Rohith Vemula
-
విద్యార్థుల మరణాలు దురదృష్టకరం: సుప్రీం
న్యూఢిల్లీ: ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీలు), ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెట్(ఐఐఎంల)లో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడటం అత్యంత దురదృష్టకరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇటువంటి ఘటనల నివారణకు బలమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరముందని నొక్కిచెప్పింది. ఐఐటీలు, ఐఐఎంల్లో గడిచిన 14 నెలల్లో 18 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు సీనియర్ లాయర్ ఇందిరా జైసింగ్ తెలపడంతో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్‌ల ధర్మాసనం పైవిధంగా వ్యాఖ్యానించింది. ఈ అంశానికి న్యాయపరమైన ముగింపు ఇస్తామని పేర్కొంది. హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్డీ స్కాలర్ రోహిత్ వేముల 2017లో, మహారాష్ట్రలోని టీఎన్ టోపీవాలా మెడికల్ కాలేజీ విద్యార్థిని పాయల్ తాడ్వి 2019లో బలవన్మరణం చెందారు. తమ విద్యాసంస్థల్లో కులపరమైన వివక్షను భరించలేకే ప్రాణాలు తీసుకున్నారంటూ వీరి తల్లులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇటువంటి ఘటనల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే, కోర్టు ఆదేశాలున్నా విద్యార్థుల ఆత్మహత్యల ఘటనల వివరాలను ఇచ్చేందుకు విద్యాసంస్థలు ససేమిరా అంటున్నాయని లాయర్ జైసింగ్ శుక్రవారం ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. -
రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
సాక్షి, హైదరాబాద్: సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో మళ్లీ విచారణ చేపట్టాలని నిర్ణయించినట్టు డీజీపీ రవిగుప్తా వెల్లడించారు. 2016 జనవరి 17వ తేదీన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి రోహిత్‌వేముల ఆత్మహత్యపై గచ్చిబౌలి పీఎస్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి శుక్రవారం పలు ఎల్రక్టానిక్, సోషల్ మీడియా చానళ్లలో రకరకాల వార్తలు, కథనాలు ప్రస్తారమయ్యాయి. దీనిపై స్పందించిన డీజీపీ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ‘ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా మాదాపూర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉన్నారు. ఈ కేసుకు సంబంధించిన తుది నివేదిక గత సంవత్సరం అంటే నవంబర్ 2023 కన్నా ముందే నిర్వహించిన దర్యాప్తు ఆధారంగా తయారు చేశారు. ఆ తుది నివేదికనే అధికారికంగా 21.03.2024న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సంబంధిత కోర్టులో దాఖలు చేశారు. అయితే విచారణ, విచారణ జరిగిన విధానంపై రోహిత్ వేముల తల్లితోపాటు మరికొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో కేసు విషయంలో మళ్లీ విచారణ చేపట్టాలని నిర్ణయించామని, తదుపరి దర్యాప్తును అనుమతించాలని మేజి్రస్టేట్‌ను అభ్యర్థిస్తూ సంబంధిత కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తాం’అని డీజీపీ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
వేముల రోహిత్ కేసు మూసేస్తున్నాం.. హైకోర్టుకు పోలీసుల రిపోర్ట్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడిన పీహెచ్డీ స్కాలర్ వేముల రోహిత్ కేసుపై తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. రోహిత్ కేసు క్లోజ్ చేస్తున్నట్లు కోర్టుకు పోలీసులు తెలిపారు. వేముల రోహిత్ ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని కోర్టుకు పోలీసులు నివేదిక సమర్పించారు. ఆత్మహత్యకు కారణాలు, ఎవిడెన్స్ లేవన్న పోలీసులు.. వీసీ అప్పారావుకు సంబంధం లేదని తేల్చారు. పోలీసులు రోహిత్ ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కాదని రిపోర్టులో తేల్చారు. కాగా, 2016 జనవరిలో రోహిత్ వేముల ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. రోహిత్ వేముల ఆత్మహత్యపై గతంలో 306 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ సెక్షన్లు సైతం 8 సంవత్సరాల క్రితం పోలీసులు జోడించారు. పోలీసుల తాజా రిపోర్టులో రోహిత్ వేముల ఆత్మహత్యకు వీసీ కారణమని ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. -
‘ఆ తల్లి ప్రకటన చూసి చలించిపోయా’
సాక్షి, న్యూఢిల్లీ : రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలు తప్పుడ వాగ్ధానాలు చేస్తున్నాయని, ఇలాంటి చెత్త రాజకీయాలు చేస్తున్నందుకు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్డీ విద్యార్థి రోహిత్ వేముల తల్లి రాధిక ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌పై పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. రోహిత్ ఆత్మహత్య తరువాత తన కుటుంబానికి ఇంటి నిర్మాణం కోసం ఇరవై లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారని, రెండేళ్ల గడిచిన వారి నుంచి ఎలాంటి స్పందన లేదని ఇటీవల ఆమె తెలిపారు. రాజకీయ లబ్ధికోసమే తనకు తప్పుడు వాగ్ధానాలు చేశారని వాపోయారు. రాధిక వ్యాఖ్యలపై పియూష్ గోయల్ తీవ్రంగా స్పందించారు. ‘రోహిత్ తల్లి రాధిక ప్రకటనను చూసి నేను చలించిపోయాను. రాధికను ప్రతిపక్ష పార్టీలు రాజకీయ బంటుగా వాడుకున్నాయి. ప్రతిపక్ష పార్టీలు ఇలాంటి చిల్లర రాజకీయలు మానుకోవాలి. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా పలు ర్యాలీలో రోహిత్ వేముల కుటుంబానికి పలు హామీలు ఇచ్చారు. ఆ తల్లికి అబద్ధపు ప్రకటను చేసినందుకు రాహుల్ క్షమాపణలు చెప్పాలి. ఇలాంటి చర్యలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తుంద’ని గోయల్ అన్నారు. తనకు ఇంటి నిర్మాణం కోసం ప్రకటించిన ఇరవై లక్షలకు ముస్లిం లీగ్ నుంచి రెండు చెక్కులు వచ్చాయని, అవి రెండు బౌన్స్ అయ్యాయని ఆమె చేసిన ఆరోపణలపై ఐయూఎమ్ఎల్ నేత ఎమ్కే మునీర్ స్పందించారు. ‘రాధిక వేములకు ఇరవైలక్షలు ఆర్థిక సహయం చేస్తామన్నది వాస్తవం. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాం. పొరపాటు వల్ల రెండు చెక్కులు బౌన్స్ అయ్యాయి. ఇదివరకే ఇంటి నిర్మాణ స్థలం కోసం ఐదు లక్షలు చెల్లించామ’ని ముస్లిం లీగ్ నేత మునీర్ పేర్కొన్నారు. -
రాజకీయ లబ్ధి కోసమే వాగ్ధానం: రాధిక వేముల
సాక్షి, హైదరాబాద్ : రాజకీయ లబ్ది కోసమే తనకు ఇరవై లక్షల ఆర్థిక సహాయం చేస్తామని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నాయకులు తప్పుడు వాగ్ధానం చేశారని రోహిత్ వేముల తల్లి రాధిక ఆరోపించారు. దీనిపై రాధిక సోమవారం కొన్ని విషయాలను వెల్లడించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్డీ విద్యార్ధి వేముల రోహిత్ 2016లో యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. రోహిత్ ఆత్మహత్య తరువాత కేరళ నుంచి ముస్లిం లీగ్ తరుపున కొంత మంది నాయకులు వచ్చి రోహిత్‌కు మద్దతుగా కేరళలో భారీ సభను ఏర్పాటు చేస్తున్నామని, ఆ సభకు ముఖ్య అతిధిగా తనను ఆహ్వానించినట్లు ఆమె తెలిపారు. వేముల కుటుంబం ఆర్థికంగా వెనుకబడిందిగా గుర్తించిన ముస్లిం లీగ్ నాయకులు విజయవాడలో ఇంటి నిర్మాణం కోసం ఇరవైలక్షల ఆర్థిక సహాయం చేస్తున్నట్లు ఆ మీటింగ్‌లో ప్రకటించినట్లు ఆమె తెలిపారు. ఇప్పటికి వరకు రెండు చెక్కులు పంపారని అవి రెండు బౌన్స్ అయినట్లు ఆమె వెల్లడించారు. విజయవాడ, గుంటూరు మధ్య ఇంటి నిర్మాణం కోసం స్థలం కూడా చూపించారని అన్నారు. దీనిపై రాధిక తీవ్రంగా మండిపడ్డారు. చెక్కు ఇచ్చే ఉద్దేశం లేకుండా ఇలా తప్పుడు వాగ్దానాలు చేయకుండా ఉండాలని, కేవలం రాజకీయం లబ్ధి కోసమే తనకు ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించారని ఆమె పేర్కొన్నారు. చెక్ బౌన్స్‌పై స్పందించిన ముస్లిం లీగ్ సభ్యులు పొరపాటు వల్ల ఇలా జరిగిందని, ఇచ్చిన మాటకు తాము కట్టుబడి ఉంటామని అన్నారు. -
హెచ్‌సీయూ వీసీ హత్యకు కుట్ర!
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (హెచ్‌సీయూ) వైస్ ఛాన్సులర్ అప్పారావు హత్యకుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఇందుకు సంబంధించి ఇద్దరు హెచ్‌సీయూ విద్యార్థులను తూర్పు గోదావరి జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భద్రాచలం-చర్ల రహదారిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా హెచ్‌సీయూ విద్యార్థులు చందన్ మిశ్రా, పృధ్వీరాజ్ పోలీసులకు చిక్కారు. కాగా 2013లో రోహిత్ వేముల ఆత్మహత్యకు ప్రతీకారంగా వీసీ అప్పారావు హత్యకు వీరు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర చంద్రన్నదళ సెంట్రల్ కమిటీ సభ్యుడు హరిభూషణ్ అలియాస్ యాపా నారాయణ ఆదేశాలతో హత్యకు స్కెచ్ వేసినట్లు పోలీసుల విచారణలో నిందితులు వెల్లడించారు. హెచ్‌సీయూలో ఎంఏ చదువుతున్న చందన్ కుమార్ మిశ్రా కోల్‌కతా వాసి. ఇక అంకల పృధ్వీరాజ్ కృష్ణాజిల్లా కేసరపల్లికు చెందినవాడు. వీరిద్దరికీ హెచ్‌సీయూలో పరిచయం ఉన్నట్లు జిల్లా ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు. వీరిని శనివారం మీడియా ఎదుట హాజరు పరిచారు. మరోవైపు వీరిద్దర్ని వారం క్రితమే పోలీసులు పట్టుకున్నారని విరసం ఆరోపిస్తోంది. వారిద్దరినీ విడుదల చేయాలని విరసం ఇప్పటికే పోస్టర్లు విడుదల చేసింది. ఇక ఈ ఘటనపై హెచ్‌సీయూ వీసీ అప్పారావు స్పందిస్తూ...‘నాకు ఎటువంటి బెదిరింపులు రాలేదు. నన్ను చంపడం కోసం ఎవరు కుట్ర చేశారో కూడా తెలియదు. పోలీసులు కూడా నాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ప్రస్తుతం హెచ్‌సీయూ ప్రశాంతంగా ఉంది.’ అని అన్నారు. -
ఆ పరిహారం వీసీ అప్పారావు సొత్తు కాదు
సాక్షి, హైదరాబాద్ : జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆదేశాలతో తన కుమారుడు రోహిత్ వేముల మృతికి పరిహారంగా సెంట్రల్ వర్సిటీ అందజేసిన రూ.8 లక్షలను తాను స్వీకరించినట్లు రోహిత్ తల్లి రాధిక వేముల మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తమకు పరిహారంగా ఇచ్చిన డబ్బులు సెంట్రల్ యూనివర్సిటీ వీసీ పొదిలి అప్పారావు సొత్తు కాదని అన్నారు. తన కుమారుడి ఆత్మహత్యకు కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టేవరకు ఆందోళన విరమించబోమని తెలిపారు. వీసీ అప్పారావు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ తదితరులపై తాము చేపట్టిన న్యాయపోరాటాన్ని చివరివరకు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. -
రోహిత్ వేముల తల్లికి విజ్ఞప్తి
రాజేంద్ర నగర్ : దళిత యువ నేత, గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని.. రోహిత్ వేముల తల్లి రాధికకు ఓ విజ్ఞప్తి చేశాడు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలంటూ ఆమెను కోరుతున్నాడు. తద్వారా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి గుణపాఠం నేర్పాలని జిగ్నేష్ ఆకాంక్షిస్తున్నాడు . ‘‘దళిత పోరాటంలో మా అందరికీ ప్రేరణగా నిలుస్తున్న రాధికమ్మకు నేను చేస్తున్న విజ్ఞప్తి ఒక్కటే. మీరు 2019 ఎన్నికల్లో పోటీ చేయాలి. తద్వారా పార్లమెంట్లో ‘మను’స్మృతి ఇరానీకి గుణపాఠం నేర్పించాలి’’ అని జిగ్నేష్ ఈ ఉదయం తన ట్విటర్లో ట్వీట్ చేశాడు. దళితులనే లక్ష్యంగా చేసుకుని వ్యవహరించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీరుకు వ్యతిరేకంగా.. ఆమె పేరు ముందు మనుస్మృతిని చేర్చి అప్పట్లో పలువురు నేతలు విమర్శలు గుప్పించారు. I strongly appeal to our inspiration Radhika(amma)Vemula to contest in 2019 elections and teach a lesson to Manusmriti Irani in Parliament. — Jignesh Mevani (@jigneshmevani80) 18 January 2018 రెండు సంవత్సరాల క్రితం హైదరాబాద్ సెంట్రల్‌యూనివర్సిటీలో పీహెచ్డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. రోహిత్ రెండో వర్ధంతి నేపథ్యంలో హైదరాబాద్‌కు వచ్చిన జిగ్నేష్.. రాధికమ్మను కలిసి సంఘీభావం తెలిపాడు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో రాధిక పాల్గొంటారని.. బీజేపీ ఓటమినే తమ అంతిమ లక్ష్యమని జిగ్నేష్ ఈ సందర్భంలో వెల్లడించారు. దళిత ఉద్యమం దేశంలోని ప్రతీమూలా విస్తరించాల్సిన అవసరం ఉందని.. దళిత వ్యతిరేక చర్యలకు మోదీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని జిగ్నేష్ వెల్లడించాడు. -
మా సహనం కోల్పోయిన మరుక్షణం.
-
మా సహనం కోల్పోయిన మరుక్షణం..
గుంటూరు : 'మేము సహనం కోల్పోయిన మరుక్షణం నీ సీటు గల్లంతవుతుంది' అని సీఎం చంద్రబాబు నాయుడును రోహిత్ వేముల తల్లి రాధిక హెచ్చరించారు. దళితులంటే చంద్రబాబుకు చిన్నచూపు అని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ దళితులపై దాడులు జరుగుతున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదన్నారు. ప్రమోషన్ ఇవ్వకుండా వేధిస్తే గుంటూరులో రవికుమార్ అనే ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడని ధ్వజమెత్తారు. పెందుర్తిలో దళిత మహిళను నడిరోడ్డుపై వివస్త్ర చేసి కొట్టారని రాధిక నిప్పులు చెరిగారు. ప్రకాశం జిల్లాలో దళితుల భూములు లాక్కుని వేధించారని రాధిక అన్నారు. తమ సహనాన్ని పరీక్షించొద్దన్నారు. ఎన్నికల సమయంలో మాత్రం తాను దళిత పక్షపాతినంటూ చంద్రబాబు ప్రచారం చేసుకుంటారన్నారు. అధికారంలోకి రాగానే అణచివేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ఇక మీ ఆటలు సాగవని, ప్రజాసంఘాలను కలుపుకొని పోరాటం చేస్తామని తెలిపారు. -
రూపన్ వాలా కమిషన్ నివేదికను తిరస్కరించాలి
ప్రజాసంఘాల డిమాండ్ ► దోషులను కాపాడేందుకు కుటిలయత్నం సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యపై రూపన్‌వాలా కమిషన్ నివేదికను పార్లమెంటు తిరస్కరించాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. దోషులను కాపాడేందుకు బాధితుల వాదనలను వినకుండానే నివేదికను తయారు చేశారని ఆరోపించాయి. కన్సర్న్ సిటిజన్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో ప్రజాసంఘాల తరఫున వక్తలు పాల్గొని ప్రసంగించారు. కమిషన్ నివేదికను తిప్పికొట్టాలని విద్యావేత్త చుక్కా రామయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం పిలుపునిచ్చింది. చుక్కారామయ్య మాట్లాడుతూ వివక్షకు వ్యతిరేకంగానే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. రోహిత్ మరణంపై కమిషన్ నిరాధారంగా నివేదికనిచ్చిందని ప్రభుత్వ మాజీ కార్యదర్శి కాకి మాధవరావు ఆరోపించారు. రెవెన్యూ విభాగం మాత్రమే కులాన్ని ధృవీకరించాలన్న కోర్టు అభిప్రాయాన్ని కమిషన్ ధిక్కరించి రోహిత్ కులాన్ని నిర్ధారించేందుకు ఎక్కువ ప్రయాసపడిందన్నారు. సెంటర్‌ఫర్ దళిత్ స్టడీస్ చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ పార్లమెంటులో రూపన్‌వాలా కమిషన్ నివేదికను అన్ని రాజకీయపార్టీలు తిరస్కరించాలన్నారు. కొత్తగా మరో కమిటీని నియమించి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాజకీయ ఒత్తిడితోనే బహిష్కరణ రోహిత్, ప్రశాంత్ సహా మరో ముగ్గురు విద్యార్థుల బహిష్కరణ నిర్ణయం తీసుకున్న ప్రొక్టోరల్ కమిటీ లెటర్లో ప్రొక్టార్ అలోక్‌పాండ్యా సంతకమే ఉందని, కేవలం రాజకీయ ఒత్తిడితోనే విద్యార్థులపై చర్య తీసుకున్నారని ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ అన్నారు. 2015 ఆగస్టు 12న అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్, ఏబీవీపీకి చెందిన వారిని ఘర్షణ విషయమై హెచ్చరించి వదిలేయాలని మాత్రమే ప్రొక్టోరల్ కమిటీ నిర్ణయించిందని, కానీ ఆగస్టు 31, 2015 కల్లా విద్యార్థుల బహిష్కరణకు ఎలా దారితీసిందో తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. సెప్టెంబర్ 13 నుంచి, నవంబర్ 19 వరకు రెండు నెలల కాలంలోనే కేంద్ర మానవ వనరుల శాఖ వర్సిటీకి ఐదు లేఖలు రాయడం, వాటిలో సుశీల్ కుమార్‌పై దాడికి ప్రయత్నించారని ప్రస్తావించడం, దానికి కారణాలేంటో కూడా తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ డైరెక్టర్ వై.బి.సత్యనారాయణ, ప్రొఫెసర్ కె.వై.రత్నం, ఏఎస్ఏ కన్వీనర్ సన్నంకి మున్నా, సిద్ధోజి, ప్రతీక్, రవి పాల్గొన్నారు. -
దళితులంటే చులకనా!
ఏడు పదుల స్వాతంత్య్ర సంబరాలు దేశవ్యాప్తంగా మంగళవారం అట్టహాసంగా ముగిశాయి. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ మంత్రి ఆదినారాయణ రెడ్డి దళితులను అత్యంత దారుణంగా కించపరుస్తూ మాట్లాడటానికి స్వాతంత్య్ర దినోత్సవం రోజునే ఎంచుకున్నారు. మరోపక్క అర్ధంతరంగా తనువు చాలించిన దళిత విద్యార్థి రోహిత్ వేముల మరణంపై నియమించిన న్యాయ విచారణ కమిషన్ వివాదాస్పద నివేదికను బయ టపెట్టడానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ స్వాతంత్య్ర దినోత్సవం మరుసటి రోజును ముహూర్తంగా ఎంచుకుంది. ఆ నివేదిక రోహిత్ బలవన్మరణానికి ఆయనే తప్ప అన్యులెవరూ బాధ్యులు కారని సెలవిచ్చింది. అంతేకాదు...ఆయన దళితుడు కాడని నిర్ధారించింది. దురహంకారాన్ని ప్రద ర్శించడంలో, ఎవరినైనా ఏమైనా అనడంలో మంత్రి ఆదినారాయణ రెడ్డి ఆరి తేరారు. ‘దళితులు శుభ్రంగా ఉండరు. సక్రమంగా చదువుకోరు. వారు అభివృద్ధి చెందకపోవడానికి వారే కారణం’అంటూ ఒక సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ దురహంకారంలో నుంచి పుట్టుకొచ్చినవే. పైగా ‘అంబేద్కర్ కేవలం పదేళ్లు మాత్రమే రిజర్వేషన్లు కల్పిస్తే 70 ఏళ్లవుతున్నా అవి కొనసాగుతున్నాయ’ నడం ద్వారా తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్నాళ్లక్రితం ఇలాంటి మాటలే మాట్లాడారు. ‘ఎస్సీలలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా?’ అంటూ అందరినీ విస్మయపరిచారు. అధి కారంలో ఉన్నవారు ఏం చేసినా, మాట్లాడినా పర్యవసానాలేమీ ఉండబోవన్న భరోసాయే ఇలాంటి అతివాగుడుకు చోటిస్తోంది. స్వల్ప కారణాలతో సామా న్యులపై విరుచుకుపడే చట్టాలు అధికారంలో ఉన్నవారి ముందు పెంపుడు జంతు వుల్లా ఒదిగిపోతాయి. రోహిత్ వేముల విషాదాంతంపై విచారణ జరిపిన జస్టిస్ రూపన్వాల్ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి రిటైరైనవారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల మేరకు నిరుడు ఫిబ్రవరిలో ఏర్పాటైన ఈ కమిషన్ వాస్తవానికి ఆ ఏడాది ఆగస్టులోనే ఆ శాఖకు నివేదిక సమర్పించింది. ఆ తర్వాత మీడియాలో కమిషన్ నిర్ధారణలంటూ అడపా దడపా వార్తలొచ్చాయి. మొన్న ఫిబ్రవరిలో ఒక పౌరుడు నివేదికను బయటపెట్టాలంటూ సమాచార హక్కు చట్టం కింద కోరితే ఆ శాఖ అందుకు నిరాకరించింది. నివేదిక పరిశీలనలో ఉన్నదని జవాబిచ్చింది. ఏడాది వ్యవధి తర్వాత ఎట్టకేలకు ఇన్నాళ్లకు అది వెలుగు చూసింది. రోహిత్ బలవన్మరణానికి కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయ, కేంద్రీయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ పొదిలె అప్పారావు బాధ్యులు కారని ఆ నివేదిక నిర్ధారించింది. చనిపోవాలనుకున్నది ఆయన ‘సొంత నిర్ణయం’ అని తేల్చింది. అందుకు ఆ యువకుడు వదిలి వెళ్లిన ఉత్తరమే తార్కాణమన్నది. తన చావుకు ఎవరూ బాధ్యులు కారంటూ ఆయన రాసిన వాక్యాలను ఉదహరించింది. రోహిత్ ఆత్మహత్యకు ముందు ఆయన, ఆయనతోపాటు మరో నలుగురు సస్పెన్షన్‌లో ఉన్నారు. దానిపై వారు పోరాడుతున్నారు. దళితులమైనందుకే తమకు అన్యాయం జరుగుతున్నదని ఎలుగెత్తారు. అయినా వర్సిటీ అధికారులు వివక్ష చూపారనడానికి సంబంధించిన ఆధారాలు ఎవరూ ఇవ్వలేదని కమిషన్ అంటున్నది. రూపన్వాల్ కమిషన్‌కు అప్పజెప్పిన విచారణాంశాలు రెండు. అందులో ఒకటి రోహిత్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులేమిటో, అందుకు బాధ్యులెవరో తేల్చడం. రెండోది– విద్యార్థుల ఇబ్బందుల పరిష్కారానికి వర్సిటీ అనుసరిస్తున్న విధానాలను సమీక్షించి అవసరమైన ఉపశమన చర్యలు సూచించడం. ఈ రెండూ కాకుండా రోహిత్ వేముల కులమేమిటో ఆరా తీసే బాధ్యతను కమిషన్ ఎందుకు నెత్తికెత్తుకున్నదో అనూహ్యం. కుల నిర్ధారణతోసహా విచారణాంశాల పరిధిని మించి చేసిన సిఫార్సులను పరిగణనలోకి తీసుకోబోమని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ వర్గాలు చెప్పినట్టు నిరుడు ఆగస్టులో ఒక వార్తా సంస్థ తెలిపింది. కానీ ఇప్పుడా శాఖ అధికారిక వైఖరేమిటో వెల్లడి కాలేదు. కులానికి సంబంధించినంత వరకూ నిర్ధారణ చేయాల్సింది రెవెన్యూ విభాగం. అది పలు సందర్భాల్లో రోహిత్ వేములకు కుల ధ్రువీకరణ పత్రాలు జారీచేసింది. రోహిత్ ఆత్మహత్య ఉదంతం తర్వాత జాతీయ ఎస్సీ కమిషన్ గుంటూరు జిల్లా కలెక్టర్ నుంచి నివేదిక కోరింది. కలెక్టర్ సైతం రోహిత్ వేముల షెడ్యూల్ కులానికి చెందినవాడని అప్పట్లో నిర్ధారించారు. పైగా దాదాపు 20 ఏళ్లక్రితం ఇచ్చిన కీల కమైన తీర్పులో అమ్మ కులం బిడ్డలకు వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రోహిత్ తల్లి రాధికను షెడ్యూల్ కులానికి చెందిన కుటుంబం పెంచుకుంది. వడ్డెర కులానికి వ్యక్తితోనే ఆమెకు వివాహమైనా ఆ దంపతులు అనంతర కాలంలో విడిపోయారు. అటుపై ఆమె దళిత వాడలోనే పిల్లలను పెంచారు. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకోకుండా... తన పరిధిలో లేని అంశంలోకి వెళ్లి రోహిత్‌ను వడ్డెర కులస్తుడని కమిషన్ ఎలా నిర్ధారించిందో అనూహ్యం. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన గుంటూరు జిల్లా యంత్రాంగం జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఒక రకంగా, కమిషన్‌కు మరో విధంగా నివేదిక ఇస్తుందనుకోవడానికి లేదు. లోపం ఎక్కడ జరిగిందో కనీసం కేంద్ర ప్రభుత్వమైనా తెలియజేయడం ధర్మం. న్యాయమూర్తుల నిష్పాక్షికత గురించి చెబుతూ న్యాయం చేయడమే కాదు... చేసినట్టు కనబడాలని తొమ్మిది దశాబ్దాలక్రితం బ్రిటన్ హైకోర్టు న్యాయమూర్తి ఒకరు చెప్పారు. దాన్ని ఈనాటికీ ఎవరూ సరిగా అవగాహన చేసుకోవడంలేదని రూపన్వాల్ నివేదిక గమనిస్తే అర్ధమవుతుంది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఎర్రకోట బురుజులపై నుంచి ప్రసంగించిన ప్రధాని కశ్మీర్ సమస్యకు ఆత్మీయ ఆలింగనమే తప్ప తూటాలో, దూషణలో పరిష్కారం కాదన్నారు. దళితుల విష యంలోనూ ఇలా ప్రత్యేకించి చెబితే తప్ప, కఠినంగా వ్యవహరిస్తే తప్ప ఇప్పుడున్న పరిస్థితులు మారవా? -
వ్యక్తిగత కారణాలతోనే రోహిత్ వేముల ఆత్మహత్య
హైదరాబాద్ : సంచలనం సృష్టించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో పీహెచ్డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యకు వ్యక్తిగత కారణాలేనని అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఏకే రూపన్ వాల్ కమిషన్ తేల్చి చెప్పింది. రోహిత్ వేముల మరణానికి దారితీసిన కారణాలపై దర్యాప్తు చేపట్టేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఈ ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాలు, అసంతృప్తితోనే రోహిత్ బలవన్మరణానికి పాల్పడ్డాడని... క్యాంపస్‌లో జరిగిన పరిణామాలకు అతని మృతికి ఎలాంటి సంబంధం లేదని రూపన్ వాల్ కమిషన్ స్పష్టం చేసింది. సూసైడ్ నోట్లో ఈ విషయం ఉందని నివేదికలో పేర్కొంది. రోహిత్ సూసైడ్ నోట్ ఆధారంగా నివేదిక రూపొందించింది. యూనివర్శిటీ నుంచి బహిష్కరణకు గురవడంతో రోహిత్ ఒత్తిడికి లోనైన మాట వాస్తవమే కావచ్చు కాని... ఆత్మహత్యకు మాత్రం అదొక్కడే కారణం కాదని తెలిపింది. రోహిత్ ఆత్మహత్య వివాదంలో అప్పటి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, సెంట్రల్ వర్సిటీ అధికారులకు ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేసింది. ఈమేరకు జస్టిస్ రూపన్ వాల్ కమిషన్ ఆగస్టు తొలివారంలో యూజీసీకి ఈ నివేదిక సమర్పించింది. కాగా 2016, జనవరి 17న హెచ్‌సీయూ క్యాంపస్‌లోని తన హాస్టల్‌గదిలో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు రూపన్ వాలా కమిటీ నివేదికపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. -
మిస్సైల్ లాంటి కుర్రాడు
► నానో మిస్సైల్ సృష్టికర్త ఒంగోలు యువకుడు ► సక్సెస్ ఫుల్‌గా చెన్నైలో ప్రయోగం ► వరల్డ్ రికార్డ్స్ ఇండియా నుంచి ప్రశంసలు ఒంగోలు: మినీ మిస్సైల్ సృష్టికర్తగా ఒంగోలు కుర్రోడు క్రెడిట్ కొట్టేయనున్నాడా..? అంటే అవుననే సమాధానమే వస్తుంది. కేవలం ఒక సెంటీ మీటరు సైజులో మిస్సైల్‌ను తయారు చేసి లక్ష్యాన్ని చేధించగలిగేలా ఇతను చేసిన పరిశోధన నేడు వరల్డ్ రికార్డ్స్ ఇండియా ఏజెన్సీ ప్రశంసలు అందుకుంది. దీంతో ప్రస్తుతం ఇతని పేరు మార్మోగుతోంది. చిన్నప్పటి నుంచి రాకెట్లపై ఉన్న మోజే ఇతడి మినీ(నానో) మిస్సైల్ పరిశోధనకు కారణమని తెలుస్తోంది. పరిశోధనలపై ఆసక్తి.. ఒంగోలు కమ్మపాలేనికి చెందిన దాచర్ల తిరుమలరావు పెద్ద కుమారుడైన పాండురంగ రోహిత్‌కు బాల్యం నుంచీ ప్రయోగాలంటే ఆసక్తి చూపేవాడు. ఏడో తరగతి నుంచి ఇంటర్ వరకు కృష్ణా జిల్లా ఉయ్యూరులోని విశ్వశాంతి విద్యాసంస్థల్లో చదివిన రోహిత్ ఈ క్రమంలోనే విజయవాడలో జరిగిన ఎయిర్‌ఫోర్సు ప్రదర్శనకు హాజరయ్యాడు. ఈ ప్రదర్శనకు కొందరిని ఫ్లయింగ్ క్యాడెట్లుగా ఎంపిక చేశారు. అందులో రోహిత్‌కు అవకాశం దక్కింది. తాను కూడా పైలెట్‌తోపాటు చేసిన ప్రయాణం ఇతనికి అరుదైన అనుభూతిని కలిగించింది. దీంతో ఎలాగైన నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాలని తలచాడు. ఎయిర్‌ఫోర్సు చాలా ఖర్చుతో కూడుకున్నదంటూ తండ్రి కొంత వెనుకంజ వేశాడు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో చెన్నైలోని ఎస్ఆర్ఎంటీ యూనివర్సిటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్‌లో చేరాడు. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో ఇతనికి కొన్ని ఘటనలు కదిలించాయి. కలచివేసిన దాడి ఘటనలు.. కొన్నేళ్ల క్రితం ముంబైలోని తాజ్‌హోటల్ ఘటన, కాశ్మీర్లో ఉగ్రవాదులు చేస్తున్న దాడులు, చత్తీస్‌ఘడ్‌లో ఘటనలు అన్నీ ఇతనిని తీవ్రంగా కలచివేశాయి. ప్రధానంగా శుత్రుదుర్భేధ్యమైన ప్రాంతాలలో చొరబడడం సైన్యానికి కూడా కష్టమైన పనే. ఒక సంపూర్ణమైన సైనికుడ్ని తయారు చేయాలంటే దేశం లక్షలాది రూపాయలు వెచ్చిస్తుందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుత్రువుల ఒక భవనంలో దాక్కొని చేసే కాల్పులకు సైన్యం ఎంతో కొంత నష్టపోతుంది. ఈ దశలో అతి చిన్న మిస్సైల్‌ను తయారుచేసి దానిని దేశానికి అప్పగించాలనేది ఇతని ఆలోచన. అందులో భాగంగా చిన్నపాటి మెటల్‌ను తీసుకొని అందులో ఎర్ర భాçస్వరాన్ని కూర్చి చేసిన ప్రయోగం సత్ఫలితాన్నిచ్చింది. దీనికోసం వరల్డ్ రికార్డ్స్ ఇండియా అనే ఏజెన్సీకి దరఖాస్తు చేయగా వారు అసిస్టెంట్ కమిషనర్ సమక్షంలో వీడియో తీసి తమకు పంపాలని సూచించారు. అందులో భాగంగా ఇటీవల చెన్నైలోని రామాపురం అసిస్టెంట్ పోలీసు కమిషనర్ సమక్షంలో వీడియో తీసి దానిని ఈ ఏజెన్సీకి పంపారు. వారు దానిని పరిశీలించి సంతృప్తికరం వ్యక్తం చేస్తూ యువకుడ్ని అభినందిస్తూ ఒక ప్రశంసాపత్రాన్ని, మెడల్‌ను ఒంగోలులోని అతని ఇంటికి కొరియర్లో పంపారు. తమ కుమారుడికి లభించిన ఖ్యాతిపట్ల తల్లిదండ్రులు తిరుమలరావు, శ్రీదేవి, సోదరుడు వెంకట కృష్ణ రోహిత్‌లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కలాం స్ఫూర్తితో.. నానో మిస్సైల్తోపాటు ఒక చిన్న సైజు రోబో కూడా సృషించే ప్రయత్నాల్లో ఉన్నాను. భవనాలలో దాక్కొని, శుత్రు దుర్భేధ్యమైన ప్రాంతాల్లో దాడులు చేసే ఉగ్రవాదులను ఏరిపారేసేందుకు ఈ రోబో టెక్నాలజీ సాయంతో దాడులు చేయించాలనేది నా యోచన . మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మాంత్రికుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంను స్ఫూర్తిగా తీసుకొని నేను సృష్టించిన ఈ నానో మిస్సైల్ మరిన్ని గొప్ప ఆవిష్కరణలకు నాందిగా మారుతుందని ఆశిస్తున్నా. – దాచర్ల పాండురంగ రోహిత్ -
రేవంత్, రోహిత్‌లకు ఘనస్వాగతం
గాయకుడు రేవంత్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. తెలుగులో ఎన్నో విజయవంతమైన పాటలు పాడిన రేవంత్ ప్రస్తుతం తన గాత్రాన్ని జాతీయ స్థాయిలో వినిపిస్తున్నాడు. రేవంత్‌తో పాటు మరో యువ గాయకుడు రోహిత్ కూడా ఇండియన్ ఐడల్ వేదిక మీద సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే ఈ కాంపిటీషన్లో ఫైనల్‌కు చేరిన ఈ యువ గాయకులు పోటి మధ్యలో కాస్త కాలీ సమయం దొరకటంతో హైదరాబాద్‌కు వచ్చారు. ఇండియన్ ఐడల్ వేదిక మీద సత్తా చాటిన ఈ ఇద్దరు గాయకులకు ఘనస్వాగతం పలికేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి విద్యార్థులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ప్రస్తుతం నడుస్తున్న ఇండియన్ ఐడల్ సీజన్ 9 ఫైనల్స్ ఏప్రిల్ 2న ప్రసారం కానుంది. -
రోహిత్ ఘటనలో నిజాల సమాధికి కుట్ర
తల్లి రాధికా వేముల ఆరోపణ సాక్షి, బెంగళూరు: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య వెనుక అసలు నిజాలను సమాధి చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలూ కుతంత్రాలకు పాల్పడుతున్నాయని రోహిత్ తల్లి రాధికా వేముల ఆరోపించారు. శనివారం బహుజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బెంగళూరులో నిర్వహించిన బహిరంగ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దళితులను సమాజం నుంచి వేరు చేస్తోందని ఆరోపించారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు నిజంగా దళితుల అభివృద్ధి కోసం పాటుపడుతుంటే రోహిత్ ఆత్మహత్య వెనుక నిజాలను ప్రపంచానికి తెలియజేయాలని డిమాండ్ చేశారు. -
ఆత్మహత్య లేఖ చదివి ఏడ్చాను: వరుణ్
ఇండోర్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల రాసిన ఆత్మహత్య లేఖ చదివి ఏడ్చేశానని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ తెలిపారు. ‘దళిత పరిశోధక విద్యార్థి రోహిత్ గత ఏడాది ఆత్మహత్య చేసుకున్నారు. అతని లేఖ చదివి కన్నీటి పర్యంతమయ్యాను. తన పుట్టుకే ఒక పాపమని, అందుకే ఈ ఆఘాయిత్యానికి ఒడిగడుతున్నానని అతడు రాసిన వాక్యం నా హృదయాన్ని కోతపెట్టింది’ అని అన్నారు. వరుణ్ మంగళవారమిక్కడ ఓ స్కూల్లో ‘నవ భారత్ కోసం ఆలోచనలు’ అంశంపై ప్రసంగించారు. మధ్యప్రదేశ్‌లోని తికమ్‌గఢ్‌లో గత ఏడాది ఓ స్కూల్లో చోటుచేసుకున్న వివక్షను కూడా ఆయన ప్రస్తావించారు. ‘మధ్యాహ్న భోజనాన్ని ఓ దళిత మహిళ వండినందుకు స్కూల్లోని 75 శాతం విద్యార్థులు తినేందుకు నిరాకరించారు. మన పిల్లలకు మనం ఏం నేర్పుతున్నాం? ఈ దేశం, ప్రపంచం ఏ దిశగా వెళ్తున్నాయి?’ అని ఆందోళన వ్యక్తం చేశారు. -
రోహిత్‌ని మరోమారు చంపే యత్నం
⇒ అతడి కుల ధృవీకరణ వెనుక రాజకీయ కుట్ర ⇒ కన్సర్న్డ్ సిటిజన్స్ ఫోరం ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: ఆత్మహత్య చేసుకున్న హెచ్‌సీయూ పరిశోధక విద్యార్థి రోహిత్ వేములను బీసీగా తేల్చి.. అతడిని మరో మారు హత్య చేసే కుట్ర ఢిల్లీ కేంద్రంగా జరుగుతోందని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు అన్నారు. హైదరాబాద్‌లో కన్సర్న్డ్ సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో మల్లేపల్లి లక్ష్మయ్య అధ్యక్షతన శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. రోహిత్‌ని బీసీగా తేల్చడం వర్సిటీల్లో వివక్ష కారణంగా జరుగుతున్న ఆత్మహత్యలను కొనసాగించే దుర్మార్గపు ఆలోచనేనన్నారు. దేశంలో కులాన్ని నిర్థారించే హక్కు జిల్లా రెవెన్యూ అధికారులకు మాత్రమే ఉంటుందన్నారు. రోహిత్ కేసులో నియమించిన రూపన్వాల్ కమిటీ సైతం తనకు సంబంధంలేని విషయంలో జోక్యం చేసుకుని అతడి కులంపై రిపోర్టు నివ్వడం హాస్యాస్పదమన్నారు. రోహిత్ వ్యవహారాన్ని కుల ధృవీకరణ అంశానికి కుదించివేయడం రాజకీయ కుట్రని మల్లేపల్లి అన్నారు. ఏడాది గడిచినా సమస్యను పరిష్కరించకుండా తాత్సారం చేసి, చివరకు కని, పెంచిన తల్లి కులం కాదని నిర్థారించడం దుర్మార్గమని విద్యావేత్త చుక్కా రామయ్య చెప్పారు. కాంప్రహెన్సివ్ బీసీ ఫెడరేషన్ చైర్మన్ ఉ.సాంబశివరావు (ఊసా) మాట్లాడుతూ.. రోహిత్ ఎస్సీ కాదని చెప్పడం ద్వారా అట్రాసిటీ యాక్టు నుంచి తప్పించుకోగలరేమో కానీ, అతడి హత్యానేరం నుంచి కాదన్నారు. జవాబు దారీతనం లేని టీడీపీ ప్రభుత్వం తన బాధ్యతారాహిత్యాన్ని బయటపెట్టుకుం దన్నారు. తమిళనాడులో శశికళ మాదిరిగా జైలుకి వెళ్లక తప్పదని ఏపీ సీఎం చంద్రబాబుని హెచ్చరించారు. దళిత బహుజన్ ఫ్రంట్ శంకర్, ఏపీ అంబేడ్కర్ అసోసియేషన్ కన్వీనర్ ప్రభాకర్, రోహిత్ సోదరుడు రాజా, రవి తదితరులు పాల్గొన్నారు. -
రోహిత్ కులం మార్చే ప్రయత్నాలు ఆపండి
సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణ సాక్షి, హైదరాబాద్: రోహిత్ వేముల కులాన్ని మార్చాలని చేస్తున్న ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వం స్వస్తి పలకాలని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణ డిమాండ్ చేశారు. దీనిపై ఉన్నత న్యాయ స్థానంతో విచా రణ జరిపించాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రోహిత్ దళితుడని గతంలో ఇచ్చిన సర్టిఫికెట్‌ను ఆమోదిస్తే కేంద్ర మంత్రులు స్మృతిఇరానీ, బండారు దత్తాత్రేయ, వీసీ అప్పారావులపై ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకా రం కేసు నమోదు చేయాల్సి వస్తుందన్నారు. ఇదే జరిగితే వారు జైలుకు పోవడం, కేంద్రం సంక్షోభంలో పడటం ఖాయమని.. దాని నుంచి బయటపడేందుకే నీచమైన డ్రామాకు దిగారన్నారు. కాగా, రోహిత్ దళితుడు కాదంటూ ఏపీ ప్రభుత్వం నిర్ధారించడాన్ని వ్యతిరేకిస్తూ గురువారం దిష్టిబొమ్మల దగ్ధం కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు దళిత, గిరిజన, ప్రజా సంఘాలు ప్రకటించాయి. -
15 రోజుల్లోగా రుజువు చేసుకోండి!
⇒ రోహిత్ కులంపై కుటుంబానికి గుంటూరు కలెక్టర్ నోటీసులు ⇒ న్యాయపోరాటం చేస్తున్న రోహిత్ తల్లి రాధిక సాక్షి, హైదరాబాద్: ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల కులంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అతని కుటుంబసభ్యులకు గుంటూరు కలెక్టర్ కాంతిలాల్ దండే మంగళవారం నోటీ సులు జారీ చేశారు. 15 రోజుల్లోగా తమ కులా న్ని రుజువు చేసుకోవాలని రోహిత్ తల్లి రాధిక, సోదరుడు రాజాలను ఆదేశించారు. లేదంటే వారి కుల సర్టిఫికెట్లను రద్దు చేస్తామన్నారు. వివక్ష, అణచివేతకు నిదర్శనం... ఈ నోటీస్‌పై రాధిక, రాజా మండిపడ్డారు. దళిత వాడలో పుట్టి పెరి గిన తమను కులం నిరూ పించుకోవాలంటూ హెచ్చరించడం ప్రభుత్వ వివక్ష, అణచివేత ధోరణికి నిదర్శనమ న్నారు. తమ వాదనలు వినకుండా, కనీసం తమ నివాసం చుట్టుపక్కల ఉన్నవారి అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా తమ కులాన్ని మార్చే అధికారం కలెక్టర్‌కు ఎవరిచ్చారంటూ రాధిక ప్రశ్నించారు. తమ కుటుంబంతో ఎలాంటి సంబంధం లేకుండా ఉన్న మణికుమార్ (రాధిక భర్త), అతని తల్లి రాఘవమ్మల స్టేట్మెంట్ ఆధారంగా కులంపై నిర్ణయం తీసుకున్నట్లు చెప్పడం దారుణమని పేర్కొ న్నారు. చంద్రబాబునాయుడు, బీజేపీతో కలసి సాగిస్తున్న దాడిగా దీన్ని ఆమె అభివర్ణించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసమే... ఇలా ఉండగా, రోహిత్ వేముల, అతని తల్లి రాధిక, సోదరుడు రాజా దళితులు కాదని చెప్పడం ద్వారా ఏపీ సీఎం చంద్రబాబు రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నా రని దళిత మేధావి, సీనియర్ జర్నలిస్టు మల్లేపల్లి లక్ష్మయ్య ఆరోపించారు. నోటీసులు జారీ చేయడం ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని వక్రీకరించడమేనన్నారు. రోహిత్‌కు మద్దతుగా నిలబడి పోరాడిన వాళ్లపైన నైతి కంగా దాడి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకు న్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ప్రభుత్వ దమననీతికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టను న్నట్లు దళిత స్త్రీశక్తి కన్వీనర్ గడ్డం ఝాన్సీ తెలిపారు. రాధికకు నోటీసులు ఇవ్వడం దుర్మార్గమని పేర్కొన్నారు. -
చేయి కాల్చుకోవాలనుకున్నా: రోహిత్ తల్లి
-
చేయి కాల్చుకోవాలనుకున్నా: రోహిత్ తల్లి
గుంటూరు ఎడ్యుకేషన్ : ‘‘ బీజేపీకి ఓటు వేసి గెలిపించి తప్పు చేసినందుకు నా చేతిని మంటల్లో కాల్చుకోవాలనుకున్నా. అధికారం కట్టబెట్టిన దళితులను నిండా మోసగించారు. నా కొడుకు చనిపోయి ఏడాది దాటినా ఇప్పటివరకూ ఏ ఒక్క దోషికి శిక్షపడలేదు. ప్రతిభావంతుడైన నా కొడుకు రోహిత్‌ను మానసికంగా వేధింపులకు గురి చేసి బలవన్మరణానికి ప్రేరేపించిన దోషులు సమాజంలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్నారు. రోహిత్ మృతి కారకులకు శిక్ష పడే వరకూ, దళిత విద్యార్థుల భద్రత కోసం రోహిత్ పేరుతో ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చే వరకూ పోరాటం చేస్తాం’’ ఇవి ఏడాది క్రితం ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ వేముల రోహిత్ తల్లి వేముల రాధిక అన్న మాటలు. వేముల రోహిత్ స్మృత్యర్ధం గుంటూరు నగరంలో మంగళవారం ప్రజా, విద్యార్థి, పౌర, దళిత సంఘాలతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ‘‘ఐ యామ్ రోహిత్’’ పేరుతో ర్యాలీ నిర్వహించారు. ముఖాలకు రోహిత్ చిత్రంతో ఉన్న మాస్క్‌లను ధరించిన ఆయా సంఘాల నాయకులు రోహిత్ మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రదర్శనలో రోహిత్ తల్లి రాధిక, సోదరుడు రాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాధిక ప్రభుత్వాల తీరుపై నిప్పులు చెరిగారు. కొడుకు చనిపోయిన బాధ కంటే అతనిపై వేసిన నిందలు తమను ఎంతగానో బాధిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రామచంద్రరావు లేఖల ఆధారంగా వీసీ అప్పారావు రోహిత్‌ను వర్సిటీ నుంచి బహిష్కరించారని, మానసిక వేదనకు గురైన తన కొడుకు ఆత్మహత్మ చేసుకున్నాడని చెప్పారు. కేసులో అగ్రవర్ణాలకు చెందిన పెద్ద మనుషులు ఉన్నందునే వారిపై కేసులు నమోదు చేయలేదని ఆరోపించారు. బీజేపీకి ఓటు వేసి మోదీని ప్రధానిని చేసినందుకు తమకు తగిన శాస్తి చేశారని మండిపడ్డారు. దళితులపై వేధింపులకు పాల్పడుతున్న వారిని శిక్షించకుండా ప్రేక్షక పాత్ర పోషిస్తున్న మోదీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రోహిత్ చనిపోయింది హైదరాబాద్‌లో అని సీఎం చంద్రబాబు, రోహిత్ ఆంధ్ర విద్యార్ధి అని కేసీఆర్ రాజకీయాలు చేస్తూ కేసు గురించి పట్టించుకోలేదని విమర్శించారు. విచారణ పేరుతో ఆర్డీవో వేధించారు.. రోహిత్ ఎస్సీ అని గుంటూరు జిల్లా కలెక్టర్ ధ్రువీకరించగా దానిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని రాధిక చెప్పారు. కుల విచారణ పేరుతో గుంటూరు జిల్లా రెవెన్యూ అధికారులు తమను తీవ్రంగా వేధింపులకు గురి చేశారని ఆమె ఆరోపించారు. గతేడాది నవంబర్ 2న గురజాల ఆర్డీవో కార్యాలయంలో విచారణ పేరుతో తనను పిలిపించిన ఆర్డీవో మురళి తనతో అసభ్యకరంగా మాట్లాడారని వాపోయారు. భర్తతో కాపురం చేయకుండా వదిలివేసిన దానిని పిల్లలను ఏ విధంగా పెంచుతున్నావంటూ అభ్యంతరకరమైన మాటలతో తనను వేధించారని మీడియా సమక్షంలో ఆవేదన వ్యక్తం చేశారు. తానూ ఆత్మహత్యకు పాల్పడితే కేసు నీరుగారిపోతుందనే భావనతో ఈ విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ కేసులో దోషులకు శిక్షపడి, తమకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని స్పష్టం చేశారు. ప్రదర్శనలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, సీనియర్ న్యాయవాది వైకే, సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్. సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, పీడీఎస్‌యూ, దళిత, ప్రజా సంఘాల నాయకులు, హెచ్‌సీయూ విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. -
వారు దర్జాగా తిరుగుతున్నారు
రోహిత్ వేముల తల్లి రాధిక ఆవేదన విజయవాడ: కుమారుడిని పోగొట్టుకొని తాను కుమిలిపోతుంటే, తన బిడ్డ చావుకు కారణమైన వారు మాత్రం దర్జాగా తిరుగుతున్నారని రోహి త్ వేముల తల్లి రాధిక ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ప్రభుత్వాలు ఏమని సమాధానం చెబుతాయని ప్రశ్నించా రు. గవర్నర్‌పేట మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో 5వ ఆలిండియా మహిళా సదస్సు ప్రారంభమైంది. కార్యక్రమానికి ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు అధ్యక్షత వహించగా..రాధిక వేముల, ఢిల్లీ జేఎన్‌యూ ఉపా«ధ్యక్షురాలు దీప్సి తాదర్, కార్యదర్శి శత్రుభ, మహిళా సెల్ కన్వీనర్ ఉమారాణి తదితరులు ప్రసంగించారు. దళితులకు, మహిళలకు ప్రత్యేక చట్టాలు ఉన్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యంతో వారిపై దాడులు జరుగుతున్నాయని రాధిక వేముల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ ఐ ఆలిండియా అధ్యక్ష కార్యదర్శులు వీపీ సాను, విక్రంసింగ్, త్రిపుర మహిళా కన్వీనర్ సౌదా, ఏపీ మహిళా కన్వీనర్ చిన్నారి, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నూర్‌మహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
హెచ్‌సీయూ గరం గరం
-
విద్యార్థులపై ఒక్క దెబ్బపడినా
నిరాహార దీక్ష చేస్తా సాక్షి, సిటీబ్యూరో: రోహిత్ స్థూపాన్ని సైతం జైల్లో బంధించినట్టు బంధించి, నా కొడుకుకి నేను నివాళ్లర్పించకుండా అడ్డుకోవడం ఇదెక్కడి న్యాయం అని రోహిత్ తల్లి రాధిక సూటిగా ప్రశ్నించారు. సెంట్రల్ యూనివర్సిటీలోకి ఎవరినీ అనుమతించకుండా, ఓ వైపు పోలీసులు, మరోవైపు ఫైరింజన్లు పెట్టి ఇక్కడేదో పెద్ద గొడవ జరగబోతున్నట్టు పోలీసులు చిత్రీకరిస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో రోహిత్ వర్ధంతి సభను కులనిర్మూలనా దినంగా ప్రకటిస్తూ కులనిర్మూలనా పోరాట సమితి నిర్వహించిన జాతీయ సదస్సులో ఆమె మాట్లాడారు. ఇంత నిర్బంధం మధ్య హెచ్‌సీయూ విద్యార్థులు సమానత్వం కోసం పోరాడుతున్నారు. వారికి అండగా నేను అక్కడికే వెళ్తున్నాను. ఏ విద్యార్థిపైనైనా ఒక్క లాఠీ దెబ్బ పడినా నేను నిరాహార దీక్ష చేస్తాను అని రాధిక హెచ్చరించారు. ‘నా కొడుకు రోహిత్ విగ్రహానికి దండ వేసి, నివాళులర్పించే వరకు నాకు అండగా ఉండాలని’ ఆమె కోరారు. చాలా మాట్లాడాలని ఉందని, ఈ ఒత్తిడితో మాట్లాడలేకపోతున్నానని, అనారోగ్యం ఉన్నా విద్యార్థులకు, పోరాటాలకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలియజేయడానికే ఇక్కడికి వచ్చానని రాధిక అన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ కెవై రత్నం, ప్రొఫెసర్ లక్ష్మినారాయణ, ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత. ప్రొఫెసర్ విజయ్, సతీష్, బిజూ మాచ్యూస్ తదితరులు మాట్లాడారు. దుఃఖానికి సైతం ఆంక్షలా: శేషు అంబేడ్కర్ భావజాలం పునాదిగా సమసమాజాన్ని కోరుకున్న రోహిత్ అనంతర ఉద్యమం చారిత్రాత్మకమైందన్నారు. రోహిత్ తల్లి రాధికమ్మ కొడుకు మరణంలోని దుఃఖాన్ని సైతం ప్రకటించుకునే స్వేచ్ఛ ఈ దేశంలో లేదని అన్నారు. దుఃఖానికి సైతం ఆంక్షలు విధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రోహిత్ దోషులను శిక్షించాలని యావత్ సమాజం కోరకుంటుంటే.. దోషులకు అవార్డులు ప్రకటించి గౌరవిస్తున్నారని, సైన్స్ జీనియస్‌గా కితాబులిస్తున్నారని, పరిశోధనా వ్యాసాలు కాపీ కొట్టిన వ్యక్తికి, ఓ హంతకుడికి అవార్డులా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. -
హెచ్‌సీయూ గరం గరం
► రోహిత్ వేముల వర్ధంతి సందర్భంగా వర్సిటీలో ఉద్రిక్తత ► హెచ్‌సీయూలోకి వెళ్లేందుకు విద్యార్థులు, పలు సంస్థల నాయకుల యత్నం ► అడ్డుకున్న పోలీసులు.. రోహిత్ తల్లి రాధికకూ అనుమతి నిరాకరణ ► ఆగ్రహంతో విద్యార్థుల ధర్నా.. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు ► తాళం పగలగొట్టి లోనికి... అరెస్టు చేసిన పోలీసులు ► విషయాన్ని పక్కదారి పట్టించేందుకే కుల నిర్ధారణ: రాధిక సాక్షి, హైదరాబాద్ రోహిత్ వేముల ప్రథమ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) వద్ద మంగళవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. క్యాంపస్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి బయటి వ్యక్తులను అనుమతించకపోవడంతో విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగాయి. ప్రధాన గేటు వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశాయి. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బలగాల మోహరింపు.. తనిఖీలు వర్సిటీలో వివక్ష ఎదురవుతోందంటూ ఏడాది కింద రోహిత్ వేముల అనే పరిశోధక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఏడాది కింద ఈ ఘటన ఎంతో సంచలనం సృష్టించింది. మంగళవారం హెచ్‌సీయూలో రోహిత్ వేముల ప్రథమ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో వర్సిటీ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. ప్రధాన ద్వారం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి.. ఐడీ కార్డులు చూపించిన విద్యార్థులను, వర్సిటీ సిబ్బందిని మాత్రమే లోపలికి అనుమతించారు. రోహిత్ తల్లి రాధిక సహా ఎవరినీ లోపలికి పంపించలేదు. దీంతో పలు పార్టీలు, సంస్థలు, విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, హెచ్‌సీయూ వీసీ అప్పారావు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. కొందరు విద్యార్థులు గేటు తాళాన్ని పగలగొట్టి రాధికను, మరికొందరిని లోనికి తీసుకువచ్చారు. గేటు వద్దే రోహిత్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం రోహిత్ స్తూపానికి పూలమాల వేసేందుకు క్యాంపస్ లోనికి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. చివరికి రాధికతోపాటు ఏపీ ఏఎస్ఎ కన్వీనర్ గుమ్మడి ప్రభాకర్, సుధీప్తో మండల్ (హిందుస్థాన్ టైమ్స్), విజయ్ పెదపూడి, ప్రమీల, కావ్య, రియాజ్, రాజా వేముల తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. అంతకుముందే విద్యార్థి క్రిశాంక్ సహా 18 మందిని అరెస్టు చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అప్పారావును అరెస్టు చేయాల్సిందే.. రోహిత్ ఆత్మహత్యకు పాల్పడి ఏడాది గడిచినా ఇప్పటి వరకు న్యాయం జరగలేదని హెచ్‌సీయూ జేఏసీ కన్వీనర్ వెంకటేష్ చౌహాన్ పేర్కొన్నారు. రోహిత్ చట్టం తీసుకొచ్చే వరకు పోరాటం చేస్తామని... కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయ, అప్పారావులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇక రోహిత్ వర్ధంతి కార్యక్రమానికి వెళ్లేవారిని అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని రిటైర్డ్ ప్రొఫెసర్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు పీఎల్ విశ్వేశ్వర్రావు పేర్కొన్నారు. విలేకరిపై కేసు నమోదు హెచ్‌సీయూ క్యాంపస్‌లోకి బయటి వ్యక్తులు వెళ్లవద్దన్న హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ.. క్యాంపస్‌లో సంచరించిన ఫ్రంట్‌లైన్ స్పెషల్ కరస్పాండెంట్ కునాల్æ శంకర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. హెచ్‌సీయూ భద్రతా సిబ్బంది ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొన్నారు. దేశంలో దళితులకు రక్షణ కరువైంది ‘‘నేను దళితురాలినైనా నా కుమారుడిని బీసీగా ఎలా ప్రకటిస్తారు? అధికారులు నా బిడ్డ కులం విచారణకని పిలిచి నా నైతికతకు భంగం కలిగించేలా మాట్లాడారు. నన్ను, నా వ్యక్తిగత జీవితాన్ని అగౌరవపరిచారు. నా ప్రవర్తనను తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు..’’అని రోహిత్ తల్లి రాధిక మండిపడ్డారు. రోహిత్ వర్ధంతి కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. తన బిడ్డ కలెక్టరై కార్లలో తిరుగుతాడని కష్టపడి చదివించానని... కానీ వర్సిటీ వీసీ అప్పారావు తన బిడ్డను చంపేశాడని ఆరోపించారు. ఉద్యమానికి కారణం అప్పారావు అయితే ఆయనను వదిలిపెట్టి తన బిడ్డ కులాన్ని ధ్రువీకరించే పనిపెట్టుకున్నారని మండిపడ్డారు. విషయాన్ని పక్కదారి పట్టించేందుకే ఈ పని చేశారని ఆరోపించారు. రోహిత్ తల్లి రాధికను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పోలీసులు ఏపీ సర్కారు అవమానించింది.. గుంటూరులో విచారణకని పిలిచి తనను, తన పిల్లలను ఏపీ ప్రభుత్వం అవమానించిందని రాధిక ఆరోపించారు. ‘‘నీ బిడ్డని నువ్వే పెంచావా? నీకు డబ్బెక్కడిది? ఎవరిచ్చారు అంటూ ఆర్డీవో అవమానించారు. అనేకసార్లు మమ్మల్ని బెదిరించారు. మాకు ఎక్కడికెళ్లినా భద్రత లేదు. చివరికి గుజరాత్‌లోని ఉనాకు వెళ్లినా మాకు ఆశ్రయమిచ్చిన వారు భయపడ్డారు..’’అని చెప్పారు. తన కుమారుడి ఆత్మహత్య వెనుక బీజేపీ మంత్రులున్నారు కనుకనే తన కులంపై చర్చ జరుగుతోందన్నారు. తాము దొంగలం, గూండాలం, తీవ్రవాదులం, ఉగ్రవాదులం కాదని... ఇలాగే విద్యార్థులపై నిర్బంధాన్ని కొనసాగిస్తే దళితులంతా ఏకమై పాలకులకు బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. కాగా వైవా పేరుతో దళితులకు మార్కుల్లో కోతవేస్తే ప్రశ్నించినందుకు తమను రస్టికేట్ చేశారని.. ఇప్పటికీ అది కొనసాగుతోందని రోహిత్‌తోపాటు సస్పెండైన విద్యార్థి రాహుల్ చెప్పారు. గుజరాత్లో ఊచకోత కోస్తున్నారు గుజరాత్‌లోని ఉనాలో జరిగిన ఘటనలో దళిత బాధితులు పీయూష్ సర్వయ్య, రమేష్ సర్వయ్య, జీతూ సర్వయ్య తదితరులు రోహిత్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. గుజరాత్లో దళితులను రక్తపుటేరుల్లో ముంచుతున్నారని, అయినా రోహిత్ లాంటి ఉద్యమాలు తమకు కొత్త ఊపిరి పోస్తున్నాయని వారు చెప్పారు. ఎన్ని అడ్డంకులైనా ఎదురిస్తామని, దళితుల ఆత్మగౌరవం కోసం జరిగే పోరాటాలన్నింటికీ మద్దతిస్తామని పేర్కొన్నారు. దాద్రీ ఘటనలో మరణించిన అఖ్లాక్ సోదరుడు జాన్ మహ్మద్ మాట్లాడుతూ... తమ ఇంట్లో ఆవు మాంసం దొరికిందన్న నెపంతో తన అన్నను చంపారని, అదేమీ లేదని తరువాత తేలిందని చెప్పారు. దళితులపై అత్యాచారాలు, అవమానాలు, అసమానతలు పోయే వరకు తమ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. -
రోహిత్ వర్థంతి: హెచ్‌సీయూలో ఉద్రిక్తత
-
రోహిత్ వర్థంతి: హెచ్‌సీయూలో ఉద్రిక్తత
హైదరాబాద్: సరిగ్గా ఏడాది కిందట.. రీసెర్చ్ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యతో అట్టుడికిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మళ్లీ ఇవ్వాళ అలాంటి వాతావరణమే నెలకొంది. మంగళవారం రోహిత్ వర్ధంతి సందర్భంగా వర్సిటీ క్యాంపస్‌లో భారీ సంస్మరణ సభను నిర్వహించాలనుకున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. ముందుగా ప్రకటించినట్లే వర్సిటీ క్యాంపస్‌లో రోహిత్ వర్ధంతి సభను జరిపితీరుతామని విధ్యార్థులు భీష్మించారు. సభలో పాల్గొనేందుకు దేశంలోని పలు యూనివర్సిటీల నుంచి విద్యార్థులు, ప్రొఫెసర్లు, పలు ప్రజా సంఘాల నాయకులు హెచ్సీయూకు తరలివచ్చారు. కానీ సభకు అనుమతిలేని కారణంగా పోలీసలు వారిని అడ్డుకున్నారు. ఒకదశలో ఇరుపక్షాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగిన విద్యార్థులు.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
వారిపై చర్యలు తీసుకోవాలి
రోహిత్ ఆత్మహత్యకు కారకులపై చాడ సాక్షి, హైదరాబాద్: దళిత రీసెర్చ్ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యకు కారకులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన జరిగి ఏడాది గడిచినా, అందుకు కారకులైన వీసీ అప్పారావు, కేంద్ర మంత్రులు, స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రామచంద్రరావులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని సోమవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. నిందితులలో ఏ ఒక్కరిని అరెస్ట్ చేయకపోగా, రోహిత్ దళితుడే కాదంటూ కేసును నీరుగార్చే కుట్ర జరుగుతోందన్నారు. -
'రోహిత్ కేసులో వీసీపై చర్యలేవీ'
హైదరాబాద్ : సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్డీ స్కాలర్ వేముల రోహిత్‌ది బీసీనా, ఎస్సీనా అని ప్రభుత్వాధికారులు అనడం సిగ్గుచేటని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో రోహిత్ సంస్మరణ సభ సోమవారం జరిగింది. ఈ సభకు జేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరామ్, గుండా మల్లేష్ పాటు పలువురు నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ వైస్ చాన్సలర్ అప్పారావుపై చర్యలు తీసుకుంటామన్న కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. రోహిత్ మరణించి ఏడాది అయిన దీనిపై ప్రధాని మోదీ స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రధాని ఫాసిస్ట్ ధోరణితో వ్యవహరించారని ఆరోపించారు. రోహిత్‌ది ఆత్మహత్య కాదు సంస్థాగత హత్యని కోదండరామ్ అన్నారు. రోహిత్ మరణానికి కులవివక్షే కారణమన్నారు. భవిష్యత్‌లో యూనివర్శిటీల్లో కులవివక్షతను నిర్మూలించాలంటే రోహిత్ చట్టాన్ని అమలు చేయాలని కోదండ రామ్ డిమాండ్ చేశారు. -
అరెస్టు చేయాల్సిన వ్యక్తికి అవార్డా మోదీ?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అప్పారావుకి ప్రధాని నరేంద్రమోదీ అవార్డు ఇచ్చి సత్కరించడాన్ని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రంగా తప్పుబట్టారు. రీసెర్చ్ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యకు కారకుడైనట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అరెస్టు చేసి శిక్షించాల్సిందిపోయి, అతడికి అవార్డులిచ్చి ఎలా సత్కరిస్తారని ఆయన తన ఫేస్బుక్ పోస్టులో ప్రశ్నించారు. ‘రోహిత్ వేముల భారతమాత బిడ్డ' అని ఆయన ఆత్మహత్యానంతరం పేర్కొన్న ప్రధాని మోదీ.. ఇప్పుడు రోహిత్ మరణానికి కారణమైన వీసీ అప్పారావును తిరుపతిలో జరిగిన సైన్స్ కాంగ్రెస్‌లో సత్కరించారని లాలూ ఆక్షేపించారు. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ విద్యార్థులు కూడా వీసీ అప్పారావుకి అవార్డునివ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఎదుర్కొంటున్న వీసీ అప్పారావుకి చంద్రబాబు దగ్గరుండి ప్రధాని మోదీ చేత అవార్డునిప్పించారని విద్యార్థులు ఆరోపించారు. ఈ వీసీ కారణంగానే రోహిత్ వివక్ష, వెలివేత ఎదుర్కొన్నారని ఆయనతోపాటు రస్టికేట్ అయిన అంబేడ్కర్ స్టుడెంట్స్ అసోసియేషన్ నాయకుడు దొంత ప్రశాంత్, విజయ్, శేషు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అప్పారావుకి అవార్డు ఇవ్వడం విద్యార్థి ఉద్యమాన్ని అణచివేయడంలో భాగమేనని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పవన్ కల్యాణ్ - అయిదు ప్రశ్నలు
హైదరాబాద్: జనసేన అధినేత, టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ మరోసారి ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రశ్నించేందుకే నేను ఉన్నానని తరచూ చెప్పుకునే పవర్ స్టార్ తాజాగా ట్విట్టర్ లో్ బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించారు. తన ట్విట్టర్ ద్వారా బీజేపీ ముందు ఐదు ప్రశ్నలు అడగదల్చుకున్నట్టు గురువారం వెల్లడించారు. సీనియర్ రాజకీయ నాయకులు, ప్రముఖ జర్నలిస్టులు, మేధావులు, ఇంకా వివిధ వర్గాల ప్రజలనుంచి ఈ కీలక సమాచారాన్ని సేకరించినట్టు చెప్పారు. ముఖ్యంగా బీజేపీని నమ్మి ఓట్లేసిన వారిని నుంచి సేకరించానని పేర్కొన్నారు. బీజేపీ-టీడీపీ కూటమికి ఏపీ, తెలంగాణా, కర్ణాటకలో జనసేన మద్దుతిచ్చిందని గుర్తు చేసిన పవన్ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని తాను అయిదు ప్రశ్నలు అడగనున్నట్టు పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలకు కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోనే సపోర్ట్ చేయలేదని కర్ణాటకలో కూడా వారి తరఫున ప్రచారం చేశానన్నారు. అందుకే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తాను అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం చెప్పాలని కోరారు. గోవధ నిషేధంపై బీజేపీకి చిత్త శుద్ధి ఉంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గోవధపై నిషేధం విధించవచ్చు కదా? అని ప్రశ్నించారు. బీజేపీకి ఈ అంశం నిజాయతీగా ఉంటే లెదర్ తో తయారు చేసిన పాదరక్షలు, బెల్టులను వాడకూడదని తమ కార్యకర్తలకు సూచించాలని అన్నారు. గోవులను రక్షించాలంటే ప్రతీ బీజేపీ కార్యకర్త ఒక్కో ఆవుని పెంచుకోవాలని సూచించారు. విభజన రాజకీయాల ద్వారా గోమాంసం తినే ప్రజల్లో భయాందోళలను సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. గోవులను పూజించే ప్రజల్లో సెంటిమెంట్ రెచ్చగొడుతోందని పవన్ వ్యాఖ్యానించారు. గోవధ, వేముల రోహిత్ ఆత్మహత్య, దేశభక్తి, పెద్దనోట్ల రద్దు, ఏపీకి ప్రత్యేక హోదాల అంశాలపై తన ట్విట్టర్ ద్వారా వరుసగా ప్రశ్నించనున్న అంశాలని తెలిపారు. ఈ క్రమంలో రోహిత్ వేముల ఆత్మహత్యపై రేపు ప్రశ్నిస్తానంటూ ట్వీట్ చేశారు. pic.twitter.com/f63aZBvMeT — Pawan Kalyan (@PawanKalyan) December 15, 2016 -
ఆ తప్పుడు కేసులను ఎత్తివేయాలి
- రోహిత్ కేసులో పోలీసుల తాత్సారంపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి - ఎస్సీ, ఎస్టీ టీచర్స్ ఫోరం రౌండ్‌టేబుల్ సదస్సు డిమాండ్ సాక్షి, హైదరాబాద్: దళిత పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసుకు సంబంధించి చెలరేగిన ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు, అధ్యాపకులపై తప్పుడు కేసులు నమోదు చేశారని.. వాటన్నింటినీ ఎత్తివేయాలని హెచ్‌సీయూ ఎస్సీ, ఎస్టీ టీచర్స్ ఫోరం రౌండ్‌టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. ఫోరం ఆధ్వర్యంలో ప్రొఫెసర్ కృష్ణ అధ్యక్షతన సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఈ రౌండ్‌టేబుల్ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. హెచ్‌సీయూలో వీసీ అప్పారావు నిరంకుశత్వంపై ఇకనైనా ప్రభుత్వం చొరవ చూపాలని, రోహిత్ దళితుడేనని నేషనల్ ఎస్సీ కమిషన్, గుంటూరు తహసీల్దారు, గుంటూరు జిల్లా కలెక్టర్ తేల్చి చెప్పిన తరువాతైనా పోలీసులు నిర్లక్ష్యాన్ని వీడేలా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా వీసీని రీకాల్ చేస్తానని ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు అది అమలుకు నోచుకోకపోవడం బాధాకరమన్నారు. కాకి మాధవరావు మాట్లాడుతూ ఎ.కె.రూపన్వాల్ని న్యాయమూర్తిగా సంబోధించలేనని, ఆయనకు న్యాయపరిజ్ఞానం లేకపోగా, కనీసం మానవత్వం కూడా లేదని ఆరోపించారు. విద్యార్థులకు అండగా ఉంటాం తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం మాట్లాడుతూ స్వేచ్ఛాయుతమైన వాతావరణం ఉండాల్సిన యూనివర్సిటీలను పోలీసు క్యాంపులుగా మార్చడంవల్ల ఇప్పుడిప్పుడే యూనివర్సిటీలోకి అడుగుపెడుతున్న తొలితరం దళిత, బీసీ విద్యార్థులు భీతిల్లి పోతున్నారన్నారు. విద్యార్థుల న్యాయమైన పోరాటానికి జేఏసీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రొఫెసర్ కంచ ఐలయ్య విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు. అప్పారావు వీసీగా కొనసాగడం దేశానికే అవమానమని ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్య అన్నారు. ఈ వివక్షపై విశాల ఐక్య ఉద్యమాన్ని నిర్మించాలని ప్రొఫెసర్ రమా మెల్కోటే అన్నారు. సమావేశంలో సీనియర్ జర్నలిస్ట్ మల్లేపల్లి లక్ష్మయ్య, ప్రొ. డి నరసింహరెడ్డి మాట్లాడుతూ అన్యాయం జరుగుతోంటే ప్రేక్షకపాత్ర వహించడం తగదని మేధావులకు హితవు పలికారు. -
హెచ్‌సీయూ అక్రమ కేసులు ఎత్తేయాలి
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, రోహిత్ వేముల కేసులో పోలీసుల నిర్లక్ష్య వైఖరికి సంబంధించి చర్యలు తీసుకోవాలని తెలంగాణలోని ప్రజాస్వామిక వాదులు, మేధావులు తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 'హెచ్‌సీయూ కుల వివక్షకు, కుల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడుతూ ఒక కేంద్ర బిందువుగా మారిందని అందరికీ తెలుసు. అయితే దురదృష్టవశాత్తూ ఇటీవల కాలంలో ఈ వర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో హెచ్‌సీయూలో స్వేచ్ఛాయుత, ప్రజాస్వామిక, అకాడమిక్ వాతావరణాన్ని నెలకొల్పాలి' అని ఓ ప్రతికా ప్రకటనలో ప్రొఫెసర్ జి.హరగోపాల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అనేక మంది విద్యార్థులపైనా, అధ్యాపకులపైనా తప్పుడు కేసులు నమోదయ్యాయి. ఈ అక్రమ కేసులున్న విద్యార్థులందరూ దళిత, మైనారిటీ, సామాజికంగా వెనకబడిన కుటుంబాల నుంచి వచ్చిన వారే. ఈ కుటుంబాలకు ఈ విద్యార్థుల ఉపాధి, ఆదాయాలే జీవనాధారంగా ఉన్నాయి. కనుక విద్యార్థులు, అధ్యాపకుల మీద ఉన్న కేసులను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ కొందరు మేధావులు సంతకాల సేకరణ చేశారు. జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ రోహిత్ వేముల దళితుడేనని, మాల కులానికి చెందినవాడనీ, కలెక్టర్ ఇచ్చిన నివేదికల మీద ఆధారపడి నిర్ధారించింది. అంతే కాకుండా పోలీసులు ఈ కేసు విచారణను వేగవంతం చేయాలని ఆదేశించింది. అయినా ఇంతవరకూ ఆ విచారణ ముందుకు సాగలేదు. కావున తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని గౌరవించి, తన రాజ్యాంగ బద్ధమైన బాధ్యతను నిర్వర్తించి న్యాయం చేయాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. విశ్వవిద్యాలయం సమాజంలో జరుగుతున్న మార్పులను ప్రజాస్వామిక పోరాటాలను విశ్లేశించి మద్ధతునిస్తుంది. కానీ రోహిత్ వేముల సంస్థాగత హత్య తర్వాత యూనివర్సిటీలో నిరంకుశమైన సర్క్యూలర్ ద్వారా సభలు, సమావేశాలు జరగకుండా చూస్తున్నారు. బహుశా దేశంలోనే మీడియాను, ప్రజా ప్రతినిధులను కూడా లోపలికి అనుమతించని వర్సిటీగా హెచ్‌సీయూ తయారైందంటే పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకుని వర్సిటీలో స్వేచ్ఛాయుత, వివక్షా రహిత, ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పడానికి కృషి చేయాలని కోరారు. -
ప్రజాస్వామిక సంస్కృతిని కాపాడుకుందాం!
రెండేళ్ల క్రితం ఎన్నికలు జరిగి కేంద్రంలో, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడినపుడు ఏదైతే జరుగుతుందని ఊహించామో, భయపడ్డామో, ఆందోళన చెందామో ఇప్పుడు అదే జరుగుతోంది. ప్రజాస్వామ్య సంస్కృతి, విలువలపట్ల ప్రభుత్వాలకు, వాటి అండ గల శక్తుల్లో అసహనం తారస్థాయికి చేరింది. భిన్నాభిప్రాయాలు కలిగిన వారిపై వారు చేస్తున్న బౌద్ధిక, భౌతిక దాడులకు లెక్కే లేదు. యూనివర్సిటీల నుంచి ఉడీ దాకా ‘దేశభక్తి’ పేరిట తమను వ్యతిరేకించిన అందరినీ దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. గోర క్షణ నెపంతో రాజకీయాలు నడుపుతున్నారు. మతం, జాతీయత, దేశభక్తి పదాలతో వారు ప్రజలను మానసికంగా బ్లాక్మెయిల్ చేస్తున్నందువల్ల సరిహద్దుల్లోనే కాదు దేశంలోనూ యుద్ధోన్మాద విద్వేష ప్రచారం నాట్యం చేస్తోంది. మనం ఆందోళన చెందవల సింది ప్రజాస్వామ్య విలువలకు ఎదురవుతున్న ప్రమాదాన్నే. ఈ ప్రయత్నాలు జరగడం లేదని కాదు. అన్యాయమైన ఆరో పణలు ఎదుర్కొని రోహిత్ వేముల మరణించినప్పుడు హైదరా బాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పెల్లుబికిన విద్యార్థి ఆందోళన అలాంటి ప్రయత్నాల్లో ఒకటి. భూసేకరణ చట్టాన్ని పక్కనపెట్టి అన్యాయమైన జీవో ఒకటి జారీచేసి పంట పొలాల స్వాధీనానికి తెలంగాణ ప్రభుత్వం పూనుకున్నప్పుడు మల్లన్నసాగర్ రైతులు చేసిన ఆందోళన అలాంటి ప్రయత్నాల్లో ఒకటి. ఢిల్లీలోని జేఎన్ యూలోను, గుజరాత్‌లోని ఉనాలోను, చాలాకాలంగా కశ్మీర్ లోను, ఛత్తీస్‌గఢ్‌లోను జరుగుతున్న ఆందోళనలన్నీ కూడా అప్ర జాస్వామిక ధోరణులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలే. బాలగోపాల్ ఏడో వర్ధంతి సందర్భంగా అలాంటి కొన్ని ఆందోళనలలో పాల్గొన్న వ్యక్తులను వక్తలుగా ఆహ్వానించాం. జూలై 8న బుర్హాన్ వాని (22) ఎన్కౌంటర్ తర్వాత కశ్మీర్ ఎంతగా రగిలిపోయిందో గత 3 నెలలుగా చూస్తూనే ఉన్నాం. 60 రోజుల కర్ఫ్యూ, 88 మంది మృతి, పెల్లెట్ గాయాలకు వందల మంది కంటిచూపు కోల్పోవడం.. ఇంత జరిగినా భారత రాజ్యా నికి, పౌర సమాజానికి కశ్మీర్ భూభాగం తప్ప మనుషులు కనబ డటం లేదు. ప్రజా ఆకాంక్షల మేరకే సరిహద్దులు ఏర్పడాలి, సమసిపోవాలి అని మాట్లాడటమే రాజ ద్రోహమై కూర్చుంది. కశ్మీర్‌ను ఎప్పటికీ సరిహద్దు తగాదాగానే చూద్దామా? అదొక నెత్తురోడుతున్న గాయంలా మనకు ఎప్పుడు కనిపిస్తుంది? ప్రస్తుత కశ్మీర్ పరిస్థితిని చెప్పేందుకు ఈ సభకు రావాల్సిన జేకేసీసీఎస్ నాయకుడు ఖుర్రం పర్వేజ్‌ను అన్యాయంగా అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఆయన స్థానంలో అదే సంస్థకు చెందిన జమీర్ అహ్మద్ కశ్మీర్ పరిస్థితి మీద మాట్లాడనున్నారు. ఇతరులను జాతిద్రోహులని ముద్రలు వేసే ఈ ప్రభుత్వాలు ఛత్తీస్‌గఢ్‌లో మటుకు ‘బైట’ రాష్ట్రాల మేధావులను తరిమికొట్టి, రాజపక్సే ఫార్ములాను అమలు పరచాలని చూస్తున్నాయి. ‘బైట’ రాష్ట్రాల న్యాయవా దులు అక్కడ వాదించకూ డదు. ‘బైట’ రాష్ట్రాల విలేక రులు అక్కడ ఉండి వార్తలు రాయకూడదు. పోలీసులు స్థాపించిన ‘అగ్ని’ సంస్థ మావో యిస్టులకు వ్యతిరేకంగా ‘లల్కార్’ యాత్రలు తీస్తుంది కాని సోని సోరిని మట్టుకు తిరంగా యాత్ర తీయనీయదు. దుర్గ-మహి షాసురుని కథపై తమకే గుత్త ఉన్నట్లు.. దానికి వేరే భాష్యం చెప్పిన వామపక్ష ఆదివాసీ ఉద్యమ కారుడు మనిష్ కుంజంపై కేసు పెట్టింది. కల్లోల ఛత్తీస్‌గఢ్‌లో ప్రస్తుతం ఏమి జరుగుతున్నదో మనిష్ కుంజం మనతో పంచుకోనున్నారు. విశ్వవిద్యాలయాల్లో ఆలోచనలకు పహారా కాస్తున్నారు. విద్యార్థులెవరూ కశ్మీర్, ఛత్తీస్‌గఢ్ గురించి మాట్లాడకూడదు. ముజఫర్‌నగర్ గురించి, అక్కడి సహాయక శిబిరాల్లో చనిపోతున్న పిల్లల గురించి మాట్లాడకూడదు. అఖ్లాక్ హత్యపై అసలే మాట్లాడ కూడదు. మాట్లాడితే రోహిత్ వేములను నెట్టినట్లే మృత్యువు నోట్లోకి నెడతారు. ఒక చేతిలో బాబాసాహెబ్ పటాన్ని, మరో చేతిలో పక్కబట్టలను పట్టుకుని వెనక్కి తిరిగి చూసుకుంటూ రోహిత్ తారలను వెతుక్కుంటూ వెళ్లిపోయాడు. రోహిత్ నమ్మకా లను పంచుకున్న మనం రాధిక గారి కడుపుకోతను చూసి బాధప డుతున్నాం కానీ వీసీ అప్పారావు దగ్గర నుంచి కేంద్ర మంత్రుల వరకు ఒక్కరికీ తప్పు చేసామన్న అపరాధ భావం లేదు. ఆదివాసీలపై, పేదవారిపై, స్త్రీలపై, ప్రతి అణగారిన వర్గంపై జరుగుతున్న జులుంకి వ్యతిరేకంగా ‘హల్లా బోల్’ అంటున్న జేఎన్‌యూ ఉద్యమ విశేషాలను (బసొ) కార్యకర్త అయిన జేఎన్ యూ విద్యార్థి ఉమర్ ఖాలిద్ వివరించనున్నారు. ప్రేమ, బాధ, జీవితం, మృత్యువు వంటి విషయాలలో సైతం మహా మొరటుగా వ్యవహరించే కుల వ్యవస్థ విషపరిష్వంగంలో కూరుకుపోయిన విశ్వవిద్యాలయాలను సంస్కరించాల్సింది ఎలాగో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కేవై రత్నం చెబుతారు. హిందుత్వవాదం మన మెదళ్లకు చుడుతున్న ఉరితాళ్లన్నిటినీ తెంచే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే ఊపిరి సలపడం లేదు. బాల గోపాల్ 7వ వర్ధంతి సందర్భంగా అందరం కలుద్దాం. విందాం. పరిస్థితులు మెరుగవుతాయో ఆలోచిద్దాం. అందరూ రండి. బాలగోపాల్ 7వ వర్ధంతి సందర్భంగా నేడు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల దాకా హైదరాబాద్ బాగ్‌లింగం పల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మానవహక్కుల వేదిక ఆధ్వర్యంలో సంస్మరణ సభ జరుగనుంది. బాలగోపాల్ రాసిన నాలుగు పుస్తకాలు కూడా ఈ సభలో ఆవిష్కృతమవుతాయి. బాల గోపాల్ తెలుగు ఉపన్యాసాల డీవీడీ, సీడీని కూడా నేడు విడుదల చేయడం జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. - వీఎస్ కృష్ణ, మానవహక్కుల వేదిక 94404 11899 -
అప్పారావును రక్షించేందుకే కమిషన్ వేశారా..
-
అప్పారావును రక్షించేందుకే కమిషన్ వేశారా..
హైదరాబాద్: రోహిత్ వేముల దళితుడని రెవిన్యూ అధికారులు చెప్పినా.. రూపన్వాల్ కమిషన్ మాత్రం కాదని చెప్పడం దారుణమని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అరుణ్ కుమార్ అన్నారు. శనివారం వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వీసీ అప్పారావును రక్షించేందుకే రూపన్వాల్ కమిషన్‌ను వేశారా అని ప్రశ్నించారు. కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, దత్తాత్రేయలకు క్లీన్చిట్ ఇచ్చిన ఈ నివేదిక ఏకపక్షంగా ఉందని విమర్శించారు. కులవివక్షకు రోహిత్ బలయ్యాడనే విషయాన్ని పక్కనబెట్టి.. అతని కులం కోసం వెతకడం దారుణమని అరుణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్య లేఖలో కులవివక్ష గురించి రోహిత్ రాసిన విషయాలు కమిషన్‌కు పట్టవా అని ఆయన ప్రశ్నించారు. హెచ్‌సీయూ విద్యార్థుల ఆందోళనలకు వైఎస్ఆర్ సీపీ పూర్తి మద్దతిస్తుందని ఆరుణ్ కుమార్ స్పష్టం చేశారు. -
అఖిలపక్షం ఏర్పాటు చేయాలి
రోహిత్ మృతిపై కత్తి పద్మారావు డిమాండ్ పొన్నూరు: రోహిత్ మరణంపై ప్రస్తుత న్యాయసాధికార మంత్రి రామ్‌దేవ్ అటాలే, రాంవిలాస్ పాశ్వాన్, మాయావతి, సీతారాం ఏచూరిలతో అఖిలపక్ష కమిటీని ఏర్పాటు చేయాలని నవ్యాంధ్ర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కత్తి పద్మారావు డిమాండ్ చేశారు. శుక్రవారం గుంటూరు జిల్లా పొన్నూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. రోహిత్ దళితుడు కాదనడం, అతని ఆత్మహత్య వెనుక స్మృతి ఇరానీ, దత్తాత్రేయ ప్రమేయం లేదని అలహాబాద్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఏకే రూపస్‌వాల్ ఇచ్చిన రిపోర్టు సరైనది కాదన్నారు. ఈ రిపోర్టును నిర్వీర్యం చేయడంలో ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు ప్రమేయం ఉందన్నారు. పార్లమెంటులోని 111 మంది దళిత ఎంపీలు ఆ నివేదిక అవాస్తవమని నిరాకరించాలని కోరారు. చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు సొంత సామాజిక వర్గానికి చెందిన అప్పారావును రక్షించాలనే కాంక్షతోనే ఇటువంటి నివేదికలు తెచ్చారన్నారు. -
రాధిక మనోనిబ్బరాన్ని దెబ్బతీసేందుకే..
• రూపన్వాల్ కమిషన్ నివేదికపై మండిపడ్డ విద్యార్థులు • ఆ రిపోర్టు నిరాధారం.. విద్యార్థుల అభిప్రాయాలు పరిశీలించలేదు • రోహిత్‌తోపాటు రస్టికేషన్‌కు గురైన విద్యార్థుల ఆరోపణ సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూ పీహెచ్డీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు సం బంధించి నియమించిన జస్టిస్ రూపన్వాల్ కమిషన్ రోహిత్ తల్లి రాధిక మనో నిబ్బరాన్ని దెబ్బతీసేందుకు కులాన్ని ఉపయోగించుకుందని హెచ్‌సీయూ విద్యార్థులు ఆరోపించారు. రిజర్వేషన్ల కోసమే రాధిక కులాన్ని ఉపయోగించుకున్నారనడాన్ని వారు ఖండించారు. రూపన్వాల్ కమిషన్ రిపోర్టుని వ్యతిరేకిస్తూ శుక్రవారం హెచ్‌సీయూలో విద్యార్థులు ప్రదర్శన, సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రాధిక రిజర్వేషన్ల కోసమే కులాన్ని ఉపయోగించుకున్నారని కమిషన్ వ్యాఖ్యానించడం దుర్మార్గమైన చర్య అని విద్యార్థి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందరో దళిత తల్లుల పక్షాన నిలిచి పోరాడుతున్న రాధికను మానసికంగా కుంగదీసేందుకే కమిషన్ ఇటువంటి రిపోర్టునిచ్చిందన్నారు. కమిషన్ రిపోర్టు నిరాధారమైనదని, అందులో ఎక్కడా విద్యార్థుల అభిప్రాయాలుగానీ, రోహిత్ మరణానికి కారణాలను కానీ పరిశీలించినట్టు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ పరిధిని మించి వ్యవహరించిందని, మొత్తంగా రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నుంచి కాపాడేందుకు చేసిన కుట్రలో భాగమే ఈ నివేదిక అని ఆరోపిస్తున్నారు. విద్యార్థుల రస్టికేషన్ని సైతం కమిషన్ సమర్థించడం నేరపూరిత వ్యాఖ్యానమని అభిప్రాయపడ్డారు. రోహిత్ దళితుడో కాదో తేల్చమని హెచ్ఆర్డీ శాఖ కమిషన్‌ను కోరలేదని, అటువంటప్పుడు రోహిత్ కులంపై కమిషన్ అత్యంత ఆసక్తి ప్రదర్శించడానికి కారణాలేమిటో తమకు అర్థం కావడం లేదని ప్రొఫెసర్ శ్రీపతిరాముడు వ్యాఖ్యానించారు. అది బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర.. రూపన్వాల్ కమిషన్ ముమ్మాటికీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్రని రోహిత్‌తో పాటు రస్టికేట్ అయిన దొంత ప్రశాంత్, వేల్పుల సుంకన్న, విజయ్, శేషు పేర్కొన్నారు. ఈ మేరకు హెచ్‌సీయూలో జరిగిన విద్యార్థుల సభలో వారు ఓ ప్రకటన విడుదల చేశారు. రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వీసీ అప్పారావు, కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, స్మృతీ ఇరానీలను కాపాడేందుకు కమిషన్ పేరిట కుట్ర చేశారన్నారు. రోహిత్ మరణానంతరం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిషన్ క్యాంపస్‌లో వివక్షని ఎత్తిచూపిందని, హెచ్‌సీయూలోని విద్యార్థి వ్యతిరేక పరిణామాలను, రస్టికేషన్‌ను తప్పుపట్టిందని గుర్తుచేశారు. అయితే విశ్వవిద్యాలయంలో దళిత విద్యార్థులు అనుభవిస్తున్న వివక్షని, ఆత్మహత్యలకు కార ణాలను విస్మరించి రూపన్వాల్ కమిషన్ విద్యార్థి వ్యతిరేక రిపోర్టును ఇచ్చిందన్నారు. హాస్టల్స్ నుంచి వెలివేతను సమర్థించ డాన్ని బట్టే కమిషన్ గుట్టు బట్టబయలైందని ఆరోపించారు. బీజేపీ, ఏబీవీపీకి కొమ్ముగాస్తున్న వీసీ అప్పారావును, రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారందరినీ తక్షణమే అరెస్టు చేయాలని, అప్పటి వరకు ఉద్యమం ఆగదని విద్యార్థులు స్పష్టం చేశారు. -
న్యాయ వ్యవస్థకే అవమానకరం
జస్టిస్ రూపన్వాల్ ప్రకటనపై నారాయణ సాక్షి, హైదరాబాద్: రోహిత్ వేముల దళితు డు కాదని జస్టిస్ రూపన్వాల్ ప్రకటించడం న్యాయ వ్యవస్థకే అవమానకరమని సీపీఐ నేత కె.నారాయణ మండిపడ్డారు. రోహిత్ ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులపై విచారణ చేయమని కేంద్రం ఆదేశిస్తే.. అతను దళితుడు కాదని కమిషన్ నివేదిక ఇచ్చిందన్నారు. కమిషనర్ విచారణాంశాలలో రోహిత్ ఏ కులం వాడో విచారించమని పేర్కొనలేదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యూనివర్సిటీలోని వ్యవస్థీకృత హింస వల్లనే రోహిత్ ప్రాణం కోల్పోయాడన్నారు. రోహిత్ దళితుడేనని గతంలో గుంటూరు కలెక్టర్ నివేదిక ఇచ్చారని, ఎమ్మార్వో కుల ధృవీకరణ సర్టిఫికెట్ జారీ చేశారని, జాతీయ ఎస్సీ కమిషన్ కూడా రోహిత్ దళితుడేనని తెలిపిందన్నారు. మరి ఇప్పుడు రూపన్వాల్ చెప్పింది నిజమైతే గుంటూరు జిల్లా రెవెన్యూ యంత్రాంగాన్ని తొలగించాల్సి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో రూపన్‌వాలా నివేదికను చెత్తబుట్టలో వేయాలని నారాయణ డిమాండ్ చేశారు. -
కులాన్ని తేల్చాల్సింది రూపన్వాల్ కాదు
• మా కులం ప్రస్తావించాల్సిన అవసరం కమిషన్‌కు ఏమొచ్చింది? • మండిపడిన రోహిత్ తల్లి రాధిక, సోదరుడు రాజా సాక్షి, హైదరాబాద్: ‘‘రోహిత్ కులం ఏదో తేల్చాల్సింది జస్టిస్ రూపన్వాల్ కాదు. రూపన్వాల్ ఏనాడూ మేం నివసించిన పరిసరాలను సందర్శించిన పాపాన పో లేదు. మా కుటుంబ సభ్యులతో కానీ, మా చుట్టుపక్కలవారితో కానీ మాట్లాడనైనా మాట్లాడని రూపన్వాల్.. ఏ ఆధారాలతో మేము దళితులం కాదని నిర్ధారించారో చెప్పాలి’’ అని ఆత్మహత్యకు పాల్పడిన హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ వేముల తల్లి రాధిక డిమాండ్ చేశారు. రోహిత్ దళితుడు కాదంటూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖకు జస్టిస్ రూపన్వాల్ కమిషన్ సమర్పించిన నివేదికపై శుక్రవారం ఆమె మండిపడ్డారు. రోహిత్ ఆత్మహత్య అనంతరం విద్యార్థులు చేపట్టిన ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కమిషన్ వేసినట్టే వేసి.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ రూపొందించిన నివేదికను రూపన్వాల్ ద్వారా బయటపెట్టారన్నారు. అసలు కమిషన్‌ను ఎందుకు నియమించారో ఆ పని చేయకుండా తమ కులం గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. ఇదంతా నిందితులను కాపాడేందుకు చేస్తున్న కుట్ర తప్ప మరొకటి కాదన్నారు. దళిత కులంలో పుట్టి, వివక్షను అనుభవించి, అష్టకష్టాలు పడి బిడ్డలను పెంచిన తనను వదిలేసి తన భర్త కులాన్ని తనకు అంటగట్టాలని చూడటం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. మా వాదన వినిపించుకోలేదు...రోహిత్ సోదరుడు రాజాచక్రవర్తి స్పందిస్తూ.. తన అన్నయ్య రోహిత్ మరణానికి సంబంధించి కమిషన్ ముందు తాము హాజరైన వెంటనే న్యాయమూర్తిగారు తమతో మాట్లాడిన తొలి విషయం ‘నాకు ఫ్లైట్‌కి టైం అయిపోతోంది. ఏదైనా చెప్పాలనుకుంటే జల్దీ చెప్పండి’ అని మాత్రమే అన్నారు. తాము రోహిత్‌కు యూనివర్సిటీలో ఎదురైన వివక్ష గురించి చెప్పబోతే.. తమను మాట్లాడనివ్వకుండా ‘అవన్నీ మేం పత్రికల్లో చదివాం.. టీవీల్లో చూశాం. అది కాకుండా కొత్త విషయం ఉంటే చెప్పమని’ తమను తొందరపెట్టారన్నారు. తాము చెప్పిందేదీ ఆయన వినిపించుకోలేదన్నా రు. గుంటూరు జిల్లా అధికారులు, తహసీల్దారు, కలెక్టరు సైతం తాము దళితులమేనని పదేపదే స్పష్టం చేశారని గుర్తుచేశారు. తమ అమ్మమ్మ వాంగ్మూలాన్ని, అలాగే తమ తండ్రి నాన్నగారైన తమ తాత య్య వెంకటేశ్వరరావు కూడా తమ తల్లి రాధిక ఎస్సీ మాల అని స్పష్టం చేశాక కూడా ఇదే విషయం ఎందుకు చర్చిస్తున్నారో తమకు అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తేల్చాల్సింది తమ కులం గురించి కాదని, రోహిత్ మరణానికి కారణాలేనని ఆయన స్పష్టం చేశారు. -
రూపన్వాల్ నివేదికను తిరస్కరించాలి: సీపీఎం
సాక్షి, హైదరాబాద్: రోహిత్ వేముల ఆత్మహత్యపై రూపన్వాల్ కమిషన్ ఇచ్చిన అబద్ధాల నివేదికను కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ నిర్ద్వందంగా తిరస్కరించాలని సీపీఎం డిమాండ్ చేసింది. లేనిపక్షంలో ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. రోహిత్ తల్లిపై మోపిన అభియోగాలు నేరపూరితంగా ఉన్నాయని, ఆమెను అవమానపరిచేలా వ్యాఖ్యానాలు చేయడం అన్యాయమని అన్నారు. గుంటూరు జిల్లా కలెక్టర్ విచారణ జరిపి రోహిత్ మాల కులస్తుడేనని నిర్ధారించారని, జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కూడా రోహిత్ దళితుడేనని స్పష్టం చేశారని.. అందుకు భిన్నంగా కమిషన్ నివేదికివ్వడం అభ్యంతరకరమన్నారు. రోహిత్ ఆత్మహత్య వెనుక కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, స్మృతి ఇరానీ, ఎమ్మెల్సీ రామచంద్రరావు, హెచ్‌సీయూ ప్రమేయం లేదని కమిషన్ తేల్చడం వెనక వారిని కాపాడటమే లక్ష్యంగా ఉన్నట్లు స్పష్టమవుతోందన్నారు. -
రోహిత్ దళితుడు అనేందుకు ఆధారాలు లేవు
రిజర్వేషన్ల కోసమే రోహిత్ తల్లి కులం సర్టిఫికెట్ తీసుకున్నారు * వ్యక్తిగత విషయాలే రోహిత్ ఆత్మహత్యకు కారణం * రోహిత్ ఆత్మహత్యలో రాజకీయ జోక్యం లేదు * ఇందులో హెచ్‌సీయూ యాజమాన్యం, ప్రభుత్వానికి బాధ్యత లేదు * కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, దత్తాత్రేయకు క్లీన్చిట్ * హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖకు నివేదిక సమర్పించిన రూపన్వాల్ కమిషన్ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో ఆత్మహత్యకు పాల్పడిన పీహెచ్డీ విద్యార్థి రోహిత్ వేముల దళితుడు అనేందుకు ఆధారాలు లేవని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి(హెచ్ఆర్డీ) శాఖ నియమించిన ఏక సభ్య కమిషన్ నిర్ధారించింది. రోహిత్ తల్లి రాధిక రిజర్వేషన్ల లబ్ధి కోసమే తనని తాను దళిత్‌గా ప్రకటించుకున్నారని పేర్కొంది. రోహిత్ తల్లి రాధిక కన్నతల్లిదండ్రులు ఎవ్వరో తెలియకుండా ఆమెను పెంచిన తల్లి.. రాధిక ఎస్సీ అని చెప్పడం సరికాదని కమిషన్ అభిప్రాయపడింది. ఆమె దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అనేందుకు ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొంది. రాధిక వాంగ్మూలం ఆధారంగా రోహిత్‌కు కుల ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేసినట్టు స్పష్టం చేసింది. ఈ మేరకు అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏకే రూపన్వాల్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ ఆగస్టు 1న హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖకు 41 పేజీల నివేదికను సమర్పించింది. 50 మందిని విచారించిన కమిషన్ రోహిత్ ఆత్మహత్యపై దుమారం చెలరేగడంతో ఈ ఏడాది జనవరి 28న హెచ్ఆర్డీ శాఖ నియమించిన ఏకసభ్య కమిషన్ మొత్తం 50 మందిని విచారించినట్టు పేర్కొంది. అందులో అత్యధికులు వర్సిటీ అధ్యాపకులు, సిబ్బందే. ఇందులో సామాజిక న్యాయ ఐక్య పోరాట కమిటీ నేతృత్వంలో ఉద్యమించిన ఐదుగురు విద్యార్థి జేఏసీ నాయకులు సైతం ఉన్నారని కమిషన్ వివరించింది. వాస్తవానికి రోహిత్ ఆత్మహత్యకు దారితీసిన విషయాల్లోని నిజానిజాలు.. విద్యార్థులెదుర్కొంటున్న సమస్యలకు ప్రస్తుతం ఉన్న పరిష్కారాలు.. అదనంగా తీసుకోవాల్సిన చర్యలపై కమిషన్ విచారించాల్సి ఉంది. అయితే అందుకు భిన్నంగా చాలా అంశాలను ముఖ్యంగా రోహిత్ కులంపై కమిషన్ అత్యంత ఆసక్తిని ప్రదర్శించినట్టు కనిపిస్తోంది. పలు సిఫార్సులు చేసిన కమిషన్ విద్యార్థుల కోసమే కాక రీసెర్చ్ స్కాలర్ల కోసం తగిన కౌన్సెలింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కమిటీ ప్రభుత్వానికి సూచించింది. అలాగే రోహిత్ మాదిరిగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడకుండా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను, సమాన అవకాశాల కేంద్రాలను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. నివేదికను స్వాగతించిన వీసీ అప్పారావు హైదరాబాద్: రోహిత్ ఆత్మహత్యకు సంబంధించి రూపన్వాల్ కమిషన్ సమర్పించిన నివేదికపై హెచ్‌సీయూ వీసీ పొదిలె అప్పారావు హర్షం వ్యక్తం చేశారు. రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో వీసీ అప్పారావు తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తాము ఇప్పటి వరకూ నివేదికను చూడలేదని, అయితే అందులోని అంశాలపై ఒక యూనివర్సిటీగా తాము సంతోషంగా ఉన్నామని అప్పారావు చెప్పారు. రోహిత్ ఆత్మహత్యతో విశ్వవిద్యాలయానికి సంబంధం లేదంటూ ఏకసభ్య కమిషన్ నిర్ధారించడాన్ని తాము గతిస్తున్నామన్నారు. కేంద్ర మంత్రులకు క్లీన్చిట్ యూనివర్సిటీలో జరిగిన విష యాల్లో రాజకీయ జోక్యం ఏమాత్రం లేదని కమిషన్ స్పష్టం చేసింది. కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతిఇరానీ వారి బాధ్యతలను వారు నిర్వర్తించారు తప్ప వర్సిటీ అధికారులపై ఎలాంటి ఒత్తిడీ తీసుకురాలేదని నివేదికలో రూపన్వాల్ కమిషన్ క్లీన్చిట్ ఇచ్చినట్టు తెలిసింది. రోహిత్‌ను వర్సిటీ హాస్టల్ నుంచి బహిష్కరిస్తూ అధికారులుతీసుకున్న నిర్ణయం సహేతుకమైనదని పేర్కొన్నట్టు తెలిసింది. వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య.. రోహిత్ మరణానికి వ్యక్తిగత అంశాలే కారణ మని కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసింది. రోహిత్ నిరాశా నిస్పృహతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని, అంతే తప్ప వివక్ష అతని ఆత్మహత్యకు కారణం కానేకాదని తేల్చి చెప్పింది. రోహిత్ ఆత్మహత్యకు ప్రభుత్వం కానీ, యాజమాన్యం కానీ కారణం కాదని, అది అతని స్వయంకృతాపరాధమేనని పేర్కొంది. రోహిత్ ఆత్మహత్యకు అప్పటికప్పుడు యూనివర్సిటీలో తన చుట్టూ జరిగిన విషయాలేవీ కారణం కాదని, ఇదే విషయాన్ని అతని లేఖ స్పష్టం చేస్తోందని నివేదిక పేర్కొంది. ఒకవేళ ప్రభుత్వం కానీ, యాజమాన్యం కానీ రోహిత్ ఆత్మహత్యకు కారణం అయితే అదే విషయాన్ని అతను తన లేఖలో ప్రస్తావించి ఉండేవాడని స్పష్టం చేసింది. తన ఆత్మహత్యకు కారణం ఫలానా అని అతను ఎక్కడా పేర్కొనకపోగా, తాను బాల్యం నుంచి ఒంటరితనాన్ని అనుభవించానని, మెచ్చుకోలుకి కూడా నోచుకోలేదని స్వయంగా రాసుకున్నాడని రిపోర్టు తెలియజేసింది. దీన్ని బట్టి అతను నిరాశా నిస్పృహలతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని నివేదిక తేల్చింది. -
రోహిత్‌ది హత్యే : ప్రొఫెసర్ కోదండరాం
హైదరాబాద్: రోహిత్ వేములది యూనివర్సిటీ చేసిన హత్యే అని పలువురు వక్తలు అన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో టీపీసీసీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో ‘ఆధునిక అసమాన సంస్థాగత హత్యకు రోహిత్ వేముల ఉదాహరణ.. రోహిత్ చట్టం డ్రాఫ్ట్ బిల్లు’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ ఆరెపల్లి మోహన్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, మాజీ మంత్రి సమ్మయ్య, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ప్రతినిధి విమలక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ వర్సిటీల అప్రజాస్వామిక వైఖరి వల్ల వివక్ష పెరుగుతోందన్నారు. అక్కడి వివక్ష, ఎస్సీ విద్యార్థులపట్ల నిర్లక్ష్య వైఖరి కలసే రోహిత్ వేముల ఆత్మహత్యకు దారి తీసిందన్నారు. ఏఐసీసీ ఎస్సీ విభాగం కన్వీనర్ ప్రసాద్ మాట్లాడుతూ దళితులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా విద్యార్థి దశ నుంచే పోరాడాలని పిలుపునిచ్చారు. ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఎంతోమంది వచ్చి రోహిత్ తల్లిని పరామర్శించినా సీఎం కేసీఆర్‌కు మాత్రం అందుకు సమయం దొరకలేదన్నారు. రోహిత్ చట్టం పార్లమెంట్లో ప్రవేశపెట్టి అమలు చేస్తేనే దళిత విద్యార్థులకు న్యాయం జరుగుతుందన్నారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఓ మేధావి ఈ సమాజంలో నేను బతకలేనని ఆత్మహత్య చేసుకోవడం సమాజానికి ఒక ప్రమాదఘంటిక లాంటిదని అన్నారు. విమలక్క మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రాయడానికి, పాడటానికి కూడా స్వేచ్ఛ లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ ఎస్సీ విభాగం చైర్మన్ వినయ్‌కుమార్, కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు శారద పాల్గొన్నారు. -
దళితులను కించపరిస్తే ఇక దాడులే..
హిమాయత్‌నగర్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణాలను ప్రస్తావించకుండా బీజేపీ ప్రభుత్వాన్ని కాపాడేందుకే రూపన్వాల్ కమిటీ దళితులకు వ్యతిరేకంగా నివేదిక ఇచ్చిందని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణస్వరూప్ అన్నారు. దళితులను కించపరిచేలా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని వారిపై దాడులకు సిద్దపడతామని హెచ్చరించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్రమంత్రులు స్మృతిఇరానీ, బండారు దత్తాత్రేయ, వీసీ అప్పారావు, ఎమ్మెల్సీ రాంచంద్రరావు, ఏబీవీపీ నాయకులు సుశీల్‌కుమార్‌లను తక్షణం అరెస్ట్ చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బోనులో ఎక్కే ప్రమాదం ఉన్నందునే కమితో తప్పుడు నివేదిక ఇప్పించారని ఆరోపించారు. జాతీయ కమిషన్, జిల్లా కలెక్టర్లు నిర్థారించిన తరువాత కూడా రోహిత్ కుల ప్రస్తావన తేవడం విడ్డూరంగా ఉందన్నారు. దళితుల ఆత్మ గౌరవాన్ని కించపరిచేలా నివేదిక ఇచ్చిన రూపన్‌వాల్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామన్నారు. రూపన్‌వాల్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ఈ నెల 29న ఇందిరాపార్క్ వద్ద జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని కోరారు. -
'రోహిత్ ఆత్మహత్య'పై మళ్లీ ప్రకంపనలు
హైదరాబాద్: సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్డీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యపై హెచ్ఆర్డీ మంత్రిత్వశాఖ నియమించిన కమిటీ అందించిన రిపోర్టుతో మళ్లీ వివాదం రేగింది. రోహిత్ దళితుడు, కాదని, అతని ఆత్మహత్యకు ఎవరూ బాధ్యులు కారని తేల్చిన కమిటీపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మాజీ న్యాయమూర్తి అశోక్ కుమార్ రూపన్ వాల్ నేతృత్వంలోని ఏక సభ్య కమిటీతాజాగా తన రిపోర్టును మంత్రిత్వ శాఖకు అందజేసింది. రోహిత్ ఆత్మహత్యకు ఎవరూ బాధ్యులుకారని, అది 'దురదృష్టకరమైన సంఘటన' అని తన నివేదికలో పేర్కొంది. దీంతో పాటు కొన్ని సిఫారసులను కూడా చేసింది. వీటిని మంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. రోహిత్ దళితుడు కాదని, ఓబీసీ అని తేల్చిన కమిటీ వాస్తవానికి తన రిపోర్టును ఆగస్టు 1న నివేదించాల్సి ఉంది. అయితే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో దాన్ని బహిర్గతం చేయలేదని సమాచారం. కమిటీ రిపోర్టుపై అటు విద్యార్థులు, ప్రజాసంఘాలు, అధ్యాపక బృందం మండిపడుతోంది. ఉద్యమానికి సిద్ధమవుతోంది. రోహిత్ ఆత్మహత్య ఘటనపై కమిటీ వాస్తవాలను తారుమారు చేసిందని ఆరోపిస్తు జాయింట్ యాక్షన్ కమిటీగా విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళను దిగనున్నాయి. అటు విశ్వవిద్యాలయానికి చెందిన సుమారు వందమంది లెక్చరర్లు, నగరంలో నిర్వహించే 'మహా ధర్నా'కు మద్దతు నివ్వనున్నట్టు ప్రకటించారు. దాదాపు 33 ప్రజా సంఘాలు, ఇతర సంస్థలు వీరి పోరాటానికి అండగా నిలవనున్నాయి. అలాగే మిగిలిన రాష్ట్ర, కేంద్రీయ విశ్వ విద్యాలయాలకు చెందిన విద్యార్థులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు రోహిత్ ఆత్మహత్య లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలను కమిటీ ప్రతిపాదించింది. ముఖ్యంగా మనోవేదనకు గురైన విద్యార్థుల కోసం ప్రస్తుతం ఉన్న ఫిర్యాదుల కమిటీని మరింత పటిష్టం చేయాలని, తక్షణం సహాయం అందించేలా కౌన్సిలింగ్ సెంటర్ ఉండాలని సిఫారసు చేసింది. విశ్వవిద్యాలయం నుంచి సస్పెండ్ చేసినపుడు ఫిర్యాదు చేసే అవకాశంలేకపోవడం రోహిత్ ఆత్మహత్యకు ప్రధాన కారణంగా కమిటీ పేర్కొంది. -
ఆ నివేదికను చెత్తబుట్టలో వేయాలి
రూపన్వాల్ నివేదికపై సీపీఐ నేత నారాయణ సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం రీసెర్చ్ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యపై జస్టిస్ రూపన్వాల్ నివేదికను చెత్తబుట్టలో వేయాలని సీపీఐ నేత కె.నారాయణ పేర్కొన్నారు. వాస్తవాలను కప్పిపుచ్చడానికే కేంద్రం కమీషన్‌ను నియమించిందని ఆరోపించారు. రోహిత్ దళితుడని గుంటూరు జిల్లా కలెక్టర్ ధ్రువీకరించారని, ఎస్సీ జాతీయ కమిషన్ అధ్యక్షుడు పూనియా విచారణ జరిపి నిర్ధారించారని.. కాబట్టి ఆ నివేదికలను కేంద్రం ఆమోదించాలని డిమాండ్ చేశారు. ‘రోహిత్ దళితుడని అంగీకరించే పక్షంలో హెచ్‌సీయూ వైస్ చాన్సలర్ అప్పారావు జైలుకు పోవాల్సి వస్తుంది. కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, స్మృతి ఇరానీ నైతిక బాధ్యత వహించాల్సి వస్తుంది. వ్యవస్థాగత హింస వల్లే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడనేందుకు అనేక ఆధారాలున్నా.. అసలు సమస్యను పక్కన పెట్టి రోహిత్ దళితుడా కాదా అనే అంశాన్ని ఎజెండాలోకి అనవసరంగా తీసుకొచ్చారు’ అని నారాయణ ఆరోపించారు. రోహిత్ ఆత్మహత్యకు మూలాధారాలేమిటో తేల్చాలని డిమాండ్ చేశారు. -
రోహిత్ వేముల దళితుడే: పునియా
న్యూఢిల్లీ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఆత్మహత్య చేసుకున్న పీహెచ్డీ విద్యార్థి రోహిత్ వేముల దళితుడేనని జాతీయ ఎస్పీ కమిషన్ ఛైర్మన్ పీఎల్ పునియా అన్నారు. రోహిత్ ఆత్మహత్య నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికలో అవాస్తవాలు, కల్పితాలున్నాయని ఆయన గురువారమిక్కడ అన్నారు. రోహిత్ ఆత్మహత్య చేసుకునేందుకు దారితీసిన పరిస్థితులు, అందుకు బాధ్యులైనవారిపై తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాల్సిన కమిషన్... అతడిది ఏ కులం అనే దానిపై నివేదిక ఇవ్వడం దురదృష్టకరమన్నారు. రోహిత్ దళితుడేనని గుంటూరు కలెక్టర్, తహసీల్దార్ నిర్థారించారని, అలాగే నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందన్న విషయాన్ని పునియా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏకసభ్య కమిషన్ వాస్తవాలను వెలికి తీయాల్సిన అవసరం ఉందన్నారు. కాగా గత ఏడాది సెంట్రల్ వర్సిటీ విద్యార్థి రోహిత్ సహా నలుగురు దళిత పరిశోధక విద్యార్థులను యూనివర్సిటీ యాజమాన్యం బహిష్కరించిన విషయం తెలిసిందే. యూనివర్సిటీలో దళిత విద్యార్థుల పట్ల తీవ్రమైన వివక్ష కొనసాగుతోందని, ఈ కారణంగానే వేముల రోహిత్ ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సూసైడ్ నోట్ లో సైతం పేర్కొనడం యావత్ దేశాన్ని కదిలించింది. వెల్లువెత్తిన ప్రజా ఉద్యమం యూనివర్సిటీలో దళిత విద్యార్థులు ఎదుర్కొంటున్న వివక్షపైనా, రోహిత్ ఆత్మహత్యపైనా విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి రూపన్వాల్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ను వేసింది. ఆ కమిషన్ రోహిత్ దళితుడు కాదని నిర్ధారించడంతో పాటు సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పొదిలి అప్పారావు నిర్దోషి అంటూ పేర్కొంది. -
రోహిత్ దళితుడు కాదు..!
-ఏకసభ్య కమిషన్ నిర్ధారణ -అప్పారావు నిర్దోషి అంటూ కితాబు సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి వేముల రోహిత్ దళితుడు కాదని, కాబట్టి అక్కడ వివక్షకి ఆస్కారం లేదంటూ అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి రూపన్వాల్ నేతృత్వంలో నియమించిన ఏకసభ్య కమిషన్ నిర్ధారించింది. రోహిత్ ఆత్మహత్య నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ ఆగస్టు మొదటి వారంలో తన నివేదికను సమర్పించినట్టు తెలుస్తోంది. అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి రూపన్వాల్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ రోహిత్ దళితుడు కాదని నిర్ధారించడంతో పాటు సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పొదిలి అప్పారావు నిర్దోషి అంటూ పేర్కొంది. గత ఏడాది సెంట్రల్ వర్సిటీ విద్యార్థి రోహిత్ సహా నలుగురు దళిత పరిశోధక విద్యార్థులను యూనివర్సిటీ యాజమాన్యం బహిష్కరించిన విషయం తెలిసిందే. యూనివర్సిటీలో దళిత విద్యార్థుల పట్ల తీవ్రమైన వివక్ష కొనసాగుతోందని, ఈ కారణంగానే వేముల రోహిత్ ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సూసైడ్ నోట్ లో సైతం పేర్కొనడం యావత్ దేశాన్ని కదిలించింది. వెల్లువెత్తిన ప్రజా ఉద్యమం యూనివర్సిటీలో దళిత విద్యార్థులు ఎదుర్కొంటున్న వివక్షపైనా, రోహిత్ ఆత్మహత్యపైనా విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది. రోహిత్ వేముల ఆత్మహత్యకు కారుకులైన వైస్ ఛాన్సలర్ పొదలి అప్పారావు, కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, స్మృతీ ఇరానీ, ఎబివిపి నాయకుడు సుశీల్ కుమార్లపై విద్యార్థులు ఎస్సి, ఎస్టి అట్రాసిటీ కేసు నమోదైన నేపధ్యంలో రోహిత్ కులం పై అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇటు బిజెపి చర్చ లేవనెత్తాయి. రోహిత్ దళితుడు కాదని తేల్చే ప్రయత్నం చేశాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అశోక్ రూపన్వాల్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ నియమించింది. అయితే ఈ కమిషన్ యూనివర్సిటీ లో వివక్ష జరిగిందా లేదా అనే విషయాన్ని నిర్ధారించాల్సి ఉంటుంది. బిజెపికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా, బిజెపి మంత్రులను కాపాడే లక్ష్యంతో ఈ రిపోర్టు తయారయినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే రోహిత్ దళితుడు కాదని, కనుక వివక్షకి తావులేదని, అలాగే వీసీ పొదిలె అప్పారావుకి రోహిత్ ఆత్మహత్యతో సంబంధం లేదని, అతను నిర్దోషి అంటూ కితాబివ్వడం గమనార్హం. ఈ విషయమై రోహిత్ తల్లి రాధిక స్పందిస్తూ ‘‘నేను ఎస్సి మాల అని, నా కొడుకు కూడా అదే కులానికి చెందిన వాడని గుంటూరు కలెక్టర్, తహసీల్దార్ లు చెప్పారు. అలాగే నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా ఇదే విషయాన్ని నిర్ధారించింది. నా కొడుకు రోహిత్ దళితుడు కాదని ఎలా నిర్ధారిస్తారు’’ అని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికి బిజెపి మంత్రులను కాపాడేందుకేనని తీవ్రంగా దుయ్యబట్టారు. ఎస్సి, ఎస్టి అట్రాసిటీ కేసునించి మంత్రులను, తమ అనుచరులను తప్పించేందుకు బిజెపి కుట్రగా దీన్ని అభివర్ణించారు. రోహిత్ సోదరుడు రాజా చక్రవర్తి వేముల సాక్షితో మాట్లాడుతూ ఏకసభ్య కమిషన్ ఎదుట తమ గోడు వినిపించే అవకాశం కూడా రూపన్వల్ ఇవ్వలేదని, అలాగే కులం గురించి ఒక్క ప్రశ్నకూడా తన తల్లి రాధికని గానీ, తనను గానీ అడగలేదని, అలాంటిది రోహిత్ దళితుడు కాదని ఎలా నిర్ధారణకు వస్తారన్నారు. ఏకసభ్య కమిషన్, విచారణ సందర్భంలో కూడా ఏకపక్షంగా వ్యవహరించిందని, తాము చెప్పేదేదీ వినకుండా ‘‘అవన్నీ మాకు తెలుసు, కొత్త విషయాలు చెప్పండి’’ అంటూ తమ వాదాన్ని వినిపించే అవకాశాన్ని కూడా కమిషన్ ఇవ్వలేదని రాజా తెలిపారు. నిజానికి రోహిత్ ఆత్మహత్యకు కారణమే వివక్ష అయినప్పుడు వివక్ష గురించి చెపుతుంటే చెప్పనివ్వకపోవడంలో ఆంతర్యమేమిటో తమకు అర్థం కాలేదన్నారు. ఏదేమైనా పూర్తి రిపోర్టు బయటకు వచ్చిన తరువాత జరిగిన విషయాలను సమగ్రంగా వివరిస్తామన్నారు. -
రోహిత్ కులాన్ని ఎన్ని సార్లు పరీక్షిస్తారు?
సాక్షి, హైదరాబాద్: దళితులు మరణించిన తరువాత కూడా పదేపదే తమ కులాన్ని రుజువు చేసుకోవాల్సి రావడం దారుణమని హెచ్‌సీయూ ఎస్సీ, ఎస్టీ టీచర్స్ అసోసియేషన్ కన్వీనర్ ప్రొఫెసర్ సుధాకర్ బాబు అన్నారు. సోమాజీగూడా ప్రెస్‌క్లబ్‌లో గురువారం విలేకరులతో మాట్లాడుతూ రోహిత్ వేముల కులాన్ని ఎన్నిసార్లు ధృవీకరిస్తారో చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పటికే రెండు సార్లు రోహిత్ దళితుడని ప్రభుత్వమే ధృవీకరించిందని, జాతీయ ఎస్సీ కమిషన్ అదే విషయాన్ని స్పష్టం చేసిందన్నారు. ఇప్పటికైనా కులంపై చర్చకు స్వస్తిపలికి, రోహిత్ మరణానికి కారకులైన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని ప్రొఫెసర్ లక్ష్మినారాయణ అన్నారు. దీనిపై రాష్ట్ర హోంమంత్రిని కలిసినట్లు తెలిపారు. రోహిత్‌ను భరత మాత ముద్దుబిడ్డగా పేర్కొన్న ప్రధాని మోదీ అతను దళితుడన్న విషయాన్ని చెప్పలేదని ప్రొఫెసర్ రత్నం అన్నారు. రోహిత్ కేసులో జాప్యాన్ని ప్రశ్నించినందుకు తమను జైల్లో పెట్టారన్నారు. ప్రొఫెసర్ క్రిష్ణ మాట్లాడుతూ ఎస్సీ కమిషన్ సిఫార్సులను తక్షణమే అమలు చేయాలని కోరారు. అంబేడ్కర్ విగ్రహాన్ని పునఃప్రతిష్టించాలని డిమాండ్ చేశారు. రోహిత్ మరణానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రొఫెసర్ శ్రీపతిరాముడు అన్నారు. -
ఉద్యమాన్ని పక్కదోవ పట్టించేందుకే దాడులు
సాక్షి, హైదరాబాద్: రోహిత్ వేముల ఉద్యమాన్ని పక్కదోవ పట్టించేందుకే ఏబీవీపీ నేతలు హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో దాడులకు పాల్పడుతున్నారని సామాజిక న్యాయపోరాట ఐక్యకార్యాచరణ కమిటీ నాయకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 16న అమోల్ సింగ్ అనే పరిశోధక విద్యార్థిపై ఏబీవీపీ నేత సుశీల్ కుమార్ దాడి చేయడం దారుణమన్నారు. రోహిత్ వేముల ఉద్యమంలో పాల్గొంటున్న విద్యార్థులపై పదే పదే దాడులు చేస్తూ క్యాంపస్‌లో ప్రజాస్వామ్య వాతావరణాన్ని హరిస్తున్నారన్నారు. రోహిత్ ఆత్మహత్య ఘటనలో ప్రధాన నిందితులైన వీసీ అప్పారావు, ఏబీవీపీ నేత సుశీల్ కుమార్‌ను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 16న రాత్రి షాప్‌కామ్ వద్ద కశ్మీర్ పరిణామాలపై చర్చిస్తుండగా బైక్‌లపై ర్యాలీగా వచ్చిన ఏబీవీపీ కార్యకర్తలు ప్జాబ్కు చెందిన అమోల్ సింగ్ అనే విద్యార్థిపై దాడిచేసి కొట్టారని వారు ఆరోపించారు. బాధితుడిని సహ విద్యార్థులు చందానగర్‌లోని ప్రణమ్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ సుశీల్ కుమార్ సోదరుడు విష్ణు మరోసారి చేయిచేసుకోవడమేగాక చంపుతామని బెదిరించినట్లు తెలిపారు. విద్యార్థులపై దాడులు జరుగుతున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిని అరెస్టు చేయకుండా, రోహిత్ ఉద్యమాన్ని పక్కదోవ పట్టించేందుకు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, వీసీ తోడ్పాటుతోనే ఏబీవీపీ కార్యకర్తలు పెట్రేగిపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. -
రోహిత్ వేముల దళితుడే
గుంటూరు కలెక్టర్ ధ్రువీకరణ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో జనవరి 17న ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల దళితుడేనని గుంటూరు కలెక్టర్ కాంతిలాల్ దండే ధ్రువీకరించారు. నేషనల్ కమిషన్‌కు సమర్పించిన నివేదికతో రోహిత్ ఎస్సీ మాల కులస్తుడని పేర్కొన్నారు. దీంతో రోహిత్ బీసీ అనే వాదనకు తెరపడింది. వర్సిటీ యాజమాన్యం కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు రోహిత్ తన సూసైడ్ లేఖలో పేర్కొన్న విషయం తెలిసిందే. రోహిత్‌తో సహా నలుగురు విద్యార్థుల వెలివేత, అనంతరం రోహిత్ ఆత్మహత్య యావత్ దేశాన్నే కుదిపేసింది. వర్సిటీ వైస్ చాన్స్‌లర్ అప్పారావు, కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, మంత్రి స్మృతి ఇరానీల జోక్యం వల్లే తన కుమారుడు రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డారంటూ అతడి తల్లి రాధిక ఫిర్యాదు చేయడంతో వారిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. అయితే రోహిత్ తండ్రి బీసీ(వడ్డెర) కనుక అతని కులమే రోహిత్ కులమని నమ్మించేందుకు ఏపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించింది. పిల్లల పెంపకంలో కానీ, వారి విద్యాబుద్ధుల విషయంలోగానీ, చివరకు కుటుంబం గురించి గానీ ఎటువంటి బాధ్యతలు నెరవేర్చని రోహిత్ తండ్రి కులం కాక, రోహిత్ తల్లి రాధిక కులమే రోహిత్‌కి చెందినట్టు ఆధారాలతో సహా నిరూపించడం కేసులో కీలక మలుపుగా భావించొచ్చు. గుంటూరు తహసీల్దారు రిపోర్టు ఆధారంగా రోహిత్ కులాన్ని కలె క్టర్ ధ్రువీకరించారు. ఇది విద్యార్థుల ఐక్యపోరాటాల ఫలితమని, రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిని అరెస్టు చేయాలని హెచ్‌సీయూ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ప్రశాంత్, మున్నా, వెంకటేశ్ చౌహాన్,అర్పిత అన్నారు. -
వనస్థలిపురంలో రెచ్చిపోయిన కుక్కలు
హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురం పరిధిలోని వైదేహినగర్లో పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. ఇంటి బయట ఆడుకుంటున్న రోహిత్(7) అనే చిన్నారిపై పిచ్చికుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. తీవ్రగాయాలైన చిన్నారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
పూలు చల్లే చేతుల్లోనే రాళ్లు..!
దళితులను, ఆదివాసీలను వివక్షకు గురిచేస్తూ, అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించడం, ఆయన నివసించిన ప్రదేశాలను యాత్రాస్థలాలుగా మార్చడం పట్ల చూపే శ్రద్ధ దళిత, ఆదివాసీ ప్రజల అభివృద్ధిపై చూపకపోవడం యాదృచ్ఛికం కాదు. చాయ్‌వాలాని గెలిపించిన భారత దేశ ప్రజలు బలహీన వర్గాల ప్రతినిధిగా మోదీ ప్రజ లను ఆకట్టుకుంటాడని ఆశించారు. యువత రంలో ఆశని రేకె త్తించే అనర్గళమైన ఉపన్యా సాలు, వాగ్దానాలనే నీటి మూటలతో ఆకట్టుకున్న మోదీ ప్రజల ఓట్లను కొల్లగొట్టారు కానీ ఆచరణలో ఆయా వర్గాల ఆకాంక్షలను నెరవేర్చేందుకు అర క్షణమైనా ఆలోచించిన దాఖలాలు లేవు. పర్యవసానంగా దేశం అల్లకల్లోలంగా మారింది. రెండేళ్లు పూర్తిచేసుకున్న మోదీ పాలనలో ప్రజలాశించిన దేమిటి? వారికి లభించినదేమిటో తరచి చూసుకోవాలి. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మోదీ ప్రధానిగా రెండేళ్ళ పాలనను పూర్తి చేసుకున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ స్వతహాగానే లోక్‌సభలో మెజారిటీ సంపాదించింది. ఎన్నికల సమయంలో మోదీ చేసిన ప్రసంగాలు, యువతరాన్ని బాగా ఆకట్టుకున్నాయి. అయితే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు కానీ, కల్పించిన ఆశలు గానీ ఆచరణలో కార్యరూపం దాల్చిన దాఖలాలు లేవు. ముఖ్యంగా సమాజంలోని అట్టడుగున ఉన్న ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కానీ, వారి సంక్షేమం, విద్యలపైన దృష్టి కానీ మోదీ ప్రభుత్వ ఎజెండాలోనే కనిపించడంలేదు. పైగా భారతదేశంలో షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల ఉనికినే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎస్సీ, ఎస్టీలు కలిస్తే ఈ దేశ జనాభాలో దాదాపు పావుభాగం. రాజ్యాంగబద్ధంగా ఈ వర్గాలకు కల్పించిన హక్కులు, రాయితీలను నిర్లక్ష్యం చేసిన ఏ పాలకులూ సుదీర్ఘకాలం కొనసాగలేకపోయారు. గత రెండేళ్లుగా ఈ వర్గాల ప్రజలకేం జరిగిందనే విషయంపై దేశమే కాదు ప్రపంచం యావత్తు దృష్టి సారించింది. కానీ ఈ వర్గాలకు ఈ రెండేళ్ళలో జరిగిన నష్టం గతంలో ఎప్పుడూ జరగలేదన్నది స్పష్టం. ప్రతి సంవత్సరం కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లకు ముందుగా దేశ, వివిధ రాష్ట్రాల ఆర్థిక, సామాజిక స్థితిగతుల మీద ‘ఎకనామిక్ రివ్యూ’ పేరుతో ఒక సుదీర్ఘమైన విశ్లేషణ ఉంటుంది. నిజానికి బడ్జెట్ రూపకల్పనలో ఇందులో పేర్కొన్న అంశాలను పరిగణనలోనికి తీసుకుంటారు. గత అరవై సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ‘ఎకనామిక్’ రివ్యూలో ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన తరగతుల స్థితి గతులు, వారికి అందిస్తున్న పథకాలు అంతేకాకుండా, ఆ వర్గాలు సాధించిన ప్రగతి చోటుచేసుకుంటుంది. అయితే మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం ఎకనామిక్ రివ్యూ నుంచి ఈ సామాజిక వర్గాలకు సంబంధించిన అంశాలనే తొలగించింది. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన ఉనికిని కూడా ప్రభుత్వం గుర్తించేందుకు సిద్ధంగా లేదని దీనర్థం. అయితే ఈ వర్గాల పట్ల వివక్ష ఆచరణలో కూడా కనిపిస్తున్నది. 2015-16, 2016-17, కేంద్ర బడ్జెట్లలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కోసం నిధుల కేటాయింపులు గణనీయంగా తగ్గాయి. ఈ రెండు బడ్జెట్లలో సగానికి సగం కేటాయింపులకు కోత పెట్టారు. ఉదాహరణకు, 2015-16 బడ్జెట్లో ఎస్సీలకు 16.6 శాతం నిధులు కేటాయించారు. రూ.77,236 కోట్లు కేటాయించాల్సి ఉంటే కేవలం రూ. 30,850 కోట్లు మాత్రమే కేటాయించారు. ఎస్టీలకు 8.6 శాతమే. రూ. 40,014 కోట్లు కేటాయించాల్సి ఉండగా కేవలం రూ. 19,980 కోట్లు మాత్రమే కేటాయించడం గమనించాల్సిన విషయం. 2014-15 బడ్జెట్‌తో పోలిస్తే ఇది గణనీయంగా పడిపోయిందని తెలుస్తుంది. ఈ కేటాయిం పుల్లోనూ అంకెల్లోనే కోట్ల రూపాయలు ఉంటాయి. ఆచ రణలో అవి ఏ మాత్రం ప్రయోజనాన్ని చేకూర్చలేవు. అందుకుగాను ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను సమర్థవం తంగా అమలు చేయడానికి చట్టబద్ధత కావాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా వినిపిస్తున్నది. వీటినేమాత్రం పట్టించుకోని ప్రభుత్వం ‘నీతి ఆయోగ్’ రూపంలో ఊహించని దాడికి పాల్పడుతోంది. గతంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల వినియోగాన్ని, అమలు చేసే పథకాలను ‘ప్రణాళికా సంఘం’ పర్యవేక్షించేది. అయితే, కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల పట్ల చూపుతున్న వివక్షను గమనించిన నీతి ఆయోగ్.. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలును పర్యవేక్షించే బాధ్యతను తాము తీసుకోవడం లేదని ప్రకటించింది. దీనితో ఎస్సీ, ఎస్టీల ఆర్థికాభివృద్ధిపట్ల మోదీ ప్రభుత్వం చూపుతున్న నిర్ల క్ష్యం పరాకాష్టకు చేరింది. అదే సమయంలో హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో అంబేడ్కర్ విద్యార్థి సంఘం నాయకుడు, దళిత రీసెర్చ్ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య దేశవ్యాప్తంగా విశ్వ విద్యాలయాల్లో జరుగుతున్న కుల వివక్షను బట్టబయలు చేసింది. దేశమంతా రోహిత్‌కి జరిగిన అన్యాయానికి కోడై కూస్తుంటే మోదీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చు న్నారు. కనీసం స్పందించలేదు. ఈ విషయాలన్నింటిపై కమిటీ వేసి, ఆ సిఫారసుల ఆధారంగా చర్యలు తీసు కోవాలనే డిమాండ్‌ను సైతం పట్టించుకోలేదు. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో దళిత, ఆదివాసీ విద్యార్థుల అసం తృప్తికి ఒక ప్రధాన కారణం వివక్ష, అలాగే ఆయా వర్గాల ఆర్థిక అవసరాలను తొక్కిపెట్టడం. విద్యార్థుల ప్రయోజ నాలను నిర్లక్ష్యం చేయడం, బడ్జెట్లో కేటాయింపులకు కోత పెట్టడం. ఇవన్నీ దళిత, ఆదివాసీ విద్యార్థుల సమస్యలను మరింత జటిలం చేస్తున్నాయి. కార్పోరేట్ రంగానికి మాత్రం విపరీతంగా రాయితీలు, పన్నులు మినహాయింపులు ఇవ్వడం ఎవరి ప్రయోజనాల కోసమో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు దళితులను, ఆదివాసీలను వివక్షకు, నిర్ల క్ష్యానికి గురిచేస్తూ, బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించడం, ఆయన నివసించిన ప్రదేశాలను యాత్రాస్థలాలుగా మార్చడం లాంటి విషయాలపట్ల చూపు తున్న శ్రద్ధ దళిత, ఆదివాసీ ప్రజల సామాజిక, ఆర్థికా భివృద్ధిపై చూపకపోవడం యాదృచ్చికం కాదు. ఈ రెండేళ్ళలో ఒక్కటంటే, ఒక్కటి కూడా పనికి వచ్చే పథకం లేదు. కనీసం ఈ రెండేళ్ళు పూర్తయిన సందర్భంగానైనా గత పాలనను సమీక్షించుకొని, దళితులు, ఆదివాసీల పట్ల తమ వివక్షాపూరితమైన వైఖరిని పునఃసమీక్షించుకోకపోతే మోదీ ప్రభుత్వానికి తిప్పలు తప్పవు. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్: 97055 66213 -
రోహిత్ కుటుంబానికి ఇల్లు కట్టిస్తాం
గుంటూరు: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకుని మృతిచెందిన రోహిత్ వేముల కుటుంబానికి ఇల్లు నిర్మించేందుకు అయ్యేఖర్చును భరించేందుకు కేరళ రాష్ట్ర ముస్లిం లీగ్ ముందుకు వచ్చింది. శనివారం గుంటూరు వచ్చిన కేరళ రాష్ట్ర ముస్లిం లీగ్ అధ్యక్షుడు తంగేడ్ రోహిత్ తల్లి రాధికకు రూ.10 లక్షల చెక్కును అందించారు. దీంతోపాటు ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చు అంతా తాము భరిస్తామంటూ ప్రకటించారు. ఈ సందర్భంగా తంగేడ్ విలేకరులతో మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత మతపరమైన దాడులు పెరిగాయని అన్నారు. ముస్లిం మైనార్టీ, దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. వీటిని ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇలాంటి దాడుల్లో ఇబ్బందులకు గురైన వారిని ఆదుకునేందుకు తాము ముందుంటామని చెప్పారు. -
ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కుట్ర
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల ఘటనపై కొనసాగుతున్న ఉద్యమాన్ని పక్కదోవపట్టించేందుకు వీసీ అప్పారావు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కుట్రలు పన్నుతున్నారని హెచ్‌సీయూ జేఏసీ నాయకులు అన్నారు. శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో జేఏసీ నేత వెంకటేష్ చౌహాన్ మాట్లాడుతూ.. ఉద్యమాన్ని నీరుగార్చేందుకు నిన్నటి వరకు ఉద్యమంలో ఉన్న రాజ్‌కుమార్ సాహుని బెదిరించి తమకు అనుకూలంగా మలుచుకున్నారన్నారు. ఈ ఘటనతో వీసీ వెనుక వెంకయ్యనాయుడు ఉన్నాడన్నది స్పష్టమైందన్నారు. ఏప్రిల్ 6న కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించిన సాహు అదేరోజు వీసీకి అమ్ముడుపోయాడని ఆరోపించారు. ఏప్రిల్ 12న నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఒక్కరు మినహా 948 మంది విద్యార్థులు వీసీ అప్పారావుకు వ్యతిరేకంగా ఓటు వేశారని మరో నేత అర్పిత అన్నారు. సంజయ్ మాట్లాడుతూ ఉద్యమ అవసరాలకోసం పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు, పౌరసమాజం నుంచి ఆర్థిక సహాయం పొందారని, ప్రతిపైసా ఉద్యమానికే వినియోగించామన్నారు. ఆధారరహిత ఆరోపణలను పట్టుకొని మంత్రి వెంకయ్య నాయుడు హెచ్‌సీయూ విద్యార్థులను క్షమాపణ చెప్పాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. వీసీ అప్పారావుకు పదవిలో కొనసాగే అర్హత లేదని, ఆయనను కాపడుతున్న వెంకయ్యనాయుడు దళిత జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, వామపక్షపార్టీలు, ఆమ్ఆద్మీ స్పాన్సర్డ్ ఉద్యమంగా ముద్రవేయడం దుర్మార్గమన్నారు. ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులకు ఉద్యోగాలు రావని, పాస్ చేయమని అధ్యాపకులు,వీసీ చేస్తున్న బెదిరింపులకు లొంగవద్దన్నారు. -
విరాట్, రోహిత్‌ల పోరాటం హర్షా భోగ్లే
రెండు నెలల పాటు సాగే ఐపీఎల్‌ను లాంగ్ డిస్టెన్స్ రేస్‌తో పోల్చడం కాస్త అసహజంగా అనిపించినా సారాంశం మాత్రం ఒక్కటిగానే కనిపిస్తుంటుంది. రెండేళ్ల క్రితం అందరికన్నా ముందు దూసుకెళ్లిన పంజాబ్ కింగ్స్ ఎలెవన్ తుది పోరులో బోల్తా పడింది. తాజాగా రేసులో గుజరాత్ లయన్స్ అందరికన్నా ముందుంది. ఆరంభంలో తడబడుతూ కనిపించినా చివర్లో పుంజుకుని ఇలాంటి జట్లకు షాక్ ఇచ్చేందుకు ముంబై ఇండియన్స్ లాంటి జట్లు కూడా పోటీలో ఉంటాయి. అందుకే ఏమీ చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు లీగ్ ఫినిషింగ్ దశకు వచ్చేసింది. ఈసారి ముంబై రేసులో నిలవాలంటే బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌పై విజయం కీలకం. మరోవైపు కోహ్లి బృందం వరుసగా రెండు విజయాలతో రేసులో ముందుకెళ్లేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది. దీంతో ఇరు జట్లకూ ఈ మ్యాచ్ ఎంతో కీలకం. ఓడిన జట్టు మెడపై కత్తి వేలాడుతున్నట్టే. ఇద్దరు అత్యుత్తమ లక్ష్య ఛేదన మొనగాళ్లయిన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ మధ్య జరిగే పోటీగా దీన్ని భావించాల్సి ఉంది. ఎలాంటి పరిస్థితినైనా ఒంటి చేత్తో మార్చగల సమర్థులు వీరు. అయితే గతంలోనే చెప్పుకున్నట్టు బౌలింగ్ మెరుగ్గా ఉన్న జట్టుకే విజయావకాశాలు ఉంటాయి. ఈ విషయం తాజా లీగ్‌లో చాలాసార్లు రుజువైంది కూడా. దీన్ని ప్రామాణికంగా తీసుకుంటే ముంబై ఇండియన్స్‌కు ఎక్కువ అవకాశం ఉంది. కానీ భారీ లక్ష్యం కోసం బెంగళూరు ఛేజింగ్‌కు దిగితే పరిస్థితి ఎలా ఉంటుందో మరి. కోహ్లి దూకుడుతో పాటు డివిలియర్స్, వాట్సన్ కూడా అండగా ఉంటారు. ఈవిషయం ప్రత్యర్థికి కూడా తెలుసు. ఇక ముంబై బ్యాటింగ్ అంతా రోహిత్‌పై ఆధారపడి ఉండడం కలవరపరిచే విషయమే. -
రోహిత్ కుటుంబానికి కేజ్రీవాల్ హామీపై చిక్కులు!
న్యూఢిల్లీ: ఆత్మహత్య చేసుకున్న హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ వేముల సోదరుడికి ఢిల్లీ ప్రభుత్వం తరఫున ఉద్యోగం ఇస్తామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన హామీ ఇప్పుడు చిక్కుల్లో పడింది. రోహిత్ సోదరుడు రాజచైతన్య కుమార్‌కు ఉద్యోగం ఇస్తామంటూ కేజ్రీవాల్ ఇచ్చిన ఈ హామీని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. పరిహారం రూపంలో రోహిత్ సోదరుడికి గ్రూప్ సీ ప్రభుత్వ ఉద్యోగంతోపాటు, ప్రభుత్వ వసతి కల్పిస్తూ ఢిల్లీ ప్రభుత్వం మార్చి 3న నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ విషయంలో కేజ్రీవాల్ సర్కారు నిర్ణయం 'అక్రమం, అరాచకం, రాజకీయ దురుద్దేశపూరితమైన'దంటూ న్యాయవాది అవధ్ కౌషిక్ పిల్ దాఖలు చేశారు. హెచ్‌సీయూ రీసెర్చ్ స్కాలర్ రోహిత్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఆయన కుటుంబం విజ్ఞప్తి మేరకు రోహిత్ సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఢిల్లి కేబినెట్ నిర్ణయించినట్టు నోటిఫికేషన్లో తెలిపారు. కానీ, నిజానికి రోహిత్ కుటుంబం ఢిల్లీ ప్రభుత్వానికి ఎలాంటి విజ్ఞాపన సమర్పించకుండానే.. ఆయన సోదరుడికి ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇది చట్టాలను ఉల్లంఘించి, ప్రభుత్వ విచక్షణాధికారాన్ని దుర్వినియోగం చేయడమేనని పిల్లో న్యాయవాది ఆరోపించారు. ఢిల్లీ కేబినెట్ నిర్ణయాన్ని కొట్టివేయాలని, ఇప్పటికే రోహిత్ సోదరుడికి ఉద్యోగంలోకి తీసుకుంటే ఆ నియామకాన్ని రద్దుచేయాలని హైకోర్టును కోరారు. బాధిత కుటుంబాలకు పరిహారం కారుణ్య నియామకాలు చేయాలంటే అందుకు తగిన మార్గదర్శకాలను రూపొందించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. -
రోహిత్ ఆత్మహత్యపై దర్యాప్తు కొనసాగుతోంది
♦ అతని కుల ధ్రువీకరణపై కొన్ని సందేహాలున్నాయి ♦ స్పష్టత కోసం గుంటూరు కలెక్టర్‌కు లేఖలు రాశాం ♦ సూసైడ్ నోట్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాం.. ♦ నివేదిక కోసం ఎదురుచూస్తున్నాం ♦ హైకోర్టుకు సైబరాబాద్ పోలీసుల నివేదన సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ) పీహెచ్డీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యపై దర్యాప్తు కొనసాగుతోందని సైబరాబాద్ పోలీసులు ఉమ్మడి హైకోర్టుకు నివేదించారు. రోహిత్ కుల ధ్రువీకరణపై కొన్ని సందేహాలున్నాయని, వీటి నివృత్తి కోసం గుంటూరు జిల్లా కలెక్టర్‌కు లేఖలు రాశామని, అది తేలిన తర్వాత దర్యాప్తు ఓ కొలిక్కి వస్తుందని తెలిపారు. అలాగే రోహిత్ ఆత్మహత్య లేఖను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని, నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. రోహిత్ ఆత్మహత్యకు వీసీ అప్పారావు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, ఏబీవీపీ నాయకుడు సుశీల్‌కుమార్ తదితరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పోలీసులకు పీహెచ్డీ విద్యార్థి ప్రశాంత్ ఫిర్యాదు చేశారు. దీంతో గచ్చిబౌలి పోలీసులు వీసీ అప్పారావు తదితరులపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తమపై కేసును కొట్టేయాలంటూ రామచంద్రరావు హైకోర్టును ఆశ్రయించారు. అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన హైకోర్టు, రామచంద్రరావు అరెస్ట్‌పై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని మాదాపూర్ పోలీసులను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ జె.రమేశ్‌కుమార్ కౌంటర్ దాఖలు చేశారు. రోహిత్ ఆత్మహత్య తర్వాత అతని సర్టిఫికెట్లు పరిశీలిస్తే అందులో ఎస్సీ అని ఉందని, అయితే గురజాల తహసీల్దార్ మాత్రం రోహిత్ వడ్డెర కులానికి చెందిన వ్యక్తిగా నివేదిక ఇచ్చారని తెలిపారు. రోహిత్ కులంపై స్పష్టత లేకపోవడంతో స్పష్టత కోసం గుంటూరు కలెక్టర్‌కు రెండుసార్లు లేఖలు రాశామని, కలెక్టర్ నుంచి స్పందన కోసం ఎదురుచూస్తున్నామని వివరించారు. అలాగే ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని, ఈ పరిస్థితుల్లో పిటిషనర్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందువల్ల ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేయాలని కోరారు. -
ఇక అవమానాలుండవు
బౌద్ధంలోకి మారిన రోహిత్ వేముల తల్లి, సోదరుడు ముంబై: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న రీసెర్చ్ విద్యార్థి రోహిత్ వేముల తల్లి, సోదరుడు గురువారం బౌద్ధ మతం స్వీకరించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా ఆయన మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ సమక్షంలో ఇక్కడ జరిగిన కార్యక్రమంలో బౌద్ధ బిక్షువులు రోహిత్ తల్లి రాధిక, సోదరుడు నాగ చైతన్య (రాజా వేముల)లకు బౌద్ధ దీక్షను ఇచ్చారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ.. ఒక పక్క గళమెత్తడానికి ప్రయత్నిస్తున్న వారి గొంతుకలు నొక్కడానికి ప్రయత్నిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ.. మరోపక్క అంబేడ్కర్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంటున్నారని విమర్శించారు. తాము కుల వర్గీకరణతో కూడిన హిందూ మతానికి వ్యతిరేకమని, కుల వ్యవస్థ లేని బౌద్ధంలోకి అందుకే వచ్చామని తెలిపారు. ఈ రోజు నుంచి తమకు అవమానాలు, అగౌరవాలు, దైవపూజా కార్యక్రమాల్లో వివక్ష ఉండదని చెప్పారు. తన సోదరుడు రోహిత్ బతికుంటే, తమ మత మార్పిడి నిర్ణయం పట్ల చాలా సంతోషించేవాడన్నారు. రోహిత్ కూడా బౌద్ధంలోకి మారాలని అనుకున్నాడని, అయితే ఆ పని చేయలేకపోయాడని చెప్పారు. రోహిత్ అక్క మాత్రం మతం మారలేదు. ఈ కార్యక్రమంలో రోహిత్ స్నేహితుడు రియాజ్ షేక్, హెచ్‌సీయూ విద్యార్థి రాజు పాల్గొన్నారు. -
బౌద్ధం స్వీకరించిన రోహిత్ తల్లి, సోదరుడు
ముంబై: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి రోహిత్ తల్లి రాధిక, అతని సోదరుడు రాజా మతం మారారు. ముంబైలో బౌద్ధమత గురువు సమక్షంలో వీరు బౌద్ధమతాన్ని స్వీకరించారు. రోహిత్ దళితుడు కావడం వల్లే వివక్షకు గురై వెలివేయబడ్డాడని.. అటువంటి వెలివేతకు అవకాశంలేని బౌద్ధమతాన్ని స్వీకరించినట్లు రోహిత్ సోదరుడు అన్నారు. అసమానతలకు తావులేనిదిగా భావించి అంబేద్కర్ బౌద్ధం మతం స్వీకరించారని, అటువంటి సమానత్వాన్ని కాంక్షిస్తూ అంబేద్కర్ చూపిన మార్గంలో ఆయన జయంతిని పురస్కరించుకుని తాము బౌద్ధాన్ని స్వీకరించినట్లు ఆయన తెలిపారు. కొంతకాలంగా దేశంలో 'ఘర్ వాపసీ' గో మాంసం వివాదం, విద్యావ్యవస్థ కషాయీకరణ తదితర అంశాలపై దళిత, మైనారిటీ వర్గాలు ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇదే క్రమంలో అంబేద్కర్ విద్యార్థి సంఘం సభ్యుడు, హెచ్ సీయూ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యకు పాల్పడటంతో నిరసనలు, ఆందోళలు వెల్లువెత్తాయి. -
బౌద్ధం స్వీకరించనున్న రోహిత్ తల్లి, సోదరుడు
హైదరాబాద్: యూనివర్సిటీలు కేంద్రంగా కొద్ది నెలలుగా సాగుతోన్న ఆందోళనల్లో భాగంగా రేపు కీలక పరిణామం చోటుచేసుకోనుంది. హిందూ మంతంలో దళితులపై కొనసాగుతున్న వివక్షను నిరసిస్తూ బౌద్ధాన్ని స్వీకరించిన బాబాసాహెబ్ బీఆర్ అంబేద్కర్ బాటలోనే రోహిత్ వేముల కుటుంబం కూడా పయనించనుంది. దళితుడు కావడం వల్లే తన కుమారుడు వివక్షకు గురయ్యాడని, విద్యాలయం నుంచి వెలివేశారని, తనకు న్యాయం చేయాలంటూ కొద్ది నెలలుగా ఆందోళన కొనసాగిస్తోన్న రోహిత్ వేముల తల్లి రాధిక హిందూ మతాన్ని వీడి బౌద్ధాన్ని స్వీకరించనున్నారు. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా గురువారం ముంబై మహానంగరంలో జరిగే కార్యక్రమంలో రోహిత్ తల్లి రాధికతోపాటు సోదరుడు రాజాకూడా బౌద్ధం స్వీకరిస్తారు. ఈ మేరకు వారిద్దరూ కొద్దిమంది స్నేహితులతో కలిసి బుధవారం హైదరాబాద్ నుంచి ముంబై పయనమయ్యారు. బౌద్ధ ధర్మం అసమానతలకు తావులేనిదిగా భావించడం వల్లే బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆ మతాన్ని స్వీకరించాడని, అటువంటి సమాన త్వాన్ని కాంక్షించే తాము కూడా అంబేడ్కర్ చూపిన మార్గంలో పయనించేందుకు నిర్ణయించుకున్నట్లు వేముల రాజా మీడియాకు తెలిపారు. రెండేళ్ల కిందట కేంద్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిన కొద్ది నెలలకే సంఘ్ పరివార్ 'ఘర్ వాపసీ' కార్యక్రమాన్ని ప్రారంభించడం, పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రులు, ఒక పార్టీకి చెందిన ఎంపీలు అనుచిత వ్యాఖ్యలు చేయడం, వాటిపై దేశవ్యాప్తంగా ఆందోళనలను చెలరేగటం విదితమే. ఆ తర్వాత గో మాంసం వివాదం, విద్యావ్యవస్థ కషాయీకరణ తదితర అంశాలపై దళిత, మైనారిటీ వర్గాలు ఎక్కడికక్కడ ఆందోళనలు చేపట్టడం తెలిసిందే. ఈ క్రమంలోనే అంబేద్కర్ విద్యార్థి సంఘం సభ్యుడు, హెచ్ సీయూ స్కారల్ రోహిత్ వేముల సంఘంసంఘ్ అనుబంధ ఏబీవీపీ విద్యార్థి సంఘంతో గొడవపడి, ఆత్మహత్యకు పాల్పడటం, అనంతరం దళితులపై వివక్షను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాలు పుట్టుకురావటం చూశాం. రోహిత్ కుటుంబం బౌద్ధమత స్వీకారంతో వర్సిటీల్లోని వేలమంది అణగారిన విద్యార్థులు కూడా అదే బాటపట్టే అవకాశం లేకపోలేదు. -
హెచ్ సీయూలో ఉద్రిక్తత
విద్యార్థుల చలో హెచ్ సీయూ పిలుపు, వీసీ అప్పారావు ఆధ్వర్యంలో అకడమిక్ కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రోహిత్ వేముల మృతికి కారణమైన వీసీ అప్పారావును తొలగించాలని, రోహిత్ యాక్ట్ తీసుకురావాలనే డిమాండ్ తో హెచ్ సీయూ జాక్ బుధవారం చలో హెచ్ సీయూకి పిలుపు నిచ్చింది. ఈ నేపథ్యంలో వర్సిటీ వద్ద భద్రత కట్టు దిట్టం చేశారు. మీడియాతో సహా.. బయటి వారిని వర్సిటీలోకి అనుమతించడం లేదు. మరో వైపు యూనివర్సిటీ వీసీ అప్పారావు ఆధ్వర్యంలో అకడమిక్ కౌన్సిల్ సమావేశం జరగ నుంది. కౌన్సిల్ సమావేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామని విద్యార్థి జేఏసీ స్పష్టం చేసింది. -
6న ‘చలో హెచ్‌సీయూ’కి జేఏసీ పిలుపు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ) సామాజిక న్యాయ పోరాట ఐక్య కార్యాచరణ కమిటీ(జేఏసీ) ఏప్రిల్ 6న ‘చలో హెచ్‌సీయూ’కు పిలుపునిచ్చింది. రోహిత్ వేముల మృతికి, అంబేడ్కర్ స్టూడెంట్ అసోసియేషన్(ఏఎస్ఏ) నాయకుడు ప్రశాంత్ సహా నలుగురు విద్యార్థుల రస్టికేషన్‌కు కారణమైన వైస్ చాన్స్‌లర్ అప్పారావును పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్‌తో ఈ ఆందోళన చేపడతున్నామని విద్యార్థి నేతలు ప్రశాంత్, వెంకటేశ్ చౌహాన్, జుహైల్ ‘సాక్షి’కి తెలిపారు. వీసీ పునరాగమనం వెనుక దాగి ఉన్న కుట్రను బట్టబయలు చేసేందుకే ‘చలో హెచ్‌సీయూ’కు పిలుపునిచ్చినట్టు చెప్పా రు. అరెస్టులు, లాఠీచార్జీలు, జైలు గోడలను ఛేదించుకొని ఉద్యమాన్ని మరింత విస్తృతం చేయాలని భావిస్తున్నట్టు వారు స్పష్టం చేశారు. ‘చలో హెచ్‌సీయూ’కు వేలాదిగా తరలి రావాలని కోరారు. -
హెచ్‌సీయూలో మళ్లీ ఉద్రిక్తత
♦ కేరళ ఎంపీలకు వర్సిటీలోకి అనుమతి నిరాకరణ ♦ ప్రధాన గేటు వద్ద బైఠాయించిన ఎంపీలు, విద్యార్థులు హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో గురువారం మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేరళకు చెందిన వామపక్ష పార్టీల పార్లమెంట్ సభ్యులు పీకే బిజు, ఎంబీ రాజేష్, డాక్టర్ ఎ.సంపత్ హెచ్‌సీయూ విద్యార్థులకు సంఘీభావం తెలపడానికి రావడంతో సెక్యూరిటీ సిబ్బంది వారిని ప్రధాన గేటు వద్దే అడ్డుకున్నారు. వర్సిటీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం తెలపడానికి మాత్ర మే తాము వచ్చామని వారు సెక్యూరిటీ సిబ్బం దికి స్పష్టం చేశారు. అయినా వారిని లోనికి అనుమతించకపోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. కేరళ ఎంపీలను అడ్డుకున్నారనే విషయం తెలుసుకున్న హెచ్‌సీయూ విద్యార్థులు ప్రధాన గేటు వద్దకు చేరుకున్నారు. ఎంపీలను లోపలికి పంపాలని డిమాండ్ చేశారు. దీంతో సెక్యూరిటీ సిబ్బందికి, విద్యార్థులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. పార్లమెంట్ సభ్యులను లోపలికి అనుమతించేది లేదని స్పష్టం చేయడంతో ఎంపీలు, విద్యార్థులు ప్రధాన గేటు వద్దే బైఠాయించి నిరసన తెలిపారు. స్మృతి పదవిని దిగజార్చారు: కేరళ ఎంపీ కేంద్ర విద్యా శాఖకు మౌలానా ఆజాద్ వన్నె తెస్తే.. స్మృతి ఇరానీ ఆ పదవిని దిగజార్చారని కేరళ ఎంపీ ఎంబీ రాజేష్ విమర్శించారు. హెచ్‌సీయూ ప్రధాన గేటు వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్రం దేశంలోని వర్సిటీలను కాషాయీకరణ చేస్తోందని విమర్శించారు. పార్లమెంట్‌లోనూ స్మృతి ఇరానీ అబద్ధాలు చెప్పి సభను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ ఆగడాలు పెరిగిపోయాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఆంగ్లేయుల కాలంలో భారతీయులపై పెట్టిన ఐపీసీ 124(ఏ) సెక్షన్ల కింద విద్యార్థులపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. హెచ్‌సీయూ వీసీ అప్పారావును ‘అప్పర్’ రావు కాదని.. ‘లోయర్’రావుగా పీకే బిజు అభివర్ణించారు. హెచ్‌సీయూలో నెలకొన్న పరిస్థితులను పరిశీలించి, వీసీ, రిజిస్ట్రార్లను కలసి మాట్లాడాలని అనుకున్నప్పటికీ వారు స్పందించకపోవడం, లోపలికి అనుమతించకపోవడం విడ్డూరమన్నారు. మరో ఎంపీ సంపత్ మాట్లాడుతూ హెచ్‌సీయూలో సాక్షాత్తు పార్లమెంటు సభ్యులతో అనుసరించిన వైఖరి చూస్తూంటే ఇక విద్యార్థులతో ఎలా ప్రవర్తిస్తున్నారో అర్థమవుతోందన్నారు. హెచ్‌సీయూలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. కుల నిర్మూలన పోరాటానికి కేంద్రం: తీస్తా సెతల్వాద్ హెచ్‌సీయూ కుల నిర్మూలన పోరాటానికి కేంద్రంగా మారిందని ప్రముఖ సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ విమర్శించారు. గురువారం విద్యార్థులకు సంఘీభావం తెలిపేం దుకు ఆమె వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ వర్సిటీలో రోహిత్ వేముల ఆత్మహత్య, ఆ తర్వాత జరిగిన ఘటనలను సమాజంలోని అన్ని వర్గాల వారు ఖండించాలన్నారు. హెచ్‌సీయూ విద్యార్థులకు న్యాయం జరిగే వరకు, కేంద్రం దిగి వచ్చే వరకు విద్యార్థుల పోరాటానికి ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. -
రోహిత్ ఘటనపై ప్రభుత్వ నిర్లక్ష్యం సరికాదు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తినా తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని సామాజిక కార్యకర్త తీస్తాసతల్వాద్ అన్నారు. సుందర య్య విజ్ఞానకేంద్రంలో రోహిత్ పోరాట సంఘీభావ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో తీస్తాసతల్వాద్ మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్రప్రభుత్వాలే హెచ్సీయులో జరుగుతున్న విద్యార్థి వ్యతిరేక విధానాలకు కారణమని దుయ్యబట్టారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అప్పారావును పదవినుంచి ఉపసంహరింపజేసే విషయమై అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీని నిలెబట్టుకోవాలని ఆమ్ఆద్మీపార్టీ స్పోక్స్‌పర్సన్ ప్రొఫెసర్ విశ్వేశ్వర్రావు డిమాండ్ చేసారు. గ్రామాల్లోని వెలివాడల కొనసాగింపుగా విశ్వవిద్యాలయాల్లోని వెలుస్తున్న వెలివాడలను నిర్మూలించడానికి బదులు వివక్షను రూపుమాపాలని కార్యక్రమానికి అధ్యక్షత వహించిన బండారు లక్ష్మయ్య అన్నారు. దళిత, ఆదివాసీలకు చదువుకునే అవకాశం లేకుండా చేసేందుకు, విశ్వవిద్యాలయాలు అగ్రకుల కేంద్రాలుగా తయారుచేసేందుకు ప్రభుత్వాలు కుట్రపన్నుతున్నాయని విద్యాపరిరక్షణ కమి టీ కార్యదర్శి కె.రవిచందర్ అభిప్రాయపడ్డారు. విరసం సభ్యురాలు గీతాంజలి మాట్లాడుతూ తక్షణమే సెంట్రల్ యూనివర్సిటీలో పోలీసు బలగాలను ఉపసంహరించుకోవాలని, వీసీ అప్పారావుని తొలగించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న అమానవీయ ఘటనలను ఈ సమావేశం ముక్తకంఠంతో ఖండించింది. ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకొని కేంద్రంతో సంప్రదింపులు జరిపి వీసీ అప్పారావుని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. హెచ్‌సీయూ ఘటనపై వివరణ ఇవ్వండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన మానవహక్కుల ఉల్లంఘన విషయంలో జోక్యం చేసుకోవాలంటూ ఆమ్ఆద్మీ పార్టీ నాయకులు ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, నమ్రతలు రాష్ట్రమానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే హెచ్ఆర్సీ ఎదుట హాజరుకావాలంటూ సైబరాబాద్ పోలీసులకు గతంలో ఇచ్చిన ఆదేశాలపైవారు స్పందించకపోవడంతో ఏప్రిల్ రెండవ తేదీన కమిషన్ ఎదుట హాజరుకావాలని రాష్ట్ర మానవహక్కుల కమిషన్ సైబరాబాద్ పోలీసులను తిరిగి ఆదేశించింది. ఏప్రిల్ 2వ తేదీన 11 గంటలకు కమిషన్ ఎదుట హాజరై ఘటనకు సంబంధించిన వివరణ ఇవ్వాల్సిందిగా కోరింది. -
'నా బిడ్డ మరణానికి వీసీనే కారణం'
హైదరాబాద్: రోహిత్ వేముల మరణానికి వీసీ అప్పారావే కారణమని తల్లి రాధిక అన్నారు. వీసీ చర్యలను వ్యతిరేకిస్తే విద్యార్థులను అరెస్ట్ చేస్తారా..? అని మండిపడ్డారు. హెచ్‌సీయూలో వీసీ అప్పారావు మళ్లీ విధులకు హాజరై ఉద్దేశపూర్వకంగానే విద్యార్థులను రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. మరోవైపు హెచ్‌సీయూలో అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితులు చక్కదిద్దేందుకు యూనివర్సిటీ స్థాయి కమిటీని వేశారు. రోహిత్ ఆత్మహత్య ఘటన అనంతరం కొనసాగుతున్న ఆందోళనను విరమింపజేసి తిరిగి యధాస్థితికి తెచ్చేందుకు ఏమేం చర్యలు తీసుకోవాలో తెలియజేసేందుకు ప్రొఫెసర్ కామయ్య చైర్మన్ గా ఏడుగురితో కమిటీని వేశారు. -
హెచ్‌సీయూలో మళ్లీ ఉద్రిక్తత
వర్సిటీలోకి వెళ్లేందుకు రోహిత్ తల్లి, తమ్ముడి యత్నం ♦ అడ్డుకున్న హెచ్‌సీయూ భద్రతా సిబ్బంది ♦ వర్సిటీలోకి చొచ్చుకువెళ్లేందుకు ప్రయత్నించిన పీడీఎస్‌యూ నాయకులు ♦ అడ్డుకున్న భద్రతా సిబ్బంది.. తోపులాట ♦ పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో శనివారం ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. భారీ సంఖ్యలో హెచ్‌సీయూ భద్రతా సిబ్బంది, సైబరాబాద్ పోలీసులు బందోబస్తు కొనసాగిస్తున్నారు. శనివారం ఉదయం వర్సిటీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన రోహిత్ తల్లి రాధిక, సోదరుడు రాజులను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. అనంతరం వర్సిటీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన పీడీఎస్‌యూ కార్యకర్తలనూ నిలువరించారు. దీంతో తోపులాట, ఉద్రిక్తత చోటుచేసుకున్నాయి. హెచ్‌సీయూ ప్రధాన గేటు వద్ద శనివారం కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్రిక్తత పరిస్థితి కొనసాగింది. వర్సిటీలోకి బయటివారెవరినీ అనుమతించలేదు. గుర్తింపు కార్డులున్న విద్యార్థులు, ఉద్యోగులు, అధికారులను మాత్రమే లోపలికి అనుమతించారు. రోహిత్ వేముల తల్లి రాధిక, తన కుమారుడు రాజుతో కలసి విద్యార్థి జేఏసీ నాయకులకు సంఘీభావం తెలిపేందుకు శనివారం ఉదయం వర్సిటీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ భద్రతా సిబ్బంది వారిని ప్రధాన గేటు వద్దే అడ్డుకున్నారు. అనుమతి లేనిదే ఎవరినీ లోపలికి వదలవద్దని ఆదేశాలున్నాయని స్పష్టం చేశారు. దీంతో సెక్యూరిటీ సిబ్బందికి, ఆమెకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తన ఆరోగ్యం బాగా లేదని, వర్సిటీ హెల్త్ సెంటర్‌కు వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటానని రాధిక చెప్పినా.. వారు లోపలికి అనుమతించలేదు. కొంతసేపటి తర్వాత రాధిక నీరసంగా పడిపోవడంతో... హెల్త్ సెంటర్ సిబ్బంది ప్రధాన గేటు వద్దకు వచ్చి రక్త పరీక్షల కోసం నమూనాలను తీసుకున్నారు. అనంతరం వర్సిటీ అంబులెన్స్‌లో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వీసీ అప్పారావు తిరిగి రావడాన్ని వ్యతిరేకించిన విద్యార్థులను అకారణంగా అరెస్టు చేశారని, వారిని వెంటనే విడుదల చేయాలని రాధిక డిమాండ్ చేశారు. వీసీపై చర్యలు తీసుకునే వరకు విద్యార్థులతో కలసి పోరాటం చేస్తామన్నారు. గేటు ఎదుట పీడీఎస్‌యూ నాయకుల బైఠాయింపు యూనివర్సిటీలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా చేయాలని.. రోహిత్ కుటుంబానికి, విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్‌యూ నాయకులు, కార్యకర్తలు ప్రధాన గేటు ఎదుట ధర్నా చేశారు. వర్సిటీల్లో వివక్షను రూపుమాపాలని, రోహిత్ చట్టాన్ని తీసుకురావాలని, పోలీసులను వర్సిటీలోకి అనుమతించరాదని డిమాండ్ చేశారు. అనంతరం వారు లోనికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ప్రధాన గేటును మూసివేసేందుకు భద్రతా సిబ్బంది ప్రయత్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. చివరికి భద్రతా సిబ్బంది పలువురు నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని, పోలీసులకు అప్పగించారు. రోహిత్ ఉద్యమానికి రాజకీయ రంగు: గాలి వినోద్‌కుమార్ రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, వామపక్ష నాయకులు వచ్చిన తర్వాత రోహిత్ వేముల ఉద్యమం రాజకీయ రంగు పులుముకొందని ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ ఆరోపించారు. కుల వివక్ష అంతమయ్యేంతవరకూ తన ఉద్యమం ఆగదంటున్న కన్హయ్యకుమార్.. కుల నిర్మూలన కోసం ఎందుకు గళమెత్తడం లేదని ప్రశ్నించారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టులు సహా అన్ని ఉత్తరాది పార్టీలు ఐక్యమై రోహిత్ ఘటనను దృష్టి మళ్లించాయని... దేశభక్తులు, దేశద్రోహులన్న పేరుతో కన్హయ్య వైపు మరల్చాయని ఆరోపించారు. రాహుల్ గాంధీ రోహిత్‌కు సంఘీభావం తెలిపేందుకు రెండు సార్లు హైదరాబాద్‌కు వచ్చారని... మరి కులవివక్షపై చట్టం తీసుకురావాలని పార్లమెంట్లో ఎందుకు పోరాడడం లేదని ప్రశ్నించారు. -
అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలి
సెంట్రల్ వర్సిటీలో విద్యార్థుల ధర్నా ♦ పోలీసుల పహారాలోనే హెచ్‌సీయూ.. ♦ బయటి వారిపై యథావిధిగా ఆంక్షలు ♦ చర్లపల్లి జైలులో అరెస్టయిన విద్యార్థులకు పరామర్శల వెల్లువ ♦ విద్యార్థులను పరామర్శించిన ఉత్తమ్, అసద్ తదితరులు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ)లో విద్యార్థుల ఆందోళన కొనసాగింది. వైస్ చాన్స్‌లర్ నివాసంపై దాడి తదితర ఘటనల్లో అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం వర్సిటీలో విద్యార్థులు ధర్నా చేశారు. ఒకవైపు వివాదం కొనసాగుతుండగానే వీసీ అప్పారావు బాధ్యతలు చేపట్టడాన్ని తప్పుబట్టారు. ఆయనను వెంటనే విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. మరోవైపు సెంట్రల్ వర్సిటీలో పోలీసు బందోబస్తూ కొనసాగుతోంది. బయటి వ్యక్తులను యూనివ ర్సిటీలోకి అనుమతించడం లేదు. ఐడీ కార్డులు పరిశీలించిన అనంతరం విద్యార్థులు, వర్సిటీ సిబ్బందిని మాత్రమే అనుమతిస్తున్నారు. మరోవైపు పోలీసుల జోక్యాన్ని నిరసిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు వీసీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కాగా, వరుస సెలవుల నేపథ్యంలో చాలా మంది విద్యార్థులు సొంత ఊళ్లకు వెళ్లారు. ఇదిలా ఉండగా వర్సిటీలో విధ్వంసం, దాడుల నేపథ్యంలో అరెస్టై చర్లపల్లి జైలులో ఉన్న విద్యార్థులు, అధ్యాపకులను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, దాసోజు శ్రవణ్‌కుమార్, మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే బలాల, సీనియర్ పాత్రికేయుడు మల్లేపల్లి లక్ష్మయ్య తదితరులు పరామర్శించారు. విశ్వవిద్యాలయాలను విచ్ఛిన్నం చేసే కుట్ర: హరగోపాల్ దేశంలోని విశ్వవిద్యాలయాలను విచ్ఛిన్నం చేసేందుకు సంఘ్ పరివార్ ప్రయత్నిస్తోందని పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ ఆరోపించారు. సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ ఆధ్వర్యం లో శుక్రవారం హైదర్‌గూడ ఎన్ఎస్ఎస్లో ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సెంట్రల్ వర్సిటీ ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్రలు పన్నుతూ విద్యార్థుల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. జ్యుడీషియల్ విచారణ పూర్తికాక మునుపే అప్పారావును మళ్లీ వీసీగా నియమించడం కేంద్రం కుట్ర అని, ఇందులో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు హస్తం ఉందని ఆరోపించారు. అన్ని విద్యార్థి సంఘాలు హింసకు పాల్పడవద్దని కోరారు. కమిటీ అధ్యక్షుడు చక్రధర్‌రావు, ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, మనోహర్‌రావు(టీపీటీఎఫ్), ఎంఎన్ కిష్టప్ప(డీటీఎఫ్), ప్రదీప్‌కుమార్(పీడీఎస్‌యూ), వేణు(ఎస్ఐఎస్ఎఫ్) తదితరులు పాల్గొన్నారు. దళిత వ్యతిరేక స్వరూపం బయటపడింది: ఉత్తమ్ హెచ్‌సీయూ ఘటనల తో టీఆర్ఎస్ ప్రభు త్వ దళిత వ్యతిరేక స్వ రూపం బయటపడిం దని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. విద్యార్థులకు బెయిల్ కూ డా లభించకుండా చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైనా వీసీ అప్పారావు తిరిగి విధులకు ఎలా హజరవుతారని ప్రశ్నిం చారు. బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు కల సి విద్యార్థులను అక్రమ కేసుల్లో ఇరికిం చేందుకు యత్నిస్తున్నాయన్నారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రంలో పోలీసు రాజ్యం కొనసాగుతోందని ఆరోపించారు. వీసీ అప్పారావును అరెస్ట్ చేయాలి: రోహిత్ తల్లి తన కుమారుని చావుకు కారణమైన వీసీకి పోలీసులు బందోబస్తు ఇస్తున్నారని, ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులను మాత్రం అరెస్ట్ చేస్తున్నారని, ఇదెక్కడి న్యాయమని రోహిత్ వేముల తల్లి రాధిక ప్రశ్నించారు. తన కుమారుని చావుకు కారణమైన వీసీ అప్పారావును విధుల నుంచి తొలగించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ స్టూడె ంట్స్ జేఏసీ, టీచర్స్ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం హైదర్‌గూడ ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హెచ్‌సీయూ అధ్యాపకులతో కలసి ఆమె మాట్లాడారు. తాము న్యాయం కోసం ఎంతకాలం నిరీక్షించాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విశ్వవిద్యాలయంలో చిచ్చు రేపాలనే ప్రభుత్వం అప్పారావును మరలా వీసీగా పంపిందని మండిపడ్డారు. రోహిత్ తమ్ముడు రాజు మాట్లాడుతూ తన అన్న ప్రాణం బలిగొన్న వారిపై రెండు నెలలు గడుస్తున్నా చర్యలు తీసుకోకపోగా, అమాయకులైన విద్యార్థులను అరెస్ట్ చేశారని, వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థిలోకానికి తప్పుడు సంకేతాలు: అసద్ హెచ్‌సీయూ ఉదంతంపై ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని, వివాదాలకు ఇంతటితో ఫుల్స్టాప్ పెట్టకపోతే విద్యార్థిలోకానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అసదుద్దీన్ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులను, ప్రొఫెసర్లను అరెస్ట్ చేసి పోలీసులు విచక్షణారహితంగా కొట్టారని, ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తుతామని చెప్పారు. వీసీ అప్పారావును విధుల నుంచి తొల గించి, రోహిత్ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాగా, అసదుద్దీన్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో పలువురు యూ త్ కాంగ్రెస్ నాయకులు ‘భారత్ మాతాకీ జై’ అంటూ నినదించడంతో ఉద్రిక్తత నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు యూత్ కాంగ్రెస్ సభ్యులను అక్కడి నుంచి పంపేశారు. -
అమానుషంగా వ్యవహరించారు...
ములాఖత్‌కు వెళ్లిన నేతలతో హెచ్‌సీయూ విద్యార్థుల వెల్లడి సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూలో తాము శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తుండగా పోలీసులు అమానుషంగా వ్యవహరించి అక్రమంగా అరెస్టు చేశారని చర్లపల్లి జైలులో ఉన్న హెచ్‌సీయూ విద్యార్థులు శుక్రవారం ములాఖత్ కోసం వెళ్లిన నేతలతో వాపోయారు. పోలీసులు పథకం ప్రకారమే తమను అరెస్టు చేశారని, ముందుస్తు వ్యూహం అమలు చేశారని పేర్కొన్నట్లుగా ములాఖత్‌కు వెళ్లివచ్చిన నేతలు వెల్లడించారు. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ తదితర పార్టీల నేతలు, ప్రముఖ జర్నలిస్టు మల్లెపల్లి లక్ష్మయ్య విడివిడిగా జైలులో ఉన్న విద్యార్థులు ప్రశాంత్, వెంకటేశ్ చౌహాన్, ప్రొఫెసర్ రత్నం, కృశాంక్, లింగస్వామి, అమృతరావు, దుంగ హరీష్‌లతో ములాఖత్ అయ్యారు. హెచ్‌సీయూ ఘటనల గురించి అడిగి తెలుసుకున్నారు. తమను పోలీసులు పలు పోలీస్స్టేషన్లలో ఉంచి అమానుషంగా వ్యవహరించారని విద్యార్థులు చెప్పారు. పోలీసుల చర్యల కారణంగా తమ తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు తీవ్ర వేదనకు గురయ్యారని, కొందరు ఆస్పత్రి పాలయ్యారని జైలులో ఉన్న అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రశాంత్ ఆవేదన వ్యక్తం చేసినట్లుగా ములాఖత్‌కు వెళ్లివచ్చిన మౌలానా ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థిని అరుణ తెలిపారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ ఖండన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో శాంతియుతంగా ఉద్యమిస్తున్న విద్యార్థులు, అధ్యాపకులపై పోలీసుల దాడిని, అరెస్టులను అంతర్జాతీయ మానవహక్కుల సంఘం ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా తీవ్రంగా ఖండించింది. విశ్వవిద్యాలయంలో పోలీసుల మోహరింపుపై, జరిగిన ఘటనలపై స్వతంత్ర విచారణ జరిపించాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణమైన వీసీ అప్పారావు రాకను తిరస్కరిస్తూ శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న విద్యార్థులపై తెలంగాణ పోలీసులు దాడులు చేయడం అన్యాయమని, దీనిపై సమగ్ర విచారణ జరపాలన్నారు. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం న్యాయవిచారణ లేకుండా ఎవరినీ శిక్షించే అధికారం లేదని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సయ్యద్ ఆకార్ పటేల్ ఆ ప్రకటనలో వ్యాఖ్యానించారు. -
విద్యార్థుల్లో అలజడికి బాధ్యులెవరు?
రోహిత్ వేముల ఆత్మహత్యతో అట్టుడికిపోయిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇప్పుడిప్పుడే ప్రశాంత పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో వైస్ చాన్సలర్ అప్పారావు రాక ఒక్కసారిగా అలజడి రేపింది. అప్పారావుకు వ్యతిరేకంగా, అనుకూలంగా క్యాంపస్‌లో మళ్లీ ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఇదే పరిస్థితుల్లో జేఎన్‌యూ విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్ హైదరాబాద్ రాక పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసింది. రోహిత్ వేముల విద్యార్థిని ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వైస్ ఛాన్సలర్ అప్పారావు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయలపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు దాఖలైన విషయం తెల్సిందే. ఈ కేసు నుంచి విముక్తం కాకముందే, కేసులో క్లీన్ చిట్ లభించక ముందే అప్పారావు మళ్లీ వీసీ కుర్చీలో కూర్చోవడంతో అలజడి చెలరేగింది. ప్రశాంత పరిస్థితులను నెలకొల్పేందుకు కృషిచేయాల్సిన పోలీసుల ఓవర్‌యాక్షన్ వల్ల ఉద్రిక్తత తీవ్రమవుతోంది. విద్యార్థులను చితక్కొట్టారు, క్యాంపస్‌లో మెస్‌ను మూసేశారు... విద్యుత్ సరఫరా కట్ చేశారు. క్యాంపస్‌లోకి ఎవరినీ అనుమతించడం లేదు. ఆఖరికి మీడియాను కూడా అనుమతించడంలేదు. బుధవారం జేఎన్‌యూ విద్యార్థినేత కన్హయ్య కుమార్‌ను కూడా అనుమతించలేదు. అప్పారావును మళ్లీ బాధ్యతలు నిర్వహించేందుకు అనుమతించడం అంటే మోదీ ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కి తగ్గలేదన్న మాట. పార్టీ చేపట్టిన హిందూత్వ ఎజెండాను ముందుకు తీసుకువెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నదన్న విషయం స్పష్టమవుతోంది. విద్యార్థుల్లో మోదీ ప్రభుత్వం రేపిన చిచ్చు ఒక్క హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకో, జేఎన్‌యూకో పరిమితం కాలేదు. పూణెలోని 'ఫిల్మ్స్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా', మద్రాస్ యూనివర్సిటీల్లోనూ చిచ్చు రేపింది. ఈ చిచ్చు ప్రస్తుతానికి స్థానిక పరిణామాలకే పరిమితం కావచ్చు. కానీ ప్రతిపక్షాలు అవకాశంగా తీసుకుంటున్నాయి కనుక జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై తప్పక ప్రభావం చూపనుంది. - ఓ సెక్యులరిస్ట్ కామెంట్ -
హెచ్సీయూకు 27 వరకు సెలవులు
హైదరాబాద్: వైస్ చాన్స్‌లర్ అప్పారావు రాకతో ఒక్కసారిగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మళ్లీ మొదలైన ఆందోళనల నేపథ్యంలో యూనివర్సిటీ యాజమాన్యం ఆంక్షలను కఠిన తరం చేసింది. యూనివర్సిటీకి ఈనెల 27వ తేదీ వరకు సెలవులు ప్రకటించింది. యూనివర్సిటీలోకి మీడియా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, బయటి విద్యార్థులు, వేరే విద్యార్థి సంఘాల నేతలకు సైతం అనుమతి నిరాకరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అవసరమైన పోలీసు బలగాలను మోహరించాలని యూనివర్సిటీ యాజమాన్యం పోలీస్ కమిషనర్‌కు లేఖ రాసింది. యూనివర్సిటీ మెయిన్ గేట్‌ను మాత్రమే తెరచి కేవలం యూనివర్సిటీకి సంబంధించిన వ్యక్తులకు మాత్రమే ప్రవేశం కల్పించనున్నామని యాజమాన్యం వెల్లడించింది. మరోవైపు హెచ్‌సీయూలో కన్హయ్యకుమార్ సభ నిర్వహించేందుకు కొన్ని విద్యార్థి సంఘాలు ప్రయత్నిస్తుండగా.. అసలు కన్హయ్యకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఉందా లేద అనే విషయం ఇప్పుడు వివాదాస్పదంగా మారేలా కనిపిస్తోంది. ఇప్పటివరకు పోలీసుల నుంచి కన్హయ్యకు ఎలాంటి అనుమతి లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో హెచ్‌సీయూ వరకు రావడం మాట అటుంచి, అసలు హైదరాబాద్‌లోనైనా అతడిని అడుగు పెట్టనిస్తారా లేదా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ అప్పారావు మళ్లీ బాధ్యతలు చేపట్టడంతో విద్యార్థులు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. మంగళవారం వీసీ నివాసంపై దాడికి పాల్పడిన 36 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా, రోహిత్ తల్లి నేడు హెచ్‌సీయూలో దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో హెచ్‌సీయూలో పరిస్థితి టెన్షన్ టెన్షన్‌గా మారింది. -
నిప్పురవ్వను ఊది మంటచేసి...
విశ్లేషణ రోహిత్ వేముల ఆత్మహత్య... కచ్చితంగా చెప్పాలంటే కదలించే ఆయన ఆత్మహత్య లేఖ... అసమ్మతి నిప్పురవ్వను రగిల్చింది. మితవాద పక్షం మూర్ఖంగా కన్హయ్య నాలుకకు, తలకు వెలలను ప్రకటించి ఆ నిప్పురవ్వను ఊది మంటగా ఎగదోసింది. దానంతట అదిగానే సద్దుమణిగిపోయే సమస్యను నిద్రలేపింది. కన్హయ్య కుమార్, నికార్సయిన జవహర్లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయం విద్యార్థి. ఆలో చనాపరుడు, లోతైన పరిశీలన గలవాడు, ధైర్యవంతుడు, సుస్పష్టంగా తన భావాలను వ్యక్తపరచగలవాడు. రారమ్మని పిలుస్తున్న కొత్త వృత్తి రాజ కీయాలకు బదిలీ అయితే తప్ప, ఆయనకు పీహెచ్డీ ఎలాగూ వస్తుంది. బెయిల్‌పై విడుదలయ్యాక ఆయన చేసిన ఉపన్యాసం ఉత్తేజకరమైనది. ఆయన తన వైఖరిని సుస్పష్టంగా వెల్లడించారు. ప్రస్తుతం ఆయన హృదయం, మేధస్సు కూడా రాజద్రోహంపైనే లగ్నమై ఉన్నాయి. రాజ్యాంగాన్ని ఆమోదించి మనం సాధించుకున్న స్వేచ్ఛలను, గౌరవాన్ని ఆయన కోరుతున్నారు. మితవాదానికి ఆయన బద్ధవ్యతిరేకి. నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్, పెట్టుబడిదారీ విధానం అంటూ ఆ శక్తులనూ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు కారణమయ్యారు. ఆర్థికవ్యవస్థకు సెన్సెక్స్లా, సోషల్ మీడియా కూడా ఒక విధమైన ప్రతిస్పందనా సూచిక. అయితే ఇవి రెండూ కిందా మీదా చేయగలిగినవే, చేస్తు న్నారు కూడా. మొదట ఉద్దేశపూర్వకంగా ఏదైనా రెచ్చ గొట్టే వ్యాఖ్యను చేసి, ఆ తర్వాత ఏదో ఒక సాకుతో దానికి అనుకూలంగా, ప్రతికూలంగా చర్చను రేకెత్తించవచ్చు. కన్హయ్య, సాధారణంగా కంటే కొన్నేళ్లు ఎక్కువే జేఎన్‌యూ విద్యార్థిగా ఉన్నారు. కాబట్టి ఆయన విద్యార్థి మాత్రమేనా లేక ఇంకా మరేదైనా కూడా అయి ఉండి, ఆ విద్యా సంస్థలో తలదాచుకున్నారా? అనే ప్రశ్నలు రేగు తున్నాయి. వాటిని పట్టించుకోనవసరం లేదు. విద్య నేర్వడం ఎప్పుడూ ఒకే పద్ధతిలో నడవాలనేం లేదు. వివిధ టీవీ చానళ్లకు ఆయన తన గురించి తెలిపిన దాని ప్రకారం... అతను ‘రాజకీయ కార్యకర్త’, ‘విద్యార్థి నేత’, ఆసక్తికరంగా ‘కమ్యూనిస్టుల అధికారిక ప్రతినిధి కాదు.’ బతికి బట్టకట్టడం కోసం ఆయాసపడుతున్న వామపక్షాలకు ఆయన ఊపిరి పీల్చుకునే అవకాశాన్ని కల్పించారు. కాబట్టి కొన్నేళ్లపాటూ జాగ్రత్తగా గమనించాల్సిన వ్యక్తి. విస్పష్టంగా మాట్లాడటంలోనూ, భావాలలోనూ నరేంద్ర మోదీకి సరిగ్గా దీటుగా నిలవగలవాడిగా కన్హయ్యను గుర్తించిన వామపక్ష నేతలు వెంటనే ఆయన రక్షణకు రంగంలోకి దిగారు. వామపక్షాలలోని అతి కొద్దిమంది తప్ప మరెవరూ సాటిరాని విధంగా ఆయన ఆ పనిని చేశారు లేదా ఆయన అద్భుత వాగ్ధాటిని చూస్తే అలా అనిపిస్తోంది. చర్చా వేదకపై గంధకంలా ఘాటుగా అనిపించే ఆయనకు మరో పార్శం కూడా ఉంది. మార్క్ ఆంటోనీ (గొప్ప ప్రభావశీలియైన ఉపన్యాసకునిగా) కన్హయ్య కమార్ వద్ద పోస్టల్ ట్యూషన్ తీసుకోవాలని నాకు తెలిసిన కొందరు వ్యాఖ్యానించారు. వేదిక మీద లేనప్పుడు అతడు తన ఆలోచనలను సుస్పష్టంగా, ప్రశాంతంగా వ్యక్తం చేయగలిగినవారు. అందువల్ల సాధారణ టీవీ వీక్షకులకు అతను చెప్పే విషయాలు తేలికగా అర్థం అవుతాయి. వివిధ వైఖరులను మృదువుగా వ్యక్తం చేయగలిగిన ఆయన స్వరం.. సాధారణంగా ఆధిపత్యం చలాయించే టీవీ యాంకర్లను మెత్తబరచేస్తుంది. ‘చెబుతావా, లేదంటే నీ తల’ అన్నట్టు సాగే ఇంటర్వ్యూను సంప్రదాయక పద్ధతిలో ప్రశ్నలు అడగడంగా మార్చేస్తుంది. అందుకే టీవీ చానళ్లు ఆయన పట్ల చాలా గౌరవం చూపాయి. చూడండి, పరిస్థితులన్నీ మహా అస్తవ్యస్తంగా ఉన్నాయి, వాటితో పోట్లాడతానని అతను అంటున్నాడు అన్నట్టుంటాయి. టీవీల్లో ఆయన చెప్పిన విషయాలన్నిటినీ మళ్లీ చెప్పడానికైతే ఈ కాలం అవసరం లేదు. అయితే ఆయన చెప్పినవాటినీ, చెప్పిన పద్ధతినీ చూస్తే కచ్చితంగా ఆయన రాజకీయాల్లో బాగా రాణించగల వ్యక్తి. ప్రయాణాలు చేసి, అన్ని సెక్షన్ల ప్రజలతో మాట్లాడాలని తన కోరికని ఆయన చెప్పాడు. అయినా, ఆయన ఇంకా నిజంగా రాజకీయాలకు అంకితమైన రాజకీయవేత్త కారు. ఆయన, భారతీయ జనతా పార్టీని, మోదీని ఎదుర్కోవడం మాత్రమే కాదు, యూపీఏ నుంచి బయటకు వచ్చేసి, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ చేతుల్లో ఓడిపోయినప్పటి నుంచి... ఒక దిశంటూ లేకుండా ఉన్న వామపక్షాలకు కేంద్ర రంగ స్థలిపైకి తలుపులు కూడా తెరిచారు. జేఎన్‌యూ, జాధవ్‌పూర్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లూ, ఇటీవల అల్హాబాద్ వారికి కొత్త వేదికను కల్పించాయి. కాకపోతే వారు దాన్ని చెడగొట్టుకోకుండా ఉండాలి. విద్యార్థి సంఘాలు, వివిధ వామపక్షాలకు అను బంధ సంస్థలు మాత్రమే. అయితే రోహిత్ వేముల ఆత్మ హత్య... కచ్చితంగా చెప్పాలంటే కదలించే ఆయన ఆత్మ హత్య లేఖ... అసమ్మతి నిప్పురవ్వను రగిల్చింది. మిత వాద పక్షం మూర్ఖంగా కన్హయ్య నాలుకకు, తలకు వెలల ను ప్రకటించి ఆ నిప్పురవ్వను ఊది మంటగా ఎగదో స్తోంది. అసలు మొదట్నించీ వారే.. దానంతట అదిగానే సద్దుమణిగిపోయే సమస్యను నిద్రలేపారు. బూటకపు వీడియోలుగా ఆరోపిస్తున్న వాటిని మితవాద పక్షం సభ్యులు, మద్దతుదార్లు అందించకపోగా ఆయన్ను కొట్టారు, అది చూస్తూ పోలీసులు నిలబడ్డార నేదే లెక్కలోకి వస్తుంది. అత్యంత బలమైన ప్రభుత్వం ఒక వ్యక్తికి వ్యతిరేకంగా నిలిచిందనే ఆలోచనను సామాన్యునిలో కలుగజేస్తుంది. ఒక విద్యార్థి జాతి వ్యతిరేకి అని రుజువు చేయాలని వారు అంతగా తాపత్రయపడకపోతే... కన్హయ్య బహుశా ఓ కళాశాల నేతగానే మిగిలిపోయేవాడు. అతని ఉపన్యాసం కళాశాల ఉపన్యాసంగానే మిగిలేది. మితవాద పక్షం ఆయన్ను ఒక్కసారిగా ఉన్నత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు, మహేష్ విజాపుర్కార్ ఈమెయిల్: mvijapurkar@gmail.com -
ఇపుడు వీస్తున్న గాలి..?
దేశ సామాజిక, రాజకీయ రంగంలో ఇప్పుడు ఒక కొత్త గాలి వీస్తోంది. అది దక్షిణాన హెచ్‌సీయూలో మొదలై.. ఉత్తరాన జేఎన్‌యూ వరకూ సుడిగాలిలా తిరుగుతోంది. ఉన్నత విద్యా సంస్థల్లో మొదలైన ఈ సుడిగాలి ఏ పరిణామాలకు సంకేతం? ‘పదవీ వ్యామోహాలూ, కులమత భేదాలూ భాషా ద్వేషాలూ చెలరేగే నేడూ...’ అన్న మహాకవి మాటలు ఇప్పుడు అక్షర సత్యాలన్నదానితో విభేదించే వారు ఉండరేమో! 90వ దశకంలో ఆర్థిక సంస్కరణలు, ఐటీ రంగ వికాసం, యువత కెరీర్‌కే ప్రాధాన్యమిచ్చి, సామాజిక పరిణామాలను పట్టించుకోకపోవటం వంటి కారణాల వల్ల వారిలో సామాజిక, రాజకీయ వికాసం మందగించిపోయింది. కానీ.. పాతికేళ్ల నిర్లిప్తత తర్వాత రోహిత్ వేముల, కన్హయ్య కుమార్ రూపంలో దేశమంతటా విద్యార్థి ఉద్యమం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. వివక్ష, ఆధిపత్యాలను నిరసిస్తూ రోహిత్ రాసిన ఆత్మహత్య లేఖ.. అరెస్టు, విడుదల తర్వాత కన్హయ్య ప్రసంగాలు.. దేశప్రజలనే కాదు.. రాజకీయ నాయకత్వాన్నే ప్రభావితం చేస్తున్నాయి. దేశభక్తి, జాతీయవాదాలకు కొత్త నిర్వచనాలిచ్చి, మరింత మానవీయమైన సమాజాన్ని ఆకాంక్షిస్తూ.. దూసుకొస్తున్న నేటి విద్యార్థి లోకానికి వీరిద్దరూ ప్రతీకలని మేధోవర్గం భావిస్తోంది. ఈ ప్రభంజనం దేశ రాజకీయ భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేయనుందా? అన్న ఆసక్తికర చర్చ సర్వత్రా సాగుతోంది. విద్యార్థులకు రాజకీయాలతో పనేంటని తలపండిన రాజకీయ నేతలు చెబుతోంటే .. మున్ముందు రాజకీయాలను తామే శాసించబోతున్నామని విద్యార్థి లోకం బలంగా చాటుతోందని పరిశీలకులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సామాజిక, రాజకీయ పరిణామాల్లో విద్యార్థి ఉద్యమాల పరిణామాలపై ‘సాక్షి’ ఫోకస్... మళ్లీ ఉద్యమ పథంలోకి విద్యార్థి లోకం దేశ రాజకీయాలను కుదిపేసిన రోహిత్, కన్హయ్య దేశ ప్రజా చేతనను రగిలించిన రోహిత్ ఆత్మహత్య లేఖ ప్రజలను కట్టిపడేసిన కన్హయ్య ‘ఆజాదీ’ నినాదం వినూత్న విద్యార్థి ఉద్యమాలకు ప్రతీకలుగా తెరపైకి పాతికేళ్ల స్తబ్దత తర్వాత సుడిగాలిలా రేగిన ఉద్యమాలు మార్క్స్ - అంబేద్కర్ సిద్ధాంతాలు, ఆలోచనల మేళవింపు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలే అంతిమ లక్ష్యం అన్ని రకాల దోపిడీలు, అసమానతలపై యుద్ధం భవిష్యత్ రాజకీయాలపై కొత్త ఆశలను రేకెత్తిస్తున్న వైనం పృథ్వీరాజ్ : అసమానతలు, అణచివేతలు సమాజంలో పెరుగుతున్నపుడు.. అసహనాలు, ఆధిపత్య భావజాలాలు రాజ్యం చేస్తున్నపుడు.. ఎక్కడో అక్కడ ఒక అలజడి చెలరేగుతుంది. ఒక కొత్త గాలి వీస్తుంది. చిరుగాలిలా మొదలై సుడిగాలిలా మారుతుంది. తిరుగుబాటు బావుటా రెపరెపలాడుతుంది. సమూల మార్పులకు దారితీస్తుంది. ఇది చరిత్ర రుజువుచేసిన సత్యం. చారిత్రక అవసరాలు మట్టిమనుషులను మన కాలం వీరులుగా మలిచే సందర్భాలను చరిత్ర పొడవునా గమనిస్తూనే వచ్చాం. రెండు వేల సంవత్సరాల కిందట బానిసత్వంపై తిరుగుబాటు చేసిన స్పార్టకస్ మొదలుకొని.. సామ్రాజ్యవాదం, జాత్యహంకారం, వర్ణ వివక్షలపై తిరగబడి మహోద్యమాలకు పురుడుపోసిన నిన్నటి చేగువేరా, మార్టిన్ లూథర్‌కింగ్, నెల్సన్ మండేలా, భగత్‌సింగ్‌ల వరకు ఆయా కాలాల్లో వీచిన కొత్త గాలికి సంకేతాలు! మానవ జాతి జ్ఞాపకాల్లో చిరస్మరణీయులుగా మిగిలిపోయిన మాన్యులందరూ చరిత్ర సానబెట్టిన మట్టిలో మాణిక్యాలే. రాజకీయాలకు ఆలంబనగా.. ఈ చరిత్రలు.. భారతదేశంలోనూ విద్యార్థి, యువతరం స్వాతంత్య్రోద్యమ బరిలోకి ఉరికేందుకు.. అనంతరం రాజకీయాల్లో చురుకుగా పాల్గొనేందుకు ఆలంబనగా నిలిచాయి. ఆ ఉద్యమాల సారథులూ వారథులూ స్వాతంత్య్రానంతర రాజకీయాల్లో నాయకులుగా స్థిరపడ్డారు. స్వాతంత్య్రానంతరం మంచి జీవితంపై, ఉజ్వల భవిష్యత్తుపై కోట్లాది మంది భారతీయులు పెట్టుకున్న ఆశలు, ఆకాంక్షలు, స్వప్నాలు మొత్తంగా ఇరవై ఏళ్లలోనే చెదిరిపోయిన నేపధ్యంలో.. విద్యార్థి, యువజన, రైతాంగ శ్రేణుల్లో చెలరేగిన తీవ్ర అసంతృప్తి మరో ఉద్యమ రూపం తీసుకుంది. విద్యార్థులు, విద్యావంతులు, యువతరం అందులో ఉరకలెత్తింది. ఆ ఉద్యమానికి ‘ఇపుడు వీస్తున్న గాలి’ కవిత అక్షర రూపమిచ్చింది. సమాజంలో విప్లవాత్మక మార్పులకు బీజమేసింది. ఎమర్జెన్సీకి ముందు సంపూర్ణ విప్లవం పిలుపుతో జయప్రకాశ్‌నారాయణ్ మొదలెట్టిన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న విద్యార్థి, యువజనులు తదుపరి తరంలో రాజకీయ నాయకులుగా పరిణమించారు. ఎమర్జెన్సీ అనంతరం 1989 మండల్, మందిర్ వివాదంలో.. రిజర్వేషన్, యాంటీ-రిజర్వేషన్ ఉద్యమాల్లోనూ యావద్దేశంలో విద్యార్థులు ఉప్పెనలా కదిలారు. ఆ ఉద్యమాలూ సమాజ గమనంపై బలమైన ముద్రవేశాయి. కెరీరిజం రాజ్యం ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. 1990ల ప్రారంభంలో ఆరంభమైన ఆర్థిక సంస్కరణలు, ఆ తర్వాత ఐటీ రంగ విప్లవంతో విద్యాలయాల్లో కెరీరిజం రాజ్యమేలటం మొదలైంది. సామాజిక శాస్త్రాలు వెనుకపట్టు పట్టటం, కెరీర్‌కు ఉపకరించే విద్యకే పట్టం కట్టటం వంటి పరిణామాలతో.. గత రెండు తరాల విద్యార్థులకు సామాజిక పరిస్థితుల గురించి ఏమీ తెలియకుండా పోయింది. అప్పటివరకూ జాతి చైతన్య వాణిగా గర్జించిన విద్యార్థి, యువజనుల పాత్ర రానురాను క్షీణించిపోయింది. అంతకుముందు వరకూ ఏ ప్రధాన సంఘటన జరిగినా తామున్నామంటూ ముందుకొచ్చిన విద్యార్థి ఉద్యమాలు.. ఆర్థిక సంస్కరణలు, ఐటీ వెల్లువలో కొట్టుకుపోయాయంటే అతిశయోక్తి కాదు. క్రమేపీ.. దేశభక్తి అంటే మిలటరీ దేశభక్తి అనే భావన రెడీమేడ్ వంటకంలా సమాజంలో పాతుకుపోయింది. ‘దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్...’ అన్న మానవీయ భావన విస్మరణకు గురైపోయింది. ఈ పరిస్థితుల్లోనూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి విద్యార్థి ఉద్యమమే చోదకశక్తిగా నిలిచి నడిపించింది. అయితే.. ఆ ఉద్యమం పరిధి పరిమితమైనది కావటంతో దేశవ్యాప్తంగా విద్యార్థి లోకం కదలగలిగే అవకాశం లేకపోయింది. ‘ఆజాదీ’ కాంక్ష అదే సమయంలో ఇటీవలి కాలంలో అటు ప్రపంచంలోనూ, ఇటు దేశంలోనూ చోటుచేసుకుంటున్న సామాజిక, ఆర్థిక పరిణామాల ఫలితంగా.. దేశంలో అసహనం, ఆధిపత్య భావజాలం పెచ్చుమీరటం ప్రస్ఫుటమైంది. దానితో పాటే.. వాటిని వ్యతిరేకిస్తూ అలజడి కూడా మొదలైంది. అది సామాజిక పరిస్థితుల పట్ల విద్యార్థి లోకాన్ని మళ్లీ మేల్కొలుపుతోంది. అయితే.. నాడు భగత్‌సింగ్ ఆదర్శంగా స్వాతంత్య్రోద్యమంలోకి.. అనంతరం చేగువేరా ప్రేరణగా సామ్యవాద ఉద్యమంలోకి ఉరికివచ్చిన విద్యార్థిలోకం.. ముఖ్యంగా ఉన్నత విద్యా సంస్థల్లోని విద్యార్థులు.. ఇప్పుడు మార్క్స్ - అంబేద్కర్ల సైద్ధాంతిక పునాదులను మేళవిస్తూ.. సమానత్వం, సౌభ్రాతృత్వం, ప్రజాస్వామ్య విలువలను చాటిన మేధావులందరి ఆలోచనా రీతులను ఇముడ్చుకుంటూ.. అన్ని రకాల అణచివేతలు, ఆధిపత్యాల నుంచి ‘ఆజాదీ’ కాంక్షిస్తూ ఒక రూపం తీసుకుంటోంది. అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల రూపంలో ఒక్కసారిగా విస్ఫోటనం చెందింది. ఆ వెనువెంటనే జవహర్‌లాల్‌నెహ్రూ విశ్వవిద్యాలయంలో కన్హయ్యకుమార్ గొంతుతో పొలికేక పెట్టింది. రోహిత్.. ఆత్మహత్య లేఖ అణగారిన దళిత వర్గం నుంచి వచ్చిన రోహిత్ వేముల.. ఆరంభంలో వామపక్ష విద్యార్థి సంఘంలో, తర్వాత దానితో విభేదించి అంబేద్కర్ విద్యార్థి సంఘంతో పనిచేశాడు. సహ విద్యార్థులతో కలిసి ఉద్యమించాడు. ముందు వరుసలో ఉంటూ.. కుల, మత వివక్షలకు, పీడనలకు, ఆధిపత్య భావజాలానికి వ్యతిరేకంగా గళమెత్తి నినదించాడు. ‘‘నా తాత్వికత చాలా సరళమైనది.. పరమ మూర్ఖమైన, అత్యంత మలినమైన వాదాలు రెండు- మతం, జాతీయవాదం (యుగయుగాల నుంచి హింస రచనకు అత్యుత్తమ మార్గాలుగా రుజువైనవి). నేను ఏవగించుకునే పెడ ధోరణులు- దురాశ, సంఘ బహిష్కారం (సామ్రాజ్యవాద, ఆధిపత్యవాదాల లక్షణాలు). నేను నా ప్రాణాలను అర్పించైనా చూడాలనుకున్నవి- కారుణ్యం, చైతన్యం! ఈ ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైనవి- ప్రేమ, ప్రకృతి’’ అని తన ఫేస్బుక్లో ప్రకటించాడు. కర్ణాటకలో కలబుర్గి హత్య నుంచి.. ముంబై బాంబు పేలుళ్ల కేసులో యాకూబ్‌మెమన్‌కు మరణశిక్ష విధించటం వరకూ ఒకే తీవ్రతతో వ్యతిరేకించాడు. మరణశిక్షను విధించే దేశం ప్రజాస్వామిక దేశమే కాదన్నాడు. ఆ శిక్ష హత్యతో సమానమన్నాడు. మత మైనారిటీలపై దాడులను నిర్ద్వం ద్వంగా ఖండించాడు. కశ్మీరీల స్వయం నిర్ణయ హక్కుకు మద్దతు ఇచ్చాడు. అంతటా స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వం, సౌభ్రాతృత్వం, మానవీయ విలువలే ప్రధానంగా ముందుకు నడిచాడు. అయితే.. ఆ ఉద్యమ క్రమంలో వివక్షకు, బహిష్కరణకు గురయ్యాడు. చివరికి.. ‘మనిషి విలువ.. అతడి తక్షణ గుర్తింపు, సమీప అవకాశానికి కుచించుకుపోయింది. ఒక ఓటుకు. ఒక సంఖ్యకు. ఒక వస్తువుకు (పరిమితమైపోయింది). ఒక మనిషిని ఒక ఆలోచనగా ఎన్నడూ (ఎవరూ) చూడలేదు. నక్షత్రధూళితో నిర్మితమైన ఒక ఉజ్వలమైన జీవిగా ఎప్పుడూ (ఎవరూ) చూడలేదు. ప్రతి చోటా.. చదువుల్లో వీధుల్లో రాజకీయాల్లో చావులో బతుకులో (ఎక్కడా మనిషిని మనిషిగా చూడలేదు)’ అంటూ ప్రస్తుత సమాజానికి, ఇప్పుడు రాజ్యమేలుతున్న విలువలకు ఒక అయోగ్యతాపత్రం ప్రకటిస్తూ నీడల నుంచి నక్షత్రాలకు పయనమైపోయాడు. రోహిత్ ఆత్మహత్య దేశ సమాజ చేతనను పెను కుదుపు కుదిపింది. ఈనాటి సమాజిక వాస్తవాలను, అందులోని డొల్లతనాన్ని కళ్లకు కట్టింది. మేధావులు, రచయితలు, ఉద్యమకారుల్లో తీవ్ర కలకలం రేగింది. ఢిల్లీ నుంచి గల్లీ వరకూ విద్యార్థి లోకం ఉవ్వెత్తున ఎగసింది. అందులో ఢిల్లీలోని జేఎన్‌యూ ముందు వరుసలో నిలిచింది. కన్హయ్య.. ‘ఆజాదీ’ పొలికేక చేతనత్వానికి మారు పేరుగా నిలిచే ఢిల్లీ జేఎన్‌యూ రోహిత్ ఆత్మహత్యకు ముందు నుంచే అనేకానేక అంశాలపై ఉద్యమిస్తోంది. అక్కడ కూడా.. ముఖ్యంగా ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న ఘటనలు.. హేతువాదుల హత్యలు, బీఫ్ పేరుతో దాడులు, మతకలహాల సృష్టికి ప్రయత్నాలు, కీలక కేసుల్లో దోషులకు మరణశిక్షలు.. వంటి పరిణామాలనెన్నిటినో వ్యతిరేకిస్తూ నిరసన గళం వినిపిస్తోంది. రోహిత్ ఆత్మహత్యతో ఆ స్వరం మరింత తీవ్రమైంది. విద్యాలయాల్లోని పరిస్థితులపై దేశం యావత్తూ దృష్టి సారించే స్థాయికి ఉద్యమించింది. ఆ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాల్లో భావప్రకటనా స్వేచ్ఛను పరిరక్షించుకునే ప్రయత్నంలో.. అఫ్జల్‌గురుకు ఉరిశిక్షను అమలు చేయటాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ఒక కార్యక్రమానికి జేఎన్‌యూ విద్యార్థులు మద్దతివ్వటం పెను వివాదంగా మారింది. అందులో దేశవ్యతిరేక నినాదాలు చేశాడన్న ఆరోపణలతో పోలీసులు రాజద్రోహం కేసు నమోదు చేసి జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షుడు కన్హయ్యకుమార్‌ను అరెస్ట్ చేయటం మరోసారి దేశాన్ని, విద్యార్థి లోకాన్ని కుదిపేసింది. అరెస్ట్‌కు ముందూ, వెనుకా జరిగిన పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. దేశదేశాల మేధావులు కన్హయ్య అరెస్ట్‌ను ఖండించారు. అయితే.. బెయిల్‌పై విడుదలైన తర్వాత కన్హయ్య జేఎన్‌యూలో చేసిన ప్రసంగం.. ప్రస్తుతం రూపుదిద్దుకుంటున్న విద్యార్థి ఉద్యమాల ఆలోచనా రీతులను విస్పష్టంగా ఆవిష్కరించింది. ‘‘భారత్ నుంచి మేం స్వేచ్ఛ కోరటం లేదు. భారత్‌లో స్వేచ్ఛ కావాలని కోరుతున్నాం. ... సరిహద్దు వద్ద తన ప్రాణాన్ని పణంగా పెట్టి యుద్ధరంగంలో పోరాడే వారైనా.. తన స్వేచ్ఛ కోసం జేఎన్‌యూలో పోరాడుతున్న వారైనా.. ఏకం కాగల గొంతులన్నిటినీ మూయించాలని మీరు కోరుకుంటున్నారు. రాజకీయ స్వేచ్ఛ మాత్రమే సరిపోదు.. సామాజిక స్వాతంత్య్రం కావాలని అంబేడ్కర్ చెప్పారు. అందుకే రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాం. సోషలిజం కోసం ప్రజాస్వామ్యం అనివార్యమని లెనిన్ చెప్పాడు. అందుకే ప్రజాస్వామ్యం గురించి మేం మాట్లాడతాం. భావప్రకటనా స్వాతంత్య్రం గురించి మేం మాట్లాడతాం. సమానత్వం గురించి మేం మాట్లాడతాం. ఒక బంట్రోతు కొడుకు, ఒక అధ్యక్షుడి కొడుకు.. ఒకే పాఠశాలకు వెళ్లగలిగే పరిస్థితుల కోసం మేం మాట్లాడతాం. ఆకలి, దారిద్య్రం, అణచివేత, దోపిడీల నుంచి విముక్తి లభించే వరకూ.. దళితులు, గిరిజనులు, మైనారిటీలు, మహిళల హక్కుల కోసం మా పోరాటం’’ అంటూ కన్హయ్య చేసిన నినాదం దేశాన్ని కట్టిపడేసింది. -
'జాతి వ్యతిరేకులు ఎప్పటికీ హీరోలు అవ్వరు'
మథుర: రాజద్రోహం కేసులో అరెస్టయి రెండు రోజుల కింద విడుదలైన జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ చేసిన వ్యాఖ్యలను విదేశీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి వీకే సింగ్ ఖండించారు. హెచ్‌సీయూలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల తనకు ఆదర్శమని చేసిన వ్యాఖ్యలను వీకే సింగ్ తప్పుబట్టారు. జాతి వ్యతిరేకులు ఎప్పటికీ హీరోలు కానే కాదని వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ లోని మథురలో జరిగిన ఓ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. 1993 ముంబై పేలుళ్ల కేసులో నిందితుడు యాకుమ్ మెమన్ ఉరితీతను వేముల రోహిత్ వ్యతిరేకించాడు. ఆ సందర్భంగా దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాడని ఆరోపించారు. ఈ నేపథ్యంలో రోహిత్ వేములను తనకు ఆదర్శప్రాయుడిగా విద్యార్థి నేత కన్హయ్య కుమార్ ఎలా ఎంచుకుంటాడన్నారు. రోహిత్ దారిలోనే కన్హయ్య నడిచాడు. అతడిలాగానే పార్లమెంట్ దాడులకు పాల్పడ్డ కేసులో నిందితుడు అఫ్జల్ గురు ఉరితీత అంశాన్ని వ్యతిరేకిస్తూ జేఎన్‌యూ వర్సిటీలో కార్యక్రమాలు నిర్వహించాడని మంత్రి వీకే సింగ్ గుర్తుచేశారు. ఆరు నెలల తాత్కాలిక బెయిల్ పై కన్హయ్య కుమార్ విడుదలయ్యాక కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వర్సిటీలో ఈవెంట్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. -
రోహితే నా ఆదర్శం
* అఫ్జల్ గురు కాదు: విద్యార్థి నేత కన్హయ్య * నేను దేశవ్యతిరేకిని కాదు * రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు న్యూఢిల్లీ: రాజద్రోహం కేసులో అరెస్టయి గురువారం బెయిలుపై విడుదలైన జేఎన్‌యూ విద్యార్థి నేత కన్హయ్య.. శుక్రవారం కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజద్రోహ చట్టాన్ని కేంద్రం దుర్వినియోగం చేస్తోందన్నారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘పార్లమెంటుపై దాడి కేసు దోషి అఫ్జల్ గురు నాకు ఆదర్శం కాదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) పాలకవర్గం వివక్ష వల్ల ఆత్మహత్య చేసుకున్న పీహెచ్డీ విద్యార్థి రోహిత్ వేముల నాకు ఆదర్శం. నేను ఉగ్రవాదిని కాను. నేను దేశ వ్యతిరేకిని కాదు. దేశ సరిహద్దును రక్షిస్తున్న జవాన్లు, దేశ ప్రజలందరికీ అన్నం పెట్టేందుకు శ్రమిస్తున్న రైతుల కోసం పోరాడే నిజమైన రైతు బిడ్డను. దేశంలో పేదరికం, అవినీతి నుంచి స్వేచ్ఛ లభించాలని మేం (విద్యార్థులు) కోరుకుంటున్నాం. న్యాయం కోరే వాళ్ల గొంతు నొక్కేందుకు బ్రిటిషర్లు రాజద్రోహం చట్టాన్ని ప్రయోగించేవారు. విద్యార్థుల వాణిని అణచివేసేందుకు ప్రభుత్వం రాజద్రోహం చట్టాన్ని వాడకూడదు’ అని వ్యాఖ్యానించారు. ‘దేశ రాజ్యాంగం ప్రకారం అఫ్జల్ గురు భారతీయుడు. అతనికి జరిగినదంతా (ఉరిశిక్ష విధింపు) దేశ చట్టం ప్రకారమే జరిగింది. మీరు (ప్రభుత్వం) ఎంత మంది రోహిత్‌లను చంపితే ఇంటింటి నుంచి అంతమంది రోహిత్‌లు పుట్టుకొస్తారు’ అని అన్నారు. రాజకీయాల్లో వస్తారా అని అడగ్గా.. ‘నేను రాజకీయ నాయకుడిని కాను. పీహెచ్డీ విద్యార్థిని. రాజకీయాల్లోకి వచ్చే లేదా ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదు. చదువే నా లక్ష్యం. చదవాలని కోరిక వున్నా చదవలేకపోతున్న వారి కోసం పోరాడ్డమే నా పని’ అని పేర్కొన్నారు. ఏబీవీపీ ప్రచారం చేస్తున్న అఖండ భారత్ విధానానికి తాను వ్యతిరేకినన్నారు. భారత న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని.. దీనిపై ఆరెస్సెస్ ప్రభావం ఉండదని విశ్వసిస్తున్నానని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. దేశ రాజ్యాంగం, న్యాయవ్యవస్థను నాగ్‌పూర్‌లో కూర్చున్న ఆరెస్సెస్ నాయకులు నిర్ణయించజాలరన్నారు. ‘మా సిద్ధాంతానికి అనుగుణంగా గొంతెత్తితే.. తరచూ జైలుకు వెళ్లి రావటం తప్పకపోవచ్చు’ అని తెలిపారు. మా తరఫున ప్రచారం చేస్తారు: లెఫ్ట్ కన్హయ్య వామపక్ష కార్యకర్త కనుక సహజంగా ఆయన వచ్చే ఐదు అసెంబ్లీల ఎన్నికల్లో లెఫ్ట్ ఫ్రంట్ తరఫున ప్రచారం చేస్తారని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు. కన్హయ్య ప్రచారం చేయాలని డిమాండ్ల వస్తున్నాయని సీపీఐ నేత డి.రాజా తెలిపారు. ఐఐఎంసీ అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజీనామా న్యూఢిల్లీ: రోహిత్ ఆత్మహత్యను నిరసిస్తూ.. జేఎన్‌యూ, ఎఫ్టీఐఐల్లో జరిగిన నిరసనలకు సహకరించినందుకు ప్రభుత్వం తనను లక్ష్యంగా చేసుకుందని ఆరోపిస్తూ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (ఐఐఎంసీ) అసిస్టెంట్ ప్రొఫెసర్ అమిత్ సేన్‌గుప్తా రాజీనామా చేశారు. ‘జోక్యం’ నుంచి ఆజాదీ కావాలి: కేజ్రీవాల్ ‘లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యం నుంచి ఆజాదీ కావాలి, కేంద్ర జోక్యం నుంచి ఆజదీ కావాలి’ అంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. కన్హయ్య తరహా నినాదాలతో ట్వీట్ చేశారు. -
కులాన్ని దోచుకునే కుట్రా?
కొత్త కోణం కొడుకు పెరిగి పెద్దవాడై విశ్వవిద్యాలయాల్లోని కుల జాడ్యానికి బలై, ఎస్సీ, ఎస్టీలపై అత్యా చారాల నిరోధక చట్టం కింద కేంద్ర మంత్రులపై కేసు పెట్టాల్సి వస్తుందని రాధిక ముందే దూరదృష్టితో చూసి మాలవాడకు చేరలేదు. రోహిత్ కులంపై ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఎంతో ‘పరిశోధించింది’. రోహిత్‌ను బలిగొన్న కుల వివక్షను కప్పిపుచ్చాలనే ఈ ఆరాటం తగదు. ప్రభుత్వం ఇప్పటికైనా రాధిక కులం ‘ఆరాలు’ ఆపి, దోషులను కాపాడే యత్నం మానాలి. లేకపోతే చంద్రబాబు ప్రభుత్వమే ప్రజల ముందు దోషిగా నిలవాల్సి వస్తుంది. రోహిత్... మూడక్షరాలు భారత పాలకులకు ముచ్చెమటలు పట్టించాయి. ఇవే మూడక్షరాలు ఏమార్పుగా ఉన్న విద్యార్థి యువజనోద్యమానికి మార్గ నిర్దేశనం చేశాయి. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో రాజుకున్న విద్యార్థి ఉద్యమ జ్వాలలు ఢిల్లీని చుట్టుముట్టాయి. కులం నాగు కోరలు పెరికే విద్యార్థి శక్తిని అడ్డుకోలేని శక్తులు అదే కులాన్ని పావుగా మలుచుకొని రోహిత్ తల్లి రాధిక పోరాట పటిమను దెబ్బతీయాలని చూస్తున్నాయి. ఓ దళిత స్త్రీ... అందులోనూ కడుపున పుట్టిన మహా మేధావిని పోగొట్టుకున్న తల్లి కుప్పకూలిపోకుండా. దృఢంగా నిలిచి, పోరాడింది. గుండెను చిక్కబట్టుకొని, ఎన్ని అడ్డంకులెదురైనా తన దారి పోరు దారేనని విద్యార్థి ఉద్యమంలో భాగమైంది. ఇదే ప్రత్యర్థులకు మింగుడు పడనిది. నయానా భయానా లొంగదీసుకోవాలని, ఉద్యమాన్ని అణచెయ్యాలని ఎన్నో కుయుక్తులు పన్నారు. ఏదీ సాధ్యం కాకపోగా, అమాత్యుల మెడలకే ఉచ్చు బిగుస్తుం డటంతో పాత పాచికలు మరోసారి బయటకు తీశారు. రాధిక దళితురాలు కాదని నిరూపించి, సత్యాన్ని మరుగుపర్చే యత్నం మొదలెట్టారు. ఇటీవల పార్లమెంటు ఉభయసభల్లో కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి స్మృతీ ఇరానీ చేసిన కుట్ర పూరిత ప్రసంగం అభాసుపాలైంది. ఆగ్రహావేశాలతో ఉపన్యసించిన స్మృతీ ఇరానీ ‘‘నేను ఇచ్చిన వివరణతో ఎవరైనా సంతృప్తి చెందకపోతే నా తల తీసి ఇస్తాన’’ని సవాలు విసిరారు. ‘‘నేను మీ వివరణతో సంతృప్తి చెందలేదు, మీ తల తీసివ్వండి’’ అంటూ బహుజన్ సమాజ్ పార్టీ నేత మాయావతి నిలదీయడంతో నిజంగానే స్మృతీ ఇరానీ తల తీసేసినంత పనయ్యింది. రోహిత్ కులాన్ని వివాదాస్పదం చేసి పాలకులు తమ తలలేని తనాన్ని బయటపెట్టుకుంటున్నారనిపిస్తోంది. తిమ్మిని బమ్మిచేస్తే తప్పు ఒప్పయ్యేనా? హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో కుల వివక్షకు వ్యతిరేకంగా, చైతన్యవంతమైన విద్యార్థి ఉద్యమంపై కుల దురహంకారులు ద్వేషం వెళ్లగక్కారు. పథకం ప్రకారం రాజకీయ అండదండలతో రోహిత్ సహా ఐదుగురు దళిత విద్యార్థులను విశ్వవిద్యాలయం నుంచి వెలివేశారు. తదనంతర పరిణామాలను జీర్ణించుకోలేని రోహిత్ ఆత్మహత్య చేసుకొని దేశాన్ని, ప్రత్యేకించి దళిత ఉద్యమకారులను నిద్రలేపాడు. అంతేకాదు, కేంద్ర మంత్రులు స్మృతీ ఇరానీ, బండారు దత్తాత్రేయ, వైస్ చాన్స్‌లర్ అప్పారావు తదితరుల మీద రోహిత్‌ను ఆత్మహత్యకు పురికొల్పిన అభియోగంతో పాటు, ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కూడా కేసు నమోదైంది. దీంతో వారు తొలుత రోహిత్ అసలు ఎస్సీ కాదని నిరూపించాలని శతవిధాలా యత్నించారు. ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ ప్రభుత్వం తన మిత్రపక్షమైన బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని కాపాడాలని రకరకాల ప్రచారాలు, తప్పుడు వాదనలు ప్రచారంలోకి రావడానికి ఆస్కారం కల్పించింది. ఈ వివాదం పథకం ప్రకారం పన్నిన కుట్ర. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదైన వెంటనే రోహిత్ వేముల తండ్రిని తెరపైకి తెచ్చి, అతని చేత రోహిత్ వడ్డెర కులస్తుడని చెప్పించి నమ్మించాలని ప్రయత్నిం చారు. ఎన్నడో తల్లిని పిల్లలను వీడి, ఎన్నడూ పిల్లల ఆలనా పాలనా చూడని ఆ తండ్రి కులాన్ని రోహిత్‌కి అంటగట్టాలని చూశారు. రోహిత్ తల్లి రాధిక ఎస్సీ ‘మాల’ కనుక రోహిత్ ఆమె కులస్తుడే అవుతాడని తెలిసి వెనక్కి తగ్గారు. ఇప్పుడు రాధికే ఎస్సీ కాదనే కొత్త వాదన మొదలు పెట్టి, రకరకాల రుజువులు చూపడం ప్రారంభించారు. తిరుగులేని వాస్తవాలనూ కాదంటారా? రోహిత్ తల్లి రాధిక జీవితాన్ని మొదటి నుంచి పరిశీలిస్తే వాస్తవాలు తేటతెల్లమవుతాయి. ఫిబ్రవరి మొదటి వారంలో గుంటూరు జిల్లా అధికారులు రాధిక పెంపుడుతల్లి అంజనీదేవి స్టేట్మెంట్ను నమోదు చేశారు. దాని ప్రకారం రాధిక, కూలి పని చేసుకునే ఓ వలస కూలీల జంటకు పుట్టిన బిడ్డ. అప్పటికే ఒక పాపను కోల్పోయిన అంజనీదేవి చక్కగా ఉన్న ఈ పాప(రాధిక)ను తనకివ్వమని కోరగా, పేదరికంలో ఉన్న ఆ జంట ఆ పసిపాపను ఆమెకు అప్పగించి వెళ్లిపోయారు. రాధిక మాల కులస్తురాలనే విషయాన్ని కావాలనే తాము దాచిపెట్టి, తమ కులస్తురాలనే చెప్పామని అంజనీదేవి తెలిపారు. 14వ ఏటనే రాధికను తమ వడ్డెర కులస్తుడైన మణి కుమార్‌కిచ్చి పెళ్ళి చేశారు. పెళ్ళిలో కూడా రాధిక ఎస్సీ అని బయట పడనివ్వ లేదని ఆమె మీడియాకు చెప్పారు. రాధిక ముగ్గురు పిల్లల తల్లి అయ్యాక ఆమె మాల అని భర్తకు తెలిసింది. దీంతో మణికుమార్ రాధికను హింసించడంతో పాటూ, అంజనీదేవితో సైతం గొడవపడేవాడట. ఈ హింస తట్టుకోలేకే రాధిక విడాకులు తీసుకుందని మణికుమార్ తాత చెప్పారు. రాధిక తన ముగ్గురు పిల్లలతో వచ్చి కొంత కాలం అంజనీదేవి వద్దే ఉన్నా, తర్వాత గుంటూరుకు...అది కూడా తన కులంవారు నివసించే మాలవాడకు చేరింది. రాధికను పెంచుకోవడం మొదలు పెట్టాక అంజనీదేవికి నలుగురు పిల్లలు పుట్టారు. వారంతా మంచి చదువులు చదివి, మంచి వృత్తులలో బాగా బతుకుతున్నవారే. అంజనీదేవి సైతం ఎంఏ, ఎంఈడీ చదివి, మున్సిపల్ హైస్కూల్లో హెడ్మాస్టర్గా పనిచేశారు. ఆమె భర్త ప్రభుత్వ చీఫ్ ఇంజనీర్‌గా పనిచేశారు. ఈ విషయాలను ప్రస్తావించడానికి బలమైన కారణమే ఉంది. పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగాలు చేస్తున్న ఆ జంట సొంత పిల్లలను చదివించి వృద్ధిలోకి తెచ్చినా, రాధికను మాత్రం చదివించకుండా బాల్య వివాహం చేసి పంపేసింది. భర్తతో విడాకులు తీసుకుని వచ్చిన రాధికను, ఆమె పిల్లలను అంజనీదేవి దంపతులే గాక, ఇంట్లో వారంతా పనివాళ్లకంటే హీనంగా చూసేవారని ప్రత్యక్ష సాక్షి అయిన రోహిత్ ప్రాణమిత్రుడు రియాజ్ చెప్పారు. రాధిక గుంటూరుకు చేరాక వారు తమకు ఎలాంటి సాయం చేయలేదని, రోహిత్ సోదరుడు రాజా చక్రవర్తి తెలిపారు. అనాథ అయినా రాధిక వడ్డెర కులస్తురాలై ఉంటే అంజనీదేవి కుటుంబం నుంచి తగు సాయం అందేది. అందరితో సమానంగా చూసేవారు. రాధిక వడ్డెర కులంలో పుట్టలేదనడానికి రెండు రుజువులున్నాయి. ఒకటి అంజనీదేవి స్టేట్మెంట్, రెండవది రాధిక విడాకుల గురించి ఆమె భర్త మణికుమార్ బంధువు చెప్పిన విషయాలు. రాధిక మాలవాడలో నివసిం చాలని నిర్ణయించుకోవడం కూడా కీలకమైనది. దళితేతరులెవ్వరూ మాల, మాదిగలుగా చెప్పుకోవడానికి ఇష్టపడరు. రాధిక మాల కులస్తురాలు కాకపోతే ఏరికోరి దళిత కాలనీకి వెళ్ళే అవకాశమే లేదు. ‘‘మాల మాదిగలుగా ఎవ్వరూ పుట్టాలనుకోరు. అది యాదృచ్ఛికం. రాజులుగానో, మహారాజులు గానో ఉండాలనుకుంటారు’’ అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడే అన్నారు! రాధిక తమది వడ్డెర కులమని చెప్పుకుని ఉంటే, కుల వివక్ష కూడా అంతగా ఉండేది కాదు. తన కొడుకు పెరిగి పెద్దవాడై విశ్వవిద్యాలయాల్లోని కుల జాడ్యానికి బలై, ముగ్గురు కేంద్ర మంత్రులపై ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టం కేసు పెట్టాల్సి వస్తుందని రాధిక ముందే దూరదృష్టితో చూసి మాలవాడకు చేరుకోలేదు. రోహిత్ కులమేమిటని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఎంతో శ్రద్ధగా ‘పరిశోధించింది’. ఎలాగైనా వాస్తవాలను మసిపూసి మారేడు కాయగా మార్చాలనీ చూస్తున్నది. ఓ ఒంటరి దళిత స్త్రీ కులంపై ఇంతటి ‘పరిశోధనా’? ఒక ఒంటరి దళిత స్త్రీ రాధిక కులం నేడు దేశవ్యాప్త చర్చనీయాంశం ఎందుకయ్యింది? గత కొన్నేళ్ళుగా నకిలీ ఎస్సీ, ఎస్టీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేస్తున్నారని పలు ఆరోపణలు ప్రభుత్వాలకు అందాయి. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఈ విషయంపై విచారణలు, క్షేత్ర స్థాయి పరిశీలనలు చేసి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ నివేదికలను అందించింది. 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిపిన పరిశీలనలో హైదరాబాద్‌లోని ఆదాయం పన్ను శాఖలో 31 మంది, టెలికమ్యూనికేషన్స్‌లో 8 మంది, హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌లో 10 మంది, విశాఖపట్నంలోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్లో 13 మంది, హిందుస్థాన్ షిప్‌యార్డ్‌లో 7 మంది, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ లో 33 మంది, మొత్తం 102 మంది నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేస్తున్నట్టు కమిషన్ తేల్చింది. కానీ ఇంతవరకు ఎవ్వరి మీదా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఐఏఎస్, ఐపీఎస్‌ల్లో సైతం నకిలీ ఎస్సీ, ఎస్టీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొంది, ఉన్నత పదవులు అనుభవించి రిటైరైన వారున్నారని ఫిర్యాదులున్నాయి. అయినా చర్యలు శూన్యం. కానీ కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి, ఆత్మబలిదానం చేసుకున్న రోహిత్ కులం గురించే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎనలేని ఆతృత, ఆసక్తి, ప్రత్యేక శ్రద్ధ చూపి ఏం తేల్చదల్చుకున్నారు? విచారణ ద్వారా ఏ వాస్తవాలను అవాస్తవాలని చలామణి చేయాలనుకుంటున్నారు? అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఓ దళిత స్త్రీ కుల హక్కుని సైతం దోచుకోవాలని ఎందుకు చూస్తున్నారు? ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయి? రోహిత్ బలిదానం ఎలుగెత్తి చాటిన ఉన్నత విద్యాలయాల్లోని కుల వివక్షను కాదా? ఒక్క హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోనే ఇప్పటి వరకు 24 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రస్తావిస్తే... కేంద్ర మంత్రి స్మృతీఇరానీ ఇవన్నీ కాంగ్రెస్ హయాంలో జరిగాయని ఆవేశంగా మాట్లాడారు. విశ్వవిద్యాలయాల్లో వివక్ష జరిగింది కాంగ్రెస్ హయాంలోనా, బీజేపీ హయాంలోనా? అనేది ప్రశ్నే కాదు. కేంద్రానికే చిత్తశుద్ధి ఉంటే కేంద్ర విశ్వవిద్యాలయాలు, ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో దళిత, ఆదివాసీ, ఇతర అణగారిన వర్గాల పిల్లలు ఎదుర్కొంటున్న వివక్ష మీద విచారణ జరపాలి, నివారణకు పరిష్కార మార్గాలను ఆలోచించాలి. అంతేకానీ, రోహిత్ ప్రాణాలను బలిగొన్న కుల వివక్షను కప్పిపుచ్చాలనుకుంటే ఒక తప్పుని కప్పిపెట్టడానికి మరో తప్పు చేయడమే అవుతుంది. దుష్పర్యవసానాలూ తదనుగుణంగానే ఉంటాయి. చంద్రబాబు ప్రభుత్వం వివేచనతో వ్యవహరించి, రోహిత్ తల్లి రాధిక కులంపై ఆరాను ఆపి, దోషులను కాపాడే ప్రయత్నం మానుకోవాలి. రోహిత్ సమస్యను మరింత జటిలం చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే ప్రజల ముందు దోషిగా నిలబడాల్సి వస్తుందన్నది వాస్తవం. (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు, మల్లెపల్లి లక్ష్మయ్య ) మొబైల్: 97055 66213 -
రోహిత్ తల్లికి గుంటూరులో ఇల్లు ఇవ్వండి
- ముఖ్యమంత్రికి ఎంపీ వీహెచ్ లేఖ న్యూఢిల్లీ ఆత్మహత్య చేసుకున్న సెంట్రల్ వర్శిటీ విద్యార్థి రోహిత్ వేముల తల్లి రాధికకు గుంటూరులో ఇల్లు నిర్మించి ఇవ్వాలని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడికి మంగళవారం ఒక లేఖ రాశారు. దళితులపై వివక్ష కారణంగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఎంత పరిహారం ఇచ్చినా ఆ మాతృమూర్తికి జరిగిన నష్టాన్ని భర్తీచేయలేమని తెలియజేశారు. అందువల్ల మానవీయ కోణంలో ఆమెకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. -
రోహిత్ పేరు ప్రస్తావించలేదు
న్యూఢిల్లీ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనపై కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ లోక్ సభలో స్పందించారు. తాను రాసిన లేఖలో రోహిత్ పేరును ప్రస్తావించలేదని ఆయన మంగళవారం సభలో స్పష్టం చేశారు. హెచ్‌సియు విద్యార్థుల వివాదం సందర్భంగా మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో తాను ఏ విద్యార్థి పేరును పేర్కొనలేదని దత్తాత్రేయ వివరణ ఇచ్చారు. అనవసరంగా తనమీద అభాండాలు వేసి, ఈ వివాదంలోకి లాగారన్నారు. ఈరోజు ఉదయం ప్రారంభమైన లోక్ సభ వాయిదా అనంతరం 12 గంటలకు తిరిగి సమావేశమైన తరువాత రోహిత్ వేముల ఆత్మహత్యకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నకు బండారు దత్తాత్రేయ సమాధానమిచ్చారు. ఈ వివాదంలో కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా తన ప్రతిష్టను దిగజార్చారంటూ మండిపడ్డారు. కాగా హెచ్సియూలోని ఎబీవీపీ, అంబేడ్కర్ విద్యార్థుల వివాదం నేపథ్యంలో పీహెచ్ డీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. ఈ అంశంపై దత్తాత్రేయ జోక్యంతోనే రోహిత్ సహా మరి కొందరి విద్యార్థులను యూనివర్శిటీ అధికారులు సస్పెండ్ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. -
స్మృతి వ్యాఖ్యలపై పార్లమెంట్లో దుమారం
న్యూఢిల్లీ : కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యలపై పార్లమెంట్ ఉభయ సభల్లో మంగళవారం దుమారం రేగింది. దీంతో ఉభయ సభలు విపక్ష సభ్యుల నినాదాలు, నిరసనలతో హోరెత్తాయి. సభా కార్యాక్రమాలకు అంతరాయం కలగడంతో ఇరు సభలు వాయిదా పడ్డాయి. తొలిసారి లోక్ సభ 15 నిమిషాలు, రాజ్యసభ 10 నిమిషాల పాటు వాయిదా పడింది. తిరిగి ఉభయ సభలు ప్రారంభమైనా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో మరోసారి మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా పడ్డాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనపై ఆమె పార్లమెంట్లో చేసిన ప్రకటనను విపక్షాలతో పాటు రోహిత్ కుటుంబం తప్పుబట్టిన విషయం తెలిసిందే. స్మృతి ఇరానీ ఈ అంశంపై పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించారంటూ ఇద్దరు కాంగ్రెస్ నేతలు సోమవారం ఉదయం లోక్‌సభలో సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. మరోవైపు రాజ్యసభలోను బీఎస్పీ కూడా ఆమెపై హక్కుల నోటీసు ఇవ్వనుంది.