
రోహిత్ మృతిపై స్పందించిన ప్రధాని
లక్నో: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి పీహెచ్డీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు. శుక్రవారం లక్నోలోని బాబా సాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ను ప్రారంభించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలివైన విద్యార్థి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు.
ఈ విషయంలో రాజకీయాలను పక్కనబెడితే దేశం ఓ తెలివైన బిడ్డను కోల్పోయిందన్నారు. రోహిత్ కుటుంబం పడుతున్న బాధను తాను అర్థం చేసుకోగలనని ప్రధాని వ్యాఖ్యానించారు. అంతకుముందు ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలో యూనివర్సిటీ విద్యార్థులు రోహిత్ ఆత్మహత్య పట్ల నినాదాలు చేస్తూ నిరసనలు తెలిపడంతో కొంత గందరగోళం నెలకొంది.