సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన టీడీపీ ఓటమిని జీర్ణించుకోలేపోతుంది. ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనానికి టీడీపీ చిత్తుచిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలపై మాజీ మంత్రి, చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబును సొంత పార్టీ నేతలే మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవీఎంలు పదిశాతం మోసం చేస్తే.. పార్టీ నమ్ముకున్న నేతలు 90 శాతం మోసం చేశారని లోకేష్ అన్నారు. గల్లా జయదేవ్ వంటి నేతలే గెలవంగా మిగతావారు ఎందుకు ఓడిపోయారని అసహనం వ్యక్తం చేశారు.
మంగళవారం ఓ సమావేశంలో పాల్గొన్న లోకేష్ ఓటమిపై పార్టీ నేతలతో చర్చించారు. గుంటూరు ఎంపీగా పోటీ చేసిన గల్లా జయదేవ్ విజయం సాధించగా.. ఆ లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో ఎందుకు ఓటమి చెందామని నేతల్ని ప్రశ్నించారు. నేతల మధ్య సమన్వయం, ప్రత్యర్థిని దీటుగా ఎదుర్కొలేకపోవడం మూలంగానే ఓటమి చెందామని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా ఏపీ ఎన్నికల్లో సీనియర్ నేతలతో సహా, మంత్రులు కూడా ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. కాగా మొత్తం 175 స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ కేవలం 23 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. ముఖ్యంగా టీడీపీ తురుపుముక్కగా భావించిన నారా లోకేష్ మంగళగిరిలో దారుణ ఓటమిచెందడం ఆ పార్టీ శ్రేణులను భారీ షాక్‌కు గురిచేసింది.
Comments
Please login to add a commentAdd a comment