అప్పుల్లోనూ అయ్య బాబోయ్‌! | Heavy borrowings in Lokesh Department before the elections | Sakshi
Sakshi News home page

అప్పుల్లోనూ అయ్య బాబోయ్‌!

Published Sun, Mar 10 2019 4:13 AM | Last Updated on Sun, Mar 10 2019 8:23 PM

Heavy borrowings in Lokesh Department  before the elections - Sakshi

సాక్షి, అమరావతి: అప్పులు తేవడంలో మంత్రి నారా లోకేశ్‌.. తన తండ్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు బాటలోనే పయనిస్తున్నారు. మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టాక పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ.. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకురావడంలో ముందంజలో ఉంది. ఈ శాఖలో అమల్లో ఉన్న కార్యక్రమాల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచే ఏటా రాష్ట్రానికి దాదాపు రూ.10 వేల కోట్లు వస్తున్నాయి. వాటితో పాటు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ నుంచి రూ.1,000–1,500 కోట్ల దాకా కేటాయింపులు జరుగుతుంటాయి. ఈ నిధులూ సరిపోక 2018 ఏప్రిల్‌ తర్వాత కేవలం ఒక ఏడాది కాలంలోనే ఆ శాఖ బ్యాంకుల నుంచి ఏకంగా రూ.18,850 కోట్లు అప్పులు తెచ్చింది. ప్రభుత్వం నేరుగా అప్పు తీసుకోకుండా.. అప్పు తేవడం కోసమే అన్నట్టుగా శాఖకు అనుబంధంగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల పేరుతో అప్పులు తెస్తున్నారు. వాటికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తోంది. ఈ అప్పులన్నీ సాధారణ ఎన్నికలు జరగడానికి ఐదారు నెలల ముందే కావడం గమనార్హం. ఇప్పటికే గ్రామాల్లోని మంచినీటి పథకాలు, రోడ్లు వంటి వాటిని తాకట్టు పెట్టి పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధిశాఖ పరిధిలోని కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పుల నగదును.. ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు ప్రకటించిన పసుపు–కుంకుమ, అన్నదాత సుఖీభవ వంటి కార్యక్రమాలకు మళ్లించారని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.

– గ్రామీణ రోడ్ల మరమ్మతుల కోసం రూ.1500 కోట్ల అప్పు 
అనంతపురం, చిత్తూరు, తూర్పు గోదావరి, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, విశాఖపట్నం, విజయనగరం, కడప జిల్లాల గ్రామీణ ప్రాంతాల్లోని 16 వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న 5,515 లింకు రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని.. వాటికి మరమ్మతుల కోసమంటూ రూ.1,500 కోట్లు అప్పు తీసుకొస్తోంది. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజన(పీఎంజీఎస్‌వై) అమలుకు కేంద్ర ప్రభుత్వం ఏటా రాష్ట్రానికి కేటాయించిన రూ.400 కోట్లను ప్రత్యేకించి ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు ఖాతాలో ఖర్చు పెడతామని.. ఆ ఖాతాల్లో ఉండే నిధులను సెక్యూరిటీగా పేర్కొంటూ ఆ బ్యాంకు నుంచి రోడ్‌ కార్పొరేషన్‌ పేరిట రూ.1,500 కోట్లు అప్పుగా తీసుకుంటున్నారు. ఈ అప్పుకు ప్రభుత్వమే గ్యారంటీ ఉంటుందంటూ ఫిబ్రవరి 8న ఉత్తర్వులు వెలువడ్డాయి. 

– చిన్న చిన్న రోడ్ల నిర్మాణం కోసం రూ.3,800 కోట్లు
గ్రామీణ ప్రాంతాల్లో 250 మంది జనాభా ఉండే చిన్న గ్రామాలకు కొత్తగా తారు రోడ్ల నిర్మాణానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి రూ.3,800 కోట్లు అప్పు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. టెండర్లు కూడా పిలిచారు. ఆ అప్పును కూడా చంద్రబాబు ఎన్నికల ముందు ప్రకటించిన హామీల అమలుకు ఖర్చుచేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోందని చెబుతున్నారు. 

– మంచినీటి పథకాల పేరుతో రూ.12,380 కోట్ల అప్పు 
ఎన్నికల ముందు ప్రభుత్వం ఏపీ తాగునీటి సరఫరా కార్పొరేషన్‌ ద్వారా బ్యాంకుల నుంచి రూ.12,380 కోట్లు తీసుకొస్తోంది. 13 జిల్లాల్లో ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా ప్రతి మనిషికీ 55 లీటర్ల చొప్పున నీటి సరఫరా లక్ష్యంగా వాటర్‌ గ్రిడ్‌ పథకం చేపడుతున్నట్టు చంద్రబాబు 2014లో ప్రకటించారు. 2015 అక్టోబర్‌లోనే అధికారుల బృందాన్ని వివిధ రాష్ట్రాల పర్యటనకు పంపడంతో పాటు.. పథకం అమలుకు రూ.22 వేల కోట్ల ప్రణాళికను సిద్ధం చేసింది. నాలుగేళ్లు దీనిపై మౌనంగా ఉన్న సర్కార్‌.. ఎన్నికల ముందు ఆ ప్రతిపాదనలకు దుమ్ము దులిపి బ్యాంకుల నుంచి రూ.12,380 కోట్ల అప్పులు తీసుకొస్తోంది. మొదట తయారు చేసిన రూ.22 వేల కోట్ల ప్రతిపాదనలను.. రూ.29 వేల కోట్లకు పెంచి, ఎన్నికల ముందు ఇప్పుడు అందులో మొదట దశలో రూ.15,769 కోట్ల పనులు అమలుకు ప్రభుత్వం అనుమతి తెలిపింది. అందుకుగాను పంచాయతీరాజ్‌ పరిధిలో ఉండే ఆంధ్రప్రదేశ్‌ మంచినీటి సరఫరా కార్పొరేషన్‌ ద్వారా బ్యాంకుల నుంచి రూ.12,380 కోట్ల అప్పులు తీసుకొస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి పథకాలను తాకట్టు పెట్టి ప్రభుత్వం ఇప్పటికే కొంత అప్పు తీసుకుంది. ఆ డబ్బుతో మంచినీటి పథకాల నిర్మాణ పనులు మొదలు పెట్టనే లేదు. కానీ ఆ నిధులను చంద్రబాబు ఎన్నికల పథకాలకు మళ్లించారని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటు కోసం రూ.1250 కోట్లు అప్పు..
గ్రామాల్లో కరెంటు స్తంభాలకు ఎప్పటి నుంచి ట్యూబ్‌ లైట్‌ వీధి దీపాలు వెలుగుతున్నాయి. లోకేశ్‌ మంత్రి అయ్యాక తనకు అనుకూలంగా ఉండే కొంత మంది కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం గ్రామాల్లో విద్యుత్‌ స్తంభాలకు ఇప్పుడున్న ట్యూబ్‌ లైట్లను తొలగించి.. ఎల్‌ఈడీ బల్బుల ఏర్పాటుకు పూనుకున్నారు. ఒక్కో ఎల్‌ఈడీ బల్బుకు ఏడాదికి రూ.450 చొప్పున పదేళ్ల పాటు గ్రామ పంచాయతీ గానీ, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేలా కాంట్రాక్టర్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు. రూ.1000 కూడా ఖర్చు కాని ఎల్‌ఈడీ బల్బుకు కాంట్రాక్టరుకు రూ.4,500 చెల్లించాల్సి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 12,918 గ్రామ పంచాయతీల్లో 30 లక్షల కరెంట్‌ స్తంభాలకు ఎల్‌ఈడీ బల్బుల ఏర్పాటుకు గానూ కాంట్రాక్టర్లకు పదేళ్ల కాలంలో మొత్తం రూ.1,250 కోట్లు అప్పు తెచ్చి చెల్లించాల్సి ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement