అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలి | Those arrested should be released | Sakshi
Sakshi News home page

అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలి

Published Sat, Mar 26 2016 4:28 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలి - Sakshi

అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలి

సెంట్రల్ వర్సిటీలో విద్యార్థుల ధర్నా
♦ పోలీసుల పహారాలోనే హెచ్‌సీయూ..
♦ బయటి వారిపై యథావిధిగా ఆంక్షలు
♦ చర్లపల్లి జైలులో అరెస్టయిన విద్యార్థులకు పరామర్శల వెల్లువ
♦ విద్యార్థులను పరామర్శించిన ఉత్తమ్, అసద్ తదితరులు
 
 సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ)లో విద్యార్థుల ఆందోళన కొనసాగింది. వైస్ చాన్స్‌లర్ నివాసంపై దాడి తదితర ఘటనల్లో అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం వర్సిటీలో విద్యార్థులు ధర్నా చేశారు. ఒకవైపు వివాదం కొనసాగుతుండగానే వీసీ అప్పారావు బాధ్యతలు చేపట్టడాన్ని తప్పుబట్టారు. ఆయనను వెంటనే విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. మరోవైపు సెంట్రల్ వర్సిటీలో పోలీసు బందోబస్తూ కొనసాగుతోంది.

బయటి  వ్యక్తులను యూనివ ర్సిటీలోకి అనుమతించడం లేదు. ఐడీ కార్డులు పరిశీలించిన అనంతరం విద్యార్థులు, వర్సిటీ సిబ్బందిని మాత్రమే అనుమతిస్తున్నారు. మరోవైపు పోలీసుల జోక్యాన్ని నిరసిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు వీసీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కాగా, వరుస సెలవుల నేపథ్యంలో చాలా మంది విద్యార్థులు సొంత ఊళ్లకు వెళ్లారు. ఇదిలా ఉండగా వర్సిటీలో విధ్వంసం, దాడుల నేపథ్యంలో అరెస్టై చర్లపల్లి జైలులో ఉన్న విద్యార్థులు, అధ్యాపకులను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, దాసోజు శ్రవణ్‌కుమార్, మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే బలాల, సీనియర్ పాత్రికేయుడు మల్లేపల్లి లక్ష్మయ్య తదితరులు పరామర్శించారు.

 విశ్వవిద్యాలయాలను విచ్ఛిన్నం చేసే కుట్ర: హరగోపాల్
 దేశంలోని విశ్వవిద్యాలయాలను విచ్ఛిన్నం చేసేందుకు సంఘ్ పరివార్ ప్రయత్నిస్తోందని పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ ఆరోపించారు. సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ ఆధ్వర్యం లో శుక్రవారం హైదర్‌గూడ ఎన్‌ఎస్‌ఎస్‌లో ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సెంట్రల్ వర్సిటీ ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్రలు పన్నుతూ విద్యార్థుల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. జ్యుడీషియల్ విచారణ పూర్తికాక మునుపే అప్పారావును మళ్లీ వీసీగా నియమించడం కేంద్రం కుట్ర అని, ఇందులో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు హస్తం ఉందని ఆరోపించారు. అన్ని విద్యార్థి సంఘాలు హింసకు పాల్పడవద్దని కోరారు. కమిటీ అధ్యక్షుడు చక్రధర్‌రావు, ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, మనోహర్‌రావు(టీపీటీఎఫ్), ఎంఎన్ కిష్టప్ప(డీటీఎఫ్), ప్రదీప్‌కుమార్(పీడీఎస్‌యూ), వేణు(ఎస్‌ఐఎస్‌ఎఫ్) తదితరులు పాల్గొన్నారు.
 
 దళిత వ్యతిరేక స్వరూపం బయటపడింది: ఉత్తమ్
 హెచ్‌సీయూ ఘటనల తో టీఆర్‌ఎస్ ప్రభు త్వ దళిత వ్యతిరేక స్వ రూపం బయటపడిం దని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. విద్యార్థులకు బెయిల్ కూ డా లభించకుండా చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైనా వీసీ అప్పారావు తిరిగి విధులకు ఎలా హజరవుతారని ప్రశ్నిం చారు. బీజేపీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వాలు కల సి విద్యార్థులను అక్రమ కేసుల్లో ఇరికిం చేందుకు యత్నిస్తున్నాయన్నారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రంలో పోలీసు రాజ్యం కొనసాగుతోందని ఆరోపించారు.
 
 వీసీ అప్పారావును అరెస్ట్ చేయాలి: రోహిత్ తల్లి
 తన కుమారుని చావుకు కారణమైన వీసీకి పోలీసులు బందోబస్తు ఇస్తున్నారని, ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులను మాత్రం అరెస్ట్ చేస్తున్నారని, ఇదెక్కడి న్యాయమని రోహిత్ వేముల తల్లి రాధిక ప్రశ్నించారు. తన కుమారుని చావుకు కారణమైన వీసీ అప్పారావును విధుల నుంచి తొలగించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ స్టూడె ంట్స్ జేఏసీ, టీచర్స్ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం హైదర్‌గూడ ఎన్‌ఎస్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హెచ్‌సీయూ అధ్యాపకులతో కలసి ఆమె మాట్లాడారు. తాము న్యాయం కోసం ఎంతకాలం నిరీక్షించాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విశ్వవిద్యాలయంలో చిచ్చు రేపాలనే ప్రభుత్వం అప్పారావును మరలా వీసీగా పంపిందని మండిపడ్డారు. రోహిత్ తమ్ముడు రాజు మాట్లాడుతూ తన అన్న ప్రాణం బలిగొన్న వారిపై రెండు నెలలు గడుస్తున్నా చర్యలు తీసుకోకపోగా, అమాయకులైన విద్యార్థులను అరెస్ట్ చేశారని, వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
 
 విద్యార్థిలోకానికి తప్పుడు సంకేతాలు: అసద్
 హెచ్‌సీయూ ఉదంతంపై ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని, వివాదాలకు ఇంతటితో ఫుల్‌స్టాప్ పెట్టకపోతే విద్యార్థిలోకానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అసదుద్దీన్ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులను, ప్రొఫెసర్లను అరెస్ట్ చేసి పోలీసులు విచక్షణారహితంగా కొట్టారని, ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తుతామని చెప్పారు. వీసీ అప్పారావును విధుల నుంచి తొల గించి, రోహిత్ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాగా, అసదుద్దీన్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో పలువురు యూ త్ కాంగ్రెస్ నాయకులు ‘భారత్ మాతాకీ జై’ అంటూ నినదించడంతో ఉద్రిక్తత నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు యూత్ కాంగ్రెస్ సభ్యులను అక్కడి నుంచి పంపేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement