ఇక అవమానాలుండవు
బౌద్ధంలోకి మారిన రోహిత్ వేముల తల్లి, సోదరుడు
ముంబై: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న రీసెర్చ్ విద్యార్థి రోహిత్ వేముల తల్లి, సోదరుడు గురువారం బౌద్ధ మతం స్వీకరించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా ఆయన మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ సమక్షంలో ఇక్కడ జరిగిన కార్యక్రమంలో బౌద్ధ బిక్షువులు రోహిత్ తల్లి రాధిక, సోదరుడు నాగ చైతన్య (రాజా వేముల)లకు బౌద్ధ దీక్షను ఇచ్చారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ.. ఒక పక్క గళమెత్తడానికి ప్రయత్నిస్తున్న వారి గొంతుకలు నొక్కడానికి ప్రయత్నిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ.. మరోపక్క అంబేడ్కర్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంటున్నారని విమర్శించారు.
తాము కుల వర్గీకరణతో కూడిన హిందూ మతానికి వ్యతిరేకమని, కుల వ్యవస్థ లేని బౌద్ధంలోకి అందుకే వచ్చామని తెలిపారు. ఈ రోజు నుంచి తమకు అవమానాలు, అగౌరవాలు, దైవపూజా కార్యక్రమాల్లో వివక్ష ఉండదని చెప్పారు. తన సోదరుడు రోహిత్ బతికుంటే, తమ మత మార్పిడి నిర్ణయం పట్ల చాలా సంతోషించేవాడన్నారు. రోహిత్ కూడా బౌద్ధంలోకి మారాలని అనుకున్నాడని, అయితే ఆ పని చేయలేకపోయాడని చెప్పారు. రోహిత్ అక్క మాత్రం మతం మారలేదు. ఈ కార్యక్రమంలో రోహిత్ స్నేహితుడు రియాజ్ షేక్, హెచ్‌సీయూ విద్యార్థి రాజు పాల్గొన్నారు.