
అవసరమైతే తమిళనాడుకు కూడా పార్టీని విస్తరిస్తానంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్! వినడానికి బాగానే అనిపించినా ఆయన చెప్పిందైతే వాస్తవం! ఎలాగంటారా? ఏపీలోనే సొంతబలం లేదు కదా? ఇతర రాష్ట్రాలలో ఏం చేయగలుగుతారని మీకు అనిపించవచ్చు. అదే తమాషా రాజకీయం! ఇదంతా భారతీయ జనతా పార్టీ ఆడుతున్న గేమ్ అని అందులో ఈయన ఒక పావుగా మారుతున్నారని కొంతమంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. వామపక్షాల వారైతే బహిరంగంగానే ఈ విమర్శలకు దిగుతున్నారు.
రాజకీయాలలోకి వచ్చిన తర్వాత అనేక రూపాలు మార్చుకున్న పవన్ కళ్యాణ్ కొద్ది నెలల క్రితం దక్షిణాది రాష్ట్రాలలో దేవాలయాలను సందర్శించారు. అది కూడా బీజేపీ మాట మేరకే అని ఒక విశ్లేషణ. ఎందుకంటే వచ్చే ఏడాది తమిళనాడులో శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ యోచిస్తోంది. ఇందుకోసం మళ్లీ అన్నా డీఎంకేతో జత కట్టడానికి పావులు కదుపుతోంది. అన్నాడీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి కూడా ఇందుకు దాదాపు సిద్దమవుతున్నట్లుగానే వార్తలు వస్తున్నాయి.
డీఎంకే చేపట్టిన హిందీ వ్యతిరేక ఆందోళన, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాదికి నష్టం కలుగుతున్న అంశాలపై ఆయన వ్యూహాత్మకంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు వినతిపత్రాలు సమర్పించడానికి ఢిల్లీ వళ్లారు. గతంలో బీజేపీతో పొత్తు ఉన్నా, లోక్‌సభ ఎన్నికల సమయంలో వేర్వేరుగా పోటీ చేశారు. కానీ డీఎంకే మొత్తం స్వీప్ చేసింది. ఆ పార్టీ తమిళనాడులో బలంగా వేళ్లూనుకుంది. జయలలిత మరణం తర్వాత అన్నా డీఎంకే బలహీనపడింది. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీతో పొత్తు పెట్టుకోవడమే బెటర్ అన్న భావన అన్నాడీఎంకేలో ఏర్పడిందని చెబుతున్నారు.
ప్రముఖ తమిళ నటుడు విజయ్ ఈ కూటమిలో చేరతారా? లేదా? అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. తమ కూటమికి సినీ రంగు అద్దడానికి, తమిళనాడులోని తెలుగు వారిని కొంతమేర ఆకర్షించడానికి పవన్ కళ్యాణ్‌ను ప్రయోగించాలని బీజేపీ తలపెట్టిందని అంటున్నారు. ఒకప్పుడు కులం ఏమిటి? మతం ఏమిటి అని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ ఏకంగా సనాతని వేషం కట్టి దక్షిణాది రాష్ట్రాలు తిరిగి వచ్చారు. ఒక ప్లాన్ ప్రకారం కొద్ది రోజుల క్రితం తమిళ మీడియాకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఏపీలో కేవలం ఆరు శాతం ఓట్లు మాత్రమే వచ్చినా, టీడీపీ పొత్తు కారణంగా జనసేనకు చెందిన 21 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. పవన్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చింది. కాపు సామాజిక వర్గం వారు తమ నుంచి ఎవరో ఒకరు ముఖ్యమంత్రి కావాలని ఎప్పటినుంచో అభిలషిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ వారి ఆశలపై నీళ్లు జల్లుతూ చంద్రబాబుకు పూర్తిగా వత్తాసు పలుకుతున్నారు. పదిహేనేళ్లు చంద్రబాబే సీఎంగా ఉండాలని అంటున్నారు. చంద్రబాబు కుమారుడు లోకేశ్ సీఎం కాకుండా అడ్డుపడడానికే ఈ వాదన చేస్తున్నారన్న అభిప్రాయం ఉన్నా, అవసరమైతే తన పదవి కోసం లోకేశ్‌కు కూడా విధేయత ప్రదర్శించే అవకాశం ఉంటుందని కొందరి భావన.చంద్రబాబు ఎప్పుడైనా మళ్లీ బీజేపీని వ్యతిరేకించినా, లేక ఏదో ఒక అంశంపై విడిపోవాలని బీజేపీ అనుకున్నా, పవన్ కళ్యాణ్‌ను ప్రొజెక్టు చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్‌కు ఏపీలో పెద్దగా ఓట్లు రాకపోయినా లేకపోయినా, ఆయన సినిమా ఇమేజీని వాడుకుని ఇతర రాష్ట్రాలలో ప్రొజెక్టు చేస్తే దాని ప్రభావం ఏపీపై కూడా ఉండవచ్చన్నది ఒక అంచనా అట.
తెలంగాణలో గతంలో బీజేపీ జనసేనతో కలిసి పోటీచేసినా ఫలితం పెద్దగా లేకుండా పోయింది. జనసేన ఒక్క చోట తప్ప పోటీ చేసిన అన్నిచోట్ల డిపాజిట్లు కోల్పోయింది. కాని సనాతని వేషం కట్టి ఇతర రాష్ట్రాలలో పర్యటించడం, ఇప్పుడు తమిళనాడుపై దృష్టి కేంద్రీకరించడం వంటి చర్యల ద్వారా చంద్రబాబుకు ఒక చెక్ గా పవన్ ఉండే అవకాశం ఉంటుంది. బీజేపీ వారు చెప్పినట్లు ప్రచారం చేసి వారితో ఆయన మరింత సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోగలిగితే సమీప భవిష్యత్తులో లోకేశ్‌ను ముఖ్యమంత్రిని చేయడం, లేదా ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం చంద్రబాబు కుటుంబానికి కుదరకపోవచ్చు. అన్నాడీఎంకే, బీజేపీ కూటమిలో చేరినా తమిళనాడులో జనసేన ఎంతవరకు సఫలం అవుతుందన్నది సందేహమే. సినీ నటుడు కూడా కనుక ప్రచారానికి ఈయనను వాడుకోవచ్చు. అందుకే యథా ప్రకారం పవన్ కళ్యాణ్ ఏపీలో ఎలాంటి అబద్దాలు ఆడారో, అదే తరహాలో తమిళనాడులో కూడా ట్రయల్ ప్రారంభించినట్లు అనిపిస్తుంది.
ఉదాహరణకు ఆయనకు తమిళ కవి భారతీయార్ పై అభిమానం ఉందని చెప్పడం, శివాజీ గణేశన్‌కు అభిమానినని, 1982 నుంచి 1995 వరకు చెన్నైలో ఉన్నానని చెప్పడం, మైలాపూర్ పాఠశాలలో చదువుకున్నానని అనడం, కూరగాయల మార్కెట్ కు వెళ్లి తమిళం నేర్చుకున్నానని వెల్లడించడం చూస్తే వీటిలో ఎన్ని నిజాలు ఉన్నాయో, ఎన్ని అబద్దాలు ఉన్నాయో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే పవన్ తన పుట్టిన స్థలం, చదువు గురించి మాత్రమే కాదు..అనేక అంశాలలో ఎన్ని రకాలుగా మాటలు మార్చింది ఏపీ ప్రజలకు తెలుసు. అన్నాడీఎంకే, బీజేపీ కలిస్తే తప్పులేదని, అన్నా డీఎంకేతో జనసేన పొత్తు పెట్టుకోవచ్చని ఆయన అన్నారు. ఇక పిఠాపురంలో హిందీకి అనుకూలంగా మాట్లాడి, తమిళ నేతలను పరోక్షంగా విమర్శించిన పవన్ కళ్యాణ్ అక్కడ మాత్రం మాట మార్చారు. భాషను బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తానని చెప్పారు. తద్వారా తమిళ సెంటిమెంట్‌కు అనుకూలంగా మాట్లాడినట్లు కనిపించే యత్నం చేశారన్న మాట.
పిఠాపురంలో తమిళ సినిమాలను హిందీలో డబ్బింగ్ చేసుకుని సొమ్ము చేసుకుంటున్నప్పుడు హిందీని వ్యతిరేకించడం ఏమిటని అన్నారు. హిందీని రుద్దవద్దన్నది మాత్రమే తమిళ పార్టీల డిమాండ్. ఇదే అంశంపై అన్నాడీఎంకే కూడా అమిత్‌షా కు విన్నవించింది. పవన్ కళ్యాణ్ మరో ఆశ్చర్యకరమైన అంశం చెప్పారు. 2014లో పార్టీని ప్రారంభించినప్పుడు కనుచూపు మేర చీకటి కనిపించిందని, ఎలా ముందుకు వెళ్లాలో తెలియలేదని, మనసులో ధైర్యం తప్ప మరేమీ లేవని ఆయన అన్నారు. ఇది సత్య దూరమైందో, కాదో ఆయనే ఆలోచించుకోవాలి. జనసేన పార్టీని స్థాపించడం, ఆ వెంటనే చంద్రబాబు కోరిక మేరకు మద్దతు ఇవ్వడం, కనీసం పోటీ కూడా చేయక పోవడం, తదుపరి టీడీసీ కూటమి ప్రభుత్వంతో సంబంధాలు పెట్టుకుని ఎంజాయ్ చేయడం జరిగాయి.

చంద్రబాబుకు అవసరమైనప్పుడల్లా స్పెషల్ విమానాలు ఏర్పాటు చేస్తే హైదరాబాద్ నుంచి తరలి వెళ్లేవారు. మరి ఇందులో ఆయనకు చీకటి కనిపించడం ఏమిటో తెలియదు. కాకపోతే 2019లో బీఎస్పీ, వామపక్షాలతో పోటీచేసి ఓటమి చెందినప్పుడు చీకటి కనిపించి ఉండవచ్చు. తన పార్టీ ఒకే సీటు గెలవడం, తనే రెండు చోట్ల ఓడిపోయారప్పుడు. 2019లో కూడా చంద్రబాబుతో పరోక్ష పొత్తు ఉందన్న ఆరోపణలు లేకపోలేదు. లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనపై మొదట పార్లమెంటులో మాట్లాడాలని, అలా కాకుండా ఒకేసారి రోడ్లపైకి వస్తే ఎలా అని ప్రశ్నించారు. అంతే తప్ప దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే తాను కూడా పోరాడతానని చెప్పలేక పోయారు. అదే టైమ్‌లో దక్షిణాదిలో లోక్ సభ సీట్లు తగ్గవని నమ్ముతున్నట్లు ఆయన చెబుతున్నారు.
ఏపీలో పార్టీ విస్తరణకు ప్రత్యేకంగా ఎలాంటి అడుగులు వేయకపోయినా, జనసేన నేతలు, కార్యకర్తలు ఆయా నియోజకవర్గాలలో టీడీపీ వారి పెత్తనం కింద నలిగిపోతున్నా, పట్టించుకోని పవన్ కళ్యాణ్ ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తామని చెబుతున్నారు. చంద్రబాబుతో కలిసి చేసిన సూపర్ సిక్స్ అనే అబద్దాల వాగ్దానాలను తమిళనాడులో కూడా చెబుతారేమో తెలియదు. ఈ ఇంటర్వ్యూలలో ఆ జర్నలిస్టులు ఏపిలో ఎన్డీయే కూటమి హామీల అమలు తీరుతెన్నుల గురించి ఒక్క ప్రశ్న కూడా వేసినట్లు కనిపించదు. ముందస్తుగా మాట్లాడుకుని ఉంటే ఇబ్బంది లేని ప్రశ్నలే వేసే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ విప్లవవీరుడు చెగువెరా మొదలు టిడిపి అధినేత చంద్రబాబు వరకు, ప్రధాని మోడీ వరకు ఎన్ని రంగులు మార్చారో ,ఇప్పుడు తమిళనాడులో కూడా ఎన్ని రకాల విన్యాసాలు చేస్తారో, ఆయనను తమిళ ప్రజలు ఎంతవరకు నమ్ముతారో వేచి చూడాల్సిందే.
కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత