బీజేపీ వర్సెస్ సీపీఎం: రంగంలోకి జైట్లీ
తిరువనంతపురం: ఆరెస్సెస్ కార్యకర్త ఇటీవల హత్యకు గురికావడం కేరళలో రాజకీయ కాక రేపుతోంది. బీజేపీ-ఆరెస్సెస్ కార్యకర్తలపై కేరళలో దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు ఏకంగా సీనియర్ మంత్రిని రంగంలోకి దింపడం గమనార్హం. కేరళలో సీపీఎంను రాజకీయంగా ఢీకొట్టాలని భావిస్తున్న బీజేపీ ఆదివారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని తిరువనంతపురం పంపింది. రాజధాని తిరవనంతపురంలో ఇటీవల దారుణ హత్యకు గురైన ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త కుటుంబాన్ని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఆదివారం పరామర్శించారు.
ఆరెస్సెస్ కార్యకర్త అయిన 34 ఏళ్ల రాజేశ్‌పై గత శుక్రవారం రాత్రి రోడ్డుపై కొందరు వ్యక్తులు దాడి చేసి కొట్టి చంపారు. సీపీఎం కార్యకర్తలే రాజేశ్‌పై దాడి చేసి చంపారంటూ బీజేపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజేశ్ కుటుంబాన్ని పరామర్శించిన జైట్లీ.. కుటుంబసభ్యులను ఓదార్చారు. ఓ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి ఏకంగా కేంద్ర సీనియర్ మంత్రి జైట్లీ రావడం వెనుక కేరళలో అధికారంలో ఉన్న సీపీఎంను దీటుగా ఎదుర్కోవాలనే బీజేపీ వ్యూహం కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.