ఆర్థిక భారం.. లేదు సాయం | RTC In Huge Losses | Sakshi
Sakshi News home page

ఆర్థిక భారం.. లేదు సాయం

Published Sat, May 11 2019 3:14 AM | Last Updated on Sat, May 11 2019 10:47 AM

RTC In Huge Losses - Sakshi

2015 నుంచి ఇప్పటి వరకు ఆర్టీసీ ఆదాయం, ఖర్చులు, నష్టాల వివరాలు రూ. కోట్లలో

సాక్షి, అమరావతి: సామాన్యుడి రవాణా సాధనమైన ఆర్టీసీ బస్సు నష్టాల ఊబిలో కూరుకుపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోంది. గత ఐదేళ్లుగా నష్టాలు నానాటికీ పెరుగుతుండడం, సర్కారు నుంచి ఎలాంటి సాయం అందకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్‌ఆర్టీసీ) ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారింది. కాస్త చేయూతనందించి, కష్టాల కడలి నుంచి గట్టెక్కించండి అని పదేపదే విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం కనీసం స్పందించిన పాపానపోలేదని ఆర్టీసీ కార్మికులు మండిపడుతున్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించాలంటే ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులు చాలా ఏళ్లుగా కోరుతున్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సంస్థను కాపాడుకోవాలంటే టిక్కెట్‌ చార్జీలు పెంచడం మినహా మరో గత్యంతరం లేదని ఆర్టీసీ యాజమాన్యం తేల్చిచెబుతోంది. 

సంస్థ ఆస్తులు హాంఫట్‌ 
ఆర్టీసీపై అప్పుల భారం ప్రస్తుతం రూ.6,445 కోట్లకు చేరింది. నష్టాలు ప్రతిఏటా పెరుగుతూ ఇప్పుడు రూ.1,029 కోట్లకు చేరాయి. ఆర్టీసీని ప్రభుత్వం ఆదుకోకపోగా, సంస్థ ఆస్తులను అస్మదీయులకు అప్పనంగా అప్పగించేసింది. బీవోటీ విధానంలో విలువైన ఆస్తులను కారుచౌకగా కట్టబెట్టి ఆర్టీసీ మనుగడను దెబ్బతీసింది. ప్రభుత్వ ప్రచారానికి, అధికార పార్టీ కార్యక్రమాలకు ఆర్టీసీ బస్సులను యథేచ్ఛగా వాడుకున్నారు. పోలవరం యాత్రలకు ఆర్టీసీ బస్సులను తిప్పారు. ఇందుకు గాను ఆర్టీసీకి ప్రభుత్వం రూ.75 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ నిధులు జల వనరుల శాఖ విడుదల చేస్తుందని ప్రభుత్వం చెబుతోంది. అయినా ఇప్పటిదాకా రూపాయి కూడా రాలేదు. ముఖ్యమంత్రి సభలకు, ధర్మపోరాట దీక్షలకు డ్వాక్రా మహిళలను, జనాన్ని తరలించడానికి ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకున్నారు. వాటికి సక్రమంగా బిల్లులు చెల్లించిన దాఖలాలు లేవు. ఫలితంగా ఆర్టీసీ రూ.కోట్లల్లో ఆదాయం కోల్పోయింది. 

ఆర్టీసీ సొమ్ముతో ముఖ్యమంత్రి సోకులు 
ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం ఆర్టీసీకి చెందిన రూ.9 కోట్ల నిధులతో అత్యాధునికమైన బుల్లెట్‌ ప్రూఫ్‌ బస్సును కొనుగోలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన సుబ్బారావు అనే పొగాకు రైతు తమకు గిట్టుబాటు కల్పించడం లేదు గానీ ముఖ్యమంత్రి కోసం బుల్లెట్‌ ప్రూఫ్‌ బస్సులు కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ లేఖ రాసి మరీ ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో సంచలనం సృష్టించింది. 

ఏటా రూ.281 కోట్ల వడ్డీ కట్టాల్సిందే..
ఆర్టీసీపై అప్పుల భారం పెరిగిపోవడంతో రుణాల కోసం బ్యాంక్‌లను ఆశ్రయించక తప్పడం లేదు. బస్టాండ్లను తనఖా పెట్టి మరీ రుణాలు పొందారు. ప్రస్తుతం బ్యాంకు రుణాలు రూ.2,026 కోట్లు ఉండగా, వీటికి వడ్డీ కింద ప్రతిఏటా రూ.281 కోట్లు బ్యాంకులకు చెల్లిస్తున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ‘హడ్కో’ నుంచి పొందిన రుణం రూ.793 కోట్లు ఉంది. సంస్థకు చెందిన క్రెడిట్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీ, ప్రావిడెంట్‌ ఫండ్‌లో కార్మికులు దాచుకున్న రూ.1,232 కోట్లను ఆర్టీసీ వాడుకుంది. కనీసం ఆర్టీసీ కార్మికులకు ఇవ్వాల్సిన యూనిఫాంను మూడేళ్లుగా ఇవ్వడం లేదు. 

ఎంవీ ట్యాక్స్‌ ముక్కు పిండి మరీ వసూలు 
మోటార్‌ వాహన పన్ను(ఎంవీ ట్యాక్స్‌) ఆర్టీసీకి పెనుభారంగా పరిణమించింది. ఎంవీ ట్యాక్స్‌ తగ్గించాలని ఆర్టీసీ యాజమాన్యం పంపిన ప్రతిపాదనలను ప్రతిఏటా ప్రభుత్వం కొట్టిపారేసింది. ఆర్టీసీకి పన్ను మినహాయింపు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఎంవీ ట్యాక్స్‌ గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీ ఆదాయంలో 13 శాతం ఉండేది. ముఖ్యమంత్రిగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత దాన్ని 7 శాతానికి తగ్గించారు. ప్రస్తుతం నష్టాల్లో కూరుకున్న ఆర్టీసీని ఆదుకోవాలంటే ఎంవీ ట్యాక్స్‌ నుంచి పూర్తిగా మినహాయింపు ఇవ్వాలని ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది. 

ప్రభుత్వానికి ఏటా రూ.300 కోట్లు 
ఎంవీ ట్యాక్స్‌ కింద ఆర్టీసీ ఏటా ప్రభుత్వానికి రూ.300 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. ఆర్టీసీకి వచ్చే ఆదాయంలో ప్రతి మూడు నెలలకు 7 శాతం వంతున మోటార్‌ వాహన పన్ను రూపంలో ప్రభుత్వానికి చెల్లించాలి. ప్రతి రోజూ ఆర్టీసీకి సగటున రూ.12 కోట్ల ఆదాయం వస్తోంది. అంటే మూడు నెలలకు రూ.1,080 కోట్లు, ఏడాదికి రూ.4,320 కోట్లు. ఈ ఆదాయంలో రూ.302 కోట్ల వరకు ఎంవీ ట్యాక్స్‌ కింద ప్రభుత్వానికి చెల్లించాలి. 2015–16లో ఎంవీ ట్యాక్స్‌ రూ.280 కోట్లు ఉండగా, 2018–19 నాటికి అది రూ.316 కోట్లకు చేరింది. 

డీజిల్‌ భారం రూ.650 కోట్లు 
డీజిల్‌ ధర 2015–16లో లీటర్‌కు రూ.49 ఉండగా, 2018–19 నాటికి రూ.70.41కి చేరింది. డీజిల్‌ ధరలు పెరిగినప్పుడల్లా ఆర్టీసీపై భారం పెరిగిపోతోంది. డీజిల్‌ భారం ఆర్టీసీపై ఈ ఏడాది రూ.650 కోట్లు ఉంది. ఈ భారాన్ని భరించాలని యాజమాన్యం పలుమార్లు వినతి చేసినా ప్రభుత్వం లెక్కచేయలేదు. డీజిల్‌పై వ్యాట్‌ 17 వాతం వరకు ప్రభుత్వానికి చెల్లించాలి. దీన్ని తగ్గించాలని కోరుతున్నా సర్కారు ససేమిరా అంటోంది. ధనిక వర్గాలు ప్రయాణించే విమాన ఇంధనంపై ప్రభుత్వం కేవలం 1 శాతమే వ్యాట్‌ వసూలు చేస్తోంది. మిగిలిన 16 శాతాన్ని ప్రభుత్వమే భరిస్తుండడం గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement