No ban
-
పౌల్ట్రీ ఉత్పత్తుల విక్రయంపై నిషేధం వద్దు
న్యూఢిల్లీ: బర్డ్‌ఫ్లూ(ఎవియన్ ఇన్‌ఫ్లూయెంజా) కారణంగా మహారాష్ట్ర, హరియాణాలో పౌల్ట్రీ కోళ్ల వధ కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వం ఆదివారం వెల్లడించింది. మహారాష్ట్రలోని ముంబైలో, మధ్యప్రదేశ్‌లోని మాందసౌర్‌లో కొత్తగా బర్డ్‌ఫ్లూ కేసులు బయటపడ్డాయని తెలిపింది. ఇప్పటివరకు ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కేరళ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, హరియాణా, గుజరాత్లో బర్డ్‌ఫ్లూ నిర్ధారణ అయ్యింది. పౌల్ట్రీ ఉత్పత్తుల విక్రయంపై నిషేధం విధించడం సరికాదని, దీనిపై పునరాలోచించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. వ్యాధి ప్రభావం లేని రాష్ట్రాల నుంచి కోళ్లను దిగుమతి చేసుకోవచ్చని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర పశు సంవర్థక శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. బర్డ్‌ఫ్లూ ప్రభావిత రాష్ట్రాల్లో కోళ్లలోనే కాకుండా కాకులు, గుడ్లగూబలు, పావురాలలో ఈ వ్యాధి ఆనవాళ్లు బయటపడ్డాయని పేర్కొంది. బర్డ్‌ఫ్లూపై అనుమానం ఉంటే సమాచారం అందించడానికి మహారాష్ట్ర పశు సంవర్థక శాఖ టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల బృందం బర్డ్‌ఫ్లూ ప్రభావిత రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తోంది. తాజా పరిస్థితిపై అధ్యయనం చేస్తోంది. ఈ వ్యాధిపై తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని, గందరగోళానికి గురికావొద్దని కేంద్ర పశు సంవర్థక శాఖ కోరింది. తప్పుడు ప్రచారం వల్ల పౌల్ట్రీ పరిశ్రమతోపాటు రైతులు సైతం నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేసింది. -
పెట్రోల్, డీజిల్ వాహనాల నిషేధం అక్కర్లేదు
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ వాహనాలను నిషేధించాల్సిన అవసరం లేదన్నారు కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ. ఎలక్ట్రిక్ వాహన (ఈవీ)విక్రయాలు సమజంగానే ఊపందుకుంటున్నాయని చెప్పారు. వచ్చే రెండేళ్లలో అన్ని బస్సులు ఎలక్ట్రిక్ రూపంలోనే ఉంటాయన్నారు. 2030 తర్వాత దేశంలో ఈవీ విక్రయాలనే అనుమతించాలన్నది నీతి ఆయోగ్ సిఫారసు. 150సీసీలోపు ద్విచక్ర, త్రిచక్ర వాహనాలను 2025 తర్వాత ఈవీ రూపంలో అనుమతించాలని కూడా సిఫారసు చేసింది. కాకపోతే మంత్రులు గడ్కరీ, ధర్మేంద ప్రధాన్ వంటి వారు తర్వాత ఈ ప్రతిపాదనలను ఖండించారు. ఎంఎస్ఎంఈల్లో ఇంధన సామర్థ్యం అనే అంశంపై ఢిల్లీలో నిర్వహించిన జాతీయ సదస్సులో సోమవారం పాల్గొన్న సందర్భంగా మంత్రి గడ్కరీ ఈ అంశాన్ని ప్రస్తావనకు తీసుకొచ్చారు. ‘‘ఎలక్ట్రిక్ కార్లు, బైక్‌లు, బస్సుల అమ్మకాలు సహజంగానే పెరుగుతున్నాయి. వాటి అమ్మకాలను తప్పనిసరి చేయాల్సిన అవసరం లేదు. అలాగే, పెట్రోల్, డీజిల్ వాహనాలను నిషేధించాల్సిన అవసరం కూడా లేదు. రెండేళ్లలో అన్ని బస్సులు ఎలక్ట్రిక్, బయో ఎథనాల్, సీఎన్జీతో తిరిగేవే ఉంటాయి’’ అని గడ్కరీ వివరించారు. వ్యవసాయ వ్యర్థాలు (వరిగడ్డి వంటివి) వంటి వాటితో విద్యుత్తును తయారు చేసుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. ఆ విద్యుత్తును వాహనాలకు వినియోగించుకోవడం ద్వారా, రైతుల ఆదాయం పెంచుకోవచ్చన్నారు. ప్రస్తుతం ఈ గడ్డిని రైతులు వృథాగా కాల్చేస్తున్నారని, దీనివల్ల వాయు, భూ కాలుష్యం పెరుగుతున్నట్టు చెప్పారు. ఎన్టీపీసీ సంస్థ ద్వారా ఇప్పటికే ఈ తరహా వ్యర్థాల సమీకరణను ప్రారంభించినట్టు తెలిపారు. ఎంస్ఎంఈలకు తక్కువ రేటుకు రుణాలు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈలు) తక్కువ రేటుకే రుణాలు అందించేందుకు గాను ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులతో ఒప్పందాలు చేసుకున్నట్టు నితిన్ గడ్కరీ తెలిపారు. ‘‘అధిక మూలధన వ్యయ సమస్య ఉంది. ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు 2–3 శాతంగా ఉన్నాయి. కొన్ని దేశాల్లో అయితే ఒక్క శాతమే. కానీ, మన దేశంలో ఎంఎస్ఎంఈ రుణాలపై 11–14 శాతం వరకు వడ్డీ రేట్లు అమలవుతున్నాయి. నిధుల వ్యవయాలను తగ్గించాల్సిన అవసరం ఉంది’’ అని వివరించారు. రవాణా వ్యయాలను తగ్గించగలిగితే ఎగుమతులు ప్రస్తుత స్థాయికి రెట్టింపునకు పైగా పెరుగుతాయన్నారు. -
రిజర్వేషన్ల విధానాన్ని రద్దు చేయం
భవానీపట్న(ఒడిశా): విద్య, ఉద్యోగాల్లో షెడ్యూల్డ్ కులాలు(ఎస్సీలు), షెడ్యూల్డ్ తెగల (ఎస్టీలు)కు ఉన్న రిజర్వేషన్లను రద్దు చేసే ఉద్దేశమేదీ కేంద్ర ప్రభుత్వానికి లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా స్పష్టం చేశారు. అలాగే రిజర్వేషన్ల విధానాన్ని రద్దు చేసేందుకు ఎవరినీ అనుమతించబోమన్నారు. బుధవారం భవానీపట్నలో జరిగిన బహిరంగ సభలో అమిత్‌షా మాట్లాడారు. బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగంలో సూచించిన రిజర్వేషన్ల విధానాన్ని మార్చే సాహసం ఎవరూ చేయబోరన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ దళిత సంఘాలు చేపట్టిన దేశవ్యాప్త బంద్‌లో హింస చెలరేగి పది మంది మరణించడానికి కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలే కారణమని ఆయన మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తామని ప్రధానమంత్రి హామీ ఇచ్చినా.. బంద్‌కు పిలుపునివ్వడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. రిజర్వేషన్ల విధానాన్ని బీజేపీ రద్దు చేస్తుందంటూ మీడియా, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం మొదలైందని ఆరోపించారు. రిజర్వేషన్ల విధానాన్ని బీజేపీ రద్దు చేయబోదని, అందుకు ఎవరినీ అనుమతించబోదని ఆయన స్పష్టంచేశారు. -
నిషేధం వద్దు... నోటీసులు చాలు
- మ్యాగీపై తెలంగాణ సర్కారు నిర్ణయం సాక్షి, హైదరాబాద్: మ్యాగీపై నిషేధం విధించాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే నెస్లే కంపెనీ తన మ్యాగీ ఉత్పత్తులను వెనక్కు తీసుకుంటున్న నేపథ్యంలో నిషేధం అవసరం లేదని... కేవలం నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో 22 శాంపిళ్లను సేకరించి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)కు పరీక్ష నిమిత్తం పంపిన సంగతి తెలిసిందే. వాటిలో 6 శాంపిళ్ల వివరాలను ఐపీఎం వెల్లడించింది. అందులో సీసం (లెడ్) పరిమిత మోతాదులోనే ఉందని నిర్ధారించింది. కానీ, ప్రమాదకర మోనో సోడియం గ్లూటమేట్ (ఎంఎస్‌జీ) ఉందని గుర్తించారు. మ్యాగీ ప్యాకెట్లపై మాత్రం ఎంఎస్‌జీ లేదని ముద్రించారు. ఇలా ముద్రించడం వినియోగదారులను తప్పుదోవ పట్టించడమేనని, అందుకే తాము నెస్లే కంపెనీకి నోటీసులు ఇవ్వనున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా మంగళవారం వివరించారు. అయితే ఎంత మోతాదులో ఎంఎస్‌జీ ఉందనే విషయాన్ని నిర్ధారించలేదని ఆయన తెలిపారు. సహజసిద్ధంగా ఎంఎస్‌జీ ఉందా? లేక రసాయనాలు కలపడం ద్వారా ఎంఎస్‌జీని మ్యాగీలో కలిపారా అనే విషయం తెలియదని, ఆ విషయం అప్రస్తుతమన్నారు. ఆరు శాంపిళ్ల వివరాలు ఇవే..: ఆరు శాంపిళ్ల పరీక్ష వివరాలను ఐపీఎం ప్రకటించింది. అందులో హైదరాబాద్ నుంచి సేకరించిన ఐదు ప్యాకెట్లు, రంగారెడ్డి జిల్లా నుంచి సేకరించిన ఒక శాంపిల్ ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షించిన వాటిలో మ్యాగీ మసాలా నూడిల్స్ రెండు ప్యాకెట్లు, మ్యాగీ 2 మినిట్ నూడిల్స్ రెండు ప్యాకెట్లు, మ్యాగీ 2 మినిట్ నూడిల్స్ మసాలా రెండు ప్యాకెట్లు ఉన్నాయి. ‘తప్పుడు ముద్రణ’ (మిస్‌బ్రాండెడ్) అని నిర్ధారించారు. మిగిలిన 16 శాంపిళ్ల వివరాలను కూడా వెల్లడించేందుకు ఐపీఎం కసరత్తు చేస్తోంది. బుధవారం మరో 6 శాంపిళ్ల ఫలితాలు వెల్లడిస్తారు. -
మినీ స్కర్టులు, బికినీలను నిషేధించలేం
పనాజీ: బీచ్‌లలో బికినీలు, నైట్ క్లబ్బులలో మినీ స్కర్టులు ధరించకుండా నిషేధం విధించలేమని గోవా టూరిజం మంత్రి దిలీప్ పారులేకర్ స్పష్టం చేశారు. బికినీలు, మినీ స్కర్టులను నిషేధించాలంటూ ఆ రాష్ట్ర ప్రజా పనుల శాఖ మంత్రి సుదిన్ ధవలికర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో పారులేకర్ పైవిధంగా స్పందించారు. ఇలా నిషేధం విధించడం సాధ్యంకాదని మంత్రి చెప్పారు. కాగా ధావలికర్‌ను మంత్రి వర్గం నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. మహిళలు ఎలాంటి దుస్తులు ధరించాలో ఉచిత సలహాలు ఇచ్చే బదులు నీటి సమస్యపై దృష్టి సారించాలని కాంగ్రెస్ ప్రతినిధి దుర్గాదాస్ కామత్ హితవు పలికారు.