మహూలో అంబేడ్కర్‌కు నివాళులర్పిస్తున్న కోవింద్
న్యూఢిల్లీ/వడోదర/మహూ (ఎంపీ): దేశంలో నేడు సామరస్యం అవసరం కానీ సంఘర్షణ కాదనీ, ప్రజలు విభజనవాద శక్తులతో జాగ్రత్తగా ఉండాలని రాష్ట్రపతి కోవింద్ సూచించారు. శాంతి, సౌభ్రాతృత్వాలతో ప్రజలంతా శాంతి మార్గంలో జీవించాలన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతి సందర్భంగా కోవింద్ శనివారం మధ్యప్రదేశ్‌లోని అంబేడ్కర్ జన్మస్థలం మహూ కంటోన్మెంట్‌లో నివాళులర్పించారు. ఈ ప్రాంతాన్ని సందర్శించిన తొలి రాష్ట్రపతి కోవిందే.
మరోవైపు అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఐక్యరాజ్య సమితిలోనూ భారత శాశ్వత మిషన్ ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కాగా, అంబేడ్కర్ వారసత్వాన్ని బీజేపీ చెరిపేయాలని చూస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ఓవైపు బీజేపీ, ఆరెస్సెస్‌లు దళిత వ్యతిరేక భావాలతో ఉంటే మరోవైపు మోదీ చిత్తశుద్ధి లేకుండా కేవలం నోటిమాటగా అంబేడ్కర్‌కు నివాళులర్పిస్తున్నారని కాంగ్రెస్ నాయకురాలు సెల్జా విమర్శించారు. రాజ్యాంగాన్ని రాసే మహత్తర బాధ్యతను అంబేడ్కర్‌కు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేననీ ఆమె అన్నారు.
మేనకా గాంధీకి చేదు అనుభవం
గుజరాత్‌లోని వడోదరలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన కేంద్ర మంత్రి మేనకా గాంధీకి చేదు అనుభవం మిగిలింది. బీజేపీ నేతలు అక్కడకు వచ్చి విగ్రహానికి పూలమాలలు వేయడంతో వాతావరణం కలుషితమైందంటూ దళిత నాయకులు అంబేడ్కర్ విగ్రహాన్ని పాలు, నీళ్లతో కడిగారు. మేనక కన్నా మందుగా తాము వచ్చామనీ, విగ్రహానికి పూలమాలలు వేసేందుకు ముందుగా తమనే అనుమతించాలంటూ దళిత నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
Comments
Please login to add a commentAdd a comment