'జాతి వ్యతిరేకులు ఎప్పటికీ హీరోలు అవ్వరు'
మథుర: రాజద్రోహం కేసులో అరెస్టయి రెండు రోజుల కింద విడుదలైన జేఎన్యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ చేసిన వ్యాఖ్యలను విదేశీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి వీకే సింగ్ ఖండించారు. హెచ్సీయూలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల తనకు ఆదర్శమని చేసిన వ్యాఖ్యలను వీకే సింగ్ తప్పుబట్టారు. జాతి వ్యతిరేకులు ఎప్పటికీ హీరోలు కానే కాదని వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ లోని మథురలో జరిగిన ఓ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
1993 ముంబై పేలుళ్ల కేసులో నిందితుడు యాకుమ్ మెమన్ ఉరితీతను వేముల రోహిత్ వ్యతిరేకించాడు. ఆ సందర్భంగా దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాడని ఆరోపించారు. ఈ నేపథ్యంలో రోహిత్ వేములను తనకు ఆదర్శప్రాయుడిగా విద్యార్థి నేత కన్హయ్య కుమార్ ఎలా ఎంచుకుంటాడన్నారు. రోహిత్ దారిలోనే కన్హయ్య నడిచాడు. అతడిలాగానే పార్లమెంట్ దాడులకు పాల్పడ్డ కేసులో నిందితుడు అఫ్జల్ గురు ఉరితీత అంశాన్ని వ్యతిరేకిస్తూ జేఎన్యూ వర్సిటీలో కార్యక్రమాలు నిర్వహించాడని మంత్రి వీకే సింగ్ గుర్తుచేశారు. ఆరు నెలల తాత్కాలిక బెయిల్ పై కన్హయ్య కుమార్ విడుదలయ్యాక కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వర్సిటీలో ఈవెంట్స్ నిర్వహించిన విషయం తెలిసిందే.