చంద్రబాబు నుంచి సంకేతాలు..
కేంద్రంలో రాష్ట్రానికిచ్చే పదవులు, రాష్ట్రంలో బీజేపీకి కేటాయించే పదవుల ఆధారంగా జనసేనకు ఐదో పదవి
నాదెండ్ల మంత్రివర్గంలో ఉంటారని పార్టీలో చర్చ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జనసేన పార్టీకి నాలుగుకు తక్కువకాకుండా మంత్రి పదవుల కేటాయింపు ఉంటుందని ఆ పార్టీకి చంద్రబాబు నుంచి స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. కేంద్ర కేబినెట్‌లో రాష్ట్రానికి దక్కే పదవులతో పాటు రాష్ట్ర మంత్రివర్గంలో బీజేపీకి కేటాయించే పదవులను బట్టి జనసేనకు ఐదో మంత్రి పదవి ఆధారపడి ఉన్నట్లు తెలుస్తోంది.
నిజానికి.. కేంద్రమంత్రి పదవులతో పాటు రాష్ట్ర మంత్రివర్గంలోనూ ఏ పార్టీకి ఎన్ని పదవులన్న దానిపై శనివారమే కొంత స్పష్టత వస్తుందని భావించినప్పటికీ.. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ఇద్దరూ రాజకీయేతర కార్యక్రమాలతో బిజీగా ఉండడంతో ఇరువురి మధ్య ఈ అంశం చర్చకు రాలేదని జనసేన వర్గాలు తెలిపాయి.
మరోవైపు.. రాష్ట్ర కేబినెట్‌లో జనసేన నుంచి అధినేత పవన్‌కళ్యాణ్‌తో పాటు పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తప్పక ఉంటారని పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. అలాగే, జనసేనలో మిగిలిన పదవులు ఎవరికన్నది టీడీపీలో మంత్రి పదవుల కేటాయింపుపై ఆధారపడి ఉంది. అయితే, పవన్ ఇప్పటివరకు ఎవరికీ మంత్రి పదవులపై హామీ ఇవ్వలేదని.. చంద్రబాబుతో భేటీ అనంతరమే ఆయన ఆ వివరాలు వెల్లడిస్తారని పార్టీలో చర్చ జరుగుతోంది.
వీరే ఆశావహులు..
ఈ ఎన్నికల్లో జనసేన పోటీచేసిన మొత్తం 21 స్థానాల్లో 15 ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలోనే పోటీచేసింది. దీంతో.. పవన్, నాదెండ్లకు కాకుండా జనసేనకు ఇంకెన్ని మంత్రి పదవులు దక్కినా అవి ఆ మూడు జిల్లాలోని వారికే ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ జనసేనకు ఐదో మంత్రి పదవి దక్కిన పక్షంలో విజయనగరం జిల్లా నెలిమర్ల నుంచి గెలిచిన లోకం నాగమాధవి లేదా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులలో ఒకరికి అవకాశం కల్పించే అవకాశం ఉంది. ఇక జనసేనలో కొణతాల రామకృష్ణ, సుందరపు విజయకుమార్, దేవవరప్రసాద్, కందుల దుర్గేష్, బొమ్మిడి నారాయణ నాయకర్ మంత్రి పదవుల రేసులో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment