
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘తండ్రి సీఎం హోదాలో ఉన్నారు.. అధికారం చేతిలో ఉంది.. కావాల్సినంత డబ్బుంది.. అయినా ఏం లాభం?ఎన్నికల్లో ఓటమి తప్పేట్లు లేదు’ అని నారా లోకేశ్ ఆవేదనలో మునిగిపోయినట్లున్నారంటూ ‘దిన మలర్’ అనే తమిళ దినపత్రిక ‘ఆదిలోనే హంసపాదా?’ అంటూ శనివారం ఓ కథనాన్ని ప్రచురించింది. ‘ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అండగా ఉండి ఏమి ప్రయోజనం? అసెంబ్లీ నియోజకవర్గంలో గెలుపును ఖరారు చేసుకోలేకపోయానే అని మదనపడుతున్నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్. వారసత్వ రాజకీయాలు అనుసరిస్తూ చంద్రబాబు.. తన కుమారుడికి పార్టీలో, ప్రభుత్వంలో ముఖ్యమైన బాధ్యతలు అప్పగించాడు. మంత్రిగా కూడా నియమించారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ నిలబెట్టారు. ఈ నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్‌కు మంచి పట్టున్న ప్రాంతమని, ఇక్కడ గెలవడం అంత సులభం కాదని ఓట్లడిగేందుకు వెళ్లిన కొద్ది రోజులకే లోకేశ్‌కు తెలిసివచ్చింది. ప్రభుత్వం, అధికారం, ధనం, బలగం పూర్తిగా వినియోగించినా గట్టెక్కేలా లేడు. ఓడిపోతామా అనే భయం అతడిని ఆవరించి ఉంది’ అని ఆ కథనంలో పేర్కొంది. ‘నేను ఎదుర్కొంటున్న తొలి ఎన్నికలు ఇవి.. ఈ ఎన్నికల్లో ఓడిపోతే ఆదిలోనే హంసపాదు అనే ముద్ర పడిపోతుంది’ అనే భీతిని ఎదుర్కొంటున్నాడు’ అని వ్యాఖ్యానించింది.