
పవన్ కల్యాణ్ - అయిదు ప్రశ్నలు
హైదరాబాద్: జనసేన అధినేత, టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ మరోసారి ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రశ్నించేందుకే నేను ఉన్నానని తరచూ చెప్పుకునే పవర్ స్టార్ తాజాగా ట్విట్టర్ లో్ బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించారు. తన ట్విట్టర్ ద్వారా బీజేపీ ముందు ఐదు ప్రశ్నలు అడగదల్చుకున్నట్టు గురువారం వెల్లడించారు. సీనియర్ రాజకీయ నాయకులు, ప్రముఖ జర్నలిస్టులు, మేధావులు, ఇంకా వివిధ వర్గాల ప్రజలనుంచి ఈ కీలక సమాచారాన్ని సేకరించినట్టు చెప్పారు. ముఖ్యంగా బీజేపీని నమ్మి ఓట్లేసిన వారిని నుంచి సేకరించానని పేర్కొన్నారు.
బీజేపీ-టీడీపీ కూటమికి ఏపీ, తెలంగాణా, కర్ణాటకలో జనసేన మద్దుతిచ్చిందని గుర్తు చేసిన పవన్ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని తాను అయిదు ప్రశ్నలు అడగనున్నట్టు పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలకు కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోనే సపోర్ట్ చేయలేదని కర్ణాటకలో కూడా వారి తరఫున ప్రచారం చేశానన్నారు. అందుకే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తాను అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం చెప్పాలని కోరారు.
గోవధ నిషేధంపై బీజేపీకి చిత్త శుద్ధి ఉంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గోవధపై నిషేధం విధించవచ్చు కదా? అని ప్రశ్నించారు. బీజేపీకి ఈ అంశం నిజాయతీగా ఉంటే లెదర్ తో తయారు చేసిన పాదరక్షలు, బెల్టులను వాడకూడదని తమ కార్యకర్తలకు సూచించాలని అన్నారు. గోవులను రక్షించాలంటే ప్రతీ బీజేపీ కార్యకర్త ఒక్కో ఆవుని పెంచుకోవాలని సూచించారు. విభజన రాజకీయాల ద్వారా గోమాంసం తినే ప్రజల్లో భయాందోళలను సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. గోవులను పూజించే ప్రజల్లో సెంటిమెంట్ రెచ్చగొడుతోందని పవన్ వ్యాఖ్యానించారు.
గోవధ, వేముల రోహిత్ ఆత్మహత్య, దేశభక్తి, పెద్దనోట్ల రద్దు, ఏపీకి ప్రత్యేక హోదాల అంశాలపై తన ట్విట్టర్ ద్వారా వరుసగా ప్రశ్నించనున్న అంశాలని తెలిపారు. ఈ క్రమంలో రోహిత్ వేముల ఆత్మహత్యపై రేపు ప్రశ్నిస్తానంటూ ట్వీట్ చేశారు.
— Pawan Kalyan (@PawanKalyan) December 15, 2016