ఇపుడు వీస్తున్న గాలి..? | Kanhaiya Kumar's Speech At JNU Campus After Release | Sakshi
Sakshi News home page

ఇపుడు వీస్తున్న గాలి..?

Published Sun, Mar 6 2016 3:26 AM | Last Updated on Fri, Nov 9 2018 4:31 PM

ఇపుడు వీస్తున్న గాలి..? - Sakshi

ఇపుడు వీస్తున్న గాలి..?

దేశ సామాజిక, రాజకీయ రంగంలో ఇప్పుడు ఒక కొత్త గాలి వీస్తోంది.
అది దక్షిణాన హెచ్‌సీయూలో మొదలై.. ఉత్తరాన జేఎన్‌యూ వరకూ సుడిగాలిలా
తిరుగుతోంది. ఉన్నత విద్యా సంస్థల్లో మొదలైన ఈ సుడిగాలి ఏ పరిణామాలకు సంకేతం?

‘పదవీ వ్యామోహాలూ, కులమత భేదాలూ భాషా ద్వేషాలూ చెలరేగే నేడూ...’ అన్న మహాకవి మాటలు ఇప్పుడు అక్షర సత్యాలన్నదానితో విభేదించే వారు ఉండరేమో! 90వ దశకంలో ఆర్థిక సంస్కరణలు, ఐటీ రంగ వికాసం, యువత కెరీర్‌కే ప్రాధాన్యమిచ్చి, సామాజిక పరిణామాలను పట్టించుకోకపోవటం వంటి కారణాల వల్ల వారిలో సామాజిక, రాజకీయ వికాసం మందగించిపోయింది.

కానీ.. పాతికేళ్ల నిర్లిప్తత తర్వాత రోహిత్ వేముల, కన్హయ్య కుమార్ రూపంలో దేశమంతటా విద్యార్థి ఉద్యమం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. వివక్ష, ఆధిపత్యాలను నిరసిస్తూ రోహిత్ రాసిన ఆత్మహత్య లేఖ.. అరెస్టు, విడుదల తర్వాత కన్హయ్య ప్రసంగాలు.. దేశప్రజలనే కాదు.. రాజకీయ నాయకత్వాన్నే ప్రభావితం చేస్తున్నాయి. దేశభక్తి, జాతీయవాదాలకు కొత్త నిర్వచనాలిచ్చి, మరింత మానవీయమైన సమాజాన్ని ఆకాంక్షిస్తూ.. దూసుకొస్తున్న నేటి విద్యార్థి లోకానికి వీరిద్దరూ ప్రతీకలని మేధోవర్గం భావిస్తోంది.

ఈ ప్రభంజనం దేశ రాజకీయ భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేయనుందా? అన్న ఆసక్తికర చర్చ సర్వత్రా సాగుతోంది. విద్యార్థులకు రాజకీయాలతో పనేంటని తలపండిన రాజకీయ నేతలు చెబుతోంటే .. మున్ముందు రాజకీయాలను తామే శాసించబోతున్నామని విద్యార్థి లోకం బలంగా చాటుతోందని పరిశీలకులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సామాజిక, రాజకీయ పరిణామాల్లో విద్యార్థి ఉద్యమాల పరిణామాలపై ‘సాక్షి’ ఫోకస్...

 
మళ్లీ ఉద్యమ పథంలోకి విద్యార్థి లోకం
దేశ రాజకీయాలను కుదిపేసిన రోహిత్, కన్హయ్య దేశ ప్రజా చేతనను రగిలించిన రోహిత్ ఆత్మహత్య లేఖ ప్రజలను కట్టిపడేసిన కన్హయ్య ‘ఆజాదీ’ నినాదం వినూత్న విద్యార్థి ఉద్యమాలకు ప్రతీకలుగా తెరపైకి పాతికేళ్ల స్తబ్దత తర్వాత సుడిగాలిలా రేగిన ఉద్యమాలు మార్క్స్ - అంబేద్కర్ సిద్ధాంతాలు, ఆలోచనల మేళవింపు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలే అంతిమ లక్ష్యం అన్ని రకాల దోపిడీలు, అసమానతలపై యుద్ధం భవిష్యత్ రాజకీయాలపై కొత్త ఆశలను రేకెత్తిస్తున్న వైనం

 
పృథ్వీరాజ్ : అసమానతలు, అణచివేతలు సమాజంలో పెరుగుతున్నపుడు.. అసహనాలు, ఆధిపత్య భావజాలాలు రాజ్యం చేస్తున్నపుడు.. ఎక్కడో అక్కడ ఒక అలజడి చెలరేగుతుంది. ఒక కొత్త గాలి వీస్తుంది. చిరుగాలిలా మొదలై సుడిగాలిలా మారుతుంది. తిరుగుబాటు బావుటా రెపరెపలాడుతుంది. సమూల మార్పులకు దారితీస్తుంది. ఇది చరిత్ర రుజువుచేసిన సత్యం. చారిత్రక అవసరాలు మట్టిమనుషులను మన కాలం వీరులుగా మలిచే సందర్భాలను చరిత్ర పొడవునా గమనిస్తూనే వచ్చాం.

రెండు వేల సంవత్సరాల కిందట బానిసత్వంపై తిరుగుబాటు చేసిన స్పార్టకస్ మొదలుకొని.. సామ్రాజ్యవాదం, జాత్యహంకారం, వర్ణ వివక్షలపై తిరగబడి మహోద్యమాలకు పురుడుపోసిన నిన్నటి చేగువేరా, మార్టిన్ లూథర్‌కింగ్, నెల్సన్ మండేలా, భగత్‌సింగ్‌ల వరకు ఆయా కాలాల్లో వీచిన కొత్త గాలికి సంకేతాలు! మానవ జాతి జ్ఞాపకాల్లో చిరస్మరణీయులుగా మిగిలిపోయిన మాన్యులందరూ చరిత్ర సానబెట్టిన మట్టిలో మాణిక్యాలే.
 
రాజకీయాలకు ఆలంబనగా..
ఈ చరిత్రలు.. భారతదేశంలోనూ విద్యార్థి, యువతరం స్వాతంత్య్రోద్యమ బరిలోకి ఉరికేందుకు.. అనంతరం రాజకీయాల్లో చురుకుగా పాల్గొనేందుకు ఆలంబనగా నిలిచాయి. ఆ ఉద్యమాల సారథులూ వారథులూ స్వాతంత్య్రానంతర రాజకీయాల్లో నాయకులుగా స్థిరపడ్డారు. స్వాతంత్య్రానంతరం మంచి జీవితంపై, ఉజ్వల భవిష్యత్తుపై కోట్లాది మంది భారతీయులు పెట్టుకున్న ఆశలు, ఆకాంక్షలు, స్వప్నాలు మొత్తంగా ఇరవై ఏళ్లలోనే చెదిరిపోయిన నేపధ్యంలో.. విద్యార్థి, యువజన, రైతాంగ శ్రేణుల్లో చెలరేగిన తీవ్ర అసంతృప్తి మరో ఉద్యమ రూపం తీసుకుంది.

విద్యార్థులు, విద్యావంతులు, యువతరం అందులో ఉరకలెత్తింది. ఆ ఉద్యమానికి ‘ఇపుడు వీస్తున్న గాలి’ కవిత అక్షర రూపమిచ్చింది. సమాజంలో విప్లవాత్మక మార్పులకు బీజమేసింది. ఎమర్జెన్సీకి ముందు సంపూర్ణ విప్లవం పిలుపుతో జయప్రకాశ్‌నారాయణ్ మొదలెట్టిన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న విద్యార్థి, యువజనులు తదుపరి తరంలో రాజకీయ నాయకులుగా పరిణమించారు. ఎమర్జెన్సీ అనంతరం 1989 మండల్, మందిర్ వివాదంలో.. రిజర్వేషన్, యాంటీ-రిజర్వేషన్ ఉద్యమాల్లోనూ యావద్దేశంలో విద్యార్థులు ఉప్పెనలా కదిలారు. ఆ ఉద్యమాలూ సమాజ గమనంపై బలమైన ముద్రవేశాయి.
 
కెరీరిజం రాజ్యం
ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. 1990ల ప్రారంభంలో ఆరంభమైన ఆర్థిక సంస్కరణలు, ఆ తర్వాత ఐటీ రంగ విప్లవంతో విద్యాలయాల్లో కెరీరిజం రాజ్యమేలటం మొదలైంది. సామాజిక శాస్త్రాలు వెనుకపట్టు పట్టటం, కెరీర్‌కు ఉపకరించే విద్యకే పట్టం కట్టటం వంటి పరిణామాలతో.. గత రెండు తరాల విద్యార్థులకు సామాజిక పరిస్థితుల గురించి ఏమీ తెలియకుండా పోయింది. అప్పటివరకూ జాతి చైతన్య వాణిగా గర్జించిన విద్యార్థి, యువజనుల పాత్ర రానురాను క్షీణించిపోయింది.

అంతకుముందు వరకూ ఏ ప్రధాన సంఘటన జరిగినా తామున్నామంటూ ముందుకొచ్చిన విద్యార్థి ఉద్యమాలు.. ఆర్థిక సంస్కరణలు, ఐటీ వెల్లువలో కొట్టుకుపోయాయంటే అతిశయోక్తి కాదు. క్రమేపీ.. దేశభక్తి అంటే మిలటరీ దేశభక్తి అనే భావన రెడీమేడ్ వంటకంలా సమాజంలో పాతుకుపోయింది. ‘దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్...’ అన్న మానవీయ భావన విస్మరణకు గురైపోయింది. ఈ పరిస్థితుల్లోనూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి విద్యార్థి ఉద్యమమే చోదకశక్తిగా నిలిచి నడిపించింది. అయితే.. ఆ ఉద్యమం పరిధి పరిమితమైనది కావటంతో దేశవ్యాప్తంగా విద్యార్థి లోకం కదలగలిగే అవకాశం లేకపోయింది.
 
‘ఆజాదీ’ కాంక్ష
అదే సమయంలో ఇటీవలి కాలంలో అటు ప్రపంచంలోనూ, ఇటు దేశంలోనూ చోటుచేసుకుంటున్న సామాజిక, ఆర్థిక పరిణామాల ఫలితంగా.. దేశంలో అసహనం, ఆధిపత్య భావజాలం పెచ్చుమీరటం ప్రస్ఫుటమైంది. దానితో పాటే.. వాటిని వ్యతిరేకిస్తూ అలజడి కూడా మొదలైంది. అది సామాజిక పరిస్థితుల పట్ల విద్యార్థి లోకాన్ని మళ్లీ మేల్కొలుపుతోంది. అయితే.. నాడు భగత్‌సింగ్ ఆదర్శంగా స్వాతంత్య్రోద్యమంలోకి..

అనంతరం చేగువేరా ప్రేరణగా సామ్యవాద ఉద్యమంలోకి ఉరికివచ్చిన విద్యార్థిలోకం.. ముఖ్యంగా ఉన్నత విద్యా సంస్థల్లోని విద్యార్థులు.. ఇప్పుడు మార్క్స్ - అంబేద్కర్‌ల సైద్ధాంతిక పునాదులను మేళవిస్తూ.. సమానత్వం, సౌభ్రాతృత్వం, ప్రజాస్వామ్య విలువలను చాటిన మేధావులందరి ఆలోచనా రీతులను ఇముడ్చుకుంటూ.. అన్ని రకాల అణచివేతలు, ఆధిపత్యాల నుంచి ‘ఆజాదీ’ కాంక్షిస్తూ ఒక రూపం తీసుకుంటోంది. అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల రూపంలో ఒక్కసారిగా విస్ఫోటనం చెందింది. ఆ వెనువెంటనే జవహర్‌లాల్‌నెహ్రూ విశ్వవిద్యాలయంలో కన్హయ్యకుమార్ గొంతుతో పొలికేక పెట్టింది.
 
రోహిత్.. ఆత్మహత్య లేఖ
అణగారిన దళిత వర్గం నుంచి వచ్చిన రోహిత్ వేముల.. ఆరంభంలో వామపక్ష విద్యార్థి సంఘంలో, తర్వాత దానితో విభేదించి అంబేద్కర్ విద్యార్థి సంఘంతో పనిచేశాడు. సహ విద్యార్థులతో కలిసి ఉద్యమించాడు. ముందు వరుసలో ఉంటూ.. కుల, మత వివక్షలకు, పీడనలకు, ఆధిపత్య భావజాలానికి  వ్యతిరేకంగా గళమెత్తి నినదించాడు. ‘‘నా తాత్వికత చాలా సరళమైనది.. పరమ మూర్ఖమైన, అత్యంత మలినమైన వాదాలు రెండు- మతం, జాతీయవాదం (యుగయుగాల నుంచి హింస రచనకు అత్యుత్తమ మార్గాలుగా రుజువైనవి).

నేను ఏవగించుకునే పెడ ధోరణులు- దురాశ, సంఘ బహిష్కారం (సామ్రాజ్యవాద, ఆధిపత్యవాదాల లక్షణాలు). నేను నా ప్రాణాలను అర్పించైనా చూడాలనుకున్నవి- కారుణ్యం, చైతన్యం! ఈ ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైనవి- ప్రేమ, ప్రకృతి’’ అని తన ఫేస్‌బుక్‌లో ప్రకటించాడు. కర్ణాటకలో కలబుర్గి హత్య నుంచి.. ముంబై బాంబు పేలుళ్ల కేసులో యాకూబ్‌మెమన్‌కు మరణశిక్ష విధించటం వరకూ ఒకే తీవ్రతతో వ్యతిరేకించాడు. మరణశిక్షను విధించే దేశం ప్రజాస్వామిక దేశమే కాదన్నాడు. ఆ శిక్ష హత్యతో సమానమన్నాడు. మత మైనారిటీలపై దాడులను నిర్ద్వం ద్వంగా ఖండించాడు.

కశ్మీరీల స్వయం నిర్ణయ హక్కుకు మద్దతు ఇచ్చాడు. అంతటా స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వం, సౌభ్రాతృత్వం, మానవీయ విలువలే ప్రధానంగా ముందుకు నడిచాడు. అయితే.. ఆ ఉద్యమ క్రమంలో వివక్షకు, బహిష్కరణకు గురయ్యాడు. చివరికి.. ‘మనిషి విలువ.. అతడి తక్షణ గుర్తింపు, సమీప అవకాశానికి కుచించుకుపోయింది. ఒక ఓటుకు. ఒక సంఖ్యకు. ఒక వస్తువుకు (పరిమితమైపోయింది).

ఒక మనిషిని ఒక ఆలోచనగా ఎన్నడూ (ఎవరూ) చూడలేదు. నక్షత్రధూళితో నిర్మితమైన ఒక ఉజ్వలమైన జీవిగా ఎప్పుడూ (ఎవరూ) చూడలేదు. ప్రతి చోటా.. చదువుల్లో వీధుల్లో రాజకీయాల్లో చావులో బతుకులో (ఎక్కడా మనిషిని మనిషిగా చూడలేదు)’ అంటూ ప్రస్తుత సమాజానికి, ఇప్పుడు రాజ్యమేలుతున్న విలువలకు ఒక అయోగ్యతాపత్రం ప్రకటిస్తూ నీడల నుంచి నక్షత్రాలకు పయనమైపోయాడు.

రోహిత్ ఆత్మహత్య దేశ సమాజ చేతనను పెను కుదుపు కుదిపింది. ఈనాటి సమాజిక వాస్తవాలను, అందులోని డొల్లతనాన్ని కళ్లకు కట్టింది. మేధావులు, రచయితలు, ఉద్యమకారుల్లో తీవ్ర కలకలం రేగింది. ఢిల్లీ నుంచి గల్లీ వరకూ విద్యార్థి లోకం ఉవ్వెత్తున ఎగసింది. అందులో ఢిల్లీలోని జేఎన్‌యూ ముందు వరుసలో నిలిచింది.
 
కన్హయ్య.. ‘ఆజాదీ’ పొలికేక

చేతనత్వానికి మారు పేరుగా నిలిచే ఢిల్లీ జేఎన్‌యూ రోహిత్ ఆత్మహత్యకు ముందు నుంచే అనేకానేక అంశాలపై ఉద్యమిస్తోంది. అక్కడ కూడా.. ముఖ్యంగా ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న ఘటనలు.. హేతువాదుల హత్యలు, బీఫ్ పేరుతో దాడులు, మతకలహాల సృష్టికి ప్రయత్నాలు, కీలక కేసుల్లో దోషులకు మరణశిక్షలు.. వంటి పరిణామాలనెన్నిటినో వ్యతిరేకిస్తూ నిరసన గళం వినిపిస్తోంది. రోహిత్ ఆత్మహత్యతో ఆ స్వరం మరింత తీవ్రమైంది.

విద్యాలయాల్లోని పరిస్థితులపై దేశం యావత్తూ దృష్టి సారించే స్థాయికి ఉద్యమించింది. ఆ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాల్లో భావప్రకటనా స్వేచ్ఛను పరిరక్షించుకునే ప్రయత్నంలో.. అఫ్జల్‌గురుకు ఉరిశిక్షను అమలు చేయటాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ఒక కార్యక్రమానికి జేఎన్‌యూ విద్యార్థులు మద్దతివ్వటం పెను వివాదంగా మారింది. అందులో దేశవ్యతిరేక నినాదాలు చేశాడన్న ఆరోపణలతో పోలీసులు రాజద్రోహం కేసు నమోదు చేసి జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షుడు కన్హయ్యకుమార్‌ను అరెస్ట్ చేయటం మరోసారి దేశాన్ని, విద్యార్థి లోకాన్ని కుదిపేసింది.

అరెస్ట్‌కు ముందూ, వెనుకా జరిగిన పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. దేశదేశాల మేధావులు కన్హయ్య అరెస్ట్‌ను ఖండించారు. అయితే.. బెయిల్‌పై విడుదలైన తర్వాత కన్హయ్య జేఎన్‌యూలో చేసిన ప్రసంగం.. ప్రస్తుతం రూపుదిద్దుకుంటున్న విద్యార్థి ఉద్యమాల ఆలోచనా రీతులను విస్పష్టంగా ఆవిష్కరించింది. ‘‘భారత్ నుంచి మేం స్వేచ్ఛ కోరటం లేదు. భారత్‌లో స్వేచ్ఛ కావాలని కోరుతున్నాం. ... సరిహద్దు వద్ద తన ప్రాణాన్ని పణంగా పెట్టి యుద్ధరంగంలో పోరాడే వారైనా.. తన స్వేచ్ఛ కోసం జేఎన్‌యూలో పోరాడుతున్న వారైనా.. ఏకం కాగల గొంతులన్నిటినీ మూయించాలని మీరు కోరుకుంటున్నారు.

రాజకీయ స్వేచ్ఛ మాత్రమే సరిపోదు.. సామాజిక స్వాతంత్య్రం కావాలని అంబేడ్కర్ చెప్పారు. అందుకే రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాం. సోషలిజం కోసం ప్రజాస్వామ్యం అనివార్యమని లెనిన్ చెప్పాడు. అందుకే ప్రజాస్వామ్యం గురించి మేం మాట్లాడతాం. భావప్రకటనా స్వాతంత్య్రం గురించి మేం మాట్లాడతాం. సమానత్వం గురించి మేం మాట్లాడతాం. ఒక బంట్రోతు కొడుకు, ఒక అధ్యక్షుడి కొడుకు.. ఒకే పాఠశాలకు వెళ్లగలిగే పరిస్థితుల కోసం మేం మాట్లాడతాం. ఆకలి, దారిద్య్రం, అణచివేత, దోపిడీల నుంచి విముక్తి లభించే వరకూ.. దళితులు, గిరిజనులు, మైనారిటీలు, మహిళల హక్కుల కోసం మా పోరాటం’’ అంటూ కన్హయ్య చేసిన నినాదం దేశాన్ని కట్టిపడేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement