నిషేధం వద్దు... నోటీసులు చాలు
- మ్యాగీపై తెలంగాణ సర్కారు నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: మ్యాగీపై నిషేధం విధించాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే నెస్లే కంపెనీ తన మ్యాగీ ఉత్పత్తులను వెనక్కు తీసుకుంటున్న నేపథ్యంలో నిషేధం అవసరం లేదని... కేవలం నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
రాష్ట్రంలో 22 శాంపిళ్లను సేకరించి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)కు పరీక్ష నిమిత్తం పంపిన సంగతి తెలిసిందే. వాటిలో 6 శాంపిళ్ల వివరాలను ఐపీఎం వెల్లడించింది. అందులో సీసం (లెడ్) పరిమిత మోతాదులోనే ఉందని నిర్ధారించింది. కానీ, ప్రమాదకర మోనో సోడియం గ్లూటమేట్ (ఎంఎస్‌జీ) ఉందని గుర్తించారు. మ్యాగీ ప్యాకెట్లపై మాత్రం ఎంఎస్‌జీ లేదని ముద్రించారు. ఇలా ముద్రించడం వినియోగదారులను తప్పుదోవ పట్టించడమేనని, అందుకే తాము నెస్లే కంపెనీకి నోటీసులు ఇవ్వనున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా మంగళవారం వివరించారు.
అయితే ఎంత మోతాదులో ఎంఎస్‌జీ ఉందనే విషయాన్ని నిర్ధారించలేదని ఆయన తెలిపారు. సహజసిద్ధంగా ఎంఎస్‌జీ ఉందా? లేక రసాయనాలు కలపడం ద్వారా ఎంఎస్‌జీని మ్యాగీలో కలిపారా అనే విషయం తెలియదని, ఆ విషయం అప్రస్తుతమన్నారు.
ఆరు శాంపిళ్ల వివరాలు ఇవే..: ఆరు శాంపిళ్ల పరీక్ష వివరాలను ఐపీఎం ప్రకటించింది. అందులో హైదరాబాద్ నుంచి సేకరించిన ఐదు ప్యాకెట్లు, రంగారెడ్డి జిల్లా నుంచి సేకరించిన ఒక శాంపిల్ ఫలితాలు విడుదలయ్యాయి.
పరీక్షించిన వాటిలో మ్యాగీ మసాలా నూడిల్స్ రెండు ప్యాకెట్లు, మ్యాగీ 2 మినిట్ నూడిల్స్ రెండు ప్యాకెట్లు, మ్యాగీ 2 మినిట్ నూడిల్స్ మసాలా రెండు ప్యాకెట్లు ఉన్నాయి. ‘తప్పుడు ముద్రణ’ (మిస్‌బ్రాండెడ్) అని నిర్ధారించారు. మిగిలిన 16 శాంపిళ్ల వివరాలను కూడా వెల్లడించేందుకు ఐపీఎం కసరత్తు చేస్తోంది. బుధవారం మరో 6 శాంపిళ్ల ఫలితాలు వెల్లడిస్తారు.