మోసానికి నిజ రూపం | Chandrababu is a Person is More Manipulating to Cover Corruption. | Sakshi
Sakshi News home page

మోసానికి నిజ రూపం

Published Wed, Apr 10 2019 8:57 AM | Last Updated on Wed, Apr 10 2019 10:24 PM

Chandrababu is a Person is More Manipulating to Cover Corruption. - Sakshi

సాక్షి, అమరావతి : చారిత్రక సందర్భం రానే వచ్చింది.. రాష్ట్ర దశాదిశను మార్చే కీలక ఎన్నికల్లో ప్రజలు తీర్పు చెప్పే సమయం ఆసన్నమైంది. ఐదేళ్ల అనుభవాలను విశ్లేషిస్తూ.. ప్రభుత్వ పాలనను సమీక్షిస్తూ.. ప్రతిపక్షం నిర్వర్తించిన బాధ్యతను గుర్తిస్తూ.. ప్రజలు తమ తుది నిర్ణయం తీసుకోవాల్సిన కీలక తరుణమిది. మరో ఐదేళ్లపాటు రాష్ట్ర ప్రగతిని నిర్దేశించే ఆయుధం ప్రజల చేతుల్లోనే ఉంది. ఓటరు తన స్వీయ విచక్షణ ద్వారా విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన తరుణం ఇది..ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్‌ను నిర్ణయించే ఓటరు ముందు.. ఇప్పుడు రెండే రెండు అవకాశాలున్నాయి... ఒకరు, చంద్రబాబు... మరొకరు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. 

చంద్రబాబు 2014 ఎన్నికల్లో  650కుపైగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఐదేళ్ల పాలనలో ఒక్కహామీ కూడా పూర్తిగా నెరవేర్చకుండా.. మరోసారి ప్రజల తీర్పు కోరుతున్నారు. విశ్వాసఘాతుకం.. మాటలు మార్చే నైజం.. రాష్ట్ర ప్రజలు, ప్రగతిపట్ల నిబద్ధత లేకపోవడం..  ఏ ఎండకు ఆ గొడుగు పట్టే తత్వం.. స్వార్థ రాజకీయాలతో నిత్యం వంచన.. అవినీతికి కేరాఫ్‌గా నిలిచిన చంద్రబాబు ఓవైపు ఉంటే.. 
మరోవైపు వైఎస్‌ జగన్‌ ఉన్నారు... ఆరునూరైనా ఇచ్చిన మాటకు కట్టుబడేతత్వం.. విలువలతో కూడిన రాజకీయాలు.. ప్రజల శ్రేయస్సు పట్ల అంకితభావం.. విశ్వసనీయతకు మారుపేరుగా నిలవడం.. రాష్ట్ర ప్రగతి
పట్ల దార్శనికత..సంక్లిష్ట పరిస్థితుల్లో రాజనీతిజ్ఞత ప్రదర్శించడం.. స్థిరమైన విధాన నిర్ణయాలు తీసుకోగల సత్తా.. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్న పరిణతి.. కష్టాలకు ఎదురొడ్డే తెగింపు... నిజాయితీ, నిబద్ధతతో ప్రజల్లోనే ఉండటం.. మానవీయత నింపుకున్న నాయకత్వ లక్షణాలతో అలుపెరగకుండా ప్రజాపోరాటాలు చేస్తున్న ధీరోదాత్త నాయకుడు..  

వెన్నుపోటు

నయవంచనకు ప్రతిరూపం
అరంగేట్రంతోనే వెన్నుపోటు రాజకీయాలకు చంద్రబాబు తెరతీశారు. 1978 ఎన్నికల్లో కాంగ్రెస్‌ (ఐ)లో పెద్ద నాయకులుగా ఉన్న పాటూరి రాజగోపాల నాయుడు, నల్లారి అమర్‌నాథరెడ్డి ద్వారా చంద్రగిరికి పార్టీ టికెట్‌ సాధించి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం జడ్పీ ఛైర్మన్‌ ఎన్నిక సందర్భంగా వీరిద్దరికీ చంద్రబాబు టోకరా ఇచ్చారు. 1983లో చంద్రగిరి నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి ఓడిపోయి సొంత మామ ఎన్టీరామారావు పెట్టిన తెలుగుదేశంలో చేరి చివరకు ఆయనకే వెన్నుపోటు పొడిచారు. 1995లో ఇలా సీఎం పీఠాన్ని, పార్టీని కూడా ఆక్రమించారు. వందల ఏళ్ల క్రితం ఔరంగజేబు తన తండ్రిని జైలులో పెట్టి, అన్నలను చంపి సింహాసనాన్ని ఆక్రమించిన ఘటన తర్వాత అతి పెద్ద వెన్నుపోటు చంద్రబాబుదే. రాజకీయంగా తోడ్పాటు అందించిన చాలామందిని చంద్రబాబు వాడుకుని కరివేపాకుల్లా వదిలేశారు.

నిలువెత్తు నమ్మకం..

లాలూచీ వ్యవహారాలు
నేరుగా రాజకీయాలు చేసి ప్రజాస్వామ్యబద్ధంగా నడవడం చంద్రబాబు నిఘంటువులోనే లేదు. ఎన్టీఆర్‌ను గద్దె దించడానికి తెరవెనుక కుట్రలు చేసిన ఆయన... ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై తప్పుడు కేసులకు కాంగ్రెస్‌ పార్టీతో తెరవెనుక లాలూచీ వ్యవహారాలు నడిపారు. హైకోర్టులో కాంగ్రెస్‌ పార్టీ నేత శంకర్రావుతో పాటుగా తమ పార్టీ నేత ఎర్రన్నాయుడి ద్వారా పిటిషన్‌ వేయించి అక్రమ కేసులు పెట్టించారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి... తప్పించుకొనేందుకు టీఆర్‌ఎస్‌తో, కేంద్రంలోని బీజేపీతో లాలూచీ పడ్డారు. ఇందుకోసం ఏకంగా హైదరాబాద్‌నే వదిలేశారు. ఏపీ ప్రజల ప్రయోజనాలను తాకట్టుపెట్టి రాష్ట్రానికి సంజీవని అయిన ప్రత్యేక హోదా డిమాండ్‌కు మంగళం పాడారు.

దిగజారుడు రాజకీయాలు

రాజకీయాల్లో చంద్రబాబు విలువలు దేవతా వస్త్రాలే. వాటిని ఎప్పుడూ అవసరాలకు వాడుకోవడమే ఆయనకు తెలిసినది. మామ ఎన్టీఆర్‌ నుంచి బావమరిది హరికృష్ణ, తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు వరకు బాబు రాజకీయాల బాధితులే. ఆఖరికి నందమూరి వంశంలో మూడోతరం వ్యక్తి జూ.ఎన్టీఆర్‌నూ చంద్రబాబు వదల్లేదంటేనే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. 
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను ప్రలోభపెట్టి టీడీపీలో చేర్చుకున్నారు. ఈ క్రమంలో కోట్లాది రూపాయలు వెదజల్లి రాజ్యాంగ విలువలను కాలరాశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో....టీడీపీ నేతలనే ఇన్‌ఛార్జులుగా పెట్టి వారితో ప్రభుత్వ కార్యక్రమాలు నడిపించారు. వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగితే సీఎం స్థానంలో ఉన్న వ్యక్తిగా ఖండించడానికి బదులు ప్రచారానికి చేయించుకున్నారంటూ స్థాయి మరిచి మాట్లాడారు. 

అంతా కనికట్టు

లేనిది ఉన్నట్లు చూపి ఇన్నాళ్లూ ప్రజలను కనికట్టు చేయడంలో చంద్రబాబు దిట్ట. ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని నాదెండ్ల భాస్కరరావు కూలదోసిన ఎపిసోడ్‌ను వెన్నుపోటుగా చిత్రీకరించి... అదే తీరున తాను ఎన్టీఆర్‌ను గద్దె దించితే మాత్రం దాన్ని ఈనాడు రామోజీరావు సహా మొత్తం మీడియాను మేనేజ్‌ చేసి ప్రజాస్వామ్య పరిరక్షణగా చూపిన ఘనుడు. ప్రతి పనిలోనూ ఆ కనికట్టు ద్వారానే ప్రజలను మభ్యపెడుతూ వస్తున్నారు. రాజధానిని మరో సింగపూర్‌గా గ్రాఫిక్సులో చూపిస్తూ ఒక్క శాశ్వత నిర్మాణం చేయకపోయినా ఏదో అద్భుతం జరిగిపోయినట్లు కట్టుకథలు చెబుతూ ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతున్నారు. ఒక్క పరిశ్రమ రాకపోయినా రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 30 లక్షల మందికి ఉపాధి కల్పించామని తన వర్గ మీడియాతో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. 

మాట తప్పడం
మాటపై నిలబడిన సందర్భం చంద్రబాబు రాజకీయ జీవితంలో మచ్చుకు ఒక్కటైనా కనిపించదు. లక్ష్మీపార్వతిని బూచిగా చూపి ఎన్టీఆర్‌ను కుటుంబీకుల సాయంతో గద్దె దింపిన చంద్రబాబు కొద్దిరోజుల్లోనే వారందరినీ మోసం చేశారు. తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు పార్టీ నుంచి వెళ్లిపోయేలా చేశారు. హరికృష్ణకు మంత్రి పదవిచ్చి తరువాత పోటీకి వీల్లేకుండా చేసి తప్పుకొనేలా చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నుంచి ఫిరాయించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు పలువురికి ఈ ఎన్నికల్లో టిక్కెట్లు ఇస్తామన్న మాట పూచికపుల్లలా పక్కనపెట్టారు.

కుట్రలు కుతంత్రాలు

ఈ రెండు చంద్రబాబుకు రెండు కళ్లు. ఎన్టీఆర్‌ను గద్దె దించడానికి తెరవెనుక నుంచి ఈనాడు రామోజీరావుతో కలసి కుట్రలు పన్నారు. ఎమ్మెల్యే వంగవీటి రంగా, పింగళి దశరథరామ్‌ల హత్యలతో ప్రారంభిస్తే అనేక ఘటనల్లో అందరి వేళ్లు చంద్రబాబువైపే చూపుతున్నాయి. పరిటాల రవి చనిపోయినప్పుడు రాష్ట్రంలో విధ్వంసం సృష్టించేలా బస్సులు తగులబెట్టించాలని టీడీపీ కార్యాలయంనుంచి నేరుగా శ్రేణులకు ఆదేశాలిచ్చారు. మహా నేత వైఎస్‌రాజశేఖరరెడ్డి మరణం వెనుక ఇలాంటి కుట్రలే ఉన్నాయన్న అనుమానాలున్నాయి. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో హత్యాయత్నంలోనూ బాబు మనుషులే కీలకంగా వ్యవహరించారు.

రెండు నాల్కల ధోరణి
ఒకసారి ఒక మాటచెప్పి ఆ మరుక్షణమే అందుకు భిన్నంగా మాట్లాడే తత్వం బాబుది. విభజిత రాష్ట్రానికి 15 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా కావాలని ఎన్నికలకు ముందు డిమాండ్‌ చేసి తర్వాత హోదా వల్ల ప్రయోజనం ఏముందని అన్నారు. ఏకంగా ప్రత్యేక ప్యాకేజీయే మేలని మాట మార్చారు. మళ్లీ ఎన్నికలకు ముందు హోదా అంటూ యూ టర్న్‌ తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నపుడు జీఎస్టీ, నోట్ల రద్దును సమర్దించి బయటకు వచ్చాక వాటిని తప్పుడు నిర్ణయాలుగా వ్యాఖ్యానించారు. సోనియాను ఇటలీ దెయ్యం అని తిట్టి ఇప్పుడు దేవత అని అభివర్ణిస్తున్నారు. మోడీ వల్లనే దేశం అభివృద్ధి సాధిస్తుందని పొగిడి ఇప్పుడు దేశాన్ని నాశనం చేశారని మాటమార్చారు. ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో యూ టర్న్‌లు. 

పొత్తులే దిక్కు
చంద్రబాబు తొలి నుంచి పొత్తులమారే. ఏనాడూ సొంతంగా గెలిచిన పాపానపోలేదు. సీఎం అయిన తొలిన్నాళ్లలో కమ్యూనిస్టులతో కలసి 1996, 1998 ఎన్నికల్లో పోటీ చేసి లౌకిక వాదం జపించారు. తరువాత బీజేపీతో చేతులు కలిపారు. 1999 ఎన్నికల్లో బీజేపీ సాయంతోనే గెలిచి 2004లో ఓటమి తర్వాత ఆ పార్టీని వదిలేశారు. 2009లో మళ్లీ కమ్యూనిస్టులు, తెరాసలతో మహా కూటమి కట్టారు. ఒకప్పుడు మోడీని జైల్లో పెడతానని ప్రకటన చేసి ఆయన 2014 ఎన్నికల్లో మోడీ హవాను చూసి పంచన చేరారు. గతేడాది తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం ఆవిర్భావ సిద్ధాంతానికి భిన్నంగా కాంగ్రెస్‌తో జతకట్టారు. ఇటలీ దెయ్యం సోనియా అని తాను చేసిన తీవ్ర విమర్శలను పక్కనపెట్టారు.

మోసం... 
వెన్నతో పెట్టిన విద్య నయవంచన... సహజాతి సహజ నైజం అబద్ధాలు, అర్ధ సత్యాలు... ఆయన ఇంటి పేరు నైతిక విలువలు... తన నిఘంటువులోనే లేవు మాట మార్చడంలో... ఊసరవెల్లికే గురువు వాడుకుని వదిలేయడంలో... ఘనాపాటి హామీల విస్మరణలో... సిద్ధహస్తుడు నమ్మినా... నట్టేట ముంచడం తన లక్షణం

పూటకో మాట... రోజుకో వేషం
రాష్ట్రాన్ని అత్యధిక కాలం పాలించిన సీఎంను తానేనని చెప్పుకొనే చంద్రబాబు నిర్ణయాల్లో నిబద్ధత కానీ, నిలకడ కానీ ఉండవు. రాజకీయ అవసరాల కోసం గడియకో నిర్ణయం తీసుకుని కాలం గడపడమే ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో సాక్షాత్కరిస్తుంది. రాజకీయంగా మిత్రత్వాలు నెరపడంలో, రాష్ట్ర అభివృద్ధి చర్యల్లో కేవలం తన ప్రచారాల కోసం ఎప్పటికప్పుడు నిర్ణయాలు మార్చుకుంటూ వెళ్లారు. ప్రత్యేక హోదాపై తడవకో మాటమారుస్తూ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టి తీరని నష్టం తెచ్చారు.

బాంధవ్యాలు బూటకం
చంద్రబాబుకు రాజకీయం తప్ప ఇక కుటుంబాలు, మానవ సంబంధాలు ఉండనే ఉండవు. తన కుటుంబ సభ్యులను కూడా రాజకీయాలకోసమే వాడుకుంటారు. తల్లి అమ్మణ్ణమ్మను కానీ, సోదరుడు నారా రామ్మూర్తినాయుడిని కానీ చేరదీసిన పాపాన పోలేదు. కుటుంబ సంబంధాలు లేనివాడన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడడంతో ఇప్పుడు సంక్రాతి వంటి పండగల్లో నారావారిపల్లెలో హడావుడి చేయిస్తున్నారు. బాలకృష్ణతో వియ్యం కూడా కేవలం రాజకీయ లబ్ది కోసమే అన్న విశ్లేషణలు వచ్చాయి. చివరకు హరికృష్ణ శవం పక్కనే టీఆర్‌ఎస్‌తో పొత్తులపై చర్చలు చేశారంటే చంద్రబాబు కుటుంబ విలువలు ఏవిధంగా పాటిస్తారో తెలుస్తోంది.

మానిప్యులేటర్‌
అవినీతి అక్రమాలను కప్పిపుచ్చడానికి ఎంతటి మానిప్యులేషన్‌కైనా బరితెగించే వ్యక్తి చంద్రబాబు. అమరావతి రాజధాని శాశ్వత నిర్మాణం కోసం తాను ఏమీ చేయకపోయినా, పచ్చ మీడియా ద్వారా మానిప్యులేషన్‌ చేస్తూ ప్రజలను భ్రమల్లో ఉంచుతున్నారు. ఆ తాత్కాలిక రాజధాని ఏర్పాట్లలోనూ రూ.కోట్లు దండుకుంటున్నారు. రాజధానిలో సింగపూర్‌ ప్రభుత్వమే నిర్మాణాలు చేపడుతున్నట్లు చెబుతూ తెరవెనుక నుంచి తన బినామీ సంస్థలను దింపి వందల కోట్ల విలువైన భూములను కొల్లగొడుతున్నారు. 1,600 ఎకరాలను బినామీ సంస్థలకు అప్పగించారు.

కమిట్‌మెంటుతో అబద్ధాలు
అబద్ధం చెప్పినా గోడకట్టినట్లు ఉండాలంటారు. అందులో అంతకు మించిన నైపుణ్యం చంద్రబాబుది. లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 30 లక్షల ఉద్యోగాలు వచ్చాయని అలవోకగా చెప్పేయగల నేర్పరి. పోలవరం పూర్తయిపోయిందని, నీళ్లు ఇచ్చేస్తున్నామని చెప్పి మభ్యపెట్టడంలో ఘనాపాఠి. ఒకప్పుడు ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం ముందుకు పోతుందని చెప్పి అదే నోటితో మళ్లీ ప్రత్యేకహోదాతో ఏదీ రాదని చెప్పగల దిట్ట. అంతలోనే ప్రత్యేక హోదా కోసం పోరాటం అంటూ కొత్త వేషం వేయడం, దాన్ని ప్రజల ముందు న మ్మించేలా తన పచ్చమీడియా ద్వారా ప్రచారాలు చేయించడం తెలిసిందే. 

వ్యవస్థల మేనేజ్‌...
ప్రజలను నమ్ముకుని కాకుండా వ్యవస్థలను మేనేజ్‌ చేయడం ద్వారానే చంద్రబాబు అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తుంటారు. న్యాయ, మీడియా, కీలక అధికార వ్యవస్థల్లో తన మనుషులను చొప్పించి వారి ద్వారా ఆ రంగాలను మేనేజ్‌ చేస్తుంటారు. ఎన్ని కేసులున్నా అన్నిటిలోనూ మేనేజ్‌ చేయడం ద్వారా స్టేలతో కొనసాగుతున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు, ఓటుకు కోట్లు కేసు, ఇలా చెప్పుకొంటూ పోతే చంద్రబాబు వ్యవస్థల మేనేజ్‌మెంటుకు అనేక తార్కాణాలు కనిపిస్తాయి.

అంతా అధికార యావ
చంద్రబాబు స్వార్థ ప్రయోజనాలు, అధికారం కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టడానికీ సిద్ధపడతారు. ప్రత్యేక హోదాకోసం తెలంగాణ ప్రభుత్వం మద్దతు ఇస్తుండగా దాన్నీ రాజకీయం కోసం వాడుకోవడం చూసి రాష్ట్ర ప్రజలు విస్తుపోతున్నారు. విభజనకు సంబంధించిన అంశాలు చర్చల ద్వారా పరిష్కరింపచేసుకొనే అవకాశమున్నా వాటిని అలాగే ఉంచి ఎన్నికల సమయంలో తన రాజకీయాలకు వినియోగించుకోవడం చూసి జనం చీత్కరించుకుంటున్నారు.

కుల మీడియా రూపొందించిన నాయకుడు
చంద్రబాబు స్వయం ప్రకాశకుడు కాదు.ఎన్టీ రామారావుపెట్టిన పార్టీని, ఆయన కష్టపడి ప్రజల ద్వారా సాధించిన అధికారాన్ని వెన్నుపోటు ద్వారా చేజిక్కించుకున్న వ్యక్తి. కేవలం అధికారంలో ఉన్నప్పుడు అధికారుల అండదండలతో, పచ్చ మీడియా సహకారంతో ముందుకు వెళ్లడమే తప్ప తన కాళ్లపై తాను నిలబడి రాజకీయాలు నెరిపే సామర్థ్యం చంద్రబాబుకు ఏనాడూ లేదు. ఇప్పటికీ ఒంటరిగా ఎన్నికల్లో నిలిచి గెలిచే సత్తా బాబుకు లేదు. తాజా ఎన్నికల్లో పొత్తులు లేవంటూనే ఒకపక్క జనసేనతో, మరోపక్క కాంగ్రెస్‌ పార్టీతో లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్నారు. పార్టీ గెలిస్తే తన గొప్పగా ఓడితే వేరే వాళ్ల తప్పులుగా చూపిస్తుంటారు. 2004లో ఓడినప్పుడు బీజేపీని కారణంగా చూపారు. 2009లో చిరంజీవి వల్లనే ఓడిపోయానన్నారు. 

కార్పొరేట్‌ సంస్థలకు సేవకుడిగా
 

ప్రజలకు సేవ చేయడం ద్వారా వారి గుండెల్లో చిరస్థాయిగా ఉండే బదులు ధనార్జనే చంద్రబాబు ధ్యేయం. రాజధాని కోసం రైతుల నుంచి 35 వేల ఎకరాలు తీసుకుని బినామీలు, కార్పొరేట్‌ సంస్థలకు  తక్కువ రేట్లకు కట్టబెట్టారు. రైతులకు కనీసం అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇవ్వలేదు. ప్రభుత్వ సంస్థలకు కోట్ల మేర రేట్లు పెట్టి కార్పొరేట్‌ సంస్థలకు అతి తక్కువ ధరలకు భూములు కట్టబెట్టారు. ప్రజలకు ఐదేళ్లూ ఎలాంటి సంక్షేమమూ చేయకుండా ఎన్నికలు దగ్గరపడిన సమయంలో పప్పుబెల్లాల్లా పసుపు కుంకుమ, నిరుద్యోగ భృతి అంటూ మభ్యపెడుతున్నారు.

ప్రచార కండూతి
ప్రతి అంశాన్నీ ప్రచారానికి వాడుకోవడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. తల్లి అనారోగ్యం పాలై తిరుపతి ఆసుపత్రిలో ఉంటే... ప్రచారం కోసం హైదరాబాద్‌ నుంచే డాక్టర్లతో మాట్లాడుతున్నట్లు పచ్చ పత్రికల ద్వారా రాయించారు. పండగలను కూడా ఇలానే వాడుకుంటున్నారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు దోమలపై దండయాత్ర వంటి కార్యక్రమాలు తెరపైకి తెచ్చి ప్రచారం చేయించుకుంటారు. గోదావరి పుష్కరాల సమయంలో ప్రచార యావతో, షూటింగ్‌ కవరేజీ కక్కుర్తితో.. పదుల సంఖ్యలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయినా కనీస పశ్చాత్తాపమూ లేని కఠినాత్ముడు. కృష్ణానదిలో మంత్రుల అండతో టీడీపీ నేతలు అనుమతి లేని బోట్లు తిప్పి మరో 29 మంది ప్రాణాలను బలిగొంటే చంద్రబాబు కనీసం బాధిత కుటుంబాలను ఆదుకునే చర్యలూ చేపట్టలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement