
ఆ నివేదికను చెత్తబుట్టలో వేయాలి
రూపన్‌వాల్ నివేదికపై సీపీఐ నేత నారాయణ
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం రీసెర్చ్ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యపై జస్టిస్ రూపన్‌వాల్ నివేదికను చెత్తబుట్టలో వేయాలని సీపీఐ నేత కె.నారాయణ పేర్కొన్నారు. వాస్తవాలను కప్పిపుచ్చడానికే కేంద్రం కమీషన్‌ను నియమించిందని ఆరోపించారు. రోహిత్ దళితుడని గుంటూరు జిల్లా కలెక్టర్ ధ్రువీకరించారని, ఎస్సీ జాతీయ కమిషన్ అధ్యక్షుడు పూనియా విచారణ జరిపి నిర్ధారించారని.. కాబట్టి ఆ నివేదికలను కేంద్రం ఆమోదించాలని డిమాండ్ చేశారు.
‘రోహిత్ దళితుడని అంగీకరించే పక్షంలో హెచ్‌సీయూ వైస్ చాన్సలర్ అప్పారావు జైలుకు పోవాల్సి వస్తుంది. కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, స్మృతి ఇరానీ నైతిక బాధ్యత వహించాల్సి వస్తుంది. వ్యవస్థాగత హింస వల్లే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడనేందుకు అనేక ఆధారాలున్నా.. అసలు సమస్యను పక్కన పెట్టి రోహిత్ దళితుడా కాదా అనే అంశాన్ని ఎజెండాలోకి అనవసరంగా తీసుకొచ్చారు’ అని నారాయణ ఆరోపించారు. రోహిత్ ఆత్మహత్యకు మూలాధారాలేమిటో తేల్చాలని డిమాండ్ చేశారు.