ఆయన ఒక మాజీ సీఎం కుమారుడు. ఒకసారి దొడ్డిదారిలో మంత్రిగా కూడా వెలగబెట్టారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలో అర్థం కావట్లేదు. అందుకే కొంచెం గ్యారెంటీ ఉండే సీట్ కోసం వెతుక్కుంటున్నారు. ఇందుకోసం సర్వేలు కూడా చేయించుకున్నారట. ఇంతకీ ఆయనెవరో, ఆయన కథేందో తెలుసుకుందాం.
తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి నియోజకవర్గాన్ని వెతుక్కుంటున్నారనే ప్రచారం టీడీపీలో జోరుగా నడుస్తోంది. లోకేష్ చేసిన వ్యాఖ్యలతోనే పార్టీలో ప్రచారం ఊపందుకుంది. ఇటీవల మంగళగిరిలో జరిగిన ఓ సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచే పోటీ చేస్తానని మాత్రం చెప్పలేదు.దీంతో మంగళగిరిలో గెలుస్తాననే నమ్మకం లేకనే వేరే నియోజకవర్గం వెతుక్కుంటున్నారనే ఊహాగానాలు టీడీపీలో ఊపందుకున్నాయి.
2019 ఎన్నికల్లో లోకేష్ మంగళగిరి నుంచి బరిలోకి దిగారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఓటమి తర్వాత మూడేళ్లపాటు నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదు. కరోనాకు భయపడి లోకేష్.. చంద్రబాబుతో కలిసి హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. పార్టీ ఓటమి తర్వాత నియోజకవర్గ నాయకులతో, కార్యకర్తలతో కనీసం సమీక్ష కూడా నిర్వహించలేదు. మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి లోకేష్ అప్పుడప్పుడు వచ్చినా నియోజకవర్గంలో మాత్రం అడుగుపెట్టేవారు కాదు. దీంతో సొంతపార్టీ నేతల్లోనే లోకేష్ తీరుపై తీవ్ర అసంతృప్తి ఏర్పడింది.
సీఎం వైఎస్ జగన్ బడుగు బలహీన వర్గాలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. కీలకమైన పదవుల్లో బీసీలకు వైఎస్ జగన్ అధిక ప్రాధాన్యం కల్పిస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉండగా, బీసీలకు చేయలేని ఎన్నో పనులను సీఎం జగన్ చేసి చూపిస్తున్నారు. దీనికితోడు మంగళగిరి నియోజకవర్గంలో ముఖ్యమైన బీసీ నేతలు టీడీపీకి గుడ్‌బై చెప్పారు. వారంతా సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. మంగళగిరి మాజీ మున్సిపల్ చైర్మన్, టీడీపీ అధికార ప్రతినిధి గంజి చిరంజీవి.. పార్టీ సీనియర్ నేత మురుగుడు హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల వంటి వారితోపాటు క్షేత్రస్థాయి టీడీపీలో కూడా అనేక మంది వైఎస్సార్‌సీపీలో చేరారు. మంగళగిరిలో టీడీపీ రోజురోజుకు బలహీనపడుతున్న నేపథ్యంలో మళ్లీ ఓటమి తప్పదని భావించిన లోకేష్ వేరే నియోజకవర్గం వెతుక్కునే పనిలో ఉన్నట్లు సమాచారం.
తాను పోటీచేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజకవర్గం అయితే బాగుంటుందో లోకేష్ వివిధ రూపాల్లో సర్వేలు చేయించుకున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. విజయవాడ తూర్పు, పెనుమలూరు, విశాఖసిటీలోని సెగ్మెంట్లు, భీమిలీ, హిందూపురం నియోజకవర్గాల్లో సర్వేలు చేయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అవసరం అయితే హిందూపురానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తన మామ బాలకృష్ణను వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయించి తాను హిందూపురం ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ ఆశాకిరణం చెప్పుకునే లోకేష్ ఉన్న నియోజకవర్గంలో పోటీ చేయలేక మరో నియోజకవర్గం కోసం రాష్ట్రమంతా వెతుక్కునే పరిస్థితి ఏర్పడిందని పార్టీలో చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment