సాక్షి, అమరావతి : ఏదీ చేసైనా..ఈ సార్వత్రిక ఎన్నికల్లో గెలవాలని భావిస్తున్న కృష్ణా జిల్లా టీడీపీ నేతలు కుయుక్తులకు తెరతీశారు. ఏకంగా నకిలీ పట్టాలు పంపిణీ చేసిన ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పటికే ఓటుకు రూ. వేయి నుంచి రెండు వేల వరకు పంపిణీ చేస్తున్న టీడీపీ నేతలు.. తాజాగా మహిళలకు సైతం నాసిరకం చీరలు పంపిణీ చేస్తుండటం విశేషం. బహిరంగంగానే ఈ ప్రలోభాలకు టీడీపీ నేతలు పాల్పడుతున్నా.. ఎన్నికల అధికారులు కానీ, పోలీసులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఒకటోసారి.. రెండోసారి..
నామినేషన్ల ప్రక్రియ ముగియగానే..టీడీపీ అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే పనిలో నిమగ్నమయ్యారు. తమకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో అనుచరులను రంగంలోకి దింపి డబ్బులు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒకటోసారి.. రెండోసారి.. అవసరమైతే మూడోసారైనా ఫర్వాలేదు అన్నట్లుగా వేలం పాట రీతిలో ఓటర్లకు రూ.1,000 నుంచి రూ.3 వేల వరకు పంపిణీ చేయాలని టీడీపీ నేతలు నిర్ణయించారు.
ఇప్పటికే జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు మొదటి విడత పంపిణీ పూర్తి చేసినట్లు సమాచారం. డబ్బుతోపాటు మహిళలకు చీరలు, ముక్కుపుడకలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలు స్తోంది. మరో అడుగు ముందుకేసి పేదలను ఇళ్ల పట్టాల పంపిణీ పేరిట మోసాలకు తెరలేపా రు.
హనుమాన్ జంక్షన్‌లో నకిలీ పట్టాలు
గన్నవరం నియోజకవర్గంలోని హనుమాన్‌జంక్షన్, కొయ్యూరు గ్రామాలలో పేదలకు నకిలీ ఇళ్ల పట్టాలను టీడీపీ నేతలు పంచారు. గత ఏడాది ఆగస్టులో బదిలీ అయిన బాపులపాడు మండల తహసీల్దార్ కె.గోపాలకృష్ణ పేరిట రబ్బర్ స్టాంపు సంతకం కలిగిన 500 పట్టాలను స్థానిక టీడీపీ నేతలు పంపిణీ చేయడం గమనార్హం.
కేవలం ఓట్లు దండుకోవడం కోసమే నకిలీ పట్టాలు సృష్టించి పేదలను మోసగించడానికి యత్నిస్తున్న టీడీపీ నేతల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నకిలీ ఇళ్ల పట్టాల పంపీణీ వ్యవహారంపై మండల రెవెన్యూ, నియోజకవర్గ ఎన్నికల అధికారులకు వైఎస్సార్ సీపీ నేతలు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకున్న దాఖాలాలు లేవు. కేంద్ర ఎన్నికల కమిషన్ నేరుగా ఓటర్లు ఫిర్యాదు చేసేందుకు ఏర్పాటు చేసిన సీవిజిల్ యాప్‌లోనూ ఈ విషయాన్ని ఫొటోలతో సహా అప్‌లోడ్ చేసినా అతీగతి లేదు.
చీరలూ నాసిరకమే..
ఇటీవల మంగళగిరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారాలోకేష్ ఓటర్లకు ఏకంగా ఏసీలు, వాషింగ్ మిషన్లు పంపిణీ చేసినట్లుగా ఆరోపణలున్నాయి. అవి కూడా చాలా నాసిరకంగా ఉన్నాయని తెలిసింది. ఇదేవిధంగా ఇప్పుడు కృష్ణాజిల్లాలో టీడీపీ నేతలు అలాంటి కుయుక్తులకు పాల్పడుతున్నారు.
వారు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాసిరకమైన చీరలు కొనుగోలు చేసి గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. గన్నవరం నియోజకవర్గంలో ఆదివారం పలు గ్రామాల్లో ఇలాంటి చీరలను టీడీపీ నేతలు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment