ఎంతమంది రోహిత్లను చంపుతారు: కన్హయ్య
హైదరాబాద్ : లాఠీలతో తమ గొంతులు నొక్కలేరని జేఎన్యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చేరుకున్న ఆయనను బుధవారం సాయంత్రం పోలీసులు లోనికి అనుమతించలేదు. హెచ్సీయూ మెయిన్ గేటు వద్దే కన్హయ్య కుమార్ వాహనాన్ని అడ్డుకోవటంతో ఆయన వాహనం దిగి ఆవేశపూరితంగా ప్రసంగించారు. వేముల రోహిత్ కలలను సాకారం చేయడానికే తాము హెచ్సీయూకు వచ్చినట్లు చెప్పారు. అతనికి న్యాయం జరగాలని, రోహిత్ చట్టం వచ్చేవరకూ తమ పోరాటం కొనసాగుతుందన్నారు. యూనివర్సిటీలో భయానక పరిస్థితులు సృష్టించారన్నారు.
తమను వర్సిటీలోనికి పోలీసులు అనుమతించడం లేదని, లాఠీలతో తమ గొంతులు నొక్కలేరన్నారు. లాఠీలు, తూటాలతో పోరాటాలు ఆపలేరని కన్హయ్య కుమార్ అన్నారు. ఇంకా ఎంతమంది రోహిత్లను చంపుతారని ఆయన ఉద్వేగంగా మాట్లాడారు. సామాజిక న్యాయం జిందాబాద్...యూనివర్సిటీలో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి అంటూ కన్హయ్య కుమార్ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆయనతో పాటు విద్యార్థులు గొంతు కలిపారు. కాగా వేముల రోహిత్ తల్లి రాధిక, అతడి సోదరుడుతో కలిసి కన్హయ్య కుమార్ హెచ్సీయూకు వచ్చారు.
కాగా తాము కన్హయ్య కుమార్ ను తాము అడ్డుకోలేదని, యూనివర్సిటీ భద్రతా సిబ్బందే అడ్డుకున్నారని పోలీసులు తెలిపారు. వీసీ అప్పారావు ఆదేశాల మేరకు వర్సిటీ భద్రతా సిబ్బంది అడ్డుకున్నట్లు పేర్కొన్నారు.