vc apparao
-
నేడు హెచ్‌సీయూ బంద్
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల సస్పెన్షన్‌పై మళ్లీ అగ్గి రాజుకుంది. విద్యార్థుల సస్పెన్షన్‌కి వ్యతిరేకంగా ఐదు రోజులుగా వివిధ రూపాల్లో నిరసనను వ్యక్తం చేసినా పట్టించుకోకపోవడంతో హెచ్‌సీయూ విద్యార్థి సంఘం మంగళవారం యూనివర్సిటీ బంద్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముట్టడికి పిలుపునిచ్చింది. విద్యార్థుల సస్పెన్షన్‌కు యాజమాన్యం కక్షపూరిత వైఖరే కారణమని, దీనికి నిరసనగా విద్యార్థులు స్వచ్ఛందంగా తరగతులను బహిష్కరించాలని కోరింది. వైస్ చాన్స్‌లర్ అప్పారావు కక్షపూరిత వైఖరి విద్యార్థుల భవిష్యత్‌ను బలితీసుకుంటున్నదని ఆరోపించింది. సోమవారం యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంఘం నాయకులు, విద్యార్థులు మాట్లాడారు. వార్డెన్లు తాగి వచ్చి అనవసర రాద్ధాంతం చేయగా తమను సస్పెండ్ చేశారని విద్యార్థులు పేర్కొన్నారు. వార్డెన్లపై దాడి జరిగితే పోలీస్ కంప్లెయింట్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. తక్షణమే బేషరతుగా సస్పెన్షన్ ఎత్తివేయాలని విద్యార్థి సంఘం కార్యదర్శి ఆరిఫ్ అహ్మద్, నాయకులు బషీర్, భాస్కర్ డిమాండ్ చేశారు. ఒకవేళ యూనివర్సిటీలో ఉన్న మగాళ్లందర్నీ మీ అమ్మాయిల హాస్టల్‌కి రానిస్తేనన్నా మీరు సంతృప్తి చెందుతారా’అంటూ ఓ వార్డెన్ నాతో అసభ్య ప్రేలాపన చేశారు. ఇది ముమ్మాటికీ లైంగిక వేధింపే. దీనిని యాజమాన్యం నిలదీయకపోగా, రోహిత్ ఉద్యమంలో చురుకుగా ఉన్న 10 మంది విద్యార్థులను సస్పెండ్ చేసింది. – అథిర ఉన్ని, విద్యార్థిని ప్రొక్టోరల్ కమిటీని ఎందుకు మినహాయించారు? ఎటువంటి విచారణ లేకుండా సస్పెండ్చేయడంలో ఉద్దేశం విద్యార్థులను భయపెట్టడమే. రోహిత్ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వారినే టార్గెట్ చేశారు. ప్రొక్టోరల్ కమిటీ క్యాంపస్‌లో ఉన్నతమైన కమిటీ, మరి దాన్నెందుకు విస్మరించారు. వీసీ అప్పారావు వైఖరికి టీడీపీ రాజకీయ అండదండలే కారణం. - మున్నా, అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వార్డెన్లను దుర్భాషలాడింది ఎవరు? పది మందిపై వేటు వేశారు. వారినెలా గుర్తించారో తెలియదు. వారిలో ఎవరెవరు ఏం నేరం చేశారని కానీ, ఏం జరిగిందని కానీ రిపోర్టు ఇవ్వలేదు. మరి కమిటీ ఎందుకు వేసినట్టు..? - వెంకటేష్ చౌహాన్, ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఇక్కడ ప్రశ్నించడమే నేరం.. ఆరోజు జరిగింది భౌతిక దాడి కాదు. కేవలం వాగ్వాదం. లైట్స్ ఆర్పి దాడికి దిగారనడం ఒఠ్ఠి అబద్ధం. తప్పుడు ప్రచారం చేస్తూ విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేసేందుకు ఇదంతా చేస్తున్నారు. రోహిత్ ఉద్యమంలో ఉన్నందుకే ఇదంతా. ఇక్కడ ప్రశ్నించడమే నేరమైంది. - సాయి యామర్తి, సస్పెండైన విద్యార్థి -
రాష్ట్రపతి పేరును ఎందుకు చేర్చారు?: హైకోర్టు
హైదరాబాద్: పలు గొడవలకు కారణమైనా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వీసీ అప్పారావును తొలగించడం లేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేరును కూడా చేర్చారు. దీనిపై సోమవారం విచారించిన హైకోర్టు... రాష్ట్రపతి పేరును ఎందుకు చేర్చారని పిటిషనర్ తరఫు లాయర్ ను హైకోర్టు ప్రశ్నించింది. వీసీని నియమించింది రాష్ట్రపతి కాబట్టే ఆయన పేరు కూడా చేర్చామని న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ అభియోగానికి తగ్గట్టుగా వచ్చే సోమవారం లోపు కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్‌ను కోరింది. కేసు తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. -
సుంకన్నకు నెటిజన్ల ఆదరణ
సాక్షి, హైదరాబాద్: ఇటీవల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 18వ స్నాతకోత్సవంలో వీసీ అప్పారావు నుంచి పీహెచ్డీ పట్టాను తీసుకోనని సభాముఖంగా తిరస్కరించిన వేల్పుల సుంకన్న వీడియోకి నెటిజన్లు బాగా స్పందిస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటికి దాదాపు లక్షా 70 వేలకు పైగానే వీక్షకులు తిలకించారు. సెంట్రల్ వర్సిటీలోనూ, దేశవ్యాప్తంగానూ దళిత విద్యార్థులు ఎదుర్కొంటోన్న వివక్ష, అవమానాలకు తిరస్కారంగా హెచ్‌సీయూ దళిత పరిశోధక విద్యార్థి వేల్పుల సుంకన్న పీహెచ్డీ డిగ్రీని నిరాకరించిన విషయం తెలిసిందే. ఇదే వీడియో సోషల్ మీడియాలో హల్చల్ సృష్టిస్తోంది. -
‘హెచ్‌సీయూ వీసీని తొలగించాలి’
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో అశాంతికి కారణమైన వీసీ పొదిలి అప్పారావును తక్షణమే తొలగించాలని మంగళవారం సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం జనరల్ బాడీ సమావేశంలో డిమాండ్ చేసింది. విశ్వవిద్యాలయాన్ని మిలటరీ క్యాంపుగా మార్చిన అప్పారావును వారంతా తీవ్రంగా వ్యతిరేకించారు. విద్యార్థులపై పెట్టిన కేసులన్నీ ఉపసంహరించుకోవాలని ఈ సమావేశం తీర్మానించింది. యూనివర్సిటీలోకి మీడియా, ఇతర మేధావులు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రవేశించడం వారి ప్రజాస్వామిక హక్కు అని తెలిపింది. వర్సిటీలో వివక్షకు తావులేకుండా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని సమావేశం డిమాండ్ చేసింది. -
వీసీ ఏవిధంగా ఏ1 అవుతారు: హైకోర్టు
హైదరాబాద్ : హెచ్‌సీయూ పీహెచ్డీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య ఘటనపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. వేముల రోహిత్ ఎఫ్ఐఆర్ ఆధారంగా వీసీ అప్పారావును తొలగించాలన్న పిటిషనర్ వాదనపై హైకోర్టు బుధవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎఫ్ఐఆర్ ఆధారంగా వీసీ ఏవిధంగా A1 అవుతారని హైకోర్టు ప్రశ్నించింది. మనోభావాల ఆధారంగా విచారణ జరపలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం వీసీనీ ఏవిధంగా తొలగించాలో చెప్పాలని తీవ్రంగా తప్పుబట్టింది. దీనిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి సోమవారం విచారణకు రావాలని కోర్టు సూచించింది. వీసీతో పాటు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయను కూడా ఆయా పదవుల నుంచి తొలగించాలని కోరుతూ కాంగ్రెస్ స్టాండింగ్ కౌన్సిల్ దామోదర్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. కాగా కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఇచ్చిన లేఖ వల్లే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని హెచ్‌సీయూ విద్యార్థులు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అలాగే వైస్ ఛాన్సులర్ అప్పారావుపై కూడా కేసు నమోదు అయింది. ఏ1 వీసీ అప్పారావు, ఏ2 బండారు దత్తాత్రేయ, ఏ3 సుశీల్ కుమార్, ఏ4 విష్ణుపై సెక్షన్ 306 కింద కేసు నమోదు అయ్యాయి. -
'ఆయన ఇప్పటికైనా రాజీనామా చేయాలి'
హైదరాబాద్: విద్యార్థులను తన పిల్లల్లా చూడాల్సిన హెచ్‌సీయూ వీసీ అప్పారావు వారిపట్ల వివక్ష చూపారని కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే విమర్శించారు. అప్పారావు ఇప్పటికైనా రాజీనామా చేయాలని, లేదంటే కేంద్ర ప్రభుత్వం వీసీ పదవి నుంచి ఆయన్ను తొలగించాలని డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్ వచ్చిన షిండే.. రోహిత్ తల్లి రాధికను పరామర్శించారు. హెచ్‌సీయూలో ఎమర్జెన్సీ వాతావరణం ఉందని, రోహిత్‌ది ఆత్మహత్య కాదు, సంస్థాగత హత్య అని విద్యార్థులు.. షిండే దృష్టికి తీసుకువచ్చారు. షిండేతో దళిత, యువజన సంఘాల నేతలు భేటీ అయ్యారు. షిండే మాట్లాడుతూ.. 'రోహిత్ ఆత్మహత్య జరిగిన రోజునే వీసీగా అప్పారావు తప్పుకోవాల్సింది. ఆయనపై అట్రాసిటీ కేసు పెట్టిన పోలీసులు ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ చేయలేదు?దళితులను అణచివేయాలని కేంద్రం చూస్తోంది. విద్యార్థుల పోరాటానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది' అని అన్నారు. ఈ కార్యక్రమంలో షిండేతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, మహారాష్ట్ర ఎంపీ రాజీవ్ సతావ్ పాల్గొన్నారు. -
ఇది విద్యాహక్కుకు భంగం కాదా?
విశ్లేషణ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అంతర్యుద్ధాన్ని పోలిన పరిస్థి తులు తలెత్తడానికి ఆ విశ్వవిద్యాలయ వివాదాస్పద వైస్‌చాన్స్‌లర్ డాక్టర్ అప్పారావు మళ్లీ పదవీ బాధ్యతలను చేపట్టడంలో ప్రదర్శించిన బాధ్యతా రాహిత్యం, మొరటుతనం ప్రధాన కారణం. రెండుమాసాల సెలవు అనంతరం తిరిగి విధులకు ఎందుకు హాజరు కావలసి వచ్చిందో ఆయన చెప్పిన కారణాలు విశ్వసించదగిన మీడియాలోనే వార్తలుగా వచ్చాయి. అది ఆయన మాట లలోనే: ‘రెండుమాసాలంటే సుదీర్ఘకాలం. చేయవలసిన పని చాలా ఉండిపోయింది’. ఇంకా, ఆయనను మళ్లీ విధులకు హాజరయ్యేటట్టు పురికొల్పిన మరో అంశం, ‘‘ఆయన సహోద్యోగులు పట్టుపట్టడం’’ కూడా. అంతేకాకుండా తన పునరా గమనానికి మరోకారణం- రూపన్వాల్ జుడీషియల్ కమిషన్ ‘‘దాదాపు’’ తన పనిని పూర్తి చేసిందని తాను భావించడం. వైస్‌చాన్స్‌లర్ గుర్తించడంలో విఫలమైనది, మొత్తం ప్రపంచం గుర్తించిన అంశం ఒకటి ఉంది. అదేమిటంటే-కొన్ని మాసాల నుంచి మానవ హక్కుల రక్షణలో ఆయన దారుణమైన అసమర్థతతో వ్యహరించారు. అందు లోనే విద్యార్థుల విద్య హక్కు ఇమిడి ఉంది. రోహిత్ వేముల ఆత్మహత్య సహా, విశ్వవిద్యాలయ ప్రాంగణం యుద్ధాన్ని మరిపించే రీతిలో తయారు కావడానికి ఇదే కారణం. సమ్మె చేస్తున్న విద్యార్థులను శాంతింపచేయడంలో వైస్‌చాన్స్‌లర్ పూర్తిగా విఫలమయ్యారని, ఫలితంగానే సమస్య ముదిరి పోయిందని కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ నియమించిన నిజనిర్ధారణ సంఘం కూడా చెప్పేసింది. చివరిగా- వైస్‌చాన్స్‌లర్ మళ్లీ విధులు చేపట్టడానికి వచ్చేనాటికి రూపన్వాల్ జుడీషియల్ కమిషన్ తన నివేదికను సమర్పించలేదు. తాను చేసిన పనికి వైస్‌చాన్స్‌లర్ కుంటిసాకులు వెతుకుతూ ఎలిబీ సృష్టించుకుంటున్నారు తప్ప, ఒక విద్యాలయం యుద్ధాన్ని మరిపించే విధంగా తయారు కావడానికి తన వంతు పాత్రను గురించి ఆయన అంతరాత్మను ప్రశ్నించుకోవడం లేదు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆదేశాలతో వైస్ చాన్స్‌లర్ సెలవుపై వెళ్లారన్నది సుస్పష్టం. ఇన్చార్జి వీసీని ఆయన స్థానంలో నియమించడం కూడా జరిగింది. అలాంటప్పుడు, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ తాజా ఆదేశాలు లేకుండానే, వైస్‌చాన్స్‌లర్ తనకు తానై కార్యాలయానికి వచ్చి ఎలా కూర్చుంటారు? చెప్పాపెట్టకుండా వైస్ చాన్స్‌లర్ అలా మళ్లీ వచ్చి విధులు ఎలా చేపట్టారని మానవ వనరుల అభివృద్ధి శాఖ కూడా విస్తుపోయిందని విశ్వసించదగిన మీడియా వార్తల వల్ల తెలు స్తున్నది. నిజానికి ఆ మంత్రిత్వ శాఖ నిజంగానే ఆశ్చర్యపోయిందా; లేక ఇది కూడా దోబూచులాటేనా? ఇన్ని వాస్తవలు పరిశీలించిన తరువాత ఓ అంతిమ నిర్ణయానికి రావడానికి అవకాశం ఉంది. అదేమిటంటే- ఏమరేమనుకున్నా ఫర్వాలేదన్నంత రీతిలో అధికార దాహం ఉన్న వైస్‌చాన్స్‌లర్‌కు తప్పుడు నిర్ణయంతో అప్పగించిన బాధ్యత నుంచి విశ్వవిద్యాలయం పాలనా వ్యవహారాలు చూసే మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆయన మాటతోనే తప్పించింది. లేదా వైస్ చాన్సలర్‌ను తొలగించినట్టు ఒక ఆట ఆడింది. కాబట్టి ఇప్పుడు వైస్‌చాన్స్‌లర్‌ను సస్పెండ్ చేయమని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖను కోరే హక్కు మనకు ఉంది. ఆయన హయాంలో జరిగిన లోటుపాట్ల మీద దర్యాప్తును నిలుపు చేయమని కోరవచ్చు. అలాగే విశ్వవిద్యాలయం వ్యవహారాలను నిర్వ హించే బాధ్యతను మళ్లీ ఇన్చార్జి వీసీకి అప్పగించమని కోరే హక్కు కూడా మనకు వచ్చింది. ఇది మాత్రమే విశ్వవిద్యాలయంలో సాధారణ పరిస్థితులను నెలకొల్పడానికి ఉపకరిస్తుంది. ఇన్చార్జి వీసీ నియామకంతోనే ఆయనకు పూర్తి స్థాయి అధికారాలను మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ వెంటనే అప్ప గించాలి కూడా. విద్యా విషయక కార్యకలాపాలు కూడా సాగించే అధికారాలను దఖలుపరిచే సమగ్ర ఆదేశాలను జారీ చేయాలి. దానితోనే డాక్టర్ అప్పారావు వైస్‌చాన్స్‌లర్‌గా కొనసాగడం కోసం చెప్పుకోవడానికి సాకు ఏదీ మిగలదు. ఈ పని నిర్వర్తించ డంలో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ విఫలమైతే, ఈ దోబూచు లాట వెనకాల ఆ మంత్రిత్వ శాఖ ఉందని ఇప్పటికే భావిస్తున్న అనేక వర్గాల దృష్టిలో దోషిగా నిలబడవలసి దుస్థితిని తనకు తనే తెచ్చుకోవచ్చు. ఈ వైఫ ల్యాన్ని మానవ హక్కుల ఉల్లంఘనగా నిర్ధారించుకోవలసివస్తుంది. అంటే విద్యాహక్కును ఉల్లంఘించినట్టు నిర్ధారణకు రావలసి ఉంటుంది. ఆ చట్టంలోని సెక్షన్ 12(1), (2) కింద హెచ్‌సీయూ విద్యార్థులకు ఆ హక్కును నిరాకరించి నందుకు దోషిగా నిలబడవలసి ఉంటుంది. మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రేక్షకపాత్ర వహించిన దోషం కూడా ఉంటుంది. వీటితో నష్టపోయిన వారికి కేంద్రం పరిహారం చెల్లించవలసి ఉంటుంది. జాతీయ మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయడం ద్వారా లేదా కమిషన్ తనకు తానుగా కేసును పరిగణనలోనికి తీసుకోవడం వల్ల ఇది సాధ్యపడుతుంది. ఇటీవల కాలంలో వరసగా జరుగుతున్న అవకతవకలకు తోడు ఈ పాపాన్ని కూడా మూట గట్టుకోరాదు. - కె.ఆర్. వేణుగోపాల్ వ్యాసకర్త విశ్రాంత ఐఏఎస్ అధికారి మొబైల్: 9052469165 -
వీసీని వెనక్కి పిలవాలన్న వీహెచ్
వరంగల్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ అప్పారావును వెంటనే రీకాల్ చేయాలని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. హన్మకొండలోని డీసీసీ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సెంట్రల్ యూనివర్సిటీలో శాంతిభ్రదతలు లేకపోవడం వల్ల విద్యార్థుల మధ్య బేధాభిప్రాయాలు తలెత్తుతున్నాయని, వీసీ అప్పారావు లాంటి వారు కొందరికి మద్దతు ఇవ్వడం వల్లే యూనివర్సిటీలో గొడవలు చెలరేగుతున్నాయన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంస్థలు యూనివర్సిటీల్లో కుల రాజకీయాలు నడుపుతున్నాయని, గతంలో ఇలాంటి రాజకీయాల వల్లే నక్సలిజం పుట్టిందన్నారు. మళ్లీ అదే పరిస్థితులు యూనివర్సిటీల్లో నెలకొనే అవకాశాలున్నాయన్నారు. యూనివర్సిటీల్లో శాంతిభద్రతలపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టాలని, వీసీని రీకాల్ చేసేందుకు కేంద్ర మానవ వనరుల శాఖకు సీఎం లేఖ రాయాలని ఆయన సూచించారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, పీసీసీ కార్యదర్శులు ఈవీ.శ్రీనివాసరావు, కట్ల శ్రీను పాల్గొన్నారు. -
ఎంతమంది రోహిత్‌లను చంపుతారు: కన్హయ్య
హైదరాబాద్ : లాఠీలతో తమ గొంతులు నొక్కలేరని జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చేరుకున్న ఆయనను బుధవారం సాయంత్రం పోలీసులు లోనికి అనుమతించలేదు. హెచ్‌సీయూ మెయిన్ గేటు వద్దే కన్హయ్య కుమార్ వాహనాన్ని అడ్డుకోవటంతో ఆయన వాహనం దిగి ఆవేశపూరితంగా ప్రసంగించారు. వేముల రోహిత్ కలలను సాకారం చేయడానికే తాము హెచ్సీయూకు వచ్చినట్లు చెప్పారు. అతనికి న్యాయం జరగాలని, రోహిత్ చట్టం వచ్చేవరకూ తమ పోరాటం కొనసాగుతుందన్నారు. యూనివర్సిటీలో భయానక పరిస్థితులు సృష్టించారన్నారు. తమను వర్సిటీలోనికి పోలీసులు అనుమతించడం లేదని, లాఠీలతో తమ గొంతులు నొక్కలేరన్నారు. లాఠీలు, తూటాలతో పోరాటాలు ఆపలేరని కన్హయ్య కుమార్ అన్నారు. ఇంకా ఎంతమంది రోహిత్‌లను చంపుతారని ఆయన ఉద్వేగంగా మాట్లాడారు. సామాజిక న్యాయం జిందాబాద్...యూనివర్సిటీలో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి అంటూ కన్హయ్య కుమార్ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆయనతో పాటు విద్యార్థులు గొంతు కలిపారు. కాగా వేముల రోహిత్ తల్లి రాధిక, అతడి సోదరుడుతో కలిసి కన్హయ్య కుమార్ హెచ్సీయూకు వచ్చారు. కాగా తాము కన్హయ్య కుమార్ ను తాము అడ్డుకోలేదని, యూనివర్సిటీ భద్రతా సిబ్బందే అడ్డుకున్నారని పోలీసులు తెలిపారు. వీసీ అప్పారావు ఆదేశాల మేరకు వర్సిటీ భద్రతా సిబ్బంది అడ్డుకున్నట్లు పేర్కొన్నారు. -
వెళ్లి తీరుతా, అనుమతించే ప్రసక్తే లేదు..
హైదరాబాద్ : హెచ్ సీయూ మరోసారి అట్టుడుకుతోంది. ఓవైపు వర్సిటీలోకి వెళ్లితీరుతానంటున్న జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్, మరోవైపు అతడిని క్యాంపస్‌లోకి అనుమతించేది లేదని పోలీసులు ...ఈ నేపథ్యంలో బుధవారం మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో వర్సిటీలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కాగా కన్హయ్య కుమార్‌ను లోనికి అనుమతించే ప్రసక్తే లేదని పోలీసులు తెలిపారు. అయితే కన్హయ్యను వర్సిటీలోకి అనుమతించకుంటే తామే బయటకు వచ్చి సభ నిర్వహించుకుంటామని విద్యార్థులు స్పష్టం చేశారు. అంతకు ముందు హాస్టల్లో వంట చేసుకుంటున్న తమపై పోలీసులు లాఠీఛార్జ్ చేయటాన్ని విద్యార్థులు ఖండిస్తున్నారు. ఇంకెంతమందిని చంపుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచినీళ్లు, ఇంటర్నెట్, వర్శిటీ క్యాంటిన్లు ఇలా అన్నింటిని మూసేసి తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. కాగా అంతకు ముందు కన్హయ్య కుమార్ మాట్లాడుతూ.... పీహెచ్డీ విద్యార్థి వేముల రోహిత్ చట్టం తీసుకొచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. హెచ్‌సీయూ విద్యార్థి జేఏసీ ఆహ్వానం మేరకు హైదరాబాద్ వచ్చిన కన్హయ... రోహిత్‌లా మరొకరు ప్రాణాలు కోల్పోవద్దన్నదే తమ అభిప్రాయమన్నారు. హెచ్సీయూకు వెళ్లి, అక్కడ బహిరంగ సభలో మాట్లాడనున్నట్లు చెప్పారు. వర్సిటీలో హింసకు వీసీ అప్పారావే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. ఒక యూనివర్సిటీకి చెందిన విద్యార్థి మరో వర్సిటీకి వెళ్లకూడదా అని ప్రశ్నించారు. చట్టాన్ని ఉల్లంఘించేవాళ్లం కాదని, కట్టుబడి ఉండేవాళ్లమని కన్హయ్య తెలిపారు. కాగా కొండాపూర్‌లోని సీఆర్ పౌండేషన్లో ఉన్న రోహిత్ తల్లి రాధికను ఇవాళ ఆయన పరామర్శించారు. అనంతరం రోహిత్ తల్లి, సోదరుడితో కలిసి కన్హయ్య కుమార్ హెచ్ సీయూకు బయల్దేరారు. కాగా హెచ్‌సీయూ నుంచి పోలీసు బలగాలను తక్షణమే పంపించివేయాలని ప్రొఫెసర్ కోదండరామ్ డిమాండ్ చేశారు. -
హెచ్‌సీయూ ఘటనలో 28మంది విద్యార్థుల అరెస్ట్
హైదరాబాద్ : హెచ్‌సీయూలో రెండోరోజు కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్న హెచ్‌సీయూలో జరిగిన ఘటనకు సంబంధించి 28మంది విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారికి రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు. మరోవైపు తమకు అనుమతి ఇవ్వకపోయినా హెచ్‌సీయూలో నిరసన కార్యక్రమం నిర్వహించి తీరతామని విద్యార్థులు స్పష్టం చేశారు. నిరసన తెలపటం తమ హక్కు అని, వీసీ అప్పారావును తొలగించేవరకూ తమ ఆందోళన కొనసాగుతుందని వారు తెలిపారు. తమకు మద్దతు తెలిపే అందరినీ వర్శిటీకి ఆహ్వానిస్తామన్నారు. విద్యార్థుల నిరసన కార్యక్రమానికి జేఎన్ యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ హాజరు కానున్నారు. అయితే నిరసన కార్యక్రమానికి అనుమతి లేదని, బయటవారిని వర్శిటీలోకి అనుమతించేది లేదని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఈ ఏడాది జనవరి 17న ఆత్మహత్య చేసుకోవడంతో వర్శిటీలో ఆందోళనలు మిన్నంటిన సంగతి తెలిసిందే. తనపై వ్యతిరేకత వెల్లువెత్తడంతో వీసీ అప్పారావు దాదాపు రెండు నెలలుగా దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. మంగళవారం తిరిగి వర్సిటీకి వచ్చారు. తనకు అనుకూలంగా ఉన్న పలు విభాగాల డీన్లు, ప్రొఫెసర్లతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలియడంతో అందడంతో విద్యార్థి జేఏసీ నేతృత్వంలో పెద్దఎత్తున విద్యార్థులు వీసీ నివాసం(లాడ్జ్) వద్దకు ర్యాలీగా తరలివచ్చారు. రోహిత్ మృతికి బాధ్యులైన వారిపై కఠిన చర్యల్లేకుండా వీసీ మళ్లీ ఎలా విధుల్లోకి ఎలా చేరతారంటూ ఆగ్రహంతో ఆయన నివాసంపై దాడి చేశారు. అక్కడున్న కంప్యూటర్లు, టీవీలు, ప్రింటర్లు, అలంకరణ సామాగ్రి, అద్దాలు, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి, 28మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. -
తరిమి తరిమి కొట్టారు
- హెచ్‌సీయూలో విద్యార్థులపై మళ్లీ విరిగిన లాఠీ - వీసీ అప్పారావు రాకతో వర్సిటీలో ఉద్రిక్తత - పెద్ద ఎత్తున విద్యార్థుల ఆందోళన.. వీసీ నివాసంపై దాడి.. ఫర్నిచర్ ధ్వంసం - ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు వీసీ నివాసం ముందు నిరసన - విద్యార్థులను చెదరగొట్టేందుకు విచక్షణారహితంగా లాఠీచార్జి చేసిన ఖాకీలు - ఏడుగురు విద్యార్థులకు తీవ్రగాయాలు - వీసీకి మద్దతుగా నిలిచిన నాన్‌టీచింగ్ స్టాఫ్, ఏబీవీపీ, లైఫ్‌సైన్స్ విద్యార్థులు - రెండు కేసులు నమోదు.. అదుపులో 26 మంది విద్యార్థులు, ఇద్దరు ప్రొఫెసర్లు - నేడు వర్సిటీలో రోహిత్ తల్లి దీక్ష.. కన్హయ్య కుమార్ రాక సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూ మళ్లీ రణరంగమైంది! విద్యార్థులపై లాఠీలు విరిగాయి. ఖాకీలు విచక్షణారహితంగా దొరికిన వారిని దొరికినట్టు బాదేశారు. ఒక్కసారిగా విరుచుకుపడి విద్యార్థులను తరిమితరిమి కొట్టారు. ఈ లాఠీచార్జిలో పలువురు విద్యార్థులు తీవ్ర గాయాలపాలయ్యారు. రోహిత్ ఘటన తర్వాత ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న వర్సిటీకి మంగళవారం వైస్ చాన్స్‌లర్(వీసీ) అప్పారావు రావడం, రహస్యంగా బాధ్యతలు చేపట్టడం ఈ ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది. వీసీ నివాసంపై విద్యార్థుల దాడి, వారిపై పోలీసుల లాఠీచార్జి, ప్రతిగా విద్యార్థుల రాళ్లదాడితో యూనివర్సిటీ రోజంతా అట్టుడికిపోయింది. ఈ ఘటనలకు సంబంధించి రెండు కేసులు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు 26 మంది విద్యార్థులతోపాటు ఇద్దరు ప్రొఫెసర్లనూ అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు వీసీకి మద్దతుగా నిలిచిన నాన్-టీచింగ్ స్టాఫ్ మంగళవారం సాయంత్రం నుంచి సహాయ నిరాకరణ పేరుతో మెస్‌ల బంద్‌కు పిలుపునిచ్చారు. కాక రేపిన వీసీ రాక హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఈ ఏడాది జనవరి 17న ఆత్మహత్య చేసుకోవడంతో వర్శిటీలో ఆందోళనలు మిన్నంటిన సంగతి తెలిసిందే. తనపై వ్యతిరేకత వెల్లువెత్తడంతో వీసీ పొదిలె అప్పారావు దాదాపు రెండు నెలలుగా దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. మంగళవారం తిరిగి వర్సిటీకి వచ్చారు. తనకు అనుకూలంగా ఉన్న పలు విభాగాల డీన్లు, ప్రొఫెసర్లతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలియడంతో అందడంతో విద్యార్థి జేఏసీ నేతృత్వంలో పెద్దఎత్తున విద్యార్థులు వీసీ నివాసం(లాడ్జ్) వద్దకు ర్యాలీగా తరలివచ్చారు. రోహిత్ మృతికి బాధ్యులైన వారిపై కఠిన చర్యల్లేకుండా వీసీ మళ్లీ ఎలా విధుల్లోకి ఎలా చేరతారంటూ ఆగ్రహంతో ఆయన నివాసంపై దాడి చేశారు. అక్కడున్న కంప్యూటర్లు, టీవీలు, ప్రింటర్లు, అలంకరణ సామాగ్రి, అద్దాలు, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. ఈ ఘటనల్ని చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపైనా కొందరు విద్యార్థులు దాడికి యత్నించారు. దీన్ని ఖండిస్తూ మీడియా ప్రతినిధులు అక్కడ కొద్దిసేపు ధర్నా చేశారు. అప్పారావు నివాసంలోనే ఉండడం గమనించిన విద్యార్థులు అటువైపు చొచ్చుకెళ్లేందుకు విఫలయత్నం చేశారు. అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు విద్యార్థుల్ని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వీసీకి మద్దతుగా ఏబీవీపీ, నాన్ టీచింగ్ స్టాఫ్ విద్యార్థులు వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న సమయంలో కొందరు నాన్ టీచింగ్ ఉద్యోగులు వైస్ చాన్స్‌లర్‌కు మద్దతుగా నిలిచారు. వీసీ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడంతో వారికి, విద్యార్థులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహించిన నాన్ టీచింగ్ సిబ్బంది తాము వర్సిటీ మెస్‌లను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఆందోళనల క్రమంలో హెచ్‌సీయూ క్రమశిక్షణ సంఘం చైర్మన్ ప్రొఫెసర్ అలోక్‌పాండే అస్వస్థతకు లోనై కుప్పకూలారు. వెంటనే ఆయన్ను భద్రతా సిబ్బంది వర్సిటీలోని హెల్త్ సెంటర్‌కు తరలించారు. వీసీకి స్కూల్ ఆఫ్ లైఫ్‌సైన్స్ విద్యార్థులు కూడా మద్దతుగా నిలిచారు. నివాసంలో వారు వీసీ చుట్టూ రక్షణ వలయంగా ఏర్పడ్డారు. వీసీకి మద్దతుగా ఏబీవీపీ, వ్యతిరేకంగా అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ సభ్యులు నినాదాలు చేశారు. ఈ సమయంలో ఏబీవీపీ, ఏఎస్ఏ మధ్య తోపులాట జరిగింది. లాఠీలతో విరుచుపడ్డ పోలీసులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యార్థులు వీసీ నివాసం వద్దే ఆందోళనలు చేపట్టారు. 5 గంటల తర్వాత పెద్ద సంఖ్యలో చేరుకున్న పోలీసులు విద్యార్థులను చెదరగొట్టేందుకు ఒక్కసారిగా లాఠీచార్జి చేశారు. విద్యార్థులను అదుపులోకి తీసుకునే సమయంలో దురుసుగా ప్రవర్తించారు. కాళ్లు, చేతులు పట్టుకుని ఈడ్చుకుపోయారు. విద్యార్థినులను మహిళా పోలీసులు వారి జడలు పట్టుకుని లాక్కెళ్లారు. లాఠీచార్జిలో భాస్కర్, షోహన్, సంజయ్, వరుణ్, అక్షిత, హాసిని, ఫైజల్ అనే విద్యార్థులతోపాటు మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఆగ్రహించిన విద్యార్థులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో నలుగురు పోలీసులకు గాయాలయ్యాయి. విద్యార్థులకు మద్దతు పలికేందుకు వెళ్లిన కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డిని పోలీసులు గేట్ వద్దే అడ్డుకున్నారు. హెచ్‌సీయూలో బుధవారం జేఎన్‌యూ విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్ పర్యటన ఉంది. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని వర్సిటీలకు చెందిన విద్యార్థులు మంగళవారమే హెచ్సీయూకు చేరుకున్నారు. తాజా ఘర్షణ నేపథ్యంలో పోలీసులు వారిని కూడా వారినీ అదుపులోకి తీసుకున్నారు. గుర్తింపు కార్డులు సమర్పించాలని, అప్పుడే వదులుతామంటూ వేధించారు. మొత్తమ్మీద యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో వర్సిటీలో పోలీసులతోపాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను మోహరించారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ సైతం తొలిసారిగా వర్శిటీకి వచ్చి అధికారులతో సమావేశమయ్యారు. -
హెచ్‌సీయూ వద్ద ఎమ్మెల్యే అరెస్టు
హైదరాబాద్: విద్యార్థులకు మద్దతుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) గేటు వద్ద కల్వకుర్తి ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత వంశీచంద్ రెడ్డి మంగళవారం రాత్రి నిరసన చేపట్టారు. కొద్దిరోజులుగా ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ.. వైస్ చాన్స్‌లర్ అప్పారావు ఈరోజు బాధ్యతలు చేపట్టడంతో మళ్లీ రగిలింది. వీసీ రాకను వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో వర్సిటీలోకి వెళ్లేందుకు ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. నిరసనగా ఆయన గేటువద్ద బైఠాయించడంతో పోలీసులు వంశీచంద్‌ను అరెస్టు చేసి సమీపంలోని దర్గా పోలీసు స్టేషన్ కు తరలించారు. -
రణరంగంగా మారిన హెచ్‌సీయూ
హైదరాబాద్: కొద్దిరోజులుగా ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రెండు నెలల అనంతరం వైస్ చాన్సులర్ ప్రొఫెసర్ అప్పారావు ఇవాళ బాధ్యతలు చేపట్టారు. దీంతో వీసీ రాకను వ్యతిరేకిస్తూ మంగళవారం విద్యార్థులు ఆందోళనకు దిగారు. వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ క్యాంపస్‌లో ఆయన చాంబర్‌ను ధ్వంసం చేశారు. హెచ్‌సీయూ పీహెచ్డీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థులు డిమాండ్ చేశారు. అంతేకాకుండా వీసీ ఇంటి వద్ద కొంతమంది విద్యార్ధులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేసి అరెస్ట్ చేశారు. కాగా ఈరోజు ఉదయం నుంచే హెచ్ సీయూ క్యాంపస్ లో భద్రతా బలగాలు భారీగా మోహరించారు. పరిస్థితి అదుపు తప్పడంతో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు...పోలీసులపై రాళ్లు రువ్వడంతో మరోసారి టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా విద్యార్థులు, పోలీసులు, పలువురు మీడియా ప్రతినిధులు గాయాపడ్డారు. దీంతో హెచ్ సీయూ రణరంగంగా మారింది. మరోవైపు ఇద్దరు ప్రొఫెసర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తాజా సంఘటనలపై వీసీ అప్పారావు స్పందిస్తూ విద్యార్థులు దౌర్జన్యానికి దిగడం సరికాదన్నారు. ఎవరికైనా అన్యాయం జరిగితే కోర్టులను ఆశ్రయించవచ్చని అన్నారు. తనపై ఉన్న కేసుల విషయంలో కోర్టులు నిర్ణయం తీసుకుంటాయని, చట్టాలను అందరూ గౌరవించాలని సూచించారు. విద్యార్థులతో మాట్లాడటానికి తాను సిద్ధంగా ఉన్నానని, వర్సిటీలో మంచి వాతావరణం కల్పించడానికి తాను బాధ్యతలు చేపట్టినట్లు స్పష్టం చేశారు. మరోవైపు ఢిల్లీ జేఎన్ యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్ బుధవారం హెచ్ సీయూలో పర్యటించనున్నాడు. -
నిజనిర్ధారణ కమిటీ వేయాలి
రోహిత్ మృతిపై విద్యార్థి జేఏసీ, ఫ్యాకల్టీ సభ్యుల డిమాండ్ ఇన్చార్జి వీసీతో చర్చలు నాలుగో రోజుకు చేరిన టీచర్స్ ఫోరం దీక్షలు హైదరాబాద్: రోహిత్ ఘటనపై హెచ్‌సీయూ ఇన్చార్జి వైస్ చాన్స్‌లర్ పెరియస్వామి ఆదివారం విద్యార్థి జేఏసీ సభ్యులు, అధ్యాపకులతో చర్చలు జరిపారు. వర్సిటీలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా రోహిత్ స్మారకార్థం వర్సిటీలో ఏటా ఉపన్యాస కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించాలని జేఏసీ సభ్యులు ప్రతిపాదించారు. రోహిత్ ఘటనపై నిజనిర్ధారణకు వర్సిటీ స్థాయిలో కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. క్రమశిక్షణ సంఘాన్ని మార్చి కొత్త సభ్యులను ఎన్నుకోవాలని, పరిపాలన విభాగ పదవులకు రాజీనామా చేసిన ఎస్సీ, ఎస్టీ ఫ్యాకల్టీలను తిరిగి విధుల్లో తీసుకోవాలని, వారి రాజీనామా పత్రాలను తిరస్కరించాలన్నారు. అలాగే వర్సి టీ స్వయంప్రతిపత్తికి భంగం వాటిల్లేలా వ్యవహరించిన వీసీ అప్పారావుపై కేంద్ర మానవ వనరుల శాఖ(ఎంహెచ్ఆర్డీ)కి లేఖ పంపాలని డిమాండ్ చేశారు. తరగతులకు నష్టం కలగని విధంగా సెమిస్టర్ కాల వ్యవధిని పొడిగించాలన్నారు. ఫ్యాకల్టీ, జేఏసీ నాయకుల ప్రతిపాదనలను చర్చించి అందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఇన్చార్జి వీసీ పెరియస్వామి తెలిపారు. అప్పారావును తొలగించాల్సిందే.. ఎస్సీ, ఎస్టీ టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో వర్సిటీలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారం నాలుగో రోజుకు చేరుకున్నాయి. అధ్యాపకులు తిరుమల్, అనుపమ, కేవై రత్నం, లీమావాలీ దీక్షలు కొనసాగిస్తున్నారు. వీసీ అప్పారావును శాశ్వతంగా తొలగించాలని, సెలవులో ఉన్న ఇన్చార్జి వీసీ శ్రీవాత్సవను తిరిగి విధుల్లోకి తీసుకుంటే ఊరుకునేది లేదని వారు స్పష్టం చేశారు. రోహిత్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకునేదాకా దీక్ష కొనసాగుతుందని తెలిపారు. -
రోహిత్ ఆత్మహత్య: లీవ్‌లో హెచ్‌సీయూ వీసీ
-
రోహిత్ ఆత్మహత్య: లీవ్‌లో హెచ్‌సీయూ వీసీ
హైదరాబాద్: హెచ్‌సీయూ యూనివర్సిటీ పీహెచ్డీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య అనంతరం అతడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ విద్యార్థులు దీక్ష చేస్తున్నారు. వర్సిటీలో వాతావరణం ఇలా ఉన్న నేపథ్యంలో వైస్ చాన్సలర్, ప్రొఫెసర్ అప్పారావు లీవ్ లో ఉన్నట్లు సమాచారం. ఆయన లీవ్ పై వెళుతూ ఇన్ఛార్జ్ వీసీగా ప్రొఫెసర్ విపిన్ శ్రీవాత్సవ్ ను నియమించారు. దీనిపై వర్సిటీ విద్యార్థులు మండిపడుతున్నారు. దీక్ష చేస్తున్న విద్యార్థులు ఎంత చెప్పినా వెనక్కి తగ్గడం లేదని, తనపై ఆరోపణలు వస్తున్నాయని భావించిన వీసీ తాత్కాలికంగా ఈ ఘటన నుంచి తప్పుకునేందుకు లీవ్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇన్ఛార్జ్ వీసీగా విపిన్ శ్రీవాత్సవ్ ను నియమించడాన్ని విద్యార్థి సంఘాలు తప్పుబట్టాయి. గతంలోనూ ఓ విద్యార్థి ఆత్మహత్యకు సంబంధించి ఆయనపై అభియోగాలున్నాయి. వర్సిటీ నుంచి సస్పెండ్ చేయడంతో రోహిత్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. మరోసారి మంటపెట్టారు: విద్యార్థులు తమ ఉద్యమానికి వీలువ లేకుండా చేస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. అసలే మా కడుపు మండిపోతుంటే.. మళ్లీ మరోసారి మంట పెట్టిన చర్యగా శ్రీవాత్సవ్ నియామకంపై విద్యార్థులు అభివర్ణించారు. ఎంతో మంది సీనియర్ ప్రొఫెసర్స్ ఉండగా కేవలం శ్రీవాత్సవ్ నే ఇన్ఛార్జ్ వీసీగా నియమించారని ఓ విద్యార్థి ప్రశ్నించారు. చెన్నై నుంచి కొందరు విద్యార్థులు వచ్చారు. కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుంచి రేపు మరికొంతమంది విద్యార్థులు వస్తారని దీక్ష తీవ్రరూపం దాల్చుతుందని చెప్పారు. విపిన్ శ్రీవాత్సవ్, వీసీ అప్పారావు ఇద్దరికి రోహిత్ ఆత్మహత్యకు సంబంధం ఉందని విద్యార్థులు ఆరోపిస్తూ తమ ఆందోళనను తీవ్రం చేస్తున్నారు. -
'రోహిత్ చేసిన తప్పేంటో వీసీ చెప్పాలి'
-
'రోహిత్ చేసిన తప్పేంటో వీసీ చెప్పాలి'
హైదరాబాద్: సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) వైస్ ఛాన్సలర్ అప్పారావు స్వయంగా వచ్చి తన కుమారుడు చేసిన తప్పేంటో చెప్పాలని రోహిత్ తల్లి రాధిక డిమాండ్ చేశారు. రోహిత్ చనిపోయాక తమ ఇంటికి వచ్చి ఆయన మాట్లాడేందుకు ప్రయత్నించారని ఆమె తెలిపారు. వీసీ తప్పు చేయకుంటే దొంగతనంగా వచ్చి తమను కలిసేందుకు ఎందుకు ప్రయత్నించారో చెప్పాలని రాధిక ప్రశ్నించారు. తమ కుమారుడు రోహిత్ ఆశయసాధనే తమ లక్ష్యమని ఆమె తెలిపారు. సస్పెన్షన్‌కు గురైన మిగిలిన నలుగురి విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ గురువారం మధ్యాహ్నం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్డీ విద్యార్థి రోహిత్ మనస్తాపంతో ఆదివారం నాడు యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. -
హెచ్‌సీయూలో కొనసాగుతున్న ఆందోళన
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో ఆందోళన కొనసాగుతూనే ఉంది. మంగళవారం వీసీ కార్యాలయం వద్ద హెచ్‌సీయూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. హెచ్‌సీయూ వైస్ ఛాన్సలర్ అప్పారావును తప్పించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళనబాట పట్టాయి. మరోవైపు హెచ్‌యూసీ వీసీ అప్పారావు రాజీనామా చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్‌సీయూ జేఏసీ ప్రకటించింది. సస్పెన్షన్‌కు గురైన మిగతా నలుగురు విద్యార్థులపై వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. వీసీ రాజీనామా చేసే వరకు క్లాసులు బహిష్కరిస్తామని...అడ్మినిస్ట్రేషన్ విభాగం కార్యకలాపాలు కొనసాగనివ్వమని నాయకులు తెలిపారు. హెచ్‌సీయూలో సస్పెన్షన్‌కు గురైన ఐదుగురు విద్యార్థుల్లో గుంటూరుకు చెందిన వేముల రోహిత్ అనే పీహెచ్డీ విద్యార్థి కలత చెంది ఆదివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. -
వీసీ రాజీనామా చేయాలి : హెచ్‌సీయూ జేఏసీ
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) వైస్ ఛాన్సలర్ అప్పారావు రాజీనామా చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్‌సీయూ జేఏసీ ప్రకటించింది. సస్పెన్షన్‌కు గురైన మిగతా నలుగురు విద్యార్థులపై వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. వీసీ రాజీనామా చేసే వరకు క్లాసులు బహిష్కరిస్తామని...అడ్మినిస్ట్రేషన్ విభాగం కార్యకలాపాలు కొనసాగనివ్వమని నాయకులు తెలిపారు. హెచ్‌సీయూలో సస్పెన్షన్‌కు గురైన ఐదుగురు విద్యార్థుల్లో గుంటూరుకు చెందిన వేముల రోహిత్ అనే పీహెచ్డీ విద్యార్థి ఆదివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.