ఎన్నికల్లో మా వర్గానికి చెందిన వారికే తెలుగుదేశం టిక్కెట్ ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ మమ్మల్ని మోసం చేశారు. చివరకు ఈ నియోజకవర్గంతో ఎలాంటి సంబంధం లేని తన కుమారుడిని తీసుకొచ్చి మానెత్తిన రుద్దారు. ఇది మమ్మల్ని తీవ్రంగా అవమానించడమే...
– ఇది గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని చేనేత కుటుంబాల ఆవేదన
‘‘చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండి ఆదుకుంటానని పవన్‌కల్యాణ్ మంగళగిరిలో సదస్సు నిర్వహించి మరీ ప్రకటించారు. కానీ ఇప్పుడు కనీసం జనసేన టిక్కెట్‌ను కూడా కేటాయించలేదు. ముఖ్యమంత్రి కుమారుడికి అనుకూలంగా వ్యవహరించి తన పార్టీ అభ్యర్థిని ఇక్కడ పోటీకి దింపలేదు. ఇంతకన్నా వంచన ఏముంటుంది?..’’
‘‘మంది మార్బలంతో తిరుగుతున్న సీఎం కొడుకు లోకేష్ దగ్గరకు వెళ్లడానికి పెద్దోళ్లకే అవకాశం లేదు. ఇక సామాన్యులమైన మేము ఆ ఊసే ఎత్తడానికి వీల్లేదు. ఇలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే కనీసం మా సమస్యలు చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉండదు..’’
– ‘సాక్షి’ ఆదివారం మంగళగిరి పట్టణంలో పర్యటించి వివిధ వర్గాల వారితో ముచ్చటించినప్పుడు వారు వెలిబుచ్చిన అభిప్రాయాలు ఇవి.
సాక్షి, అమరావతి: చంద్రబాబు తన కుమారుడు లోకేష్‌ను మంగళగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నియోజకవర్గంలోని మొత్తం ఓటర్లలో 60–70 శాతం వరకు మంగళగిరి పట్టణంలోనే ఉన్నారు. వీరిలో ఎక్కువమంది చేనేత కుటుంబాలకు చెందినవారు. వీరితో పాటు వివిధ వర్గాల వారు.. చంద్రబాబు ఐదేళ్లుగా తమ నియోజకవర్గాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదని విమర్శలు గుప్పించారు. మా ప్రాంతానికి నిధులు ఇవ్వకుండా అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) గెలవడంతో, టీడీపీ ప్రభుత్వం తమ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయకుండా నిలిపివేసిందని గుర్తుచేశారు. మున్సిపాలిటీలో సమస్యలను అసలు పట్టించుకోలేదని చెప్పారు.
మురుగునీటి పారుదల తదితర కనీస మౌలిక సదుపాయాలను కూడా కల్పించలేదన్నారు. ప్రభుత్వ సహకారం లేకున్నా.. ఎమ్మెల్యే ఆర్కే తనవంతుగా ఎంతో కృషి చేశారని వెల్లడించారు. ఇప్పుడు చంద్రబాబు తన కుమారుడిని ఇక్కడ పోటీకి దింపారని, ఐదేళ్లు పట్టించుకోకుండా ఇప్పుడు కొడుక్కి ఓట్లేయమంటున్నారని ధ్వజమెత్తారు. స్థానికంగా ఉన్న వారికి అవకాశం ఇవ్వకుండా, లోకేష్‌ను పోటీకి నిలబెట్టడం తమను అవమానించడంగానే భావిస్తున్నామని కొందరు వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీచేసి ఓడిపోయిన గంజి చిరంజీవులుకు, మాజీ ఎమ్మెల్యేలు మురుగుడు హన్మంతరావుకు, కాండ్రు కమలకు వచ్చే ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ ఇస్తానంటూ చివరి వరకు చంద్రబాబు నమ్మించారని, చివరకు తన కుమారుడిని తీసుకొచ్చి పెట్టారని విమర్శలు ఎక్కుపెట్టారు. తమ వారికి హామీ ఇచ్చి మరీ చంద్రబాబు మోసం చేశారని చేనేతవర్గానికి చెందిన పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగుదేశంతో పవన్ కుమ్మక్కు
‘ఇక్కడ అత్యధిక సంఖ్యలో ఉన్న చేనేత కుటుంబాల వారితో పవన్‌కల్యాణ్ గతంలో పెద్ద సదస్సు పెట్టారు. చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటానని, చేనేత కుటుంబాలను అన్ని విధాలుగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఎన్నికల సమయంలో జనసేనను ఇక్కడ పోటీకి దింపకుండా టీడీపీతో కుమ్మక్కు అయ్యారు. కేవలం ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్ పోటీ చేస్తున్నందుకే.. పవన్ ఇక్కడ తన పార్టీని పోటీకి దింపకుండా వారికి సహకరిస్తున్నారు. చేనేత కుటుంబాలకు అండగా ఉంటానని చెప్పి.. ఏకంగా పార్టీ అభ్యర్థినే నిలపకుండా వంచించారు’ అని జనసేన అధినేత కొందరు ధ్వజమెత్తారు.
అందరికీ అందుబాటులో ఆర్కే
ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే ఆర్కే మంచి వ్యక్తి అని, ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటారని మంగళగిరివాసులు చెప్పారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే కావడం, రాజధానిలో ప్రభుత్వ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయడంతో.. సర్కారు ఈ నియోజకవర్గానికి నిధులు ఇవ్వకుండా అన్యాయం చేసిందన్నారు. రాజధాని ప్రాంతంలో కబ్జాదారులు పెరిగిపోయారని వాపోయారు. తమకు లోకేష్, ప్రభుత్వంలోని పెద్దల అండదండలున్నాయని వారు చెబుతున్నారని, ఇక వారిని ఎన్నుకుంటే కబ్జాల పర్వానికి అంతే ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment