రోహిత్‌ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం | Sakshi
Sakshi News home page

రోహిత్‌ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం

Published Sat, May 4 2024 8:33 AM

Telangana Police to reopen Rohith Vemula case

రోహిత్‌ తల్లి, మరికొందరు అనుమానాలతో ఈ నిర్ణయం  

డీజీపీ రవిగుప్తా వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్‌ వేముల ఆత్మహత్య కేసులో మళ్లీ విచారణ చేపట్టాలని నిర్ణయించినట్టు డీజీపీ రవిగుప్తా వెల్లడించారు. 2016 జనవరి 17వ తేదీన హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి రోహిత్‌వేముల ఆత్మహత్యపై గచ్చిబౌలి పీఎస్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి శుక్రవారం పలు ఎల్రక్టానిక్, సోషల్‌ మీడియా చానళ్లలో రకరకాల వార్తలు, కథనాలు ప్రస్తారమయ్యాయి. దీనిపై స్పందించిన డీజీపీ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ‘ఈ కేసులో ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌గా మాదాపూర్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ ఉన్నారు. 

ఈ కేసుకు సంబంధించిన తుది నివేదిక గత సంవత్సరం అంటే నవంబర్‌ 2023 కన్నా ముందే నిర్వహించిన దర్యాప్తు ఆధారంగా తయారు చేశారు. ఆ తుది నివేదికనే అధికారికంగా 21.03.2024న ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌ సంబంధిత కోర్టులో దాఖలు చేశారు. అయితే విచారణ, విచారణ జరిగిన విధానంపై రోహిత్‌ వేముల తల్లితోపాటు మరికొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో కేసు విషయంలో మళ్లీ విచారణ చేపట్టాలని నిర్ణయించామని, తదుపరి దర్యాప్తును అనుమతించాలని మేజి్రస్టేట్‌ను అభ్యర్థిస్తూ సంబంధిత కోర్టులో పిటిషన్‌ దాఖలు చేస్తాం’అని డీజీపీ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 
 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement