ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు..
ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్య
దళితులు చదువుకోరు.. శుభ్రంగా ఉండరు..
మంత్రి ఆదినారాయణరెడ్డి ఆగస్టు 15న అన్న మాటలు
మాదిగ (నా..కొ..)లు అస్సలు చదవరు.. బాగుపడరు..
పరీక్ష రాసి వస్తున్న ఓ దళిత విద్యార్థిని ఉద్దేశించి మే 10న ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య చేసిన వివాదాస్పద కామెంట్..
సీఎంకి, ఆయన సహచరులకు దళితులపై ఉన్న ప్రేమకు ఈ వ్యాఖ్యలే నిదర్శనాలు..
- పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రులో దళితులపై సాంఘిక బహిష్కరణ విధించారు..
- విశాఖ జిల్లా జర్రిపోతులపాలెంలో దళిత మహిళ ఇల్లు ఖాళీచేయలేదన్న సాకుతో అందరూ చూస్తుండగా వీధుల్లో దుస్తులు ఊడిపోయేలా ఈడ్చి ఈడ్చి కొట్టారు.
- కర్నూలు జిల్లాలోని ఒక ఊరిలో శ్మశానంలో గొయ్యి తవ్వలేదని ఎస్సీ కాలనీలో రోడ్లు ధ్వంసం చేసి, కుళాయిలు పీకేశారు..రాష్ట్రంలో దళితుల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి ఇవి మచ్చుతునకలు..కానీ దళితులపై తమకు అపారమైన ప్రేమ ఉందని చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి తహతహలాడుతున్నారు. నెల్లూరు జిల్లాలో ‘దళిత తేజం’ పేరుతో రాష్ట్రప్రభుత్వం శనివారం ఓ కార్యక్రమం నిర్వహిస్తోంది.
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రతీ దళిత వాడలో దళితుల్లో చైతన్యం రగిలించేందుకు, వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను వివరించేందుకు ఉద్దేశించిన ‘దళిత తేజం’ కార్యక్రమం శనివారం నెల్లూరులో జరగనుంది. సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎస్సీ, ఎస్టీలపై దాడులు ఎక్కువయ్యాయని అంబేడ్కర్‌ను సైతం అవమానపర్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ఎంతోమంది దళిత ఉద్యోగులు వేదనకు గురవుతున్నారని ఆ వర్గాలకు చెందిన నేతలు మండిపడుతున్నారు. ఇందుకు నాలుగేళ్లలో చోటుచేసుకున్న అనేక సంఘటనలను సైతం ఉదహరిస్తున్నారు.
- పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రులో దళితులను సాంఘిక బహిష్కరణ చేశారు.
- శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో దళిత యువకుడిని ఎస్సై కొట్టి హింసించారు.
- విజయనగరం జిల్లా ముదువలసలో జన్మభూమి సభలో సమర్పించేందుకు అర్జీలు రాసుకుంటున్న దళితులను టీడీపీ వారు కొట్టారు. ఇందులో ఎమ్మెల్యే నారాయణస్వామి కుమారుడు నిందితుడు.
- అలాగే, విశాఖ జిల్లా జర్రిపోతులపాలెంలో ఒక దళిత మహిళ ఇల్లు ఖాళీచేయలేదని తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులు అందరూ చూస్తుండగా వీధుల్లో దుస్తులు ఊడిపోయాలా ఈడ్చి ఈడ్చి కొట్టారు.
- కృష్ణాజిల్లా బందరులో ఈనెల 9, 10, 11 తేదీల్లో ప్రభుత్వం నిర్వహించిన బీచ్ ఫెస్టివల్‌లో ఆటలు ఆడుతున్న మల్లేశం గ్రామానికి చెందిన కొందరు దళిత యువకులను పోలీసులు నాలుగు రోజులు స్టేషన్లు మార్చి మార్చి మరీ కొట్టారు.
- ప్రకాశం జిల్లా పర్చూరు మండలం దేవరపల్లిలో 20 దళిత కుటుంబాలకు చెందిన భూమిని నీరు–చెట్టు కార్యక్రమం కింద స్వాధీనం చేసుకుని రాత్రికి రాత్రి మట్టి తోలారు. టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు బలవంతంగా ఈ పనిచేయించినట్లు దళితులు కేసు పెట్టారు.
- చిత్తూరు జిల్లా మునగపాలెం ఎస్సీ కాలనీలో బైక్ హారన్ కొట్టారని ఒక యువకుడిని గ్రామంలోని కొందరు కొట్టగా కేసు పెట్టారు. దీంతో దళితవాడను సాంఘిక బహిష్కరణకు గురిచేశారు.
- అనంతపురం జిల్లా పరిగి మండలం వన్నంపల్లి గ్రామంలో అన్ని కులాల వారు చందాలు వేసుకుని గుడి నిర్మించారు. గుడిలో విగ్రహ ప్రతిష్టాపనకు దళితులు వచ్చేందుకు వీల్లేదని అడ్డుకోవడంతో ఎదురుతిరిగిన దళితులను సాంఘిక బíßహిష్కరణకు గురిచేశారు.
- కర్నూలు జిల్లా నక్కలదిన్నె శ్మశానంలో గొయ్యి తవ్వేందుకు దళితులు రాలేదని ఎస్సీ కాలనీలో రోడ్లు ధ్వంసం చేసి, తాగునీటి కుళాయిలు పీకేశారు.
ఈ సంఘటనలన్నీ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌లో నమోదయ్యాయి. అలాగే, నాలుగేళ్లుగా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరగకపోవడం గమనార్హం.
స్మృతివనం పేరుతో అంబేడ్కర్‌కు అవమానం
అమరావతిలో 25 ఎకరాల స్థలంలో అంబేడ్కర్ స్మృతివనం నిర్మిస్తున్నామని, అక్కడ 125 అడుగుల ఎత్తులో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటుచేస్తున్నామని సీఎం ఘనంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇందుకు గతేడాది ఏప్రిల్ 14న భూమి పూజ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 14న శంకుస్థాపన చేశారు. కానీ ఇప్పటివరకు ఒక్క ఇటుకా పడలేదు. అలాగే, రెండేళ్లుగా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఆదేశాలు గాలిలో కలిసిపోయాయి. గుంటూరుకు చెందిన వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగి రవి ఎంతోకాలం కోర్టుల చుట్టూ తిరిగి ప్రమోషన్ రాకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
సబ్‌ప్లాన్ నిధులు పక్కదోవ
సబ్‌ప్లాన్ నిధులు పక్కదోవ పడుతున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయానికి నిధులు అవసరమైనప్పుడల్లా సబ్‌ప్లాన్ నుంచి వినియోగిస్తున్నారు. వివిధ ప్రాంతాలకు ముఖ్యమంత్రి విమానంలో వెళ్ళిన ఖర్చులు కూడా సబ్‌ప్లాన్ నిధులనే వెచ్చించడం విశేషం. ఇదిలా ఉంటే.. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఏర్పాటుచేసిన సంక్షేమ హాస్టళ్లను ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఎంతోమంది పేద దళిత విద్యార్థులు విద్యకు దూరమయ్యారు. అలాగే, రెండువేల వరకు ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులు ఉన్నప్పటికీ నాలుగేళ్లుగా అవి భర్తీకి నోచుకోలేదు. ఈ నేపథ్యంలో దళిత తేజం పేరుతో శనివారం నెల్లూరు జిల్లాలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుండడంపై ఆయా వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పలుచోట్ల దళితులపై జరిగిన దాడుల్లో నిందితులను అరెస్టుచేయని టీడీపీ సర్కార్ శనివారం నెల్లూరులో ‘దళిత తేజం’ నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
దళిత తేజం సిగ్గుచేటు
దళితులపై ఇటీవల జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, హత్యలు, సాంఘిక బహిష్కరణలు చేస్తున్నా ప్రధాన నిందితులను అరెస్టు చేయని టీడీపీ ప్రభుత్వం దళిత తేజం నిర్వహించడం సిగ్గుచేటు.
– ఆండ్ర మాల్యాద్రి,ప్రధాన కార్యదర్శి, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం
దళిత నిస్తేజం
ఏంచేశారని దళిత తేజం నిర్వహిస్తున్నారు? ఎన్‌ఆర్‌ఈజీఎస్, 14వ ఆర్థిక సంఘం నిధులు ఖర్చుచేసి రోడ్లు, డ్రైనేజీ కాలువలు అక్కడక్కడ కట్టిస్తే దళిత తేజం అవుతుందా? ఎస్సీ, ఎస్టీ కాలనీల్లోని సుమారు ఆరువేల స్కూళ్లు మూసివేశారు. విద్య, వైద్యం నిర్వీర్యమైంది. దళితులు ఉండే ప్రాంతాల్లో ఉచిత వైద్యం లేదు.
– ఆదిమూలం సురేష్, ఎమ్మెల్యే, సంతనూతపాడు, ప్రకాశం జిల్లా.
గాడాంధకారమే..
రాష్ట్రంలో దళిత తేజం లేదు, దళిత గాడాంధకారమే ఉంది. దళితుల్లో ఒక్కరికి కూడా ఎకరా పొలం ఇవ్వలేదు. ఇళ్లు, ఇళ్ళ స్థలాలు ఇవ్వలేదు. కృష్ణానది ఒడ్డున ఉన్న అనేకమంది దళితులను అక్కడి నుంచి ఖాళీ చేయించి రోడ్డున పడేశారు. టీడీపీకి దళితులు అందమైన సమాధి కడతారు.
– దారా సాంబయ్య, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు
Comments
Please login to add a commentAdd a comment