అంబేడ్కర్ను హైజాక్ చేస్తున్నారా..!
న్యూఢిల్లీ: భారత రాజ్యాంగ పిత, నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి రోజున ఆయన ఖ్యాతిని, గొప్పతనాన్ని హైజాక్ చేసి తమ సొంతం చేసుకునేందుకు అధికార ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా కనిపించినట్లు తెలుస్తోంది. ఒకరిపై ఒకరు విపరీతమైన విమర్శలకు దిగుతూనే ఆయనకు నివాళులు అర్పించాయని పలువురు విమర్శిస్తున్నారు. ఇక బీజేపీ అయితే, ఎన్నడూ లేనిది కొత్తగా వాడవాడలా, మూల మూలకు అంబేడ్కర్ జయంతి వేడుకలు నిర్వహించేందుకు పార్టీ శ్రేణులకు ఆదేశించిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఆరెస్సెస్ అంబేద్కర్ నమ్మిన సిద్ధాంతాలను వల్లేవేస్తూ దేశంలో అస్పృశ్యత పోవాలంటే ఒకే గుడి, ఒకే బావి, ఒకే స్మశానం ఉండాలని కార్యక్రమాన్ని గత మార్చిలోనే ప్రారంభించింది.
దీంతోపాటు ఇప్పటికే ఢిల్లీలో ఓ కార్యక్రమం నిర్వహించి అంబేడ్కర్పై ఓ పుస్తకాన్ని విడుదల చేసింది. త్వరలోనే ఆయన జీవితం, కార్యచరణ తదితర ముఖ్యమైన అంశాలపై భారీ స్థాయిలో పుస్తకాలను ముద్రించాలనుకుంటుంది. అంతేకాకుండా, బీజేపీ కీలక నేతలు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ బీహార్లో పెద్ద ర్యాలీలనే నిర్వహించారు. దీంతో త్వరలో జరగనున్న బీహార్ ఎన్నికల్లో దళితుల ఓట్లను పొందేందుకు ఈ అంశాన్ని ప్రచార కార్యక్రమంగా వాడుకుంటున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.