సాక్షి, అమరావతి బ్యూరో: మంగళగిరిలో ఓటు భారీ రేటు పలుకుతోంది. ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ పోటీ చేస్తుండడంతో ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి గట్టెక్కేందుకు ఆ పార్టీ వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా ప్రలోభాలకు తెరలేపింది. ఓటుకు భారీ నోటును ఫిక్స్ చేసి మరీ పంపిణీ చేస్తున్నారు.
పోస్టల్ బ్యాలెట్ రూ.4 వేలకు పైనే..
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కోసం టీడీపీ నేతలు భారీగా ఖర్చు పెట్టారు. నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 1,680 పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కోసం టీడీపీ రూ.కోటి పైగా ఖర్చు చేసింది. ఒక్కో ఓటుకు రూ.4 వేల నుంచి 6వేల వరకు ఇచ్చారు. నియోజకవర్గంలో యథేచ్ఛగా డబ్బులు పంపిణీ చేస్తున్నా..అధికారులు, పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.
ఇంటికో ఫ్రిడ్జ్, ఏసీలు పంపిణీ..
కుటుంబంలో ఐదు ఓట్లు ఉంటే ఆ ఇంటికి ఏసీలు, రెండు, మూడు ఓట్లుంటే ఫ్రిడ్జ్, సెల్‌ఫోన్ తదితర ఉపకరణాలను టీడీపీ నేతలు పంపిణీ చేస్తున్నారు. లోకేశ్‌ను గట్టెక్కించేందుకు ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టడానికైనా ఆ పార్టీ వెనకాడడం లేదు. ఈ నియోజకవర్గంలో గెలుపు చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. ఆ పార్టీ భవిష్యత్ నాయకుడు పోటీలో ఉండడం, ప్రతిపక్ష అభ్యర్థి బలంగా ఉండడంతో నిరంతరం చెమటోడ్చక తప్పడం లేదు.
టీడీపీ ఎంపీ అభ్యర్థి నుంచి ఫండింగ్..
కమ్యూనిటీల వారీగా ఓటర్లను కొనుగోలు చేసేందుకు అవసరమైన డబ్బును గుంటూరు ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ సరఫరా చేస్తున్నారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఖర్చు మొత్తం ఆయనే భరించాలని పార్టీ అధిష్టానం స్పష్టం చేసినట్లు సమాచారం. లోకేశ్‌ను ఎలాగైనా గెలిపించుకునేందుకు టీడీపీ నాయకులు సర్వశక్తులు ఒడ్డుతుండడం గమనార్హం.
ఎదురీదుతున్న లోకేశ్..
నియోజకవర్గంలో బలంగా ఉన్న బీసీలు, ఎస్సీలు టీడీపీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధమయ్యారు. బీసీలకు సీటు కేటాయిస్తామని హామీ ఇచ్చి చివరి నిమిషంలో మొండిచెయ్యి చూపడంతో బీసీలు మండిపడుతున్నారు. దీనికితోడు వచ్చే ఎన్నికల్లో ఈ టికెట్ బీసీలకే కేటాయిస్తామని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్కే హామీ ఇవ్వడంతో పాటు.. గుంటూరు జిల్లా నుంచి ఎమ్మెల్సీగా ఓ బీసీ నేతకు ఇస్తామని జగన్ హామీ ఇవ్వడంతో బీసీలంతా వైఎస్సార్ సీపీకి మద్దతు తెలుపుతున్నారు. అలాగే సుమారు 50 వేల వరకు జనాభా ఉన్న ఎస్సీలు తమ మద్దతు పూర్తిగా వైఎస్సార్ సీపీకేనని స్పష్టం చేస్తున్నారు.
మంగళగిరిలో భారీగా పెరిగిన ఓటుకు రేటు!
Published Thu, Apr 11 2019 3:47 AM | Last Updated on Thu, Apr 11 2019 3:47 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment