వెళ్లి తీరుతా, అనుమతించే ప్రసక్తే లేదు..
హైదరాబాద్ : హెచ్ సీయూ మరోసారి అట్టుడుకుతోంది. ఓవైపు వర్సిటీలోకి వెళ్లితీరుతానంటున్న జేఎన్యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్, మరోవైపు అతడిని క్యాంపస్లోకి అనుమతించేది లేదని పోలీసులు ...ఈ నేపథ్యంలో బుధవారం మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో వర్సిటీలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
కాగా కన్హయ్య కుమార్ను లోనికి అనుమతించే ప్రసక్తే లేదని పోలీసులు తెలిపారు. అయితే కన్హయ్యను వర్సిటీలోకి అనుమతించకుంటే తామే బయటకు వచ్చి సభ నిర్వహించుకుంటామని విద్యార్థులు స్పష్టం చేశారు. అంతకు ముందు హాస్టల్‌లో వంట చేసుకుంటున్న తమపై పోలీసులు లాఠీఛార్జ్ చేయటాన్ని విద్యార్థులు ఖండిస్తున్నారు. ఇంకెంతమందిని చంపుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచినీళ్లు, ఇంటర్నెట్, వర్శిటీ క్యాంటిన్లు ఇలా అన్నింటిని మూసేసి తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు.
కాగా అంతకు ముందు కన్హయ్య కుమార్ మాట్లాడుతూ.... పీహెచ్డీ విద్యార్థి వేముల రోహిత్ చట్టం తీసుకొచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. హెచ్సీయూ విద్యార్థి జేఏసీ ఆహ్వానం మేరకు హైదరాబాద్ వచ్చిన కన్హయ... రోహిత్‌లా మరొకరు ప్రాణాలు కోల్పోవద్దన్నదే తమ అభిప్రాయమన్నారు. హెచ్సీయూకు వెళ్లి, అక్కడ బహిరంగ సభలో మాట్లాడనున్నట్లు చెప్పారు.
వర్సిటీలో హింసకు వీసీ అప్పారావే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. ఒక యూనివర్సిటీకి చెందిన విద్యార్థి మరో వర్సిటీకి వెళ్లకూడదా అని ప్రశ్నించారు. చట్టాన్ని ఉల్లంఘించేవాళ్లం కాదని, కట్టుబడి ఉండేవాళ్లమని కన్హయ్య తెలిపారు. కాగా కొండాపూర్లోని సీఆర్ పౌండేషన్లో ఉన్న రోహిత్ తల్లి రాధికను ఇవాళ ఆయన పరామర్శించారు. అనంతరం రోహిత్ తల్లి, సోదరుడితో కలిసి కన్హయ్య కుమార్ హెచ్ సీయూకు బయల్దేరారు. కాగా హెచ్సీయూ నుంచి పోలీసు బలగాలను తక్షణమే పంపించివేయాలని ప్రొఫెసర్ కోదండరామ్ డిమాండ్ చేశారు.