
అమిత్‌షా
భవానీపట్న(ఒడిశా): విద్య, ఉద్యోగాల్లో షెడ్యూల్డ్ కులాలు(ఎస్సీలు), షెడ్యూల్డ్ తెగల (ఎస్టీలు)కు ఉన్న రిజర్వేషన్లను రద్దు చేసే ఉద్దేశమేదీ కేంద్ర ప్రభుత్వానికి లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా స్పష్టం చేశారు. అలాగే రిజర్వేషన్ల విధానాన్ని రద్దు చేసేందుకు ఎవరినీ అనుమతించబోమన్నారు. బుధవారం భవానీపట్నలో జరిగిన బహిరంగ సభలో అమిత్‌షా మాట్లాడారు. బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగంలో సూచించిన రిజర్వేషన్ల విధానాన్ని మార్చే సాహసం ఎవరూ చేయబోరన్నారు.
ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ దళిత సంఘాలు చేపట్టిన దేశవ్యాప్త బంద్‌లో హింస చెలరేగి పది మంది మరణించడానికి కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలే కారణమని ఆయన మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తామని ప్రధానమంత్రి హామీ ఇచ్చినా.. బంద్‌కు పిలుపునివ్వడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. రిజర్వేషన్ల విధానాన్ని బీజేపీ రద్దు చేస్తుందంటూ మీడియా, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం మొదలైందని ఆరోపించారు. రిజర్వేషన్ల విధానాన్ని బీజేపీ రద్దు చేయబోదని, అందుకు ఎవరినీ అనుమతించబోదని ఆయన స్పష్టంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment