
రోహిత్ మృతికి బాధ్యులెవరో తేలాల్సిందే
ప్రతిపక్ష నేతల డిమాండ్
♦ కేసీఆర్, బాబు ఎందుకు రావడం లేదని నిలదీత
♦ హెచ్‌సీయూలో విద్యార్థులకు మద్దతు
సాక్షి, హైదరాబాద్: రోహిత్ మృతికి కారణమైనవారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు చేపట్టిన దీక్షకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. విద్యార్థులకు సంఘీభావంగా వివిధ రంగాల ప్రముఖులు తరలివస్తున్నారు. శనివారం సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, భారత రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ జోగేంద్ర కమాడీ తదితరులు హెచ్‌సీయూకు వచ్చి విద్యార్థులకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారేమన్నారో వారి మాటల్లోనే...
ఇకనైనా రాజకీయ క్రీడ ఆపాలి
ఇప్పటిదాకా చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా వివక్షాపూరితంగా వ్యవహరించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అధికారులు ఇకనైనా రాజకీయ క్రీడ ఆపాలి. వర్సిటీలో మరో విద్యార్థి బలిదానం తగదు. అందుకే దీక్ష విరమించాలని విద్యార్థులను కోరుతున్నా. విశ్వవిద్యాలయాల్లో దళిత, అణగారిన వర్గాల పట్ల వివక్షా పూరిత వైఖరి అనాగరికం. దళిత విద్యార్థులపై ఆరోపణలు ఆధార రహితమని తెలిసిన తర్వాత కూడా విద్యార్థులను బహిష్కరించడం రాజ్యాంగ ఉల్లంఘనే. రోహిత్ తల్లి రాధిక విషాదాన్ని వ్యక్తీకరించే పదాలు లేవు.
- జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, సుప్రీం రిటైర్డ్ జడ్జి
కేసీఆర్, బాబులకు సమయం లేదా
రోహిత్ ఆత్మహత్య ఘటనపై ఇతర రాష్ట్రాల నాయకులు స్పందిస్తుంటే ముఖ్యమంత్రులైన కేసీఆర్, చంద్రబాబుకు సమయం లేదా..? పలు రాష్ట్రాల సీఎంలు ఇక్కడికి వచ్చి విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. కానీ ఇక్కడే ఉన్న తెలుగు రాష్ట్రాల సీఎంలు రాకపోవడం శోచనీయం. రాష్ట్రపతికి హెచ్‌సీయూ ఘటనపై ఫిర్యాదు చేస్తాం. పార్టీ తరఫున కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించేందుకు కృషి చేస్తాం.
-ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
సీఎంలు నోరుమెదపరేం
సెంట్రల్ యూనివర్సిటీలో దళిత విద్యార్థి ఆత్మహత్య చేసుకొని ఇన్ని రోజులైనా తెలంగాణ సీఎంగానీ, ఆంధ్రప్రదేశ్ సీఎంగానీ నోరు మెదపకపోవడం అవమానకరం. మతోన్మాద విద్యార్థి సంఘాలు, శక్తులకు బీజేపీ మద్దతిస్తూ లౌకిక ప్రజాస్వామిక శక్తులను అణచివేసే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే సెంట్రల్ యూనివర్సిటీలో దళిత విద్యార్థులను సస్పెండ్ చేశారు.
-రఘువీరారెడ్డి, ఏపీపీసీసీ అధ్యక్షుడు
కేంద్రమంత్రులు ఎందుకు జోక్యం చేసుకున్నారు?
దేశంలో ఎందరో మేధావులు మెమన్ ఉరిశిక్షను వ్యతిరేకించారు. అంతమాత్రాన వారంతా జాతి విద్రోహకులా? భారత్‌కు రప్పించి మెమన్‌ని ఉరితీయడం దుర్మార్గం. స్వయంప్రతిపత్తి ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలో కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, స్మృతి ఇరానీ ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది? బీజేపీ, మోదీ.. అంబేడ్కర్ గురించి మాట్లాడటం అంబేడ్కర్‌కే అవమానకరం. రోహిత్ లాంటి మేధావిని పొట్టన పెట్టుకున్న ఈ యూనివర్సిటీ తన తప్పు నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. మోదీ రోహిత్ వ్యవహారం నుంచి త ప్పించుకోలేరు.
-ఎస్.జైపాల్ రెడ్డి, కేంద్ర మాజీమంత్రి
ఆ కేంద్రమంత్రులను సస్పెండ్ చేయాలి
వీసీ అప్పారావుకి ఆ పదవిలో కొనసాగే అర్హత లేదు. కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, స్మృతి ఇరానీలను ఈ దేశంలో ఎక్కడా పనిచేయకుండా సస్పెండ్ చేయాలి. విద్యార్థులు లేకుండా దేశ భవిష్యత్తే లేదు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ ఎందుకు నోరు మెదపడం లేదు?
-గీతారెడ్డి, మాజీమంత్రి
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ బాధ్యత వహించాలి
రోహిత్ మరణానికి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్సే కారణం. ఉన్నత విశ్వవిద్యాలయాల్లో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ జోక్యం తగదు. వీసీ వైదొలగాలి. కేంద్ర మంత్రులిద్దరినీ మంత్రివర్గం నుంచి తొలగించాలి.
- పొన్నాల లక్ష్మయ్య, పీసీసీ మాజీ అధ్యక్షుడు
ఇది సర్కారీ హత్యే
రోహిత్‌ది ఆత్మహత్య కాదు. సర్కారీ హత్యే. వీసీ వాళ్ల వాడే కాబట్టే ఏపీ సీఎం చంద్రబాబు హెచ్‌సీయూకు రాలేదు. ఆంధ్రా విద్యార్థి కనుక కేసీఆర్ రాలేదు. కానీ ఓట్లు మాత్రం ఆంధ్రా, తెలంగాణవి కావాలంటారు. లెఫ్ట్ పార్టీల బలహీనత వల్లే ఇలాంటి నష్టాలు జరుగుతున్నాయి. అందుకే నేను విద్యార్థులను క్షమాపణ కోరుతున్నా. ఈ ఘటనకు బాధ్యత వహించి వీసీ తక్షణం వైదొలగాలి. రోహిత్ కుటుంబ సభ్యులకు మా పార్టీ తరఫున విపత్తి సాయం నుంచి రూ.లక్ష ఇస్తాం.
-నారాయణ, సీపీఐ నేత
మా పిల్లలను టార్గెట్ చేశారు
రోహిత్ త్యాగం వృథా పోదు. ఈ రోజు రోహిత్ బలిదానం దేశం యావత్తుని మేల్కొల్పింది. మోదీ మొహంలో అంబేడ్కర్ ఉంటే కడుపులో ద్రోణాచార్యుడున్నాడు. దత్తాత్రేయ, స్మృతి ఇరానీల రూపంలో మా బిడ్డలను బలి తీసుకుంటున్నారు. వీసీ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మనిషి అవడం వల్లే మా పిల్లలను టార్గెట్ చేస్తున్నారు.
-ప్రొ.జోగేంద్ర కమాడీ,రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడు