రోహిత్‌ని మరోమారు చంపే యత్నం
⇒ అతడి కుల ధృవీకరణ వెనుక రాజకీయ కుట్ర
⇒ కన్సర్న్‌డ్ సిటిజన్స్ ఫోరం ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: ఆత్మహత్య చేసుకున్న హెచ్‌సీయూ పరిశోధక విద్యార్థి రోహిత్ వేములను బీసీగా తేల్చి.. అతడిని మరో మారు హత్య చేసే కుట్ర ఢిల్లీ కేంద్రంగా జరుగుతోందని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు అన్నారు. హైదరాబాద్‌లో కన్సర్న్‌డ్ సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో మల్లేపల్లి లక్ష్మయ్య అధ్యక్షతన శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. రోహిత్‌ని బీసీగా తేల్చడం వర్సిటీల్లో వివక్ష కారణంగా జరుగుతున్న ఆత్మహత్యలను కొనసాగించే దుర్మార్గపు ఆలోచనేనన్నారు. దేశంలో కులాన్ని నిర్థారించే హక్కు జిల్లా రెవెన్యూ అధికారులకు మాత్రమే ఉంటుందన్నారు.
రోహిత్ కేసులో నియమించిన రూపన్వాల్ కమిటీ సైతం తనకు సంబంధంలేని విషయంలో జోక్యం చేసుకుని అతడి కులంపై రిపోర్టు నివ్వడం హాస్యాస్పదమన్నారు. రోహిత్ వ్యవహారాన్ని కుల ధృవీకరణ అంశానికి కుదించివేయడం రాజకీయ కుట్రని మల్లేపల్లి అన్నారు. ఏడాది గడిచినా సమస్యను పరిష్కరించకుండా తాత్సారం చేసి, చివరకు కని, పెంచిన తల్లి కులం కాదని నిర్థారించడం దుర్మార్గమని విద్యావేత్త చుక్కా రామయ్య చెప్పారు.
కాంప్రహెన్సివ్ బీసీ ఫెడరేషన్ చైర్మన్ ఉ.సాంబశివరావు (ఊసా) మాట్లాడుతూ.. రోహిత్ ఎస్సీ కాదని చెప్పడం ద్వారా అట్రాసిటీ యాక్టు నుంచి తప్పించుకోగలరేమో కానీ, అతడి హత్యానేరం నుంచి కాదన్నారు. జవాబు దారీతనం లేని టీడీపీ ప్రభుత్వం తన బాధ్యతారాహిత్యాన్ని బయటపెట్టుకుం దన్నారు. తమిళనాడులో శశికళ మాదిరిగా జైలుకి వెళ్లక తప్పదని ఏపీ సీఎం చంద్రబాబుని హెచ్చరించారు. దళిత బహుజన్ ఫ్రంట్ శంకర్, ఏపీ అంబేడ్కర్ అసోసియేషన్ కన్వీనర్ ప్రభాకర్, రోహిత్ సోదరుడు రాజా, రవి తదితరులు పాల్గొన్నారు.