు, ప్రకాశం జిల్లా. గాడాంధకారమే.. రాష్ట్రంలో దళిత తేజం లేదు, దళిత గాడాంధకారమే ఉంది. దళితుల్లో ఒక్కరికి కూడా ఎకరా పొలం ఇవ్వలేదు. ఇళ్లు, ఇళ్ళ స్థలాలు ఇవ్వలేదు. కృష్ణానది ఒడ్డున ఉన్న అనేకమంది దళితులను అక్కడి నుంచి ఖాళీ చేయించి రోడ్డున పడేశారు. టీడీపీకి దళితులు అందమైన సమాధి కడతారు. – దారా సాంబయ్య, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు -
‘డిప్యూటీ’పై సిగపట్లు
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో కొలువుదీరనున్న కాంగ్రెస్– జేడీఎస్ సంకీర్ణ సర్కారులో డిప్యూటీ సీఎం పదవికోసం కాంగ్రెస్‌లో తీవ్రమైన పోటీ నెలకొంది. పలువురు సీనియర్ నేతలు దీనికోసం తమకు తోచిన మార్గాల్లో లాబీయింగ్ చేసుకుంటున్నారు. జేడీఎస్‌తో పొత్తును ప్రకటించిన మరుక్షణం నుంచే డిప్యూటీ సీఎం సహా కీలక మంత్రిత్వ శాఖలపై ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆంతరంగిక సమావేశాల్లోనూ పలువురు నేతలు మంత్రిత్వ శాఖలపై పట్టుబడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి పదవిపై సోనియా గాంధీ, రాహుల్‌లతో కుమారస్వామి చర్చించినట్లు సమాచారం. అయితే.. రెండు ఉప ముఖ్యమంత్రుల పదవులను ఏర్పాటుచేసి ఒకటి లింగాయత్‌లకు, మరొకటి దళితులకు ఇవ్వాలని చర్చ జరుగుతోంది. పోటీలో డీకే, శివశంకరప్ప, పరమేశ్వర్ ఎమ్మెల్యేల క్యాంపు రాజకీయాలను నడిపిస్తున్న కాంగ్రెస్ మాజీ మంత్రి డీకే శివకుమార్ కూడా డిప్యూటీ సీఎం పదవిని ఆశిస్తున్నారు. కేపీసీసీ అధ్యక్ష పదవి శివకుమార్‌కు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుండగా.. డిప్యూటీ సీఎంకే ఆయన పట్టుబడుతున్నట్లు సమాచారం. తమ సామాజిక వర్గం అధ్యక్షుడు శ్యామనూరు శివశంకరప్పకు ఉపముఖ్యమంత్రి పదవి అప్పగించాలని లింగాయత్‌లు కోరుతున్నారు. ఇక దళితుల కోటాలో కేపీసీసీ చీఫ్ పరమేశ్వర్ ఆ పదవిని ఇష్టపడుతున్నారు. మంత్రుల విషయంలోనూ తీవ్రమైన పోటీ నెలకొంది. ఇప్పటికే పలువురు లాబీయింగ్‌లు ప్రారంభించారు. మరో మూడ్రోజుల్లో బలపరీక్ష ఉన్న నేపథ్యంలో శాఖల కేటాయింపు అంశం పీటముడిగా మారినట్లు కనిపిస్తోంది. అయితే ఇప్పటివరకు మంత్రివర్గ కూర్పుపై చర్చించలేదని ఇరుపార్టీలు బహిరంగంగా చెబుతున్నప్పటికీ లోలోపల ఎమ్మెల్యేల ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు సమాచారం. -
వారి హృదయంలో దళితులకు చోటులేదు
సాక్షి, బెంగళూరు: డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ కలలుగన్న శక్తివంతమైన, సుభిక్షమైన భారత నిర్మాణానికి బీజేపీ ప్రభుత్వం కృషిచేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అంబేడ్కర్‌ను తీవ్రంగా అవమానించిన కాంగ్రెస్ పార్టీ.. ఏనాడూ దళిత, బహుజన వర్గాల సంక్షేమం గురించి ఆలోచించలేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. కర్ణాటక ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగా పార్టీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, స్లమ్ మోర్చా నాయకులు, కార్యకర్తలనుద్దేశించి నమో యాప్ ద్వారా ప్రధాని ప్రసంగించారు. 1952లో పార్లమెంటు ఎన్నికల్లో, 1953లో ముంబైలోని బాంద్రా లోక్‌సభ ఉపఎన్నికల్లోనూ అంబేడ్కర్‌ను ఓడించేందుకు కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డిన విషయాన్ని మరిచిపోవద్దన్నారు. ‘కాంగ్రెస్ పార్టీ హృదయంలో దళితులు, ఓబీసీలకు చోటే లేదు. అంబేడ్కర్‌ను అవమానించినప్పటి నుంచి దశాబ్దాలుగా ఇదే విధానాన్ని అమలుచేస్తోంది. కాంగ్రెస్ చేతిలో అధికారం ఉన్నంతవరకు అంబేడ్కర్‌కు భారతరత్న ఇవ్వలేదు. బీజేపీ పగ్గాలు చేపట్టాకే ఆ మహనీయునికి సరైన గౌరవం దక్కింది’ అని మోదీ పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో అందరినీ కలుపుకుని పోవాలని, అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలన్న బాబాసాహెబ్ ఆలోచనలను నిజం చేసే దిశగా.. సమానత్వం, సామాజిక న్యాయం జరిగేలా తమ ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. అంబేడ్కర్ కలల సాకారం కోసం మనమంతా కృషిచేద్దామని మోదీ పిలుపునిచ్చారు.ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల నుంచి ఎక్కువ మంది బీజేపీ వారేనని మోదీ గుర్తుచేశారు. స్వతంత్ర భారతంలో ఎస్టీలకోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ, ప్రత్యేక ఎస్టీ కమిషన్‌ను ఏర్పాటుచేసింది వాజ్‌పేయి ప్రభుత్వమేనన్నారు. అందుకే ఎస్టీలు ఎక్కువగా ఉన్న మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్తాన్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, త్రిపుర వంటి రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని, నాగాలాండ్, మేఘాలయల్లో సంకీర్ణ ప్రభుత్వాలు నడుపుతోందన్నారు. ఎస్టీలు బీజేపీ వెంటే ఉన్నారనటానికి ఇదే నిదర్శనమన్నారు. అటు ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధత ఇచ్చేందుకు కాంగ్రెస్ ఏనాడూ ఆలోచించలేదని.. ఇప్పటికీ ఈ విషయం ముందుకు రాగానే కావాలని ఏదో ఒక ఆటంకాన్ని కలగజేస్తోందని మోదీ పేర్కొన్నారు. బడుగు, బలహీనవర్గాల మద్దతు ఎప్పటికీ బీజేపీకే ఉంటుందన్న ప్రధాని.. తమ పార్టీయే అల్పసంఖ్యాక వర్గాల వారికి సరైన న్యాయం చేస్తుందని భరోసా ఇచ్చారు. 25 లక్షల మందితో మోదీ! నమో యాప్ ద్వారా కర్ణాటకలోని 25లక్షల మందితో ప్రధాని నరేంద్ర మోదీ అనుసుంధానమయ్యారు. కర్ణాటక ప్రచారం సందర్భంగా పలు వీడియో సంభాషణల ద్వారా ఇంత మంది ప్రజలతో ఆయన కనెక్ట్ అయ్యారని బీజేపీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఇంతమందితో అనుసంధానమైన తొలినేతగా మోదీ నిలిచారని పేర్కొంది. ఇప్పటికే నమో యాప్ ద్వారా పార్టీ మహిళ, యువజన, మైనార్టీ విభాగాలతో, రైతులతో మాట్లాడిన మోదీ.. తాజాగా పార్టీలోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, స్లమ్ మోర్చాలతోనూ సమావేశమయ్యారు. ఇందులో పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలు, మోదీ మద్దతుదారులు కూడా ఉన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల వరకు దేశవ్యాప్తంగా వివిధ వర్గాలకు మరింత చేరువయ్యేందుకు మోదీ నమో యాప్‌ను బలమైన వేదికగా మార్చబోతున్నారని పార్టీ ఐటీ విభాగం నేత అమిత్ మాలవీయ పేర్కొన్నారు. -
ఘర్షణ కాదు.. సామరస్యం కావాలి
న్యూఢిల్లీ/వడోదర/మహూ (ఎంపీ): దేశంలో నేడు సామరస్యం అవసరం కానీ సంఘర్షణ కాదనీ, ప్రజలు విభజనవాద శక్తులతో జాగ్రత్తగా ఉండాలని రాష్ట్రపతి కోవింద్ సూచించారు. శాంతి, సౌభ్రాతృత్వాలతో ప్రజలంతా శాంతి మార్గంలో జీవించాలన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతి సందర్భంగా కోవింద్ శనివారం మధ్యప్రదేశ్‌లోని అంబేడ్కర్ జన్మస్థలం మహూ కంటోన్మెంట్లో నివాళులర్పించారు. ఈ ప్రాంతాన్ని సందర్శించిన తొలి రాష్ట్రపతి కోవిందే. మరోవైపు అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఐక్యరాజ్య సమితిలోనూ భారత శాశ్వత మిషన్ ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కాగా, అంబేడ్కర్ వారసత్వాన్ని బీజేపీ చెరిపేయాలని చూస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ఓవైపు బీజేపీ, ఆరెస్సెస్‌లు దళిత వ్యతిరేక భావాలతో ఉంటే మరోవైపు మోదీ చిత్తశుద్ధి లేకుండా కేవలం నోటిమాటగా అంబేడ్కర్‌కు నివాళులర్పిస్తున్నారని కాంగ్రెస్ నాయకురాలు సెల్జా విమర్శించారు. రాజ్యాంగాన్ని రాసే మహత్తర బాధ్యతను అంబేడ్కర్‌కు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేననీ ఆమె అన్నారు. మేనకా గాంధీకి చేదు అనుభవం గుజరాత్‌లోని వడోదరలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన కేంద్ర మంత్రి మేనకా గాంధీకి చేదు అనుభవం మిగిలింది. బీజేపీ నేతలు అక్కడకు వచ్చి విగ్రహానికి పూలమాలలు వేయడంతో వాతావరణం కలుషితమైందంటూ దళిత నాయకులు అంబేడ్కర్ విగ్రహాన్ని పాలు, నీళ్లతో కడిగారు. మేనక కన్నా మందుగా తాము వచ్చామనీ, విగ్రహానికి పూలమాలలు వేసేందుకు ముందుగా తమనే అనుమతించాలంటూ దళిత నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. -
దళితులపై నేరాలు ఎనిమిదింతలు
ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం–1989 కింద నిందితుల్ని తక్షణ అరెస్ట్ చేయరాదంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసిన నేపథ్యంలో కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా 2006తో పోల్చుకుంటే 2016 నాటికి దళితుల(ఎస్సీ)పై నేరాలు 746 శాతం (8 రెట్లు) పెరిగాయని ఇండియా స్పెండ్ అనే సంస్థ తెలిపింది. ఇక ఆదివాసీల(ఎస్టీ)పై నేరాల సంఖ్య ఈ పదేళ్లలో 1,160 శాతం(12 రెట్లు) పెరిగాయని వెల్లడించింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) 2016లో విడుదల చేసిన గణాంకాలను విశ్లేషించిన అనంతరం ఈ నివేదికను విడుదల చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశజనాభాలో 20.1 కోట్ల మంది(16.6 శాతం) దళితులు, 10.4 కోట్ల మంది(8.6 శాతం) ఆదివాసీలు ఉన్నారు. మధ్యప్రదేశ్ టాప్ 2006–16 మధ్య దేశవ్యాప్తంగా దళితులపై 4,22,799 నేరాలు జరిగాయి. గోవా, కేరళ, ఢిల్లీ, గుజరాత్, బిహార్, మహారాష్ట్ర, జార్ఖండ్, సిక్కిం రాష్ట్రాల్లో ఈ నేరాల సంఖ్య 10 రెట్లు పెరిగిందని ఆ సంస్థ వెల్లడించింది. దళితులపై జరిగిన నేరాల్లో మధ్యప్రదేశ్(43.4%), గోవా (43.2%), రాజస్తాన్(42%) రాష్ట్రాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయంది. ఇక ఆదివాసీలపై 37.5% నేరాలతో కేరళ తొలిస్థానంలో నిలవగా, అండమాన్–నికోబార్ దీవులు (21%), ఆంధ్రప్రదేశ్ (15.4%) తర్వాతి స్థానాల్లో నిలిచాయంది. దేశవ్యాప్తంగా ఈ పదేళ్లలో ఆదివాసీలపై 81,322 నేరాలు జరగగా.. వాటిలో అత్యధికం కేరళ, కర్ణాటక, బిహార్ రాష్ట్రాల్లోనే నమోదయ్యాయంది. పోలీస్స్టేషన్లలో ఆదివాసీలకు సంబంధించి 405 పెండింగ్ కేసులతో ఏపీ మొదటిస్థానంలో నిలిచిందంది. తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ,ఎస్టీలపై జరుగుతున్న నేరాల్లో దోషుల సంఖ్య 10 శాతానికి మించడం లేదని తెలిపింది. కొండలా పేరుకుపోతున్న కేసులు దళితులు, ఆదివాసీలపై ఈ పదేళ్లలో నేరాలు పెరిగినప్పటికీ.. పోలీస్స్టేషన్లు, కోర్టుల్లో అదే స్థాయిలో కేసుల పరిష్కారం జరగడంలేదని నివేదిక స్పష్టం చేసింది. దళితుల ఫిర్యాదులపై పోలీస్స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసులు ఈ పదేళ్లలో 99 శాతం పెరిగాయని, కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు 50 శాతం పెరిగాయని తెలిపింది. 4,311 పెండింగ్ కేసులతో బిహార్ దేశంలోనే తొలిస్థానంలో ఉంది. తప్పుడు కేసులు అంతంతే: దళితులు నిందితులపై పెట్టిన తప్పుడు కేసు ల సంఖ్యలో ఈ పదేళ్లలో ఎలాంటి పెరుగుదల లేదని ఆ నివేదిక తెలిపింది. 2006–16 మధ్య దళితులు పెట్టిన కేసుల్లో 5,347 తప్పుడు కేసులుగా తేలాయంది. వీటిలో రాజస్తాన్ 2,632 కేసులతో ముందుంది. శిక్షపడుతున్న సందర్భాలు చాలా తక్కువ దేశవ్యాప్తంగా దళితులు, ఆదివాసీలపై నేరాలకు పాల్పడిన ఘటనల్లో దోషులుగా తేలుతున్నవారి సంఖ్య 30 శాతానికి మించడం లేదు. దళితులపై జరిగిన నేరాల్లో దోషులుగా తేలినవారి సంఖ్య 2006లో 28 శాతం ఉండగా, 2016 నాటికి 26 శాతానికి పడిపోయిందని ఆ నివేదిక తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సిక్కిం, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, ఒడిశా, గుజరాత్, తమిళనాడు, గోవా, కేరళ రాష్ట్రాల్లో దోషులుగా తేలినవారి సంఖ్య 10 శాతానికి మించడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే 2006లో ఆదివాసీలపై నేరాల్లో దోషులుగా తేలినవారి సంఖ్య 28 శాతం ఉండగా, 2016 నాటికి ఇది 21 శాతానికి పడిపోయిందని పేర్కొంది. పోలీసులకు ఆలస్యంగా ఫిర్యాదు చేయడం, విచారణలో జాప్యం, బాధితులకు రక్షణ లేకపోవడం, ఎస్సీ, ఎస్టీ చట్టంలో సరైన సెక్షన్ల కింద కేసు నమోదుచేయకపోవడం కారణంగానే చాలామంది నేరస్తులు శిక్షపడకుండా తప్పించుకుంటున్నారంది. –సాక్షి నేషనల్ డెస్క్ -
మోదీకి మరో బీజేపీ ఎంపీ షాక్
న్యూఢిల్లీ: ‘‘అంబేద్కర్ చూపిన మార్గంలోనే తన ప్రభుత్వం నడుస్తోంద’న్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాటలను సొంత పార్టీ ఎంపీలే నమ్మడంలేదు. రిజర్వేషన్ల ఎత్తివేతకు కుట్ర జరుగుతోందని బీజేపీ ఎంపీ సావిత్రి బాయి, పార్టీలో దళితులకు గౌరవం లేదన్న మరో ఎంపీ చోటేలాల్ వ్యాఖ్యలపై దుమారం చల్లారకముందే మరో బీజేపీ ఎంపీ.. ప్రధానిపై లేఖాస్త్రం సంధించారు. ఉత్తరప్రదేశ్‌లోని నగీనా స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న బీజేపీ ఎంపీ యశ్వంత్ సింగ్ శనివారం మోదీకి రాసిన లేఖలో పలు సంచలన అంశాలను పేర్కొన్నారు. బీజేపీ దళితులకు చేసిందేమీలేదు: ‘‘గడిచిన నాలుగేళ్లలో మన ప్రభుత్వం దేశంలోని 30 కోట్ల మంది దళితులకు చేసింది ఏమీలేదు. రిజర్వేషన్ వల్ల నేను ఎంపీగా గెలవడం తప్ప ప్రత్యేకంగా సాధించింది ఏమీలేదు. కేవలం దళితుడిని కావడంవల్లే నా సామర్థ్యాన్ని పార్టీ వినియోగించుకోవడంలేదు..’’ అని ఎంపీ యశ్వంత్ సింగ్ పేర్కొన్నారు. ఇదే లేఖలో.. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేయరాదంటూ సుప్రీంకోర్టుకు ఓ సూచన చేశారు. ఎస్సీ, ఎస్టీ ఎంపీల అసంతృప్తి: ఉత్తరప్రదేశ్‌కు చెందిన దళిత, గిరిజన ఎంపీలు ఒక్కొక్కరిగా సొంత పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేస్తుండటం రాజకీయంగా చర్చనీయాంశమవుతున్నది. బహ్రెయిచ్ ఎంపీ సావిత్రి బాయి మొన్న ఒక ర్యాలీలో మాట్లాడుతూ.. ‘దశాబ్దాల తరబడి ఇస్తున్న రిజర్వేషన్లపై సమీక్ష జరపాలని దేశంలో ఒక వర్గం ఒత్తిడి తెస్తున్నా.. బీజేపీ మౌనంగా ఉండటంలో అర్థమేమిటి?’ అని ప్రశ్నించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే రాబర్ట్‌గంజ్ బీజేపీ ఎంపీ చోటేలాల్.. మోదీకి రాసిన లేఖలో యూపీ సీఎం యోగి తీరును తీవ్రంగా తప్పుపట్టారు. తన జిల్లాలో అధికారుల అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు వెళితే సీఎం సిబ్బంది తనను గల్లాపట్టి నెట్టేశారని ఆరోపించిన చోటేలాల్.. పార్టీలో దళితులకు ఇచ్చే గౌరవం ఇదేనా? అన్ని వాపోయారు. ఆ మరుసటి రోజే.. ఇటావా స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తోన్న గిరిజన బీజేపీ ఎంపీ అశోక్ దోహ్రీ.. యూపీలో దళితులపై దాడులు పెరిగిపోయాయని, భారత్ బంద్‌లో పాల్గొన్న దళితులపై యోగి సర్కార్ తప్పుడుకేసులు బనాయిస్తున్నదంటూ ప్రధాని మోదీకి లేఖరాశారు. ఇప్పుడు నగీనా ఎంపీ యశ్వంత్.. బీజేపీ పాలనలో దళితులకు న్యాయం జరగలేదని బాంబు పేల్చారు. తాజా ఆరోపణలపై బీజేపీ అధిష్టానం స్పందించాల్సిఉంది. పార్టీపై అసంతృప్తి వెళ్లగక్కిన ఎస్సీ, ఎస్టీ ఎంపీలు (యశ్వంత్ సింగ్, అశోక్ దోహ్రీ, సావిత్రి బాయి, చోటేలాల్) -
రిజర్వేషన్ల విధానాన్ని రద్దు చేయం
భవానీపట్న(ఒడిశా): విద్య, ఉద్యోగాల్లో షెడ్యూల్డ్ కులాలు(ఎస్సీలు), షెడ్యూల్డ్ తెగల (ఎస్టీలు)కు ఉన్న రిజర్వేషన్లను రద్దు చేసే ఉద్దేశమేదీ కేంద్ర ప్రభుత్వానికి లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా స్పష్టం చేశారు. అలాగే రిజర్వేషన్ల విధానాన్ని రద్దు చేసేందుకు ఎవరినీ అనుమతించబోమన్నారు. బుధవారం భవానీపట్నలో జరిగిన బహిరంగ సభలో అమిత్‌షా మాట్లాడారు. బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగంలో సూచించిన రిజర్వేషన్ల విధానాన్ని మార్చే సాహసం ఎవరూ చేయబోరన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ దళిత సంఘాలు చేపట్టిన దేశవ్యాప్త బంద్‌లో హింస చెలరేగి పది మంది మరణించడానికి కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలే కారణమని ఆయన మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తామని ప్రధానమంత్రి హామీ ఇచ్చినా.. బంద్‌కు పిలుపునివ్వడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. రిజర్వేషన్ల విధానాన్ని బీజేపీ రద్దు చేస్తుందంటూ మీడియా, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం మొదలైందని ఆరోపించారు. రిజర్వేషన్ల విధానాన్ని బీజేపీ రద్దు చేయబోదని, అందుకు ఎవరినీ అనుమతించబోదని ఆయన స్పష్టంచేశారు. -
‘దళితులను దగాచేస్తున్న ప్రభుత్వం’
గోపాల్పేట : దళితులను దగా చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలంగాణ మాల మాహానాడు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు అద్దంకి దయాకర్ స్పష్టంచేశారు. ఆదివారం ఆయన వనపర్తిలో విలేకరులతో మాట్లాడారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఒక్క డీఎస్సీ కూడా వేయకుండా నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని ఆరోపించారు. నాలుగేళ్లలో దాదాపు రూ.95వేల కోట్లను సీమాంధ్ర కాంట్రాక్టర్లకు కట్టబెట్టారని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్‌రావు నలుగురితో బంగారు తెలంగాణ ఎలా సాధ్యమన్నారు. అంబేద్కర్ సుజల స్రవంతి పేరును కాళేశ్వరంగా మార్చి అంబ్కేదర్‌ను అవమానించారన్నారు. తెలంగాణ కోసం పనిచేసిన ప్రొఫెసర్ కోదండరాం పర్యటిస్తే జైల్లో పెడతారు.. అదే కేసీఆర్‌ను తిట్టిన పవన్ కల్యాణ్ మాత్రం పర్యటించ వచ్చా? అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు కేటాయించడమే తప్ప ఖర్చు చేయడం లేదన్నారు. బ్యాక్లాగ్ పోస్టులను భర్తీచేయాలని డిమాండ్ చేశారు. త్వరలో నడిగడ్డలో దళితగర్జన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి తుమ్మల రవికుమార్, శ్రీనివాస్, కృష్ణ, రవికుమార్ ఉన్నారు. -
ఆ సేవలను గుర్తించే క్షణం ఎప్పుడో!
వ్యవసాయం, పారిశ్రామిక రంగాల అభివృద్ధి అణువణువునా అంటరాని కులాల త్యాగాలతో నిండి ఉన్నాయి. ఆ త్యాగాల అనుభవాలను మరిచిన సమాజం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. అంటరాని కులాలు గతంలో శ్రమ దోపిడీకి గురికావడమే కాదు, వర్తమాన సమాజంలో ఎటువంటి భాగస్వామ్యానికీ నోచుకోవడంలేదు. హీనంగా చూస్తూ వారిని ఊరి బయటకు నెడుతున్నారు. జాతి సంపదను పెంచిన కులాలు ప్రభుత్వాల దగ్గర రిజర్వేషన్ల కోసమో, సంక్షేమ కార్యక్రమాల కోసమో మోకరిల్లాల్సిన పరిస్థితి. ‘ఆఫ్రికా నవ నక్షత్రాలూ వెనక్కి ఇచ్చేయాలి. అవి ఆఫ్రికా వజ్రాలు. తొమ్మిది వజ్రాలను తొమ్మిది నక్షత్రాలని పిలుస్తాం. ఇవి బ్రిటన్‌లో ఉన్నాయి. అటువంటి వేలాది వజ్రాలు ఆఫ్రికా నుంచి తవ్వి తీసుకెళ్లారు. అవి మావి, మాకే చెందాలి’ ఆఫ్రికా రిపరేషన్స్ మూవ్మెంట్ నాయకులు, బ్రిటన్ పార్లమెంట్ సభ్యులు బెర్నిగ్రాంట్ డిమాండ్ ఇది. ఆఫ్రికాను బ్రిటన్ వలసగా మార్చుకోవడం, సంపదను దోచుకెళ్లడం వంటి వివరాలను బెర్నిగ్రాంట్ తెలి యజేశారు. ఆఫ్రికా నల్లజాతి ప్రజలు వజ్రాలను వెలికితీసి బ్రిటన్ను సంపన్నదేశంగా మార్చారని బెర్నీ పేర్కొన్నారు. ఆఫ్రికా నల్లజాతి కార్మికుడు ఒకరు ప్రీమియర్ మైనింగ్ కంపెనీలో పనిచేస్తున్న సమయంలో 1905లో ఒక వజ్రం కంటపడింది. ఇది చరిత్రలో నమోదు కాలేదు. ఆ వజ్రాన్ని 1907లో బ్రిటన్ ప్రభుత్వం లక్షా యాభైవేల పౌండ్స్‌కు కొనుగోలు చేసి చక్రవర్తి ఏడవ ఎడ్వర్డ్‌కు జన్మదిన కానుకగా అందజేసింది. దాన్ని ఆ తర్వాత తొమ్మిది చిన్న వజ్రాలుగా మలిచారు. వీటినే తొమ్మిది నక్షత్రాలుగా పిలుస్తామని బెర్నీగ్రాంట్ తెలి పారు. బెర్నీ ఆఫ్రికా రిపరేషన్స్ మూవ్మెంట్ నాయకుడు. ఆ ఉద్యమం గురించి ఇంకొంచెం 2001 ఆగస్టు– సెప్టెంబర్ నెలల్లో దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో జరిగిన ప్రపంచ జాతి వివక్షా వ్యతిరేక సదస్సులో మొదటిసారిగా ‘రిపరేషన్స్’అనే అణగారిన ప్రజల విముక్తినాదం నా చెవులను తాకింది. ‘వివక్షకూ అణచివేతకూ గురైన ప్రజల ప్రగతి కోసం మానవ హక్కులూ, సేవాదృక్పథం మాత్రమే సరిపోవు. కోల్పోయిన అన్నిరకాల వనరులు, సంపద తిరిగి పొందేంతవరకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అదే రిపరేషన్స్’ అని నల్లజాతి నినదించింది. అప్పటి నుంచి ఆ ఉద్యమం అంచెలంచెలుగా విస్తరిస్తున్నది. అమెరికాలో, ఆస్ట్రేలియాలలో ఆదిమ తెగల ప్రజలకు అక్కడి ప్రభుత్వాలు రిపరేషన్స్ పేరుతో ఏటా కొన్ని నిధులు కేటాయించి అభివృద్ధికి పాటుపడుతున్నాయి. అమెరికాలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ప్రజలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు కూడా. డిసెంబర్ 7, 2009న ఫెడరల్ కోర్టు రెడ్ ఇండియన్స్‌కి రిపరేషన్స్ నిధులు అందజేయాలని తీర్పునిచ్చింది. ఇది ఆధునిక ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించడానికి సూచనగా నాటి అధ్యక్షుడు బరాక్ ఒబామా భావించారు కూడా. ఆదిమ తెగల ప్రజల సంపద, వారసత్వం మీదనే ఆధునిక సమాజాల నిర్మాణం జరిగిందనీ, అణచివేతతో, పీడనతో ప్రజలనుంచి దోచుకున్న సంపదతోనే ప్రస్తుత వ్యవస్థలు పనిచేస్తున్నాయనీ, అటువంటి వారసత్వాన్నీ, సంపదనూ అందించిన ప్రజలను మర్చిపోవడం లేదా వివక్షకు గురిచేయడం ఎంత మాత్రం సరికాదని ఆ సమయంలోనే ఒబామా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీనితో మరోసారి రిపరేషన్స్ అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ‘రిపరేషన్స్’అంశం చరిత్రకు కొత్తకాదు. గతంలో యుద్ధంలో ఓడినవారు విజేతలకు నష్టపరిహారంగా కొంత సంపదను రిపరేషన్స్ పేరిట చెల్లించేవారు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జర్మనీలో జరిగిన యూదు జాతి హత్యాకాండకు పరిహారంగా ప్రభుత్వం ఏటా రిపరేషన్స్ చెల్లిస్తున్నది. కెనడాలో 1991 నుంచి అ««ధ్యయనం చేసి 2006లో అక్కడి ఆదిమ తెగల అభివృద్ధి కోసం రెండు బిలియన్ డాలర్ల ఆర్థికసాయాన్ని అందజేసింది. నియంతృత్వ పాలనలలో నిర్బంధానికి గురైన ప్రజలకు, కార్యకర్తలకు ప్రజాస్వామ్య వ్యవస్థలు ఏర్పడిన అనంతరం తగు నష్టపరిహారం చెల్లించినట్టు ఆధారాలున్నాయి. చిలీ, మొరాకో, గుయానా, బార్బొడాస్, జమైకా దేశాల్లో ఇటువంటి రాజకీయ రిపరేషన్స్ అందజేశారు. రాజకీయ పరమైన వారసత్వ హక్కుగా ఈ రోజు ఆఫ్రికా రిపరేషన్ మూవ్మెంట్ నడుస్తున్నది. అమెరికా నల్లజాతి ప్రజలు కూడా తమకు జరిగిన అన్యాయానికీ, దోపిడీకి రిపరేషన్స్ పరిష్కారమని భావిస్తున్నారు. రిజర్వేషన్ – రిపరేషన్ ఈ నేప«థ్యం నుంచే భారతదేశంలో రిజర్వేషన్లను అర్థం చేసుకోవాలి. ఇటీవల ఈ రిజర్వేషన్ల డిమాండ్‌కు కొత్త అర్థాలు తీసుకొస్తున్నారు. జనాభా అధికంగా ఉండి, రాజకీయాలను ప్రభావితం చేసేవారు తమ ఆర్థిక, సామాజిక స్థితిగతులతో నిమిత్తం లేకుండా రిజర్వేషన్లపైన ఉద్యమాలు చేస్తున్నారు. భారత రాజ్యాంగం స్ఫూర్తి ప్రకారం కాకుండా కేవలం తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి కొందరు రాజకీయ నాయకులు ఇటువంటి నినాదాలను ముందుకు తెస్తున్నారు. ఎలాగైనా అధికారంలోనికి రావాలనే ఆశతో ప్రధాన పార్టీలన్నీ ఇటువంటి నినాదాలను సమర్థిస్తున్నాయి. రాజ్యాంగ పరిధిలో అవి ఏమాత్రం ఇమడవని తెలిసినప్పటికీ ప్రోత్సహిస్తున్నాయి. దానితో రిజర్వేషన్ల లక్ష్యమే ప్రమాదంలో పడింది. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల ప్రకారం పౌరులెవ్వరైనా వివక్షకు గురికాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అయితే నిజానికి ఏ వర్గాలైతే ఈ దేశంలో వివక్షకూ, దోపిడీకీ, వెలివేతకూ గురయ్యాయో అవి ఇంకా అదే పరిస్థితుల్లో జీవనం కొనసాగిస్తున్నాయి. ఆర్థిక, సామాజిక అంతరాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ వర్గాలకే ఎంతో చేసినట్టు, దేశ సంపదను దోచిపెడుతున్నట్టు ఆధిపత్య కులవాదులు భావించడమే దారుణం. పైకి ఏం చెబుతున్నప్పటికీ ఎస్సీ, ఎస్టీల పట్ల, వారి అభివృద్ధి పట్ల రాజకీయ నాయకులలో చిత్తశుద్ధి లేదు. కానీ సంక్షేమం పేరుతో ఘనకార్యం చేస్తున్నట్టు ప్రకటించుకుంటున్నారు. ఆఫ్రికా రిపరేషన్స్ మూవ్మెంట్ స్ఫూర్తిని చూశాక, వారి వాదనను అర్థం చేసుకున్న తర్వాత ఈ దేశంలోని ఎస్సీ, ఎస్టీలకు కావాల్సింది రిజర్వేషన్లు మాత్రమే కాదు, రిపరేషన్స్ సైతం తప్పనిసరి అని భావించాలి. ప్రస్తుతం ఎస్సీలుగా పేర్కొంటున్న అంటరాని కులాలు మూడు వేల సంవత్సరాలకు పైగా తమ శ్రమను, సంపదను, ప్రాణాలను ఈ దేశం కోసం అర్పించాయి. ఆ శ్రమ, త్యాగం వృథా కారాదు వ్యవసాయం, పారిశ్రామిక రంగాల అభివృద్ధి అణువణువునా అంటరాని కులాల త్యాగాలతో నిండి ఉన్నాయి. ఆ త్యాగాల అనుభవాలను మరిచిన సమాజం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. అంటరాని కులాలు గతంలో శ్రమ దోపిడీకి గురికావడమే కాదు, వర్తమాన సమాజంలో ఎటువంటి భాగస్వామ్యానికీ నోచుకోవడంలేదు. హీనంగా చూస్తూ వారిని ఊరి బయటకు నెడుతున్నారు. జాతి సంపదను పెంచిన కులాలు ప్రభుత్వాల దగ్గర రిజర్వేషన్ల కోసమో, సంక్షేమ కార్యక్రమాల కోసమో మోకరిల్లాల్సిన పరిస్థితి. వ్యవసాయ సమాజం పురోగమించడానికి అంటరాని కులాలు చేసిన కృషి అనిర్వచనీయం. చనిపోయిన పశువుల చర్మాలను శుద్ధి చేసి 18 రకాల వృత్తి వస్తువులను అందించి ఉండకపోతే ఈ రోజు మన సమాజాన్ని ఈ స్థాయిలో ఊహించడం కష్టమే. అత్యంత మురికితో ఉండి, వాసనకూడా తట్టుకోలేని స్థితిలో తోలును లందలో ఉంచి శుభ్రం చేయడం సమాజంలోని మరే ఇతర సామాజిక వర్గం చేయలేనప్పుడు అంటరాని కులాలుగా ఉన్న వీరు దాన్ని అత్యంత బాధ్యతగా సామాజిక పురోగమనానికి ఒక ఆయుధంగా వాడారు. వ్యవసాయ రంగంలో పశుపోషణ, చెరువుల నిర్మాణం, నిర్వహణ, దున్నడం, పంటల రక్షణ వంటి పనులు అంటరాని కులాలే నిర్వహించాయి. ఇటీవల రైతేరాజు అనీ, అన్నదాత అనీ చెపుతున్నదంతా ఎవరిని గురించి ప్రస్తావిస్తున్నదంటే భూమి ఎవరి చేతిలో ఉందో వారిని గురించే, భూమిపైన కాగితపు హక్కుదారులను గురించే తప్ప ఆ మట్టిలో మట్టిగా ఆరుగాలం కష్టపడి, తమ చెమటతో పంటలను పండించిన ఈ అంటరాని జనం తమ రక్తాన్ని ధారపోసి గుక్కెడు గంజికి సైతం నోచుకోక తరతరాలుగా ఆ భూమికి దూరంగా బతుకుతున్నారన్న స్పర్శ ఈ సమాజానికి ఎందుకు లేకుండా పోయిందో అర్థం కాదు. ఇక ఏ తోలైతే సాంకేతిక నైపుణ్యానికి పునాదులు వేసిందో దాన్ని ఆవిష్కరించిన అంటరాని కులాలు ఈ రోజు అదే పరిశ్రమలో కూలీలుగా కూడా మిగల్లేదు. ఏటా వేల కోట్ల రూపాయల ఎగుమతితో విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదిస్తున్న వాళ్లు పరిశ్రమాధిపతులైతే వృత్తికీ, ఉత్పత్తికీ దూరమై దిక్కు తోచక గ్రామాల్లో అలమటిస్తున్నది మాత్రం అంటరాని కులాలు. 150 ఏళ్ల రైల్వే, గనుల చరిత్రను తవ్వి తీస్తే కార్మికుల కృషి, త్యాగం బయటపడతాయి. కానీ ఇప్పటి వరకు ఆ చరిత్రను రాయడానికీ, అధ్యయనం చేయడానికీ ఏ ప్రభుత్వాలూ సిద్ధంగా లేవు. ఆదివాసీల పరిస్థితీ అంతే! అదేవిధంగా ఆదివాసీలు గత వందల సంవత్సరాల్లో తమ భూమినీ, అడవినీ కోల్పోయి పుట్టిన గడ్డపైనే పరాయి బతుకు బతుకుతున్నారు. పరిశ్రమాధిపతుల ప్రయోజనం కోసం ప్రభుత్వాలు ఆదివాసీలను తరిమి వేస్తూ అక్కడి వనరులను ఆక్రమించుకుంటున్నాయి. నాటి బ్రిటిష్ ప్రభుత్వంతో పాటు ఆధునిక ప్రభుత్వాలు సైతం వారిని వెంటాడి వేటాడుతున్నాయి. దేశ సంపదను వృద్ధి చేయడంలో, వనరులను కాపాడడంలో ఎన్నో త్యాగాలు చేసిన∙ఆదివాసీల కోసం, అంటరాని కులాల కోసం బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు వాటి మీద ఆధారపడి అమలు జరుగుతున్న రిజర్వేషన్లు, సంక్షేమ కార్యక్రమాలు, రోజురోజుకీ ప్రభుత్వాల దయాదాక్షిణ్యాల మీద, వారి మంచి, చెడు ప్రవర్తనలమీద ఆధారపడుతున్నాయి. అందుకే ఆఫ్రికా నల్లజాతి ప్రజలు డిమాండ్ చేస్తున్నట్టుగా, ఉద్యమిస్తున్నట్టుగా రిపరేషన్స్ అనే ఉద్యమాన్ని భారతదేశంలో కూడా ఆది వాసీలు, దళితులు ఆరంభించక తప్పని పరిస్థితిని భారత సమాజం, ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. రిజర్వేషన్ల మీద నిరసనతో ఉన్న సమాజం, దళితుల పట్ల అడుగడుగునా ద్వేషంతో ఉన్న కుల సమాజం భారతదేశ చరిత్రను మరొక్కసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అణచివేతకు గురైన వర్గాల వారు దేశంలో 25 శాతం ఉన్నారు. దేశంలో సామరస్యం, శాంతి, ప్రజాస్వామ్యం నిలబడాలంటే ఒక్కటే మార్గం ఉంది. తరతరాలుగా ఈ సమాజంలో భాగం కాలేకపోయిన, వివక్షకీ గురి అవుతోన్న ఆ అణగారిన వర్గాలను ఈ దేశంలో ఒక భాగంగా గుర్తించక తప్పదు. - మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ 97055 66213 -
దళితులను మోసగిస్తున్న చంద్రబాబు
సవాలును స్వీకరించకుండా ఒప్పేసుకున్న మంత్రి రావెల – డాక్టర్ మేరుగ నాగార్జున తెనాలి : చంద్రబాబు ప్రభుత్వం దళితులను మోసం చేస్తోందని, వారి సంక్షేమాన్ని దళారులపరం చేస్తూ, దళిత చట్టాలు అపహాస్యం పాలవుతున్నాయని, వాస్తవాలపై చర్చకు సిద్ధమంటూ తాను చేసిన సవాలుకు మంత్రి రావెల కిషోర్‌బాబు పక్కకు తప్పుకొని, దళితులను ప్రభుత్వం మోసగిస్తున్నట్టు అంగీకరించినందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మేరుగ నాగార్జున అభినందించారు. కేవలం ప్రత్తిపాడు నియోజకవర్గంపైన చర్చకు మంత్రి అంగీకరించినందున దమ్మూ ధైర్యం ఉంటే ఆ అంశంపైనా చర్చకు తేదీ సమయం వెల్లడించాలని కోరారు. ప్రతిపక్ష నాయకుడి అడ్డు ఎలా తొలగించుకోవాలో తెలుసునంటూ తనను తాను చంద్రబాబు అమ్ములపొదిలో రామబాణమని రావెల చెప్పుకున్నారని గుర్తుచేస్తూ, అవినీతి పొదిలో పుల్లవనీ, కించపరచేలా మాట్లాడొద్దని హెచ్చరించారు. సత్తా వుంటే దళితులకు రావాల్సిన వాటా విషయంలో చంద్రబాబును నిలదీయాలన్నారు. తెనాలిలో బుధవారం మధ్యాహ్నం విలేకరుల సమావేశంలో డాక్టర్ నాగార్జున మాట్లాడారు. 'వైఎస్సార్సీపీ నాయకులు పిరికిపందలనీ, వాళ్లతో మేం ఏదైనా చర్చించటానికి సిద్ధంగా ఉన్నా పారిపోతున్నారంటూ రాష్ట్ర మంత్రి రావెల కిషోర్‌బాబు విసిరిన సవాల్‌ను తాను స్వీకరించినట్టు నాగార్జున గుర్తుచేశారు. దళితులకు జరుగుతున్న అన్యాయాలు, ఉపప్రణాళిక నిధుల పక్కదారి, మైనారిటీ మహిళ చేయిపట్టుకున్న కుమారుడి వ్యవహారం, జిల్లాపరిషత్ చైర్పర్సన్ జానీమున్‌ను చంపుతామని బెదిరించిన వైనంపైనా చర్చకు సంసిద్ధతను వ్యక్తంచేశానన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలోనూ అనేక అవకతవకలున్నట్టు ఆధారాలున్నాయని చెబుతూ ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉంటూనే సుచరిత, అంతకుముందు ఎమ్మెల్యేగా రావి వెంకటరమణ ఎంతో అభివృద్ధిని చేశారన్నారు. వీరితో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చందోలు డేవిడ్‌విజయ్‌కుమార్, ఎస్సీ విభాగ రాష్ట్ర కార్యదర్శి పెరికల కాంతారావు, తదితరులున్నారు. -
టీడీపీ హయాంలోనే దళితులపై దాడులు
పొన్నూరు : తెలుగుదేశం పార్టీ హయాంలోనే దళితులపై దాడులు, వేధింపులు ఎక్కువగా జరుగుతున్నాయని, ఈ క్రమంలోనే డాక్టర్ టి.రాజారావుపై అక్రమ కేసులు బనాయించి కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున ఆరోపించారు. స్థానిక ప్రజా వైద్యశాలలో ఆదివారం రాజారావును కలిసి అక్రమ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దళితులంటే టీడీపీకి చులకనని, గతంలో చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. రాజారావుపై అక్రమంగా పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. డాక్టర్ టి.రాజారావుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలుపుతోందని ఆయన తెలిపారు. ఆయన వెంట జిల్లా అధికార ప్రతినిధి గేరా సుబ్బయ్య, ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి డక్కుమళ్ళ రవి తదితరులు ఉన్నారు. -
12న అమలాపురంలో మహాధర్నా
విజయవాడ (గాంధీనగర్) : దళితులపై దాడులకు నిరసనగా ఈనెల 12న ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో అమలాపురం ఆర్డీవో కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించనున్నామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు తెలిపారు. స్థానిక కార్యాలయంలో చలో అమలాపురం వాల్‌పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగాయన్నారు. ఆవులను వధిస్తున్నారన్న నెపంతో గుజరాత్లో మతోన్మాద దాడి మరువకుముందే అమలాపురంలో దాడులు జరగడం దారుణమన్నారు. అమలాపురంలో జరిగే మహాధర్నాలో ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనార్టీలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్వాయి దాస్, చుక్కా నరేష్, మేకల కోటేశ్వరరావు, రాజు, రాజేష్ పాల్గొన్నారు. -
దళితులు సంఘటితం కావాలి
ఆల్ ఇండియా దళిత్ రైట్స్ ఫెడరేషన్ ర్యాలీలో నాయకుల పిలుపు విజయవాడ(గాంధీనగర్): బీజేపీ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగాయని పలు దళిత సంఘాల నేతలు ధ్వజమెత్తారు. బీజేపీ అనుబంధ సంఘాలు ప్రభుత్వ అండతో పేట్రేగిపోతున్నాయన్నారు. శనివారం ఆల్ ఇండియా దళిత్ రైట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో మహా ర్యాలీ, ధర్నా నిర్వహించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీ ప్రారంభించారు. ర్యాలీ పాత గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఏలూరు లాకులు, న్యూఇండియా హోటల్æసెంటర్, లెనిన్ సెంటర్ మీదుగా ధర్నా చౌక్ వరకు కొనసాగింది. అనంతరం బహిరంగ సభలో ఫెడరేషన్ జాతీయ కన్వీనర్ కందుల ఆనందరావు మాట్లాడుతూ రోహిత్ కేసులో నిందితుల్ని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదన్నారు. గోవుల చర్మం వలిస్తే నేరంగా పరిగణించడం తగదన్నారు.. దళితులంతా ఒక్క రోజు పనిమానేస్తే మోడీ స్వచ్ఛభారత్ అడ్రస్ ఉండదన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జల్లి విల్సన్ మాట్లాడుతూ దళితుల్లో ఇంకా చైతన్యం రావాలన్నారు. సీపీఐ, సీపీఎం నగర కార్యదర్శులు దోనేపూడి శంకర్, కాశీనాథ్ మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చాక రచయితలు, సాహితీవేత్తలు, మేధావులు సైతం హత్యలకు గురవుతున్నారన్నారు. ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మణిసింగ్, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సువర్ణలత, డీబీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యారావు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పంతగాని రమేష్, మట్టా ఝాన్సీ, బుట్టి రాయప్ప, కేవీపీఎస్ నాయకులు నటరాజ్, పీ రాజేష్, కొండలరావు, కే సంజీవరావు, దిలీప్‌కుమార్ పాల్గొన్నారు. -
దళితులపై దాడులకు నిరసనగా 27న ర్యాలీ
గాంధీనగర్ : రాష్ట్రంలో, దేశంలో దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈ నెల 27న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆల్ఇండియా దళితరైట్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు కందుల ఆనందరావు తెలిపారు. బీఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి అలంకార్ సెంటర్ వరకు మహార్యాలీ, ధర్నా నిర్వహించనున్నట్లు సోమవారం ప్రెస్‌క్లబ్‌లో తెలిపారు. హెచ్‌సీయూలో విద్యార్థి రోహిత్ మరణానికి కారకులైన వీసీ అప్పారావు, ఇతర నిందితుల మీద ఇంతవరకు చర్యలు లేవని విమర్శించారు. గుజరాత్, అమలాపురంలో దళితులపై జరిగిన దాడులు బీజేపీ ఎజెండాలో భాగమేనన్నారు. సంస్కృతి, సంప్రదాయాల పేరుతో బీజేపీ వర్గాలు దాడులకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. ఈ సందర్భంగా పోస్టర్‌ను ఆవిష్కరించారు. దళిత బహుజన ఫ్రంట్ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యారావు, కెవిపీసీఎస్ వ్యవస్థాపకులు పరిశపోగు రాజేష్ పాల్గొన్నారు. -
రోహిత్ వేముల దళితుడే
గుంటూరు కలెక్టర్ ధ్రువీకరణ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో జనవరి 17న ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల దళితుడేనని గుంటూరు కలెక్టర్ కాంతిలాల్ దండే ధ్రువీకరించారు. నేషనల్ కమిషన్‌కు సమర్పించిన నివేదికతో రోహిత్ ఎస్సీ మాల కులస్తుడని పేర్కొన్నారు. దీంతో రోహిత్ బీసీ అనే వాదనకు తెరపడింది. వర్సిటీ యాజమాన్యం కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు రోహిత్ తన సూసైడ్ లేఖలో పేర్కొన్న విషయం తెలిసిందే. రోహిత్‌తో సహా నలుగురు విద్యార్థుల వెలివేత, అనంతరం రోహిత్ ఆత్మహత్య యావత్ దేశాన్నే కుదిపేసింది. వర్సిటీ వైస్ చాన్స్‌లర్ అప్పారావు, కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, మంత్రి స్మృతి ఇరానీల జోక్యం వల్లే తన కుమారుడు రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డారంటూ అతడి తల్లి రాధిక ఫిర్యాదు చేయడంతో వారిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. అయితే రోహిత్ తండ్రి బీసీ(వడ్డెర) కనుక అతని కులమే రోహిత్ కులమని నమ్మించేందుకు ఏపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించింది. పిల్లల పెంపకంలో కానీ, వారి విద్యాబుద్ధుల విషయంలోగానీ, చివరకు కుటుంబం గురించి గానీ ఎటువంటి బాధ్యతలు నెరవేర్చని రోహిత్ తండ్రి కులం కాక, రోహిత్ తల్లి రాధిక కులమే రోహిత్‌కి చెందినట్టు ఆధారాలతో సహా నిరూపించడం కేసులో కీలక మలుపుగా భావించొచ్చు. గుంటూరు తహసీల్దారు రిపోర్టు ఆధారంగా రోహిత్ కులాన్ని కలె క్టర్ ధ్రువీకరించారు. ఇది విద్యార్థుల ఐక్యపోరాటాల ఫలితమని, రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిని అరెస్టు చేయాలని హెచ్‌సీయూ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ప్రశాంత్, మున్నా, వెంకటేశ్ చౌహాన్,అర్పిత అన్నారు. -
దళితులపై అత్యాచారాల నిరోధానికి బిల్లు
న్యూఢిల్లీ: దళితులపై అత్యాచారాలు ఆందోళనకర రీతిలో పెరుగుతున్నాయని, ఇలాంటి నేరాలను నిరోధించేందుకు వచ్చే వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ సోమవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని రాజస్థాన్, మహారాష్ట్రల్లో దళితులపై అత్యాచారాలను ప్రస్తావించారు. యూపీఏ ప్రభుత్వం తెచ్చిన ఒక ఆర్డినెన్స్ కాలవ్యవధి మీరిపోయి చెల్లకుండా పోయేలా ఎన్డీఏ ప్రభుత్వం నిర్లిప్తత వహించిందని.. దాని స్థానంలో చట్టం చేసేందుకు ఇటీవలి బడ్జెట్ సమావేశాల్లో బిల్లు తేలేదని తప్పుపట్టారు. మధ్యప్రదేశ్‌లోని అంబేడ్కర్ జన్మస్థలమైన మహూను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ మంగళవారం సందర్శించనున్న నేపథ్యంలో.. దానికి ఒక రోజు ముందు సోనియా.. ప్రధానికి లేఖ రాయటం గమనార్హం. సోనియా లేఖ వివరాలు.: రాజస్థాన్‌లోని నగౌర్ జిల్లాలో భూవివాదం విషయమై 17 మంది దళితులను మరో కులం వారు ట్రాక్టర్‌తో తొక్కించారు. ఈ ఘటనలో నలుగురు దళితులు చనిపోయారు. దీనికి 3 నెలల ముందు అదే జిల్లాలో ముగ్గురు దళితులను సజీవంగా దహనం చేశారు. ఇతర రాష్ట్రాల్లోనూ దళితులపై దాడులు జరుగుతున్నాయి. షిర్డీలో మొబైల్ ఫోన్‌కు అంబేడ్కర్ రింగ్ టోన్ పెట్టుకున్నందుకు దళిత యువకుడిని హత్య చేశారు. ఈ కేసుల్లో దోషులను శిక్షించటం ముఖ్యం. దళితుల సంక్షేమం, రక్షణ బాధ్యతలు నిర్వర్తించే వ్యవస్థను బలోపేతం చేసి, బాధ్యతాయుతం చేయటం దళితుల హక్కుగా న్యాయం పొందేందుకు ముఖ్యం. దీనికోసం యూపీఏ-2 ప్రభుత్వం ఎస్సీలు, ఎస్టీలు (అత్యాచారాల నిరోధం) చట్టం 1989ని బలోపేతం చేయటంతో పాటు ఇతర చర్యల కోసం ఆర్డినెన్స్ తెచ్చింది’ అని వివరించారు. -
దళిత ఓట్ల గాలానికి 4 సూత్రాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పూర్తిగా దూరమవుతున్న దళిత ఓట్లను మళ్లీ తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం నాలుగు సూత్రాలతో కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. దీని అమలు బాధ్యతను రాహుల్‌గాంధీ కోర్‌కమిటీ సభ్యుడు, ఏఐసీసీ ఎస్సీసెల్ విభాగం చైర్మన్ కొప్పుల రాజుకు అప్పగించింది. అందులో భాగంగా ఆదివారం రాష్ట్రానికి వచ్చిన కొప్పుల రాజు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలను వేర్వేరుగా కలిసి ఇదే అంశంపై చర్చించారు. అనంతరం సాయంత్రం గాంధీభవన్‌లో, ఆ తరువాత పీసీసీ ఎస్సీ విభాగం కార్యవర్గ భేటీలో మాట్లాడారు. దూరమవుతున్న దళితుల విశ్వాసాన్ని మళ్లీ పొందేందుకు నాలుగు అంశాలతో రూపొందించిన ప్రణాళికను వివరించారు. దళితులను పార్టీ నిర్లక్ష్యం చేస్తోందన్న నేతలు కొప్పుల రాజు ముఖ్య అతిథిగా ఆదివారం గాంధీభవన్‌లో జరిగిన ఎస్సీసెల్ కార్యవర్గ సమావేశంలో వివిధ జిల్లాల నాయకులు పార్టీ తీరును ఎండగట్టారు. కాంగ్రెస్‌లో దళితులంటే చిన్న చూపుందని నేతలు వాపోయారు. ప్రభుత్వం నియమించిన నామినేటెడ్ పదవుల్లో ఎస్సీలకు స్థానమే లేకుండా పోయిందన్నారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో దళితులకు ఒరిగిందేమీ లేదని అనంతపురం జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు శంకర్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులు కూడా ఎస్సీలను పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఉన్నా రుణాలిచ్చే దిక్కులేదని చెప్పారు. ఎస్సీ కార్పొరేషన్ ైచైర్మన్ ఎ.లక్ష్మణ్‌కుమార్ మాట్లాడుతూ.. తాను కార్పొరేషన్ బాధ్యతలు చేపట్టి నాలుగు నెలలైనా ఒక్క లబ్ధిదారుడికి కూడా రుణం ఇవ్వలేదని చెప్పారు. సబ్‌ప్లాన్ నిధుల్లో రూ. 300 కోట్లు కార్పొరేషన్‌కు కేటాయించినా రుణాల మంజూరు అధికారమంతా బ్యాంక్ చేతుల్లోనే పెట్టడం బాధాకరమన్నారు. బొత్స మాట్లాడుతూ.. ఎస్సీల విషయంలో ఎంతో అవకాశం ఉన్నా పెద్దగా కార్యక్రమాలు అమలు చేయలేకపోయామని, ఇలా జరగడం బాధాకరమన్నారు. అయినా ‘‘ఎన్నికలు రాబోతున్నందున మనల్ని మనమే సముదాయించుకుని పార్టీ కోసం ముందుకు వెళదాం’’ అని ఊరడించే ప్రయత్నం చేశారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్ భట్టివిక్రమార్క, ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్, ఎంపీ నంది ఎల్లయ్య, పీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ ఎ.కృష్ణ తదితరులు పాల్గొన్నారు. దళితుల ఓట్ల ఆకర్షణకు సూత్రాలివే.. ఙ్ట్చఛగ్రామ స్థాయిలో దళితుల సమస్యలపై పోరాడుతున్న యువకులను గుర్తించి కమిటీలుగా ఏర్పాటు చేస్తారు. దళితులకు, ఇతర సామాజికవర్గాలకు మధ్య తేడాను, వారి ఆకాంక్షలను గుర్తించి వాటిని నెరవేర్చేందుకు దళిత నాయకులు ఏమేరకు విజయవంతమయ్యారనే దానిపై పర్యవేక్షణా కమిటీలను నియమిస్తారు. 3 నెలల్లో ఆ కమిటీలిచ్చే నివేదికల ఆధారంగా పంచాయతీ, మున్సిపల్, నగర ఎన్నికలతోపాటు శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో నేతలకు టికెట్లు ఇస్తారు. అలాగే నామినేటెడ్ పదవుల్లోనూ నియమిస్తారు. బ్లాక్, డీసీసీ, పీసీసీ మొదలు ఏఐసీసీ వరకు ప్రతి సమావేశంలోనూ దళితుల అభిప్రాయాలు విన్పించే ఎజెండాను చేర్చాలి. ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్రాల్లో సమస్యల పరిష్కారానికి సంఘటిత పోరాట పంథాను అనుసరించాలి. యూపీఏ ప్రభుత్వానికి జాతీయ సలహా మండలి ఏ విధంగా ఉందో కాంగ్రెస్ పార్టీకి కూడా ఇకపై ఓ సలహా మండలిని ఏర్పాటు చేయాలి. ప్రధానంగా దళిత, గిరిజనుల అభివృద్ధి కోసం పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించడంతోపాటు వారి కోసం అమలవుతున్న కార్యక్రమాల సరళిని విశ్లేషించి ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చేసేలా కృషి చేయడం వీటిలో ఉన్నాయి. -
ఎమ్మార్పీఎస్ పోరాటం వల్లే దళితులకు గుర్తింపు
మహేశ్వరం, న్యూస్‌లైన్: గత కొన్నేళ్లుగా ఎమ్మార్పీఎస్ చేస్తున్న పోరాటం, ఉద్యమాల కారణంగానే రాష్ట్రంలో దళితులకు గుర్తింపు లభించిందని, తమ వల్లే పలువురు దళితులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు కాగలిగారని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. జనవరి నెల మొదటి వారంలో తాను కొత్త పార్టీ ప్రకటిస్తానని చెప్పారు. శుక్రవారం ఆయన మహేశ్వరంలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ... జనవరిలో తాను పెట్టబోయే కొత్త రాజకీయ పార్టీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఏబీసీడీ వర్గీకరణ బిల్లును వెంటనే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి 2014 ఎన్నికల్లో గెలుపొందిన అనంతరం వర్గీకరణ బిల్లుపై ఉద్యమిస్తామని తెలిపారు. ఎమ్మార్పీఎస్ ఉద్యమ ఫలితంగానే ప్రతి మాదిగలో చైతన్యం వచ్చిందని అన్నారు. తెలంగాణ బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే ఎమ్మార్పీఎస్ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర వికలాంగుల పోరాట సమితి అధ్యక్షుడు అందె రాంబాబు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు వనం నర్సింహా మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కళామండలి అధ్యక్షుడు ఎన్వై. ఆశోక్ మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు వత్తుల రఘుపతి, జిల్లా అధ్యక్షుడు రావుగళ్ల బాబు మాదిగ, మాదిగ విద్యార్థి పెడరేషన్ జిల్లా అధ్యక్షుడు కొండ్రు ప్రవీణ్‌మాదిగ, నియోజకవర్గ ఇన్చార్జి కొంగరి నర్సింహా మాదిగ, మండల అధ్యక్షుడు బక్కని రవి మాదిగ, నాయకులు లక్ష్మణ్, ప్రశాంత్ మాదిగ, స్వామి మాదిగ, వికలాంగులు, ఉద్యోగులు, యువసేన నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.