వ్యక్తిగత కారణాలతోనే రోహిత్ వేముల ఆత్మహత్య
హైదరాబాద్ : సంచలనం సృష్టించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో పీహెచ్‌డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యకు వ్యక్తిగత కారణాలేనని అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఏకే రూపన్ వాల్ కమిషన్ తేల్చి చెప్పింది. రోహిత్ వేముల మరణానికి దారితీసిన కారణాలపై దర్యాప్తు చేపట్టేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఈ ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాలు, అసంతృప్తితోనే రోహిత్ బలవన్మరణానికి పాల్పడ్డాడని... క్యాంపస్‌లో జరిగిన పరిణామాలకు అతని మృతికి ఎలాంటి సంబంధం లేదని రూపన్ వాల్ కమిషన్ స్పష్టం చేసింది. సూసైడ్ నోట్‌లో ఈ విషయం ఉందని నివేదికలో పేర్కొంది.
రోహిత్ సూసైడ్ నోట్ ఆధారంగా నివేదిక రూపొందించింది. యూనివర్శిటీ నుంచి బహిష్కరణకు గురవడంతో రోహిత్ ఒత్తిడికి లోనైన మాట వాస్తవమే కావచ్చు కాని... ఆత్మహత్యకు మాత్రం అదొక్కడే కారణం కాదని తెలిపింది. రోహిత్ ఆత్మహత్య వివాదంలో అప్పటి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, సెంట్రల్ వర్సిటీ అధికారులకు ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేసింది. ఈమేరకు జస్టిస్ రూపన్ వాల్ కమిషన్ ఆగస్టు తొలివారంలో యూజీసీకి ఈ నివేదిక సమర్పించింది. కాగా 2016, జనవరి 17న హెచ్‌సీయూ క్యాంపస్‌లోని తన హాస్టల్‌గదిలో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు రూపన్ వాలా కమిటీ నివేదికపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.