హెచ్‌సీయూ గరం గరం | Tension In HCU Over Rohith Vemula's Death Anniversary | Sakshi
Sakshi News home page

హెచ్‌సీయూ గరం గరం

Published Wed, Jan 18 2017 2:21 AM | Last Updated on Tue, Sep 5 2017 1:26 AM

హెచ్‌సీయూ గరం గరం

హెచ్‌సీయూ గరం గరం

రోహిత్‌ వేముల వర్ధంతి సందర్భంగా వర్సిటీలో ఉద్రిక్తత
హెచ్‌సీయూలోకి వెళ్లేందుకు విద్యార్థులు, పలు సంస్థల నాయకుల యత్నం
అడ్డుకున్న పోలీసులు.. రోహిత్‌ తల్లి రాధికకూ అనుమతి నిరాకరణ
ఆగ్రహంతో విద్యార్థుల ధర్నా.. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు
తాళం పగలగొట్టి లోనికి... అరెస్టు చేసిన పోలీసులు
విషయాన్ని పక్కదారి పట్టించేందుకే కుల నిర్ధారణ: రాధిక


సాక్షి, హైదరాబాద్‌
రోహిత్‌ వేముల ప్రథమ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) వద్ద మంగళవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. క్యాంపస్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి బయటి వ్యక్తులను అనుమతించకపోవడంతో విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగాయి. ప్రధాన గేటు వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశాయి. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

బలగాల మోహరింపు.. తనిఖీలు
వర్సిటీలో వివక్ష ఎదురవుతోందంటూ ఏడాది కింద రోహిత్‌ వేముల అనే పరిశోధక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఏడాది కింద ఈ ఘటన ఎంతో సంచలనం సృష్టించింది. మంగళవారం హెచ్‌సీయూలో రోహిత్‌ వేముల ప్రథమ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో వర్సిటీ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. ప్రధాన ద్వారం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి.. ఐడీ కార్డులు చూపించిన విద్యార్థులను, వర్సిటీ సిబ్బందిని మాత్రమే లోపలికి అనుమతించారు. రోహిత్‌ తల్లి రాధిక సహా ఎవరినీ లోపలికి పంపించలేదు. దీంతో పలు పార్టీలు, సంస్థలు, విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, హెచ్‌సీయూ వీసీ అప్పారావు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేశారు.

కొందరు విద్యార్థులు గేటు తాళాన్ని పగలగొట్టి రాధికను, మరికొందరిని లోనికి తీసుకువచ్చారు. గేటు వద్దే రోహిత్‌ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం రోహిత్‌ స్తూపానికి పూలమాల వేసేందుకు క్యాంపస్‌ లోనికి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. చివరికి రాధికతోపాటు ఏపీ ఏఎస్‌ఎ కన్వీనర్‌ గుమ్మడి ప్రభాకర్, సుధీప్తో మండల్‌ (హిందుస్థాన్‌ టైమ్స్‌), విజయ్‌ పెదపూడి, ప్రమీల, కావ్య, రియాజ్, రాజా వేముల తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. అంతకుముందే విద్యార్థి క్రిశాంక్‌ సహా 18 మందిని అరెస్టు చేసి గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

అప్పారావును అరెస్టు చేయాల్సిందే..
రోహిత్‌ ఆత్మహత్యకు పాల్పడి ఏడాది గడిచినా ఇప్పటి వరకు న్యాయం జరగలేదని హెచ్‌సీయూ జేఏసీ కన్వీనర్‌ వెంకటేష్‌ చౌహాన్‌ పేర్కొన్నారు. రోహిత్‌ చట్టం తీసుకొచ్చే వరకు పోరాటం చేస్తామని... కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయ, అప్పారావులను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇక రోహిత్‌ వర్ధంతి కార్యక్రమానికి వెళ్లేవారిని అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని రిటైర్డ్‌ ప్రొఫెసర్, ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకులు పీఎల్‌ విశ్వేశ్వర్‌రావు పేర్కొన్నారు.

విలేకరిపై కేసు నమోదు
హెచ్‌సీయూ క్యాంపస్‌లోకి బయటి వ్యక్తులు వెళ్లవద్దన్న హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ.. క్యాంపస్‌లో సంచరించిన ఫ్రంట్‌లైన్‌ స్పెషల్‌ కరస్పాండెంట్‌ కునాల్‌æ శంకర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. హెచ్‌సీయూ భద్రతా సిబ్బంది ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొన్నారు.

దేశంలో దళితులకు రక్షణ కరువైంది
‘‘నేను దళితురాలినైనా నా కుమారుడిని బీసీగా ఎలా ప్రకటిస్తారు? అధికారులు నా బిడ్డ కులం విచారణకని పిలిచి నా నైతికతకు భంగం కలిగించేలా మాట్లాడారు. నన్ను, నా వ్యక్తిగత జీవితాన్ని అగౌరవపరిచారు. నా ప్రవర్తనను తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు..’’అని రోహిత్‌ తల్లి రాధిక మండిపడ్డారు. రోహిత్‌ వర్ధంతి కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. తన బిడ్డ కలెక్టరై కార్లలో తిరుగుతాడని కష్టపడి చదివించానని... కానీ వర్సిటీ వీసీ అప్పారావు తన బిడ్డను చంపేశాడని ఆరోపించారు. ఉద్యమానికి కారణం అప్పారావు అయితే ఆయనను వదిలిపెట్టి తన బిడ్డ కులాన్ని ధ్రువీకరించే పనిపెట్టుకున్నారని మండిపడ్డారు. విషయాన్ని పక్కదారి పట్టించేందుకే ఈ పని చేశారని ఆరోపించారు.

రోహిత్‌ తల్లి రాధికను అరెస్ట్‌ చేసి తీసుకెళ్తున్న పోలీసులు

ఏపీ సర్కారు అవమానించింది..
గుంటూరులో విచారణకని పిలిచి తనను, తన పిల్లలను ఏపీ ప్రభుత్వం అవమానించిందని రాధిక ఆరోపించారు. ‘‘నీ బిడ్డని నువ్వే పెంచావా? నీకు డబ్బెక్కడిది? ఎవరిచ్చారు అంటూ ఆర్‌డీవో అవమానించారు. అనేకసార్లు మమ్మల్ని బెదిరించారు. మాకు ఎక్కడికెళ్లినా భద్రత లేదు. చివరికి గుజరాత్‌లోని ఉనాకు వెళ్లినా మాకు ఆశ్రయమిచ్చిన వారు భయపడ్డారు..’’అని చెప్పారు. తన కుమారుడి ఆత్మహత్య వెనుక బీజేపీ మంత్రులున్నారు కనుకనే తన కులంపై చర్చ జరుగుతోందన్నారు. తాము దొంగలం, గూండాలం, తీవ్రవాదులం, ఉగ్రవాదులం కాదని... ఇలాగే విద్యార్థులపై నిర్బంధాన్ని కొనసాగిస్తే దళితులంతా ఏకమై పాలకులకు బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. కాగా వైవా పేరుతో దళితులకు మార్కుల్లో కోతవేస్తే ప్రశ్నించినందుకు తమను రస్టికేట్‌ చేశారని.. ఇప్పటికీ అది కొనసాగుతోందని రోహిత్‌తోపాటు సస్పెండైన విద్యార్థి రాహుల్‌ చెప్పారు.

గుజరాత్‌లో ఊచకోత కోస్తున్నారు
గుజరాత్‌లోని ఉనాలో జరిగిన ఘటనలో దళిత బాధితులు పీయూష్‌ సర్వయ్య, రమేష్‌ సర్వయ్య, జీతూ సర్వయ్య తదితరులు రోహిత్‌ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. గుజరాత్‌లో దళితులను రక్తపుటేరుల్లో ముంచుతున్నారని, అయినా రోహిత్‌ లాంటి ఉద్యమాలు తమకు కొత్త ఊపిరి పోస్తున్నాయని వారు చెప్పారు. ఎన్ని అడ్డంకులైనా ఎదురిస్తామని, దళితుల ఆత్మగౌరవం కోసం జరిగే పోరాటాలన్నింటికీ మద్దతిస్తామని పేర్కొన్నారు. దాద్రీ ఘటనలో మరణించిన అఖ్లాక్‌ సోదరుడు జాన్‌ మహ్మద్‌ మాట్లాడుతూ... తమ ఇంట్లో ఆవు మాంసం దొరికిందన్న నెపంతో తన అన్నను చంపారని, అదేమీ లేదని తరువాత తేలిందని చెప్పారు. దళితులపై అత్యాచారాలు, అవమానాలు, అసమానతలు పోయే వరకు తమ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement