రోహిత్ వేముల దళితుడే
గుంటూరు కలెక్టర్ ధ్రువీకరణ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో జనవరి 17న ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల దళితుడేనని గుంటూరు కలెక్టర్ కాంతిలాల్ దండే ధ్రువీకరించారు. నేషనల్ కమిషన్‌కు సమర్పించిన నివేదికతో రోహిత్ ఎస్సీ మాల కులస్తుడని పేర్కొన్నారు. దీంతో రోహిత్ బీసీ అనే వాదనకు తెరపడింది. వర్సిటీ యాజమాన్యం కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు రోహిత్ తన సూసైడ్ లేఖలో పేర్కొన్న విషయం తెలిసిందే.
రోహిత్‌తో సహా నలుగురు విద్యార్థుల వెలివేత, అనంతరం రోహిత్ ఆత్మహత్య యావత్ దేశాన్నే కుదిపేసింది. వర్సిటీ వైస్ చాన్స్‌లర్ అప్పారావు, కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, మంత్రి స్మృతి ఇరానీల జోక్యం వల్లే తన కుమారుడు రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డారంటూ అతడి తల్లి రాధిక ఫిర్యాదు చేయడంతో వారిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. అయితే రోహిత్ తండ్రి బీసీ(వడ్డెర) కనుక అతని కులమే రోహిత్ కులమని నమ్మించేందుకు ఏపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించింది.
పిల్లల పెంపకంలో కానీ, వారి విద్యాబుద్ధుల విషయంలోగానీ, చివరకు కుటుంబం గురించి గానీ ఎటువంటి బాధ్యతలు నెరవేర్చని రోహిత్ తండ్రి కులం కాక, రోహిత్ తల్లి రాధిక కులమే రోహిత్‌కి చెందినట్టు ఆధారాలతో సహా నిరూపించడం కేసులో కీలక మలుపుగా భావించొచ్చు. గుంటూరు తహసీల్దారు రిపోర్టు ఆధారంగా రోహిత్ కులాన్ని కలె క్టర్ ధ్రువీకరించారు. ఇది విద్యార్థుల ఐక్యపోరాటాల ఫలితమని, రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిని అరెస్టు చేయాలని హెచ్‌సీయూ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ప్రశాంత్, మున్నా, వెంకటేశ్ చౌహాన్,అర్పిత అన్నారు.