న్యూఢిల్లీ: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై గుజరాత్‌లో జరిగిన దాడి వెనుక బీజేపీ, ఆరెస్సెస్‌ల హస్తం ఉందని కాంగ్రెస్ ఆరోపించింది. పక్కా ప్రణాళిక ప్రకారమే దాడి జరిగిందని మండి పడింది. ‘బీజేపీ, ఆరెస్సెస్ కార్యకర్తలు హత్య చేసే ఉద్దేశంతోనే ప్లాన్ ప్రకారమే రాహుల్‌పై దాడి చేశారు’ అని రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ ఆరోపించారు.
గుజరాత్‌లో విజయ్ రూపానీ నేతృత్వం లోని బీజేపీ ప్రభుత్వం రాహుల్‌కు భద్రత కల్పించడంలో విఫలమైందని విమర్శిం చారు. ప్రజలను కలవడాన్ని, వారి సమస్యలు తెలుసుకోవడాన్ని కాంగ్రెస్ కొనసాగిస్తుందని, తమను ఇలాంటి దాడులు ఆపలేవని స్పష్టం చేశారు. ఇలాంటి దాడి మరోమారు జరిగితే.. దేశ ప్రజలు ఏ మాత్రం సహించబోరని హెచ్చరించారు.